సమీక్ష : ఆడు మగాడ్రా బుజ్జి – పరవాలేదనిపించిన బుజ్జి.!

aadu-magaadra-bujji విడుదల తేదీ : 7 డిసెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకుడు : కృష్ణారెడ్డి గంగదాసు
నిర్మాత : ఎం. సుబ్బారెడ్డి – ఎస్.ఎన్ రెడ్డి
సంగీతం : శ్రీ కొమ్మినేని
నటీనటులు : సుధీర్ బాబు, అస్మితా సూద్, పూనం కౌర్..


‘ఎస్.ఎం.ఎస్’ తో పరవాలేధనిపించుకొని, ‘ప్రేమ కథా చిత్రమ్’తో సూపర్ హిట్ అందుకున్న సుధీర్ బాబు హీరోగా నటించిన మూడవ సినిమా ‘ఆడు మగాడ్రా బుజ్జి’. ఈ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. అస్మితా సూద్ హీరోయిన్ గా నటించిన ఈ లవ్ ఎంటర్టైనర్ సినిమా ద్వారా కృష్ణారెడ్డి గంగదాసు డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. ఎం. సుబ్బారెడ్డి – ఎస్.ఎన్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి శ్రీ సంగీతం అందించాడు. సుదీర్ బాబు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి 6 ప్యాక్ కూడా చేసాడు. సుధీర్ బాబు చేసిన ఈ మూడో సినిమా తన కెరీర్ కి హెల్ప్ అయ్యే విధంగా హిట్ అయ్యిందో లేదో ఇప్పుడు చూద్దాం…

కథ :

సిద్దు(సుధీర్ బాబు) పుట్టినప్పటి నుండే తన తండ్రి అయిన ప్రసాద్(సీనియర్ నరేష్) కి తెగ అల్లరి చేస్తూ చుక్కలు చూపిస్తుంటాడు. ఇలాంటి అల్లరి చేసే కుర్రాడు మొదటి చూపులోనే ఇందు(అస్మితా సూద్)ని చూసి ప్రేమలో పడతాడు. తన కోసం తను చదివే కాలేజ్ లో చేరతాడు. కానీ అక్కడ ఇందు మీద ఈగ కూడా వాలనివ్వకుండా చూసుకునే చెర్రి(రణధీర్ రెడ్డి) ఉంటాడు. కానీ అదే కాలేజ్ లో చెర్రిని ఇష్టపడే అంజలి(పూనం కౌర్) ఉంటుంది. దాంతో సిద్దు చెర్రి – అంజలిలను ఒకటి చేసి తన ట్రాక్ ని క్లియర్ చేసుకుంటాడు. అప్పుడే కథలో ట్విస్ట్. వీరి నలుగురి జీవితాల్లోకి రౌడీ మరియు రాజకీయాల్లో ఎదగాలనుకునే శంకరన్న అలియాస్ బుజ్జి(అజయ్) వస్తాడు. అక్కడి నుంచి కథ పలు మలుపులు తిరుగుతుంది. అసలు బుజ్జి ఎవరు? ఎందుకు వీరి జీవితాల్లోకి వచ్చాడు? ఈ నలుగురికి బుజ్జికి ఉన్న సంబంధం ఏమిటి? చివరికి ఈ రెండు జంటల్లో ఎంతమంది కలిసారు? అనే అంశాలను మీరు తెరపైనే చూడాలి.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో రెండు కామెడీ ట్రాక్స్ చాలా బాగున్నాయి. ఒకటి సుధీర్ బాబు పాధర్ గా నటించిన సీనియర్ నరేష్ కామెడీ ట్రాక్ ప్రేక్షకులని బాగా నవ్విస్తుంది. అలాగే ఈ సినిమా మొత్తం ట్రావెల్ అయ్యేలా చేసిన కుక్క కామెడీ ప్రేక్షకులని బాగా నవ్విస్తుంది. ఈ కుక్కకి డబ్బింగ్ చెప్పిన వాయిస్ చాలా బాగుంది. ఈ రెండు కామెడీ ట్రాక్స్ సినిమాలో మొత్తం ట్రావెల్ అవుతూ అక్కడక్కడా నవ్విస్తూనే ఉంటారు.

ఇక సినిమా హీరో సుధీర్ బాబు నటన బాగుంది. కామెడీ డైలాగ్స్ బాగా చెప్పాడు. ఇక ఎప్పటిలానే అన్ని పాటల్లో డాన్సులు బాగా వేసాడు. విలన్ పాత్రలో అజయ్ మరో సారి మెప్పించాడు. పూనం కౌర్ రణధీర్ రెడ్డి, సుమన్ ల నటన పాత్ర పరిధిమేర ఉంది. సినిమా ఫస్ట్ హాఫ్ లో మొదటి 40 నిమిషాలు చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి మైనస్ పాయింట్ సెకండాఫ్. సెకండాఫ్ లో అక్కడక్కడా కామెడీ ఉన్నా సరే మొత్తం ఊహాజనితంగా ఉంటుంది. సీన్ టు సీన్ ప్రేక్షకులు ఊహించేయవచ్చు. చెప్పాలంటే సెకండాఫ్ డీ రెడీ దేనికైనా రెడీ, బిందాస్ మొదలైన సినిమాలను పోలి ఉంటుంది. క్లైమాక్స్ రొటీన్ కె రొటీన్ గా ఉండటం ఇంకాస్త నిరుత్సాహానికి గురిచేస్తుంది. అలాగే నటీనటుల డైలాగ్ డెలివరీ విషయంలో డైరెక్టర్ ఇంకాస్త శ్రద్ధ తీసుకావాల్సింది. ఎందుకంటే పంచ్ డైలాగ్స్ ని ఎక్కడ నొక్కి పలకాలో తెలియకుండా రొటీన్ గా చెప్తే వినడానికి అస్సలు బాగోవు.

హీరోయిన్ అస్మితా సూద్ నటన అంత బాగాలేదు, అలాగే హీరో కంటే ఎక్కువ వయసున్న అమ్మాయిలా కనిపిస్తుంది. సినిమాకి ముందు నుంచి ఈ సినిమా కోసం సుధీర్ బాబు సిక్స్ ప్యాక్ చేసాడని చెప్పుకొని, పోస్టర్స్ లో పబ్లిసిటీ చేసారు. కానీ తీరా సినిమాలో చూస్తే పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ లో సిక్స్ ప్యాక్ చూపించకుండా ఓ రెండు పాటల్లో సిక్స్ ప్యాక్ ని చూపించడం విడ్డూరంగా అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో మొదటగా చెప్పుకోవాల్సింది సినిమాటోగ్రాఫర్ సాంటానియో టెర్జియో. తను ప్రతి లొకేషన్ ని, ప్రతి ఫ్రేం ని రిచ్ గా వచ్చేలా చేసాడు. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ అందించిన పాటలు పెద్దగా హెల్ప్ అవ్వలేదు. అలాగే శ్రీ – సునీల్ కశ్యప్ కలిసి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎడిటర్ సెకండాఫ్ మీద కాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది.

ఇక పద్మశ్రీ నంద్యాల అందించిన కథ చెప్పుకోతగ్గ స్థాయిలో ఏం లేదు. ఇక స్క్రీన్ ప్లే – దర్శకత్వ విభాగాలను క్రిష్ణారెడ్డి గంగదాసు డీల్ చేసాడు. ముందుగా ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే, పాత్రలను పరిచయం చేయడం, ఎంటర్టైన్మెంట్ విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకున్నాడు కానీ సెకండాఫ్ ని మాత్రం రొటీన్ గా లాగించేసాడు. దాంతో డైరెక్టర్ గా పరవాలేదనిపించుకున్నాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘ఆడు మాగాడ్రా బుజ్జి’ సినిమా ఫస్ట్ హాఫ్ ఎంటర్టైనింగ్ గా, సెకండాఫ్ రొటీన్ గా సాగిపోయే సినిమా. సుధీర్ బాబు నటన, సీనియర్ నరేష్ మరియు కుక్క కామెడీ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తే రొటీన్ గా అనిపించే సెకండాఫ్ మిమ్మల్ని కాస్త నిరుత్సాహపరుస్తుంది. ఓవరాల్ గా సినిమా సూపర్బ్ అనేంత లేదు అలా అని తీసిపారేసెంత కూడా లేదు..

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version