సమీక్ష : రాయుడు – మాస్‌ను మెప్పించే సినిమా

Rayudu review

విడుదల తేదీ : 27 మే, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : ఎమ్. ముత్తయ్య

నిర్మాత : విశాల్

సంగీతం :డి.ఇమాన్‌

నటీనటులు : విశాల్, శ్రీ దివ్య

‘పందెం కోడి’, ‘పొగరు’ వంటి చిత్రాలతో తెలుగునాట తనకంటూ ఓ ప్రత్యేకమైన మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు విశాల్, తాజాగా నటించిన చిత్రం ‘మరుదు’. దర్శకుడు ఎమ్. ముత్తయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గతవారమే విడుదలై తమిళనాట ఘన విజయం సాధించింది. ఇప్పుడీ సినిమా నేడు ‘రాయుడు’గా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్వయంగా హీరో విశాల్ నిర్మించిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం…

కథ :

రాయుడు (విశాల్) అనే ఓ మంచివాడైన కూలీకి తన అమ్మమ్మ మంగమ్మ అంటే ప్రాణం. మంగమ్మ కూడా తన మనవడు రాయుడుకి పెళ్లి చెయ్యాలని తపిస్తూ ఉంటుంది. అలా రాయుడి పెళ్లి గురించి కలలు కంటున్న మంగమ్మకు అనుకోకుండా భాగ్య లక్ష్మి (శ్రీ దివ్య) అనే గడుసైన అమ్మాయి తారసపడుతుంది. ఆ అమ్మాయిని చూసి ముచ్చట పడ్డ మంగమ్మ ఎలాగైనా ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోమని రాయుడిని పట్టుబడుతుంది. రాయుడు కూడా మంగమ్మ మాట కాదనలేక ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడై ప్రేమ ప్రయత్నాలు మొదలు పెడతాడు.

అలా రాయుడు ప్రేమ ప్రయత్నాల్లో ఉండగా, ఆ ఊళ్ళో ఉండే రోలెక్స్ బాచీ (ఆర్కే. సురేష్) అనే రౌడీ కమ్ పొలిటీషియన్ అదే ఊళ్ళో ఉన్న పెద్దమనిషి భైరవ నాయుడి అండతో పదవీ వ్యామోహంతో అన్యాయాలు చేస్తూ ఓ కేసు విషయంలో తనకు అడ్డుగా ఉన్న భాగ్య లక్ష్మిని చంపుదామని అనుకుంటాడు. కానీ రాయడు అందుకు అడ్డుపడతాడు. దీంతో బాచీ రాయుడిని దెబ్బ తీయడానికి అనేక ప్రయత్నాలు చేస్తాడు. అసలు బాచీ భాగ్య లక్ష్మిని ఎందుకు చంపాలనుకుంటాడు? అతనికి భాగ్య లక్ష్మి కి మధ్య ఉన్న వివాదం ఏమిటి? మంగమ్మ భాగ్య లక్ష్మితోనే రాయుడి పెళ్లి ఎందుకు చేయ్యాలనుకుంటుంది? భాగ్య లక్ష్మిని రాయుడు బాచి బారి నుండి ఎలా కాపాడతాడు? ఆ ప్రయత్నంలో రాయుడు ఏం కోల్పోతాడు? అన్నదే ఈ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అంటే ముందుగా చెప్పుకోవలసింది గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశం. అచ్చమైన పల్లెటూరి వాతావరణం, అమ్మమ్మ, మనువాడి మధ్య అనుబంధం, విశాల్ పవర్ ఫుల్ మాస్ యాక్షన్ కూడా ఈ సినిమాకి మేజర్ హైలెట్స్ అని చెప్పొచ్చు. దర్శకుడు ముత్తయ్య చిత్ర ప్రథమార్థంలో కథను హీరో, విలన్ అనే రెండు వైపుల నుండి ఒకేసారి ప్రారంభించిన విధానం బాగుంది. కథ పాతదే అయినప్పటికీ కథకు సెంటిమెంట్ అనే అంశాన్ని జోడించి దర్శకుడు కథ చెప్పిన విధానం బాగుంది.

అలాగే చిత్రంలో భాగ్య లక్ష్మి పాత్రలో శ్రీదివ్య నటన చాలా సహజంగా ఉండి ఓ పల్లెటూరి గడుసైన అమ్మాయిని చూస్తున్నట్టే ఉండి మెప్పిస్తుంది. మధ్య మధ్యలో వచ్చే హీరో స్నేహితుడు కొక్కొరొకో (సూరి) కామెడీ సన్నివేశాలు నవ్విస్తాయి. విశాల్ నుండి ప్రేక్షకులు కోరుకునే మాస్ డోస్ ను పండించడానికి విలన్ రోలెక్స్ బాచీ పాత్రను కఠినంగా రూపొందించిన తీరు బాగుంది. ముఖ్యంగా సినిమాలో వచ్చే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే చెప్పుకోవలసింది 2 గంటల 26 నిముషాల రన్ టైమ్. దర్శకుడు కథకు సెంటిమెంట్ జోడించి కథనాన్ని నడుపుదామనుకుని చాలా చోట్ల కథనాన్ని సాగదీస్తూ ఫస్ట్ హాఫ్ చివర, సెకండ్ హాఫ్ మొదట్లో చిరాకు తెప్పిస్తాడు. అలాగే ఎప్పటికప్పుడు కథ హీరోకి, విలన్ కి మధ్య నడుస్తుంది అనుకునే సమయంలో సెంటిమెంట్ సీన్స్ వచ్చి డిసప్పాయింట్ చేస్తాయి.

సినిమా నెమ్మదించిన సమయంలో మధ్యలో వచ్చే పాటలు కూడా చిరాకు తెప్పిస్తాయి. ఇకపోతే ఇంటర్వెల్ సమయంలో వచ్చే చిన్న ట్విస్టును చూసి కథలో ఏదో బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనుకుంటుండగా సెకండ్ హాఫ్ లో అలాంటిదేమీ లేకుండా ఓ వీక్ ఫ్లాష్ బ్యాక్ తో కథను లాగేయడం నిరుత్సాహపరుస్తుంది.

సాంకేతిక వర్గం :

దర్శకుడు ఒక మాస్ ఎంటర్టైనర్ కు బలమైన సెంటిమెంట్ అనే అంశాన్ని జోడించి కథను చెప్పిన పద్దతి బాగుంది. హీరో, హీరోయిన్ల మధ్య నడిచే ప్రేమ సన్నివేశాలు, హీరోకి, అతని అమ్మమ్మకు మధ్య నడిచే సెంటిమెంట్ సన్నివేశాలు, విలన్ లోని క్రూరత్వాన్ని ఎలివేట్ చెయ్యడానికి రాసుకున్న సన్నివేశాలు దర్శకుడిలోని రచయితకు మంచి మార్కులు పడేలా చేశాయి. కానీ కొన్ని చోట్ల అనవసరమైన సెంటిమెంట్ సన్నివేశాల వల్ల కథనం నెమ్మదించి బోర్ కొడుతుంది కాబట్టి దర్శకుడు కథనంపై ఇంకాస్త శ్రద్ద పెట్టి ఉంటే బాగుండేది.

గ్రామీణ నైపథ్యంలో సాగే కథాంశానికి తగిన వాతావరణాన్ని సినిమాటోగ్రాఫర్ వేల్‌రాజ్ తెర మీద ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. ఇమాన్ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తుంది. అనల్ అరసు అందించిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. విశాల్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

మాస్ ప్రేక్షకులనే దృష్టిలో పెట్టుకుని, వారిని ఆకర్షించే అంశాలతోనే తెరకెక్కిన సినిమా ‘రాయుడు’. విశాల్, శ్రీ దివ్యల నటన, మాస్ ఎలిమెంట్స్‌తో సాగే సన్నివేశాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్. ఫుల్ మాస్ ఫ్లేవర్ బి, సి సెంటర్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. మధ్యలో వచ్చే సెంటిమెంట్ సన్నివేశాల డోస్ ఎక్కువవకుండా ఉంటే సినిమా ఇంకా బాగా ఎలివేట్ అయ్యుండేది. కాస్త అక్కడక్కడా నెమ్మదించిన కథనం, పూర్తిగా తమళ మాస్ సినిమా చూసిన ఫీలింగ్‌ను పట్టించుకోకుండా కేవలం మాస్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులకు ఈ సినిమా బాగానే నచ్చుతుంది.

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version