సమీక్ష : హృదయ కాలేయం – సంపూ కామెడీ ఎంటర్టైనర్

hrudaya-kaleyam విడుదల తేదీ : 4 ఏప్రిల్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : స్టీవెన్ శంకర్
నిర్మాత : సాయి రాజేష్ నీలం
సంగీతం : ఆర్.కె
నటీనటులు : సంపూర్నేష్ బాబు, ఇషిక సింగ్, కావ్య కుమార్..

సోషల్ మీడియాలో సంచలనం సృష్టించిన సంపూర్నేష్ బాబు హీరోగా తెరకెక్కిన సినిమా ‘హృదయ కాలేయం’. ‘ఎ కిడ్నీ విత్ హార్ట్’ అనే ఉపశీర్షిక ఉన్న ఈ సినిమా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. స్టీవెన్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సాయి రాజేష్ నీలం నిర్మాత. సంపూర్నేష్ బాబు సరసన ఇషిక సింగ్, కావ్య కుమార్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమాకి ఆర్.కె మ్యూజిక్ కంపోజ్ చేసాడు. సోషల్ మీడియాలోనే కాకుండా ‘హృదయ కాలేయం’ మూవీతో కూడా సంపూర్నేష్ బాబు సంచలనం సృష్టించాడేమో ఇప్పుడు చూద్దాం..

కథ :

సిటీలోని పోలీస్ డిపార్ట్ మెంట్ సిటీ ఎలక్ట్రికల్ షాప్స్ లో జరుగుతున్న దొంగను పట్టుకోవడానికి తెగ ట్రై చేస్తుంటారు. కానీ పట్టుకోలేక పోతుంటారు. అతనే సంపూర్నేష్ బాబు(సంపూర్నేష్ బాబు) అని కొద్ది రోజులకి తెలుస్తుంది. దాంతో అతన్ని పట్టుకోవడానికి ఓ స్పెషల్ టీంని రంగంలోకి దించుతారు. ఎలాగో కష్టపడి పోలీసులు సంపూర్నేష్ బాబుని పట్టుకుంటారు.

పోలీసులు అసలు సంపూర్నేష్ దొంగగా ఎందుకు మారాడు అని అడగడంతో సంపూ తన ఫ్లాష్ బ్యాక్ మొదలవుతుంది. ఒక మెకానిక్ అయిన సంపూర్నేష్ తన ప్రేమకోసమే ఇదంతా చేస్తున్నాడని తెలుస్తుంది. అసలు తన పూర్తి ఫ్లాష్ బ్యాక్ ఏమిటి? ప్రేమ కోసం దొంగతనాలు చేయటం ఏంటి? అనే పలు రకాల విషయాలకు సమాధానం కావాలంటే మీరు ‘హృదయ కాలేయం’ సినిమా తప్పక చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి ప్లస్ అంటే మరో ఆలోచన లేకుండా చెప్పాల్సిన, చెప్పుకోవాల్సిన పేరు సంపూర్నేష్ బాబు. ఇప్పటి వరకూ పోస్టర్స్, ట్రైలర్స్ లో మాత్రమే సంచలనం సృష్టించిన సంపూ ప్రేక్షకులను మెప్పించడంలో కూడా ఎక్కడా నిరుత్సాహపరచలేదు. సినిమా మొత్తం తన కామెడీ, డాన్సులు, ఫైట్స్ తో ప్రేక్షకులను ఆద్యంతం నవ్విస్తూనే ఉన్నాడు. సంపూ బాబు చెప్పిన డైలాగ్స్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉన్నాయి. ఇటీవల కాలంలో వల్గారిటీ లేకుండా ఇలాంటి కామెడీని చూడలేదు.

హీరోయిన్ పూజా కుమార్ చూడటానికి బాగుంది అలాగే, తన పాత్ర వరకూ బాగానే చేసింది. ఈ సినిమాలో రాసుకున్న సెటైరికల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ లను డైరెక్టర్ చాలా బాగా తీసాడు. అలాగే పోలీస్ ఆఫీసర్ గా కనిపించినతని పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుంది. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ లో కామెడీ మీ పొట్ట చెక్కలయ్యేలా ఉంటుంది. అలాగే క్లైమాక్స్ కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఇదొక సెటైరికల్ సినిమా కావడంతో ముందుగా అనుకున్నట్టుగానే ఈ సినిమాలో లాజిక్ అనేది అస్సలు ఉండదు. ఎంత సెటైరికల్ సినిమా అయినా శృతి మించి సీన్స్ ఉండకూడదు కానీ కొన్ని సీన్స్ శృతి మించి పోయాయి. అలాగే సినిమా ఫస్ట్ హాఫ్ లో వచ్చే హీరోయిన్ ఇషిక సింగ్ పాత్రకి అస్సలు క్లారిటీ లేదు, అలాగే మరికొన్ని పాత్రలకి కూడా ఎందుకు వస్తాయి ఎందుకు వెళ్తాయి అన్న క్లారిటీ లేదు. సెకండాఫ్ 15 నిమిషాలు గడిచిన తర్వాత క్లైమాక్స్ ముందు వరకూ సినిమా స్లో అయిపోతుంది. అక్కడ ఆడియన్స్ చాలా బోర్ ఫీలవుతారు. అలాగే సంపూర్నేష్ బాబు తెలియని వారు ఈ సినిమాని అర్థం చేసుకోవడం కాస్త కష్టమైన పని.

సాంకేతిక విభాగం :

రస్సెల్ కార్పెంటర్ సినిమాటోగ్రఫీ బాగుంది. చిన్న బడ్జెట్ సినిమా అయినప్పటికీ విజువల్స్ మాత్రం రిచ్ గా ఉన్నాయి. ఆర్.కె అందించిన పాటలు పరవాలేధనిపించాయి. ఎడిటింగ్ ఓకే కానీ సెకండాఫ్ లో ఒక 5-10 నిమిషాలు కట్ చేసి ఉండొచ్చు.

ఇక డైరెక్టర్ స్టీవెన్ శంకర్ కథ – స్క్రీన్ ప్లే – డైలాగ్స్ – దర్శకత్వ విభాగాలను హ్యాండిల్ చేసాడు. కథలో పెద్ద లాజిక్ లేకపోయినా స్క్రీన్ ప్లే మాత్రం బాగా రాసుకున్నాడు. దాని వల్ల ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. అలాగే సంపూకి రాసిన వన్ లైన్ పంచ్ డైలాగ్స్ ఆడియన్స్ ని తెగ నవ్వించాయి. అలాగే మొదటి సినిమాతో డైరెక్టర్ గా స్టీవెన్ శంకర్ మంచి మార్కులు సంపాదించుకున్నాడు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

తీర్పు :

సంపూర్నేష్ బాబు నటించిన ‘హృదయ కాలేయం’ సినిమా అన్నిరంగులు కలగలిపిన ఒక మసాలా సెటైరికల్ ఫిల్మ్. పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే సంపూర్నేష్ బాబు పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి మేజర్ హైలైట్. సినిమాలో అసలు లాజిక్ అనేది లేకపోవడం మైనస్. లాజిక్ లతో సంబంధం లేదు సినిమా ఎంటర్ టైనింగ్ గా ఉంటే చాలు అనుకునే వారికి ఈ సినిమా మంచి టైం పాస్. సంపూ గిరించి తెలిసిన వారు మాత్రం బాగా ఎంజాయ్ చేసే సినిమా ఇది.మిగతా వారికి ఈ సినిమా పెద్దగా ఎక్కే అవకాశం లేదు.
123తెలుగు.కామ్ రేటింగ్ : 3 /5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version