సమీక్ష : జబర్దస్త్ – ఓ సారి చూడొచ్చు

Jabardasth2 విడుదల తేదీ : 22 ఫిబ్రవరి 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : నందిని రెడ్డి
నిర్మాత : బెల్లంకొండ గణేష్ బాబు
సంగీతం : ఎస్.ఎస్ థమన్
నటీనటులు : సిద్దార్థ్, సమంత, నిత్యా మీనన్..

2011 జనవరి చివరిలో ‘అలా మొదలైంది’ సినిమాతో మన ముందుకొచ్చి సూపర్ హిట్ అందుకున్న లేడీ డైరెక్టర్ నందిని రెడ్డి రెండు సంవత్సరాల గ్యాప్ తీసుకొని చేసిన కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ‘జబర్దస్త్’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పటి వరకూ క్లాస్ సినిమాలు చేస్తూ లవర్ బాయ్ పేరున్న సిద్దార్థ్, అలాగే అందాల భామ సమంత మొదటి సారి మాస్ పాత్రలు పోషించిన ఈ సినిమాలో నిత్యా మీనన్, శ్రీహరి ప్రధాన పాత్రలు పోషించారు. బెల్లం కొండ గణేష్ బాబు నిర్మించాడు. అంచనాలు బాగున్న ఈ ‘జబర్దస్త్’ సినిమా జబర్దస్త్ గా ఉందో? లేదో? ఇప్పుడు చూద్దాం.

కథ :

బైర్రాజు(సిద్దార్థ్) ఊరంతా అప్పులు చేసి పలు వ్యాపారాలు చేసి బాగా నష్టపోయి అప్పులవారికి దొరక్కుండా తప్పించుకొని తిరుగుతుంటాడు. అందులో భాగంగానే హైదరాబాద్ నుంచి పారిపోయి బిహార్ లో ఉంటాడు. అక్కడ కూడా అప్పులు చేసి పారిపోయి ఐదేళ్ళ తరువాత హైదరాబాద్ వచ్చి తన ఫ్రెండ్ పండుని (అర్జున్) కలిసి అతనితో ఉంటాడు. అనుకోకుండా ఓ పెళ్లిలో శ్రేయ (సమంత) అనుకుంటున్న ఐడియాని కాపీ కొట్టి ఫేమస్ మ్యారేజ్ ఈవెంట్ ఆర్గనైజర్ పింకీ శర్మ దగ్గర తనకి రావాల్సిన ఉద్యోగం బైర్రాజు కొట్టేస్తాడు. అది తెలుసుకున్న శ్రేయ – బైర్రాజుతో ఒక ఒప్పందానికి వచ్చి ఇద్దరూ ఆమె దగ్గర ఉద్యోగంలో చేరతారు. ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో ఇద్దరూ విడిపోతారు. అసలు ఎందుకు విడిపోయారు? అలా విడిపోయిన వీరి జీవితాల్లోకి సరస్వతి (నిత్యా మీనన్), ఫేమస్ డాన్ జావేద్ భాయ్ (శ్రీహరి) ఎందుకు వచ్చారు? చివరికి వీరు కలిసారా? లేదా? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

మొదటగా కొత్తగా మాస్ యాంగిల్ ట్రై చేసిన సిద్దార్థ్ గురించి చెప్పుకోవాలి. మాస్ పాత్రలో సిద్దార్థ్ ఫెర్ఫార్మెన్స్ ఫుల్ ఎనర్జీగా ఉంది. అలాగే వచ్చీ రాని ఇంగ్లీష్ లో మాట్లాడుతూ బాగా నవ్వించాడు. ఇక టాలీవుడ్ అందాల భామ సమంత గురించి చెప్పుకోవాలి. సమంత కొన్ని సీన్స్ లో చేసిన మాస్ యాక్టింగ్ సూపర్బ్. సమంత పెర్ఫార్మన్స్, గ్లామరస్ లుక్, మాస్ డాన్సులు సినిమాకి ప్రధాన హైలైట్. సమంత మరోసారి తన నటనకి ఫుల్ మార్క్స్ కొట్టేయడమే కాకుండా గ్లామరస్ లుక్ తో మరోసారి ప్రేక్షకుల మతి పోగొట్టింది. క్యూట్ గర్ల్ పాత్రలో నిత్యామీనన్ నటన ఎంత బాగుందో, ఆమె కూడా అంతే బ్యూటిఫుల్ గా ఉంది. సిద్దార్థ్, సమంత, నిత్యా మీనన్ పాత్రలు ఈ సినిమాకి మేజర్ హైలైట్స్.

ఈ మూడు పాత్రలను నందిని రెడ్డి చాలా బాగా తీర్చిదిద్దింది మరియు ఈ మధ్య కాలంలో పాటలు అంటే ఆడియన్స్ బయటకి వెళ్లిపోతున్నారు కానీ ఈ సినిమాలో వచ్చే 5 పాటలనూ ఏ మాత్రం బోర్ కొట్టకుండా, ఎంతో కలర్ ఫుల్ విజువల్స్ తో అద్భుతంగా చిత్రీకరించారు. ముఖ్యంగా ‘లష్కర్ పోరి చూడు’, ‘మేఘమాల’, ‘హల్లా గుల్లా’ పాటల చిత్రీకరణ చాలా బాగుంది. ఈ రెండు విషయాల్లో నందిని రెడ్డి పనితీరుని మెచ్చుకునే తీరాలి. తెలంగాణ శకుంతల ఎపిసోడ్, నిత్యా మీనన్, శ్రీహరి ఎపిసోడ్స్ బాగా నవ్వించాయి.

తాగుబోతు రమేష్, తెలంగాణ శకుంతల, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, వేణు, సాయాజీ షిండే, అతని గ్రూప్ ప్రేక్షకులను బాగానే నవ్వించారు. డాన్ పాత్రలో శ్రీహరి తన పరిధిమేరకు నటించి, కొద్దిసేపు నవ్వించాడు. సినిమాకి మొదటి 30 నిమిషాల తర్వాత నుండి ప్రీ క్లైమాక్స్ వరకూ బాగుండడం సినిమాకి ప్లస్.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్ బాలీవుడ్ సినిమా ‘బ్యాండ్ బాజా బరాత్’ నుండి స్ఫూర్తి పొంది దానికి ఉపకథలు (నిత్య మీనన్ ఎపిసోడ్, జావేద్ భాయ్ ఎపిసోడ్) అల్లుకుంటూ పోయారు. సెకండ్ హాఫ్ లో మెయిన్ కాన్సెప్ట్ (లవ్ ఎపిసోడ్) పక్క దారి పట్టించి ఉపకథలు మెయిన్ ట్రాక్ ఎక్కించారు. సినిమా మొదటి 30 నిమిషాలు చాలా నిధానంగా సాగుతుంది. ఇంటర్వెల్ ముందు వచ్చే ట్విస్ట్ కథా పరంగా పర్వాలేదనిపించినా చాలా రొటీన్ గా ఉంది. సినిమా ప్రీ క్లైమాక్స్ నుండి సడన్ గా స్లో అయిపోవడం, క్లైమాక్స్ ఆడియన్స్ ఊహించేలా ఉండటం బిగ్ మైనస్.

మొదటి సినిమాలో చాలా పగడ్బందీగా స్క్రీన్ ప్లే రాసుకున్న నందిని రెడ్డి ఈ సినిమా స్క్రీన్ ప్లే విషయంలో తడబడింది. అందువల్లే అక్కడక్కడా ప్రేక్షకులు బోర్ ఫీలవుతారు. కామెడీని కూడా సరిగ్గా డీల్ చెయలేకపోయింది. తాగుబోతు రమేష్, ధర్మ వరపు సుబ్రహ్మణ్యం, వేణు లాంటి కమెడియన్స్ సినిమా మొత్తం ఉన్నప్పటికీ వారిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. చాలా సీన్స్ లో కామెడీ అప్పుడే మొదలవుతోంది అనుకునే టైంలో కట్ చేసి వేరే సీన్స్ కి వెళ్ళి పోతుంటుంది.

సాంకేతిక విభాగం :

చాలా సింపుల్ పాయింట్ ని కథగా తీసుకున్న నందిని రెడ్డి దాన్ని పగడ్బందీగా రాసుకోవడంలో ఫుల్ మార్కులు తెచ్చుకోలేక పోయింది. దానికి తోడు స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడంతో డైరెక్షన్ లో కవర్ చేసుకోలేకపోయింది. ‘అలా మొదలైంది’ సినిమా సూపర్ హిట్ కావడంతో ఈ సినిమా పై ఉన్న అంచనాలను ఫుల్ ఫిల్ చేయలేకపోయింది. సినిమాటోగ్రఫీ బాగుంది, ముఖ్యంగా సాంగ్స్ లో సింప్లీ సూపర్బ్. ప్రతీ సాంగ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది. ఎడిటర్ కాస్త కేర్ తీసుకొని అక్కడక్కడా కత్తెరకి పనిచెప్పి సినిమాని ఇంకాస్త ఆసక్తికరంగా తయారుచేయాల్సింది. థమన్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యింది. డైలాగ్స్ లో ఎక్కడా అసభ్యకరం లేకుండా చాలా క్లీన్ గా ఉన్నాయి. బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

‘జబర్దస్త్’ సినిమా అక్కడక్కాడా నిధానంగా, యావరేజ్ కామెడీతో సాగిపోయే డీసెంట్ క్లాస్ ఎంటర్టైనర్. సిద్దార్థ్, సమంత, నిత్యా మీనన్ నటన సినిమాలో ప్రధాన హైలైట్స్. అలాగే సినిమాలోని ఐదు పాటలను సూపర్బ్ గా చిత్రీకరించడం సినిమాకి మరో హైలైట్. యాక్షన్ సీక్వెన్సులు లేక పోవడం, వీక్ స్క్రీన్ ప్లే, కమెడియన్స్ మస్తీ కూడా కాస్త తక్కువగా ఉండడం సినిమాకి మైనస్. చివరిగా ‘జబర్దస్త్’ సినిమాని ఈ వారం ఫ్రెండ్స్ తో పాటు జాలీగా ఓ సారి చూడొచ్చు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

రాఘవ

Click here for English Review

Exit mobile version