సమీక్ష : బలుపు – మాస్ ని మెప్పించే ఎంటర్టైనర్

విడుదల తేదీ : 28 జూన్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
దర్శకుడు : గోపీచంద్ మలినేని
నిర్మాత : పరమ్ వి పొట్లూరి
సంగీతం : ఎస్ ఎస్ థమన్
నటీనటులు : రవితేజ, శృతి హాసన్, అంజలి..


గత కొద్ది కాలంగా బాక్స్ ఆఫీసు వద్ద సరైన హిట్ లేక పూర్తిగా డీలా పడిపోయిన మాస్ మహారాజ రవితేజ ఈ సారి హిట్ కొట్టాలని నిర్ణయించుకొని తన గెటప్ మార్చి చేసిన సినిమా ‘ బలుపు’. ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల తర్వాత రవితేజ మాస్ లుక్ లో కనిపిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్, అంజలి హీరోయిన్స్ గా నటించారు. గతంలో రవితేజతో ‘డాన్ శీను’ సినిమా తీసిన గోపీచంద్ మలినేని ఈ సినిమాకి డైరెక్టర్. పరమ్ వి పొట్లూరి భారీగా నిర్మించిన ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించాడు. ప్రస్తుతం సక్సెస్ లు అందుకొని ఫుల్ ఫాంలో ఉన్న శృతి హాసన్, అంజలి లక్ అన్నా కలిసి వచ్చి ‘బలుపు’తో రవితేజ హిట్ అందుకున్నాడో లేదో ఇప్పుడు చూద్దాం..

కథ :

రవి(రవితేజ) బ్యాంకులో పనిచేస్తూ తన తండ్రి మోహన్ రావు(ప్రకాష్ రాజ్) తో కలిసి బెంగుళూరులో నివసిస్తుంటాడు. ఒక రోజు తన ఫ్రెండ్ బొగ్గు శ్రీనివాస్(సత్యం రాజేష్) అందరినీ ఆటపట్టించే శృతి(శృతి హాసన్), క్రేజీ మోహన్(బ్రహ్మానందం) చేతిలో మోసపోయి సూసైడ్ చేసుకుంటాడు. అలా చేస్తున్న వాళ్ళకి బుద్ది చెప్పాలని రవి అనుకుంటాడు. అందులో భాగంగానే శృతిని ఆటపట్టిస్తుంటాడు. అది ఒక స్టేజ్ కి వచ్చేసరికి శృతి రవితో నిజంగానే ప్రేమలో పడుతుంది. కట్ చేస్తే శృతికి మరో వారం రోజుల్లో రోహిత్(అడవి శేష్) పెళ్లి ఉంటుంది. కానీ ఈ విషయం తెలియడంతో శృతి తల్లి తండ్రులు రోహిత్ తో పెళ్లి కాన్సల్ చేసి రవితో నిశ్చితార్ధం జరిగే సమయంలో రోహిత్ మామయ్యా వైజాగ్ పూర్ణ(అసుతోష్ రాణ) ఎంటర్ అవుతాడు.

అప్పుడే సినిమాలో మెయిన్ ట్విస్ట్. పూర్ణ శృతిని తీసుకొని వైజాగ్ వెళ్ళిపోతూ రవిని వైజాగ్ రమ్మని చాలెంజ్ చేస్తాడు. కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్ రవి అలియాస్ శంకర్ – మోహన్ రావు అలియాస్ నానాజీ – వైజాగ్ పూర్ణ మధ్య పాత కక్ష్యలు ఉంటాయి. అసలు వీరి ముగ్గిరికి ఉన్న గొడవలేంటి? వీరి మధ్యలో డాక్టర్ అంజలి(అంజలి) ఎలా ప్రవేశించింది? రవితేజ – అంజలి మధ్య ప్రేమ ఎలా పుట్టింది? ఆ తర్వాత అంజలికి ఏమైంది? చివరికి రవి శృతిని కాపాడి పెళ్లి చేసుకున్నాడా? లేదా అనేదే ఆసక్తికరమైన కథాంశాన్ని వెండితెరపైనే చూడాలి. స్పెషల్ రోల్ చేసిన లక్ష్మీ రాయ్ తన గ్లామర్ తో మాస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

ప్లస్ పాయింట్స్ :

రవితేజకి బలుపు కమ్ బ్యాక్ మూవీ అని చెప్పాలి. ఎప్పటిలానే రవితేజ ఫుల్ ఎనర్జీతో ఇచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేసాడు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ మాస్ పాత్రలో పవర్ఫుల్ పంచ్ డైలాగులు, నటన ఇరగదీశాడు. ఇక హీరోయిన్ పొడుగుకాళ్ల సుందరి శృతి హాసన్ విషయానికి వస్తే సినిమా మొత్తం అవుట్ అండ్ అవుట్ అల్ట్రా మోడ్రన్ గర్ల్ గా కనిపించింది. అలాగే మొదటి సారి శృతి హై రేంజ్ లో అందాలు ఆరబోసి ప్రేక్షకుల మతి పోగొట్టిందని చెప్పాలి. అలాగే డాన్సులు కూడా బాగా చేసింది. ముఖ్యంగా ‘పాతికేళ్ళ సుందరి’ పాటలో మాస్ ప్రేక్షకులని డాన్సులతో విపరీతంగా ఆకట్టుకుంది. అంజలికి మరోసారి నటనకి ఆధారం ఉన్న పాత్ర దక్కింది. ఆ పాత్రకి అంజలి పర్ఫెక్ట్ గా సరిపోయింది మరియు పాత్రకి తనవంతు న్యాయం చేసింది.

సినిమాలో అందరికీ ఫుల్ కామెడీని పంచి ప్రేక్షకుల ముఖంలో నవ్వులు పూయించిన క్రీజీ మోహన్ అదే మన బ్రహ్మానందం నటన సూపర్బ్. ఈ సినిమాలో ఆయన తన కామెడీతోనే కాకుండా ‘గగ్నమ్ స్టైల్’, ‘ఐపిఎల్ జంపింగ్ జపాన్’ మ్యూజిక్ బిట్స్ కి స్టెప్పులేసి బాగా నవ్వించాడు. సినిమాలో చివరిగా ‘కనకనలాడే నిప్పు కణాన్ని.. కాకమీదున్న ఈ క్రేజీ ని ఏం చెయ్యలేరు’, ‘మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్’ అనే ఎమోషన్ డైలాగ్స్ ని బ్రహ్మానందం చెప్పడం విపరీతంగా నవ్వుతెప్పిస్తాయి. ప్రకాష్ రాజ్ ఈ సినిమాలో ఒకదానితో ఒకదానికి సంబంధం లేని రెండు విభిన్న పాత్రలను పోషించాడు. రెండు పాత్రలకి పూర్తి న్యాయం చేసాడు. అడవి శేష్, అసుతోష్ రాణాలు తమ పరిధిమేర నటించారు. ఇంటర్వెల్ బాంగ్ అందరినీ ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

సినిమా కోసం ఎంచుకున్న మెయిన్ స్టొరీ లైన్ ఇప్పటికి మనం చాలా సినిమాల్లో చూసాం కాబట్టి కథా పరంగా చూసుకుంటే మీకు పెద్దగా అనిపించదు. ఫస్ట్ హాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తో లాగేసినా సెకండాఫ్ లో అక్కడక్కడా కాస్త ఫ్లో తగ్గింది అలాగే కొన్ని సీన్స్ తో సినిమాని సాగదీశారని చెప్పుకోవాలి. క్లైమాక్స్ లో రవితేజ సీరియస్ ఎమోషన్ కాస్త తగ్గిందనిపిస్తుంది, అక్కడ బ్రహ్మానందం కామెడీ లేకపోతే సినిమా చాలా వీక్ అయిపోయేది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ప్రకాష్ రాజ్ – అసుతోష్ రానా మధ్య ఉండే వైరం గురించి చూపించే సీన్స్ ఇంకాస్త ఎక్కువ రేంజ్ లో ఉంటే బాగుండేది. రవితేజ – అంజలి రొమాంటిక్ ట్రాక్ ఇంకాస్త బెటర్ గా ఉంటే బాగుండేది. సినిమా క్లైమాక్స్ సాంగ్ బాగున్నప్పటికీ అది వచ్చి ప్లేస్ సరైనదిగా అనిపించలేదు. కమెడియన్ అలీని సరిగా ఉపయోగించుకోలేదు అందుకే ఆయన పాత్ర స్క్రీన్ పై పెద్దగా పేలలేదు. రావు రమేష్, బ్రహ్మాజీ, సుప్రీత్, శ్రీనివాస్ రెడ్డి, ఫిష్ వెంకట్ లాంటి వారిని సరిగా ఉపయోగించుకోలేదు.

సాంకేతిక విభాగం :

సినిమా కథ పాతదే అయినప్పటికీ స్క్రీన్ ప్లేని చాలా తెలివిగా రాసుకున్నారు అదే సినిమాని చాలా వరకూ కాపాడింది. అలాగే డైరెక్షన్ బాగుంది, నటీనటులనుండి బెస్ట్ పెర్ఫార్మన్స్ ని రాబట్టుకున్నాడు. ఈ రెండు విభాగాల్లోనూ గోపీచంద్ మలినేని మంచి మార్కులు సంపాదించుకున్నాడు. సినిమాటోగ్రాఫర్ జయనన్ విన్సెంట్ పనితనం బాగుంది. కోనా వెంకట్ – వెలిగొండ శ్రీనివాస్ డైలాగ్స్ బాగున్నాయి. సెకండాఫ్ తో పోల్చుకుంటే ఫస్ట్ హాఫ్ లో గౌతంరాజు ఎడిటింగ్ బాగుంది. ఫైట్స్ చాలా వరకూ గాల్లోనే ఉన్నా సినిమాకి సరిపోయాయి కానీ నలుగురు ఫైట్ మాస్టర్స్ కంపోజ్ చేయడం వల్ల ఎవరు ఏ ఫైట్ కంపోజ్ చేసారో చెప్పడం కష్టం. థమన్ మ్యూజిక్ ఓకే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకి టైటిల్ కి తగ్గట్టే ఉంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘బలుపు’ మాస్ ప్రేక్షకులను మెప్పించే మాస్ మసాలా ఎంటర్టైనర్. చాలా రోజుల తర్వాత మెప్పించిన రవితేజ మాస్ యాక్షన్, శృతి హాసన్ గ్లామర్, బ్రహ్మానందం కామెడీ, కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ అయితే కాస్త పాతదిగా అనిపించే కథ, సెకండాఫ్ అక్కడక్కడా కాస్త తగ్గడం చెప్పదగిన మైనస్ పాయింట్స్. చివరిగా రవితేజ శృతి హాసన్, అంజలితో జోడీ కట్టి తనని చాలా కాలంగా ఊరిస్తున్న హిట్ ని అందుకున్నాడు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version