సమీక్ష : రేయ్ – యువతను ఆకట్టుకునే మూవీ.!

Rey

విడుదల తేదీ : 27 మార్చి 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : వైవిఎస్ చౌదరి

నిర్మాత : వైవిఎస్ చౌదరి

సంగీతం :చక్రి

నటీనటులు : సాయి ధరమ్ తేజ్, శ్రద్ధ దాస్, సయామీ ఖేర్…

2013 మే కల్లా షూటింగ్ పూర్తైనా, దాదాపు గత రెండు సంవత్సరాలుగా పలు ఇబ్బందుల వల్ల వాయిదా పడుతూ వస్తున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ మూవీ ‘రేయ్’ ఎట్టకేలకు ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైవిఎస్ చౌదరి దర్శకనిర్మాతగా ఎంతో గ్రాండ్ స్కేల్ లో షూట్ చేసిన ఈ సినిమా ద్వారా హీరోయిన్ గా సయామీ ఖేర్ పరిచయం అయితే, లేడీ విలన్ గా శ్రద్ధ దాస్ కనిపించనుంది. ‘రేయ్’కి స్వర్గీయ చక్రి సంగీతం అందించాడు. మరి ఎన్నో వ్యయ ప్రయాసలను తట్టుకొని ఫైనల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ రేయ్ ఆడియన్స్ చేత రేయ్ – ఇది గెలుపు కోసం అరిచిన అరుపే అని అనిపించుకుందా.? లేదా.? అన్నది ఇప్పుడు చెబుతా..

కథ :

రేయ్ సినిమా అమెరికాలో మొదలవుతుంది.. రెండు సార్లు అమెరికాలో బెస్ట్ అఫ్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న అమెరికన్ పాప్ సింగర్ జెన్న(శ్రద్ధ దాస్) మూడోసారి కూడా ఆ టైటిల్ గెలుచుకోవాలని అనుకుంటున్న టైంలో తనకి ఇండియా నుంచి వచ్చిన సాండీ(ఫర్హద్ షానవాజ్) గట్టి పోటీని ఇస్తాడు. అదే టైంలో అమెరికన్ డాన్ డాంగే(అర్పిట్ రాంఖా) సాండీ ని చంపేస్తాడు. సాండీ చెల్లెలైన అమృత(సయామీ ఖేర్) తన అన్నయ్య కోరికను నెరవేర్చి బెస్ట్ అఫ్ వరల్డ్ టైటిల్ గెలుచుకోవాలని అమెరికా వస్తుంది. ఆ కాంపిటీషన్ లో ప్లేస్ సంపాదించడం కోసం జమైకాలోని ఓ మ్యూజికల్ కాలేజ్ లో చేరుతుంది.

కట్ చేస్తే అక్కడే మన హీరో ఎంట్రీ.. రాకెట్ అలియాస్ రాక్ మ్యూజిక్ కన్నా కాలేజ్ లో ఉన్న అమ్మాయిల అందాల్ని ఎక్కువగా ప్రేమించే కుర్రాడు. రాక్ మరియు తన ఫ్రెండ్స్ ని అమృత గ్రూప్ లో వేస్తాడు. కానీ రాక్ బ్యాచ్ సీరియస్ గా తీసుకోరు. కానీ ఓ రోజు మాఫియా డాన్ డాంగే చేసిన పనివల్ల రాక్ ఈగో హార్ట్ అవ్వడంతో జెన్నకి పోటీగా బెస్ట్ అఫ్ వరల్డ్ కాంపిటీషన్ కి వెళ్ళాలని సిద్దమవుతాడు. కానీ ఆ కాంపిటీషన్ లో పాల్గొనడానికి అన్ని దారులు మూసుకుపోతాయి. అప్పుడు మన హీరో రాక్ ఏం చేసాడు.? ఎలా బెస్ట్ అఫ్ వరల్డ్ కాంపిటీషన్ లో చోటు సంపాదించాడు.? దాని కోసం అమృత ఎంత వరకూ హెల్ప్ అయ్యింది.? అలాగే ఈ జర్నీలో తన అన్నయ్యకి చావుకి కారణం డాంగే అని తెలుసుకున్న రాక్ – అమృతలు ఏం చేసారు.? ఫైనల్స్ లో జెన్నకి పోటీని ఇచ్చి రాక్ ‘రేయ్ బ్యాండ్’ బెస్ట్ అఫ్ వరల్డ్ టైటిల్ గెలుచుకుందా.? లేదా అన్నది తెలియాలి అంటే మీరు సినిమా చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

మెగా కాంపౌండ్ నుంచి హీరోగా పరిచయం అవుతూ సాయి ధరమ్ తేజ్ చేసిన మొదటి సినిమా ‘రేయ్’. మేనమామ పోలికలు మేనల్లుడికి వస్తాయి అంటారు. అలానే చిరులోని కొన్ని కొన్ని లక్షణాలు సాయి ధరమ్ తేజ్ లో కనిపిస్తాయి. ముఖ్యంగా డాన్సులు చేయడంలో, రిస్క్ చేసి స్టంట్స్ చేయడంలో చిరులోని ఈజ్ కనిపిస్తుంది. మొదటి సినిమాలోనే నటన పరంగా కూడా చాలా వరకూ మెప్పించాడు. ఒక నటుడిగా తన పాత్ర కోసం ఎతో ఎఫర్ట్ పెట్టాడు. ముఖ్యంగా కరేబియన్ కుర్రాడి లుక్ లో చాలా బాగున్నాడు. గోలీమార్, క్లైమాక్స్ లో వచ్చే టైటిల్ సాంగ్ లో సాయి ధరమ్ తేజ్ వేసే స్టెప్స్ యువతని ఉరూతలూగిస్తాయి. ఇక అమెరికన్ పాప్ సింగర్ గా మరియు లేడీ విలన్ గా శ్రద్ధ దాస్ సూపర్బ్ గా చేసింది. ముఖ్యంగా నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించింది. సాయి ధరమ్ తేజ్ – శ్రద్ధ దాస్ మధ్య వచ్చే చాలెంజింగ్ సీన్స్ బాగున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే, పాత్ర పరంగా శ్రద్ధ దాస్ మోస్ట్ గ్లామరస్ లుక్స్ ఆన్ స్క్రీన్ ఆడియన్స్ కి కన్నుల పండుగగా ఉంటుంది. శ్రద్ధ దాస్ ఇంత గ్లామరస్ గా ఇప్పటివరకూ కనిపించలేదు.

ఇక హీరోయిన్ గా పరిచయం అయిన సయామీ ఖేర్ అందాల విందుని మాత్రమే ప్లస్ లో చెప్పుకోవాలి. ఒక్క మాట చెప్పాలి శ్రద్ధ దాస్ – సయామీ ఖేర్ లు ఆన్ స్క్రీన్ పై కనపడ్డారు అంటే ఆడియన్స్ కి ఐ ఫీస్ట్ అని చెప్పాలి. డాన్ గా అర్పిత్ రాంఖా పెర్ఫార్మన్స్ కూడా బాగుంది. ఇక సీనియర్ నరేష్, హేమల ట్రాక్ ఆడియన్స్ ని నవ్విస్తుంది. తనికెళ్ళ భరణి హీరోయిజం ఎలివేట్ చేసే సీన్ లో చాలా బాగా చేసాడు. ఇక సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా కోసం ఎంచుకున్న బాస్క్ డ్రాప్, చెప్పాలనుకున్న పాప్ కాంపిటీషన్ టైపు పాయింట్ టాలీవుడ్ ఆడియన్స్ కి చాలా కొత్తగా అనిపిస్తుంది.

సినిమా స్టార్టింగ్ చాలా ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. అలాగే ఇంట్రడక్షన్ లో సాయి మీద వచ్చే చేజింగ్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్లాక్ ఫస్ట్ హాఫ్ లో మేజర్ హైలైట్ అయితే, సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ లు, చాలెంజింగ్ సీన్స్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే క్లైమాక్స్ లో వచ్చే 11 నిమిషాల సాంగ్ ఆడియన్స్ చేత డాన్సులు చేయించేలా ఉంటుంది. ఆ సాంగ్ లో హీరోయిన్స్ అందాల విందు మరో బోనస్ అని చెప్పాలి.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ లో ముందుగా చెప్పుకోవాల్సింది.. కథా విస్తరణ గురించి.. ఎందుకంటే ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ బాగుంది, కానీ ఒక సినిమా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వాలి అంటే బ్యాక్ డ్రాప్ ఒక్కటే ఉంటే సరిపోదు.. కథని కూడా ఆసక్తికరంగా చెప్పాలి.. హీరో ఇంట్రడక్షన్ వచ్చే టైంకి సినిమాలో కథ -స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి అర్థమైపోతుంది. ఇక ఆడియన్స్ కొత్తగా థ్రిల్ అయ్యేది ఏమీ ఉండదు. మొదటి 30 నిమిషాల తర్వాత నుంచి సీట్లో కూర్చున్న ఆడియన్ ఏమనుకుంటాడో అదే జరుగుతూ ఉంటుంది. మొదరి 20 నిమిషాల నుంచి ఇంటర్వల్ బ్లాక్ వరకూ ఆడియన్స్ కి చాలా బోర్ కొడుతుంది. ఇంటర్వల్ బ్లాక్ ని బాగానే రాసుకొని హైప్ తెచ్చిన వైవిఎస్ చౌదరి అదే టెంపోని సెకండాఫ్ లో కొనసాగించలేకపోయాడు. సెకండాఫ్ లో ఒక సీన్ బాగా ఉంటుంది, ఆ తర్వాత సాగదీసినట్టు ఉండడం, మళ్ళీ మంచి సీన్ మళ్ళీ స్లో.. ఇలా సాగుతుంది. దాని వలన ఆడియన్స్ కంటెంట్ కి కనెక్ట్ అవ్వరు.

ఈ సినిమాకి మైనస్ పాయింట్ అంటే సినిమా చాలా చోట్ల మరీ లౌడ్ గా అనిపించడం. డైరెక్టర్ వైవిఎస్ చౌదరి కథా పరంగా కరేబియన్స్ లౌడ్ ఎక్స్ ప్రెషర్స్ కావచ్చు కానీ మరీ ఆ రేంజ్ లో చూపిస్తే తెలుగు ప్రేక్షకులకు మోతాదు మరీ ఎక్కువైంది అనిపిస్తుంది. అందుకే కాస్త తగ్గించి ఉండాల్సింది. అలాగే సాయి ధరమ్ తేజ్ – సయామీ ఖేర్ ల రొమాంటిక్ ట్రాక్ చాలా బోరింగ్ గా ఉంటుంది. హీరోయిన్ సయామీ ఖేర్ కూడా సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. తను చేసింది మెయిల్ లీడ్ కానీ హావభావాలను సరిగా పలికించలేకపోయింది. అలాగే ఇలాంటి ఓ కమర్షియల్ మూవీలో ఎంటర్ టైన్మెంట్ అనేది అస్సలు లేకపోవడం సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. అలీ, వేణు మాధవ్, రఘుబాబులను పెట్టినా వాళ్ళు నవ్వించకపోగా విసుగు తెప్పిస్తారు. పవన్ కళ్యాణ్ – మహేష్ బాబు – ఎన్.టి.ఆర్ లపై చేసిన 3 ఇంటెలిజెంట్స్ అనే సినిమా స్పూఫ్ కూడా పెద్దగా మెప్పించలేదు.

అలాగే పాటలు ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. సినిమా ముందుకు వెళ్ళడం లేదు అని బాధపడుతుంటే సమయం సందర్భం లేకుండా వరుసగా పాటలు వచ్చేస్తుంటాయి. ఆ పాటలు బాగా ఇర్రిటేట్ చేస్తాయి. అలాగే సినిమా రన్ టైం కూడా చాలా ఎక్కువ. 168 నిమిషాలు కాకుండా ఏ 130 – 140 నిమిషాల్లో చెప్పి ఉంటె సినిమా ఇంకాస్త బెటర్ గా ఉండేది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ఈ సినిమాకి హెల్ప్ అయిన అంశాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా గుణశేఖరన్ సినిమాటోగ్రఫీ.. ఎందుకంటే ఈ సినిమాలో కథా పరంగా కరేబియన్ నేటివిటీని చూపించాలి. ఒకవేళ దానిని సరిగా చూపించలేదు అంటే సినిమాకి పెద్ద మైనస్ అవుతుంది. కానీ ఈ విషయంలో గుణశేఖరన్ 100% సక్సెస్ అయ్యాడు. కరేబియన్ ఫీల్ ని తీసుకురావడమే కాకుండా అక్కడి బ్యూటిఫుల్ లోకేషన్స్ ని ఆకర్షణీయంగా తెరపై చూపించాడు. అలాగే హీరోయిన్స్ ని డైరెక్టర్ అనుకున్నట్టుగా మోడ్రన్ గా, గ్లామరస్ గా చూపించడంలోనూ సక్సెస్ అయ్యాడు. స్వర్గీయ చక్రి అందించిన పాటలు విన్నప్పుడు యావరేజ్ గా అనిపించినా ఆన్ స్క్రీన్ చూసేటప్పుడు చాలా బాగా అనిపిస్తాయి. కానీ పాటలకి సందర్భం కూడా కలిసి ఉంటే బాగుండేది. ఇక బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే పాత్రలలానే అక్కడక్కడా మరింత లౌడ్ నెస్ ఉంది. మిగతా అంతా డీసెంట్ గా అనిపిస్తుంది. కోటగిరి వెంకటేశ్వర రావు ఎడిటింగ్ పరంగా చాలా కేర్ తీసుకోవాల్సింది. సినిమాని మరీ లెంగ్థీ గా కట్ చేసారు. అలాగే కొన్ని సాంగ్స్ ని కూడా సరిగా ఎడిట్ చెయ్యలేదు. ఈయన ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని సాగదీసిన సీన్స్ మాత్రం కట్ చేసి ఉంటే చాలా రిలీఫ్ గా ఉండేది. రఘు కులకర్ణి ఆర్ట్ వర్క్ కూడా ఈ సినిమాకి గ్రాండ్ నెస్ తెచ్చింది.

ఇదొక మ్యూజిక్ అండ్ డాన్స్ బేస్ సినిమా.. అంటే మ్యూజిక్ మరియు డాన్సులు సీట్లలో కూర్చున్న ఆడియన్స్ చేత డాన్సులు చేయించాలి. ఆడియన్స్ చేత డాన్సులు చేయించే రేంజ్ లోనే రాజు సుందరం, ప్రేమ్ రక్షిత్, జానీ, శేఖర్, భానోదయ మాస్టర్స్ స్టెప్స్ కంపోజ్ చేసారు. స్టన్ శివ, గణేష్, విజయ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఇక శ్రీధర్ శ్రీపాన రాసిన సెటైరికల్ అండ్ చాలెంజింగ్ డైలాగ్స్ బాగున్నాయి, యూత్ కి బాగా నచ్చుతాయి. ఇక ఈ సినిమాకి కథ – స్క్రీన్ ప్లే – నిర్మాత – దర్శకత్వం ఇలా అన్నీ డీల్ చేసింది ఒక్కరే, ఆయనే వైవిఎస్ చౌదరి. వైవిఎస్ కథ కోసం ఎంచుకున్న బ్యాక్ డ్రాప్ చాలా కొత్తగా ఉంది, దాని చుట్టూ అల్లుకున్న కథ కూడా టాలీవుడ్ కి కొత్తగా అనిపిస్తుంది. స్క్రీన్ ప్లే – బాగా ఊహాజనితంగా ఉంటుంది. అనవసరమైన కామెడీ ట్రాక్స్ పెట్టకుండా కాన్సెప్ట్ నే ఇంకాస్త స్పీడ్ గా చెప్పి ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే ఇంకాస్త స్పీడ్ గా ఉండాల్సింది. మీరు ఊహించిన క్లైమాక్స్ ఏ అయినప్పటికీ ఎలా జరుగుతుందా అనేది మాత్రం ఆడియన్స్ ని ఆకట్టుకుంది. ఇక డైరెక్టర్ గా మరోసారి ఒక కొత్త హీరో బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఓ కథని రాసుకొని దానిని ఆడియన్స్ కి చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. డైరెక్టర్ గా కేర్ తీసుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే అవి. పాటలని ఇంకాస్త పర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకొని, కథకి లెంగ్త్ ని పెంచే అంశాలను తగ్గించుకొని, లాజికల్ గా చేసిన బ్లండర్ మిస్టేక్స్ ని సర్దుకొని ఉంటే బాగుండేది. ఇక నిర్మాతగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా చేసే వైవిఎస్ ఈ సినిమా విషయంలో కూడా అలానే చేయడం వలన సినిమా చాలా రిచ్ గా గ్రాండ్ విజువల్స్ తో చాలా కలర్ఫుల్ గా ఉంటుంది.

తీర్పు :

మెగా కాంపౌండ్ హీరోని పరిచయం చేస్తున్నామన్న ఉద్దేశంతో డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మంచి పాయింట్ నే తీసుకున్నాడు. కానీ దానిని ఆడియన్స్ కి 100% కనెక్ట్ అయ్యేలా తెరపై చూపించడంలో అంత సక్సెస్ కాలేకపోయాడు. కానీ వైవిఎస్ చౌదరి సాయి ధరమ్ తేజ్ ని మెగా అభిమానులు కోరుకునే విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడమే కాకుండా, యువత చేత కేకలు పెట్టించేలా డాన్సులు కూడా చేయించి మెగా అభిమానులని మెప్పించాడు. దీనికి శ్రద్ధ దాస్, సయామీ ఖేర్ ల గ్లామర్ అట్రాక్షన్ స్పెషల్ గా నిలిచింది. ఓవరాల్ గా సినిమా కోసం ఎంచుకున్న బ్యాక్ డ్రాప్, సాయి ధరమ్ తేజ్ – శ్రద్ధ దాస్ ల పెర్ఫార్మన్స్, గోలీ మార్, రేయ్ సాంగ్స్ పిక్చరైజేషన్ మరియు కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్ యువతని బాగా ఆకట్టుకుంటాయి. అలాగే బి, సి సెంటర్ ఆడియన్స్ ని ఆకట్టుకునే అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఓవరాల్ గా రేయ్ సినిమా యువతని ఆకట్టుకునే సినిమా..

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version