సమీక్ష : 1-నేనొక్కడినే – అర్థం కావడం కాస్త కష్టమే.!

విడుదల తేదీ : 10 జనవరి 2014
123తెలుగు.కామ్ రేటింగ్ : NA
దర్శకుడు : సుకుమార్
నిర్మాత : రామ్ ఆచంట, గోపి ఆచంట, అనిల్ సుంకర
సంగీతం : దేవీశ్రీ ప్రసాద్
నటీనటులు : మహేష్ బాబు, కృతి సనన్..

సూపర్ స్టార్ మహేష్ బాబు రాక్ స్టార్ గా స్టైలిష్ లుక్ లో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘1-నేనొక్కడినే’. మహేష్ బాబు కెరీర్లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీని 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ వారు నిర్మించారు. మొదటి సారి దేవీశ్రీ ప్రసాద్ మహేష్ బాబు సినిమాకి కంపోజ్ చేసాడు. మాములుగా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలు మన తెలుగు ప్రేక్షకులకు కొత్త మరియు ఇలాంటి సినిమాలను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చెప్పడం కాస్త కష్టతరం అని చెప్పాలి. ఇలాంటి జోనర్ లో వచ్చిన ఈ సినిమాని మన ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారో, మహేష్ బాబు-సుకుమార్- దేవీశ్రీ ప్రసాద్ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

గౌతమ్(మహేష్ బాబు) గ్రేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఒక రాక్ స్టార్. అతనికి ఎప్పుడు ఒక కల వస్తూ ఉంటుంది. తన అమ్మానాన్నలని ఎవరో ముగ్గురు చంపేసినట్టు, వాళ్ళు తనని కూడా తనని చంపడానికి ట్రై చేస్తున్నారని. కానీ గౌతమ్ రివర్స్ లో ఆ విలన్స్ చంపేస్తుంటాడు. కట్ చేస్తే ఇదంతా కేవలం గౌతమ్ ఊహ మాత్రమే అని అర్థమవుతుంది. అలాంటి తరుణంలో జర్నలిస్ట్ సమీర(కృతి సనన్) గౌతమ్ లైఫ్ లోకి ఎంటర్ అవుతుంది. ఏది నిజం ఏది అపద్దం తెలుసుకోలేని గౌతమ్ సమీరతో పాటు తన గతం ఏంటో తెలుసుకోవడానికి అన్వేషణ మొదలు పెడతాడు. ఆ ప్రయాణంలో గౌతమ్ తెలుసుకున్న నిజం ఏమిటి? అసలు నిజంగానే గౌతమ్ అమ్మానాన్నా ఉన్నారా? ఉంటే వాళ్ళెవరు? అసలు వాళ్ళు ఎందుకు చంపబడ్డారు? గౌతమ్ అమ్మానాన్నని చంపిన ఆ ముగ్గురు ఎవరు? ఇందుకోసం చంపారు? అనే సస్పెన్స్ ని మీరు తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అంటే అది వన్ అండ్ ఓన్లీ మహేష్ బాబు. రాక్ స్టార్ కోసం మహేష్ బాబు తనని తాను మార్చుకున్న లుక్ సింప్లీ సూపర్బ్ అని చెప్పాలి. రాక్ స్టార్ గా మహేష్ బాబు స్టైల్, మాడ్యులేషన్ అందరినీ ఆకట్టుకుంటుంది. డాన్సులు కూడా బాగా చేసాడు. అలాగే ఎమోషనల్ సీన్స్ బాగా చేసాడు, ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో బాగా చేసాడు. సినిమాకి మరో ప్లస్ పాయింట్ ఏమిటంటే ప్రిన్స్ గౌతమ్. మొదటి సినిమా అయినా తనకిచ్చిన సీన్స్ ని బాగా చేసాడు. క్లైమాక్స్ లో మహేష్ బాబు – గౌతమ్ ఒకేసారి స్క్రీన్ మీద కనిపించే షాట్ కి థియేటర్స్ లో సూపర్బ్ రెస్పాన్స్.

కృతి సనన్ నటన బాగుంది. అలాగే గ్లామర్ పరంగా కూడా కాస్త హాట్ గా కనిపించి ఆకట్టుకుంది. జాన్ బాషాగా సాయాజీ షిండే, గులాం సింగ్ గా పోసాని కృష్ణ మురళి ఓ రెండు మూడు సీన్స్ లో నవ్వించారు. ఇంటర్వల్ బ్లాక్, సెకండాఫ్ లో వచ్చే కొన్ని సీన్స్ మరియు ట్విస్ట్ లు బాగున్నాయి. ‘హూ ఆర్ యు’, ‘యు ఆర్ మై లవ్’ పాటలు చూడటానికి బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ముందుగా మహేష్ బాబు గత మూడు సినిమాలు హిట్ అవ్వడం, అలాగే ఆ సినిమాల్లో ఆయన చేసిన కామెడీ మరియు పంచ్ డైలాగ్స్ లేకపోవడం అభిమానులను కాస్త నిరాశ పరుస్తుంది. అలాగే సినిమా మొత్తంలో ఎంటర్టైన్మెంట్ అనేది లేకపోవడం పెద్ద మైనస్. అలాగే డైరెక్టర్ హీరోయిజం ని కూడా పర్ఫెక్ట్ గా ఎలివేట్ చెయ్యకపోవడం, ఎప్పుడు అయోమయంలోనే చూపిస్తుండడం పెద్దగా ఆకట్టుకోలేదు.

సినిమా ప్రారంభాన్ని బాగానే ప్లాన్ చేసుకున్న సుకుమార్ ఆ తర్వాత సినిమాని ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు. గోవా ఎపిసోడ్ మొత్తం నిజం – అబద్దం, నిజం – అబద్దం అంటూ తిప్పి తిప్పి అలాంటి సీన్స్ రిపీట్ గా వస్తుండడం, అవి కూడా ఊహాజనితంగా ఉండడం వల్ల ప్రేక్షకులను కాస్త చిరాకు పెడతాయి. ప్రీ క్లైమాక్స్ తో పోల్చుకుంటే క్లైమాక్స్ బాలేదు.

సినిమా ద్వారా ఏమి చెప్పాలనుకుంటున్నాడు అనే కాన్సెప్ట్ ని మొదటి 20 నిమిషాల్లోనే చెప్పేయడం వల్ల ఆ తర్వాత ఎలా తీసినా చివరికి ఏం చెప్తాడు అనేది ప్రేక్షకులు ఊహించేయవచ్చు. సరే కాన్సెప్ట్ ని పక్కన పెడితే కథనం అన్నా ఆసక్తి కరంగా ఉందా అంటే అది కూడా లేదు. ఆసక్తికి బదులు అయోమయాన్ని క్రియేట్ చేసాడు. మొదటి నుంచి యాక్షన్ సీక్వెన్స్ లు లండన్ లో అలా తీసాం ఇలా తీసాం అని చెప్పుకున్నారు కానీ అవేవీ ప్రేక్షకులు ఊపిరి బిగపట్టుకొని సీటు చివరన కూర్చొని చూసేలా మాత్రం లేవు. సినిమా నిడివి 10 నిమిషాలు తక్కువ 3 గంటలు ఉండడంతో సినిమా బోర్ కొట్టడమే కాకుండా బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ది బెస్ట్ అనిపించుకున్న వారు ఇద్దరే.. మొదటి వ్యక్తి – సినిమాటోగ్రాఫర్ రత్నవేలు.. ప్రతి లొకేషన్ ని, హీరో, హీరోయిన్ లని చాలా బాగా చూపించాడు. ప్రతి ఫ్రేం చాలా రిచ్ గా, గ్రాండ్ లుక్ ఉండేలా తీయడంతో సినిమా చూస్తున్నంత సేపు విజువల్స్ పరంగా చాలా బాగుందనిపిస్తుంది. ఇక రెండవ వ్యక్తి – దేవీశ్రీ ప్రసాద్. అతను అందించిన పాటలు బాగున్నాయి కానీ విజువల్స్ పరంగా అంతకన్నా బాగా హిట్ అయ్యాయి. పాటలు పక్కన పెడితే దేవీశ్రీ కంపోజ్ చేసిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. ఇది హాలీవుడ్ మూవీ నుంచి స్పూర్తి తీసుకున్నప్పటికీ సినిమాకి బాగా మ్యాచ్ అయ్యింది.

ఎడిటర్ సినిమాని చాలా వరకు కత్తిరించి నిడివి కాస్త తగ్గించి ఉంటే సినిమాకి కాస్తో కూస్తో హెల్ప్ అయ్యేది. కథ కోసం ఎంచుకున్న పాయింట్ కొత్తదే అయినప్పటికీ కథనంలో కాస్త గందరగోళం క్రియేట్ చెయ్యడం, ఊహాజనితంగా ఉండడంతో పెద్దగా మెప్పించలేకపోయారు. సుకుమార్ నటీనటుల నుండి పెర్ఫార్మన్స్ ని బాగా రాబట్టుకున్నప్పటికీ టేకింగ్ విషయంలో మాత్రం పెద్దగా మెప్పించలేకపోయాడు. యాక్షన్, చేజింగ్ లాంటి సీన్స్ సుకుమార్ కి కొత్త కావడం వల్ల వాటిని 100% పర్ఫెక్ట్ గా తీయలేకపోయాడు.

తీర్పు :

సుమారు రెండు సంవత్సరాల పాటు అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కి, భారీ అంచనాల నడుమ విడుదలైన ‘1-నేనొక్కడినే’ సినిమా ప్రేక్షకుల చేత పరవాలేదు అనిపించుకుంది. మహేష్ లుక్, పెర్ఫార్మన్స్, గౌతమ్ స్పెషల్ అప్పీయరెన్స్, కృతి సనన్ గ్లామర్, ఒకటి రెండు ట్విస్ట్ లు చెప్పదగినవి అయితే గందరగోళంగా మరియు ఊహాజనితంగా సాగిన కథనం, సినిమా నిడివి సుమారు 2 గంటలా 50 నిమిషాలు ఉండి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించడం, ఎంటర్టైన్మెంట్ లేకపోవడం, యాక్షన్ సీక్వెన్ లు జస్ట్ ఓకే అనిపించడం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్. అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం వాళ్ళ మొదటి వారం రెవిన్యూ మరియు మహేష్ బాబుకి ఉన్న క్రేజ్ ఈ సినిమాకి హెల్ప్ అవ్వుద్ది.

123తెలుగు.కామ్ రేటింగ్ : ‘1-నేనొక్కడినే’ సినిమాకి మేము అఫీషియల్ మీడియా పార్టనర్ గా ఉన్నాము. మేము ప్రమోట్ చేసిన చిత్రానికి రేటింగ్ ఇవ్వడం సబబు కాదు. అందువల్ల ఈ చిత్రానికి మేము రేటింగ్ ఇవ్వడం లేదు. మీరే స్వయంగా థియేటర్ కి వెళ్లి మహేష్ బాబు స్టైలిష్ థ్రిల్లర్ మూవీని ఎంజాయ్ చెయ్యండి..

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version