సమీక్ష : వర్ణ – వర్ణ రహితంగా ఉంది.

Varna విడుదల తేదీ : 22 నవంబర్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5
దర్శకుడు : శ్రీ రాఘవ
నిర్మాత : పరమ్ వి పొట్లూరి
సంగీతం : హారీష్ జైరాజ్
నటీనటులు : ఆర్య, అనుష్క..

గతంలో ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’, ‘యుగానికి ఒక్కడు’ లాంటి సినిమాలను అందించిన శ్రీ రాఘవ ఈ సారి ఫాంటసీ లవ్ స్టొరీని అంటూ చేసిన ప్రయత్నమే ‘వర్ణ’. ఆర్య, అనుష్క ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని అత్యంత భారీ వ్యయంతో పరమ్ వి పొట్లూరి నిర్మించాడు. హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకి అనిరుధ్ రవిచంద్రన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కంపోజ్ చేసాడు. ఆర్య, అనుష్క కత్తి ఫైట్స్, జార్జియాలో ఈ సినిమాని చిత్రీకరించడం వల్ల ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇలా భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

అసలు ఈ సినిమా కథ ఉందా..సరే 2 గంటల 40 నిమిషాలు ఆయన తీసాడు మేము చూసాము కాబట్టి ఆయన ఎం చూపించాడో చెప్పాలి కాబట్టి చెబుతా.. డైరెక్టర్ శ్రీ రాఘవ వర్ణ సినిమాలో మనకు రెండు కథలను చూపించాడు. ఒకటి మన భూమి మీద జరిగేది. మరొకటి భూమికి దూరంగా వేరే గ్రహంలో జరిగే కథ.

మొదటిది మన భూ లోకంలో జరిగే కథ – మధు బాలకృష్ణ(ఆర్య) ఓ మామూలు ఉద్యోగి. అతనికి ఎదుటి వారికి సాయం చేసే గుణం ఎక్కువ ఉంటుంది. అలా పలు సార్లు చాలా మందికి సాయం చేయడం గమనించిన డాక్టర్ రమ్య(అనుష్క) అతన్ని ఇష్టపడుతుంది. పెళ్లి చేసుకోవాలని ప్రపోజ్ చేస్తుంది. కానీ మధు బాలకృష్ణ కొన్ని కారణాల వల్ల కుదరదని చెప్తాడు.

రెండవది శ్రీ రాఘవ క్రియేట్ చేసిన మరో లోకంలో జరిగే కథ – ఈ లోకంలో మహిళలని బానిసలుగా చూస్తుంటారు. దాంతో అక్కడ జన్మించిన వర్ణ(అనుష్క) స్వతంత్రంగా జీవించాలి అనుకుంటూ ఉంటుంది. అందుకే యుద్ద విద్యలు నేర్చుకుంటుంది. వర్ణని అక్కడే ఉండే మహేంద్ర(ఆర్య) ఇష్టపడుతుంటాడు. కానీ వర్ణకి ఇష్టం ఉండదు. ఇదిలా ఉంట వీరిద్దరూ నివసించే లోకాన్ని కాపాడుతూ ఓక అమ్మ(అమ్మ అంటే దేవత అని అర్థం) ఉంటుంది. ఆ దేవతని ఆ రాజ్యాన్ని వశపరుచుకోవాలని ఒక దొంగల ముఠా ప్రయత్నితుంటుంది.

చివరిగా మన లోకంలో మొదలైన మధు బాలకృష్ణ – రమ్యల ప్రేమకథ ఏమైంది? తిరిగి మది రమ్య ప్రేమని అంగీకరించాడా? వీరిద్దరూ కలిసారా? లేదా? అలాగే శ్రీ రాఘవ క్రియేట్ చేసిన లోకంలోని వర్ణ మహేంద్ర ప్రేమని అంగీకరించిందా? లేదా? ఆ దొంగల ముఠా ఆ దేవతని, రాజ్యాన్నివశపరుచుకున్నారా? లేదా? అసలు మన లోకానికి? ఆ లోకానికి ఏమన్నా సంబంధం ఉందా? ఉంటే అది ఏంటి? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.. ఒకవేళ చూసాక మీకు అర్థం కాకపోతే శ్రీ రాఘవని అడగండి..

ప్లస్ పాయింట్స్ :

అత్యంత భారీ బడ్జెట్ పెట్టి ఓ సౌత్ ఇండియన్ సినిమా నిర్మించిన పివిపి బ్యానర్ అధినేత పరమ్ వి. పొట్లూరి గారికి హ్యాట్సాఫ్ చెప్పాలి. కొన్ని చోట్ల సిజిలో బ్యాక్ గ్రౌండ్ లో చూపించే విజువల్స్ బాగున్నాయి. జార్జియాలో చూపించిన కొన్ని బ్యూటిఫుల్ లోకేషన్స్ ని బాగా చూపించారు. భూలోకంలో జరిగే ఎపిసోడ్, అందులో అనుష్క, ఆర్య లుక్ పరవాలేదనిపిస్తుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ వర్ణ అనే సినిమాలో వర్ణించదగిన మైనస్ పాయింట్స్ చాలానే ఉన్నాయి. ఒక్కో దాని గురించి చెప్పుకుందాం.. ముందుగా శ్రీ రాఘవ ఎంచుకున్న కథ గురించి మాట్లాడదాం.. ఈ కథ ద్వారా ఆయన మన ప్రేమలో నిజాయితీ ఉంటే మనం కోరుకున్న వ్యక్తి చనిపోయినా ఆమె మరో లోకంలో ఉంటుంది. ఆమెని నీవు చేరుకోవచ్చు అని చెప్పాలనుకున్నాడు. నాకు తెలిసి ఇది సాధ్యం కాని విషయం. ఈ సినిమా చూసి బయటకి వచ్చిన ఆడియన్స్ బాగా కష్టం అని చెప్పుకునే హాలీవుడ్ సినిమాల్లో కథే అర్థమైంది, కానీ వర్ణ కథ మాత్రం అర్థం కాలేదని అంటున్నారు. స్క్రీన్ ప్లే మొదటి నుండి చివరి వరకూ చాలా నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. సినిమాలో ట్విస్ట్ లు ఏమీ లేవు. ఒకవేళ ఉన్నా అవి చెప్పదగినవి కాదు. ఈ రెండు విషయాల్లో శ్రీ రాఘవ ఘోరాతి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు.

తెలుగులో ఆర్య కంటే ఎక్కువగా అనుష్కకే పేరుండడం వల్ల ఎక్కువ అనుష్క పేరుని వాడుకొనే ఈ సినిమా ప్రచారం చేసారు. కానీ సినిమాలో అనుష్క కంటే ఆర్యదే ఎక్కువ ఉంటుంది. అలాగే వేరే లోకం ఎపిసోడ్ లో అనుష్క మేకప్, లుక్ చూడటానికి అస్సలు బాగోలేదు. ఆమె అభిమానులైతే బాగా నిరుత్సాహానికి గురవుతారు. అనుష్క కత్తి పట్టుకొని ఉన్న పోస్టర్స్ ఎక్కువ రిలీజ్ చేసారు. కానీ అనుష్క కట్టి పట్టుకొని యుద్ధం చేసే సీన్స్ ఉన్నది రెండే అవి కూడా మెరుపుతీగలా అలా వచ్చి అలా వెళ్ళిపోతాయి. అవికూడా చెప్పుకునే స్థాయిలో లేవు. కావున అనుష్క అభిమానులు ఈ సినిమా విషయంలో బాగా నిరుత్సాహానికి గురవుతారు. అలాగే మహేంద్ర పాత్రలో ఆర్య లుక్ కూడా అస్సలు బాలేదు. ఈ విషయంలో వెళ్ళని ఏమీ అనలేం అందుకంటే ఇది శ్రీ రాఘవ పైత్యం. మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ అయిన ఆర్య, అనుష్క లాంటి వారిని ఉపయోగించుకోవడంలో శ్రీ రాఘవ 100కి నెగటివ్ మార్క్స్ స్కోర్ చేసాడని చెప్పాలి.

ఇకపోతే సినిమాలో ఎంటర్టైన్మెంట్ అనేది లేదు, సినిమా మొత్తం ఆ లోకం ఈ లోకం అంటూ దాదాపుగా అనుష్క, ఆర్య తప్ప వేరే ఎవరూ తెరపై పెద్దగా కనిపించరు. ఇకపోతే ఫస్ట్ హాఫ్ లో అనుష్క, ఆర్య సింహంతో చేసే ఫైట్ సీన్స్ వర్ణానాతీతం అయితే గ్రాఫిక్స్ లో క్రియేట్ చేసిన సరికొత్త సింహం గురించి మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. అలాగే కొత్త లోకంలో చూపించిన అమ్మ చూడగానే అమ్మ అంటే ఇలా ఉంటుందా? అని ఆడియన్స్ షాక్ కి గురవుతున్నారు. వర్ణ సినిమా విజువల్ వండర్ అని చెప్పుకుంటూ వచ్చారు.. కానీ అంత వండర్ఫుల్ గా ఏమీ లేదు.

అలాగే సినిమాలో చూపించని రెండు కథల్లో అనవసరమైన సీన్స్ పెట్టి బాగా సాగదీయడం వల్ల సినిమా నిడివి బాగా ఎక్కువైంది. సినిమాలో వచ్చే ఒక్క యాక్షన్ ఎపిసోడ్ కూడా బాలేదు. అసలు ఆడియన్స్ కి అది యాక్షన్ ఎపిసోడ్ అన్న ఫీలింగ్ కూడా రాలేదు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు. సినిమాలో శ్రీ రాఘవ ఓ గ్రహాన్ని క్రియేట్ చేసాడు. సినిమాలో లాజిక్ లేని సీన్స్ చాలా ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో సింప్లీ సూపర్బ్ అని చెప్పుకోవాల్సింది. పరమ్ వి పొట్లూరి నిర్మాణ విలువల గురించి మాత్రమే. ఆయన పెట్టిన ఖర్చు సినిమా చాలా చోట్ల చాలా రిచ్ గా కనిపిస్తుంది. అనిరుధ్ నేపధ్య సంగీతం సినిమాకి చాలా ప్లస్ అయ్యింది. హరీష్ జైరాజ్ అందించిన ట్యూన్స్, చంద్రబోస్ సాహిత్యం బాగున్నాయి. రాంజీ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకొని సినిమాలో ఉన్న అనవసరపు చాలా సీన్స్ ని కత్తిరించాల్సింది. కనీసం ఎడిటర్ కత్తెరకి పనిచెప్పి నిడివి అన్నా తగ్గించి ఉంటే సినిమాకి కాస్త అన్నా హెల్ప్ అయ్యుండేదేమో.. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ కొన్ని చోట్ల పరవాలేదనిపించుకున్నా కొన్ని చోట్ల మెప్పించలేకపోయాడు. యాక్షన్ సీక్వెన్స్ లు అస్సలు బాలేవు.

సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ అక్కడక్కడా బాగా అనిపించినా ఓవరాల్ గా చెప్పుకునే స్థాయిలో లేవు. ఇక కథ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ బాధ్యతలు చేపట్టిన శ్రీ రాఘవ సినిమాని వర్ణనాతీతంగా తీసాడు. పైన చెప్పినట్టు కథ అనేది ఏం లేదు. స్క్రీన్ ప్లే ఏమో చాలా నిధానంగా ఉంటుంది. ఇక గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘సినిమాని ఎలా తీయకూడదో చెప్పడానికి తీసిన సినిమా’ ఇది అన్న రీతిలో తీసాడు. ఇక్కడ చెప్పాల్సింది ఏటంటే ఈ సినిమా కథ శ్రీ రాఘవ చెప్పినప్పుడు చాలా మంది ఇది యానిమేషన్ మూవీ గా తప్ప మామూలు మూవీగా తియ్యలేం అని చెప్తే వాళ్ళని దిక్కరించి నేను తీసి చూపిస్తా అనిచెప్పి చేతగాని వాటి జోలికెళ్ళి చేతులు కాల్చుకున్నాడు. అలాగే శ్రీ రాఘవ ఓ ఇంటర్వ్యూలో హాలీవుడ్ ‘అవతార్’ మూవీని బుల్ షిట్ అని అన్నాడు. శ్రీ రాఘవ గారు మీరొకసారి మళ్ళీ అవతార్ ని, మీరు తీసిన కళాఖండాన్ని చూసుకొని ఏది బుల్ షిట్ అనేది మీరే తేల్చుకోండి.

తీర్పు :

ఈ రోజు రిలీజ్ అయిన ‘వర్ణ’ సినిమా వర్ణనాతీతంగా ఉంది. మా సినిమా అలా ఉండబోతుంది, ఇలా ఉండబోతుంది, విజువల్ ఎఫెక్ట్స్ సూపర్, చాలా కొత్తగా ఉంటది, ఎవరూ చూపించని కథని మేము చూపిస్తున్నాం అని ముందే ఎక్కువగా చెప్పేసుకొని అంచనాలు పెంచేసుకొని వచ్చిన సినిమాలు ఏవీ అనుకున్న స్థాయి విజయాన్ని అందుకోలేదు. అలాంటి సినిమాల టాప్ లిస్టులో వర్ణ స్థానం దక్కించు కుంది. వర్ణలో చెప్పుకోదగినది అంటే పివిపి బ్యానర్ వారి ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రమే. మిగతా అన్నీ బాగోలేవనేది మీకు అర్థమైందని అనుకుంటా.. ముఖ్యంగా కథ – స్క్రీన్ ప్లే – డైరెక్షన్ చాలా చెత్తగా ఉంది. ఈ వర్ణనాతీతమైన వరణ సినిమా చూసిన ఆడియన్స్ వర్ణించలేని ఫీల్ తో థియేటర్ బయటకి వస్తారంటే అతిశయోక్తి కాదేమో…

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.5/5

రాఘవ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version