సమీక్ష – మనుషులతో జాగ్రత్త – ప్రేక్షకులారా తస్మాత్ జాగ్రత్త!!

manushulatho_jagratha విడుదల తేదీ :21 డిసెంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5
దర్శకుడు :గోవింద్ వరహ
నిర్మాత : జి. చిరంజీవులు నాయుడు
సంగీతం : ప్రణవ్
నటీనటులు :ఆదర్శ తేజ్, సోనియా

ఆదర్శ్ తేజ్, సోనియా జంటగా నటించిన సినిమా ‘మనుషులతో జాగ్రత్త’. ఈ సినిమా ఈ రోజు రాష్ట్రమంతటా విడుదలైంది. కుమారి వసుంధర సమర్పణలో ఈ సినిమాను బి చిరంజీవులు నాయుడు నిర్మించాడు. ప్రణవ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాని గోవింద వరహ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ యముడి పాత్రలో, నరేష్ బ్రహ్మ పాత్రలో నటించారు. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

రామరాజు (ఆదర్శ్) ఒక న్యూస్ చానల్ పనిచేస్తూ ఉంటాడు. చాలా నిజాయితీ పరుడు. పదిమందికి సహాయం చేయాలనే మనసు గలవాడు. అతనికి ముగ్గురు ఫ్రెండ్స్ నటరాజు, కామరాజు, దొరబాబు. వీరు ముగ్గురుకి అమ్మాయిలు, డబ్బు అంటే ఇష్టం. ఒకరోజు రామరాజు మనస్తాపానికి గురైన మందు తాగి వస్తున్నప్పుడు మ్యాన్ హోల్ లో పడి చనిపోతాడు.

యమలోకానికి వెళ్ళిన అతనికి ఆయువు తిరకుండానే చనిపోయాడని అర్థం అవుతుంది. అయితే అతన్ని మళ్ళి భూలోకానికి పంపిస్తానంటే వద్దని భూలోకం మొత్తం కుళ్ళిపోయిందని నేను భూలోకం వెళ్ళనని రామరాజు యముడితో అంటాడు. అతనికి మంచి వారిని చూపించి మళ్ళీ భూలోకానికి పంపిస్తాడు యముడు.

భూలోకానికి వచ్చిన రామరాజు నీతూ(సోనియా) ప్రేమలో పడతాడు. నీతూకి కూడా ఇతరులకు సహాయం చేసే గుణం ఉంటుంది. కానీ మొదట్లో నీతూకి రామరాజు అంటే ఇష్టం ఉండదు. చివరికి వీరిద్దరి మధ్యా ప్రేమ పుట్టిందా?లేదా? చివరికి వారిద్దరూ కలుసుకుంటే ఎలా కలుసుకున్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో యముడి పాత్రలో నటించిన రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మ పాత్రలో నటించిన నరేష్, చిత్రగుప్తుని పాత్రలో భగవాన్ పరవాలేదు అనిపించారు. పోసాని మురళీ కృష్ణ నటించిన పాట పరవాలేదు. సినిమా చివర్లో డబ్బు ఎందుకు ఆదా చేయాలని పిల్లలతో చెప్పిన సన్నివేశం బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో చెప్పుకోదగిన కథ ఏమి లేదు. స్క్రీన్ ప్లే కూడా బాగోలేదు. అలాగే హీరో, హీరోయిన్ నటనలో సహజత్వం లేదు. హీరోయిన్ ఈ సినిమాకి మెయిన్ మైనస్ పాయింట్. ఈ సినిమాలో పాత్రలు ఎందుకు వస్తున్నాయో, ఎందుకు వెళ్తున్నాయో అర్థం కాదు. రాజేంద్ర ప్రసాద్, నరేష్ ల పాత్రల నిడివి కూడా చాలా తక్కువ టైం ఉండడం వల్ల వారిద్దరూ సినిమాకి పెద్దగా హెల్ప్ కాలేకపోయారు. అలాగే అన్ని సన్నివేశాల్లో డబుల్ మీనింగ్ వచ్చే విదంగా సన్నివేశాలు, డైలాగులు చాలా ఎబ్బెట్టుగా ఉన్నాయి.

సినిమాలో కామెడీ అంటూ ఏమి లేదు. పోనీ సెంటిమెంట్ అన్న వుందా అంటే అది లేదు. పేరడీ చేయించిన ఎంఎస్ నారాయణ పాత్ర నవ్వు తెప్పించకపోగా ఆడియన్స్ కి చిరాకు పుట్టించారు. నాలుగు పాత్రల చుట్టూ సినిమా మొత్తం తిరుగుతూ ఉంటుంది. కామెడీ నటులు వున్న వారిని ఉపయోగించుకోవడం డైరెక్టర్ విఫలం అయ్యాడు. చాలా ప్రదేశాల్లో సినిమా చూడటానికి ఇబ్బంది కలిగించే విదంగా ఉంది, ఇలాంటి సినిమాకి యు/ఏ సర్టిఫికేట్ ఎలా ఇచ్చారో అర్థం కావడం లేదు. సంగీతం, పాటలు కూడా బాగోలేవు. సినిమా మొదటి నుండే చాలా నెమ్మదిగా సాగుతూ సినిమా చూస్తున్న ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తున్నట్టు ఉంటుంది.

సాంకేతిక విభాగం :

సినిమాటోగ్రఫీ పరవాలేధనిపించేలా ఉంది. సంగీతం అస్సలు బాలేదు, పోనీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయినా బాగుందా అంటే అది కూడా అదే విదంగా ఉంది. ఒకటి రెండు ప్రదేశాల్లో డైలాగ్స్ తప్ప మిగిలిన అన్ని సీన్స్ లో భూతు తప్ప మీకీమీ వినిపించదు. అన్నీ డబుల్ మీనింగ్ డైలాగులు, సన్నివేశాలు. ఎడిటింగ్ కూడా సరిగ్గా చేయలేదు. ప్రొడక్షన్ విలువలు కూడా అంతంత మాత్రంగానే వున్నాయి. గోవింద్ వరాహా అందించిన ఈ సినిమాలో కథ, స్క్రీన్ ప్లే అస్సలు బాగోలేదు. ఇక దర్శకత్వం విషయానికి వస్తే చాలా విషయాల్లో అవగాహన లేకపోవడం వల్ల సినిమా ఎలా తీయాలి అనే దానికంటే సినిమా ఎలా తీయకూడదు అనేదానికి గుర్తుగా ఈ సినిమాని తీసాడు.

తీర్పు :

మనుషులతో జాగ్రత్త సినిమా అర్ధం పర్ధం లేని సన్నివేశాలు మరియు భుతూ డైలాగ్స్ వల్ల ఎ, బి, సి లలో ఏ ఒక్క సెక్షన్ ని కూడా మెప్పించలేకపోయింది. సినిమాలో కామెడీ లేదు, లాగే ఏ ఒక్క ఎపిసోడ్ కి కూడా సరైన ముగింపు లేదు. విలక్షణ నటులు ఉన్నప్పటికీ వారిని ఉపయోగించుకోవడంలో డైరెక్టర్ గోవింద్ వరాహా ఫెయిల్ అయ్యాడు. చివరిగా ఈ సినిమా చూడాలనుకునే వారు.. తస్మాత్ జాగ్రత్త…

123తెలుగు.కామ్ రేటింగ్ : 1/5

నగేష్ మేకల

Exit mobile version