సమీక్ష : ఐస్ క్రీమ్ – నో స్వీట్ నో హర్రర్.!

ice-cream విడుదల తేదీ : 12 జూలై 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2/5
దర్శకత్వం : రామ్ గోపాల్ వర్మ
నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ
సంగీతం : ప్రద్యోధన్
నటీనటులు : నవదీప్, తేజస్వి..

ఎప్పటికప్పుడు ఏదో రకంగా వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఫ్లో కామ్ టెక్నాలజీని పరిచయం చేస్తూ చేసిన సినిమా ‘ఐస్ క్రీమ్’. నవదీప్, తేజస్వి ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని హర్రర్ థ్రిల్లర్ గా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. ఎప్పటికప్పుడు హర్రర్ సినిమాలతో ప్రేక్షకులను భయపెట్టాలనుకునే రామ్ గోపాల్ వర్మ ఈ సారి అయినా ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయ్యి విజయాన్ని అందుకున్నాడేమో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఈ కథని 2012 జూన్ 26న బెంగుళూరులో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించారు. ఇక అసలు కథలోకి వెళితే.. మెడిసిన్ చదివే అమ్మాయి రేను(తేజస్వి). వీరి ఫ్యామిలీ కొత్తగా ఓ ఇంటికి షిఫ్ట్ అవుతుంది. రేను తండ్రులు ఓ పెళ్లి కోసం వెళ్ళిపోగా రేను ఒక్కటే ఆ ఇంటిలో ఉంటుంది. రేనుకి తోడుగా ఉండడానికి తన బాయ్ ఫ్రెండ్ విశాల్ (నవదీప్) వస్తాడు. ఆ ఇంటిలో పాత ఓనర్స్ ఏదో పూజలు చేసి ఓ బొమ్మని ఉంచుతారు. అలాగే దాన్ని అక్కడ నుంచి కదల్చవద్దు అని చెబుతారు. కానీ విశాల్ మూడనమ్మకాలు అంటూ దాన్ని తన్నేస్తాడు.

ఆ క్షణం నుంచి రేను అనుకోని సంఘటనలు ఎదుర్కొంటుంది. అలాగే అవన్నీ నిజమా? కల? అనేది తేల్చుకోలేని అయోమయ పరిస్థితిలోకి రేను వెళ్ళిపోతుంది. అసలు రేను ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి? అవన్నీ తను నిజంగానే ఎదుర్కొందా? లేక కల కనిందా.? రేను ఫేస్ చేస్తున్న సమస్యల నుండి విశాల్ బయటకి తీసుకు రాగాలిగాడా..? అనే అంశాలను మీరు తెరపైన చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మొదటి ప్లస్ పాయింట్.. సినిమా స్టార్టింగ్.. సినిమా మొదలైన 20 నిమిషాలు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే అక్కడ వచ్చే థ్రిల్లింగ్ మోమెంట్స్ కూడా అందరినీ కూసింత భయపెట్టేలా ఉంటాయి. అలాగే నవదీప్ పై వచ్చే ప్రీ క్లైమాక్స్ సీన్స్ కూడా బాగుంటుంది.

ఇక నటీనటుల పరంగా తెరపై ఎక్కువ కనిపించేది తేజస్వి.. తేజస్వి పెర్ఫార్మన్స్ చాలా నాచురల్ గా ఉంది. కానీ కొన్ని చోట్ల మాత్రం చెయ్యాల్సిన దానికన్నా ఎక్కువ చేసేసింది. అందాల ప్రదర్శన కూడా బాగా ఎక్కువగానే చేసింది. నవదీప్ పెర్ఫార్మన్స్ కూడా చాలా నాచురల్ గా ఉంది. చిన్న పాత్రే అయినా మెప్పించాడు. ముఖ్యంగా క్లైమాక్స్ లో బాగా నవ్వించాడు. ఇక దెయ్యాలుగా కనిపించే పార్వతమ్మ, సందీప్తి, చంటిలు జస్ట్ ఓకే. ఓవరాల్ గా కొన్ని కొన్ని థ్రిల్లింగ్ సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమా మొత్తం నిడివి 104 నిమిషాలు. అందులో మొదటి 20 నిమిషాలు ప్లస్ క్లైమాక్స్ 5 నిమిషాలు తీసేయ్యగా మిగిలి ఉన్న 79 నిమిషాలు థియేటర్ లో ఉన్న వారికి నరకమే. ఎందుకంటే మొదటి 20 నిమిషాల తర్వాత ఒకే టైపు సీన్స్, కెమెరా యాంగిల్స్, అదే పెర్ఫార్మన్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి. ఆ సీన్స్ ఏ మాత్రం కొత్తగా ఉండవు దానికి తోడు ఈ ఫ్లో కామ్ అని చెప్పి కెమెరాని అనవసరమైన యాంగిల్స్ లో అంతా తిప్పడం వలన బాగా బోర్ కొడుతుంది. కథలో అస్సలు దమ్ము లేదు, దానికి తోడూ బాగా సాగదీసిన కథనం ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్స్.

ఎప్పటిలానే రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాలో కూడా చివరిదాకా చూసిన ఆడియన్స్ కి అసలు ఎందుకది అలా జరుగుతోంది? దానికి గల కారణం ఏమిటి? అది నిజమా? కల? అనేది చెప్పకుండా అసంపూర్తిగా ముగించేయడం వలన ప్రేక్షకులను మరింత నిరుత్సాహపడతారు. ఫ్లో కామ్ అని చెప్పి చేసిన ఈ సినిమాలోని చాలా సీన్స్ వల్ల ఈ సినిమా నిడివి బాగా పెరిగినట్టు అనిపిస్తుంది. అవి కట్ చేసి ఉంటే ఆడియన్స్ కి త్వరగా థియేటర్ నుండి బయటపడే అవకాశం ఉండేది.

రిలీజ్ కి ముందు ఈ సినిమాలో హర్రర్ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ కూడా ఉంటాయని ప్రచారం చేసారు. కానీ ఇందులో మీరు థ్రిల్ అయ్యే సీన్స్ ఏమీలేవు. అలా అని హర్రర్ సీన్స్ ఉన్నాయనుకోకండి. ఏదో థ్రిల్స్ తో పోల్చుకుంటే రెండు మూడు హర్రర్ సీన్స్ అన్నా ఉన్నాయి అన్నదే నా ఉద్దేశం.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం వైపు చెప్పుకోవడానికి ఏమీ లేవు. ముందుగా ఈ మూవీలో ఫ్లో కామ్ టెక్నాలజీ అన్నాడు కాబట్టి దాని గురించే మాట్లాడుకుందాం.. సీన్ ని ఎలాంటి కట్ లేకుండా సింగల్ షాట్ లో చేయడానికి మరియు రియలిస్టిక్ సౌండ్ ని కాప్చ్యూర్ చెయ్యడానికి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ టెక్నాలజీ హర్రర్ సినిమాలు తీయడానికి బాగా హెల్ప్ అవుతుంది. కానీ దాన్ని వాడుకోవడం తెలియాలి. అలా తెలియకపోతే మంచి ప్రాజెక్ట్ అయినా చెడిపోతుంది. ఇక్కడా అదే జరిగింది. అవసరానికి మించి అనవసరమైన లాంగ్ సీన్స్ చేయడం వలన ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయ్యారు. సినిమాటోగ్రఫీ బిలో యావరేజ్ గా ఉంది. మ్యూజిక్ డైరెక్టర్ సీన్ కి కావలసిన దానికంటే ఎక్కువ మ్యూజిక్ చేయడం, కొన్ని చోట్ల ఏమీ లేకపోయినా మీ చెవులు పగిలేలా మ్యూజిక్ చేయడం అనేది ఆడియన్స్ ని భయపెట్టక పోగా చిరాకు పెడుతుంది. ఎడిటర్ ప్రేక్షకుల మీద కాస్త దయ చూపి ఇంకొన్ని అనవసరపు సీన్స్ ని కట్ చేసి ఉంటే బాగుండేది. డైలాగ్స్ ఓకే.

ఇక కథ కథనం దర్శకత్వం విభాగాలను డీల్ చేసిన రామ్ గోపాల్ వర్మ ఈ మూడు విభాగాల్లోనూ మరోసారి ఫెయిల్ అయ్యాడు. ఎందుకంటే ఎందులోనూ ఆడియన్స్ ని మెప్పించగల కంటెంట్ లేదు. ఎప్పటిలానే హీరోయిన్ అందాల మీద పెట్టిన శ్రద్దలో ఇసుమంత అయినా ఈ డిపార్ట్ మెంట్స్ మీద పెట్టి ఉంటే సినిమా విజయానికి హెల్ప్ అయ్యేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :

తెలుగు ప్రేక్షకులను తన హర్రర్ సినిమాలతో భయపెట్టాలనుకునే రామ్ గోపాల్ వర్మ మరోసారి చేసిన హర్రర్ సినిమా ‘ఐస్ క్రీమ్’. ఈ సినిమా కూడా వర్మకి చేదు అనుభవాన్ని, ప్రేక్షకులకేమో 2 గంటల టార్చర్ నే మిగిల్చింది. మొదటి 20 నిమిషాలు సినిమాకి హెల్ప్ అయితే మిగిలిన సీన్స్ ఆడియన్స్ కి నరకాన్ని పరిచయం చేస్తాయి. అలాగే సినిమా పబ్లిసిటీ కోసం క్రియేట్ చేసిన న్యూడ్ సీన్ అనేది సినిమాలో లేదు. పొరపాటున ఎవరన్నా దాని కోసం వెళ్ళారో అనవసరంగా బుక్ అయిపోయినట్టే.. లాగే హర్రర్ లేదా థ్రిల్లర్ ఇష్టపడే వారు ఏదో ఉందని ఈ సినిమాకి వెళ్ళారంటే మీ నిరుత్సాహానికి అవధులు ఉండవు. ఇత చెప్పినా ఈ ఐస్ క్రీమ్ టెస్ట్ చూడాలి అనుకుంటే ముందే తీసుకొని వెళ్ళండి…

123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version