సమీక్ష : రోజులు మారాయి – టైమ్‌పాస్ కామెడీ!

Rojulu Marayi review

విడుదల తేదీ : 01 జూలై, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : మురళి

నిర్మాత : జి. శ్రీనివాసరావు

సంగీతం : జె.బి.

నటీనటులు : చేతన్, పార్వతీశం, కృతిక, తేజస్వి..


దర్శకుడిగా మెప్పిస్తూనే, నిర్మాతగానూ కొత్తతరాన్ని ప్రోత్సాహించే ఉద్దేశంతో మారుతి తన సొంత బ్యానర్‌లో మొదట్నుంచీ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. తాజాగా ఆయన ప్రముఖ నిర్మాత దిల్‌రాజు, శ్రేయాస్ శ్రీనివాస్‌లతో కలిసి నిర్మించిన సినిమా ‘రోజులు మారాయి’. కొత్త దర్శకుడు మురళి తెరకెక్కించిన ఈ సినిమా అన్ని కార్యక్రమాలనూ పూర్తి చేసుకొని నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి-దిల్‌రాజు బ్రాండ్‌తో మంచి అంచనాలు రేకెత్తించిన ఈ సినిమా, ఆ అంచనాలను అందుకుందా? చూద్దాం..

కథ :

ఆద్య (కృతిక), రంభ (తేజస్వి).. ఇద్దరూ ఒకే హాస్టల్‌లో ఉంటూ ఎవరి ఉద్యోగాలు వారు చేసుకుంటూ సంతోషంగా జీవితం గడుపుతుంటారు. తమికిష్టమైన వారితో ప్రేమలో ఉన్న వీరిద్దరూ, తమ చిన్న చిన్న అవసరాల కోసం అశ్వద్ (చేతన్), పీటర్ (పార్వతీశం)లను వాడుకుంటూ ఉంటారు. ఇదిలా ఉండగానే ఒకరోజు శ్రీశైలంలోని ఓ బాబా చెప్పిన మాటలను బట్టి తమ జీవితంలోకి రాబోయే వ్యక్తి పెళ్ళైన కొన్నిరోజులకే చనిపోతాడని ఆద్య, రంభలకు తెలుస్తుంది.

ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాలంటే ఒకే మార్గమని ఆద్య, అశ్వద్‌ను; రంభ, పీటర్‌ను పెళ్ళాడతారు. ఇక కొన్ని విచిత్ర పరిస్థితుల్లో స్వయంగా వీరిద్దరే అశ్వద్, పీటర్‌లను చంపేస్తారు. ఆ తర్వాత కథ ఏయే మలుపులు తిరిగిందీ? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అంటే ఎంచుకున్న కథాంశం, దాని నేపథ్యమనే చెప్పాలి. సాధారణంగా అమ్మాయిల కోణం నుంచి ఈ తరహా కథలను చెప్పడానికి ఎవ్వరూ పెద్దగా సాహసించారు. మారుతి అలాంటి సాహసాన్నే, అందరికీ కనెక్ట్ అయ్యే కామెడీతో, ఈతరం ప్రేమల్లోని ఓ కోణాన్ని ప్రస్తావిస్తూ చెప్పడం బాగుంది. ఇక ఫస్టాఫ్‌లో కామెడీని ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. టైటిల్స్ దగ్గర్నుంచే కథలోకి తీసుకెళ్ళడం, ఆ తర్వాత వరుసగా ఇద్దరు వ్యక్తుల కథల నుంచి పుట్టే కామెడీని సరిగ్గా వాడుకోవడం ఇవన్నీ కట్టిపడేసేలా ఉన్నాయి.

నటీనటుల్లో పార్వతీశంను ఈ సినిమాకు హైలైట్‌గా చెప్పుకోవచ్చు. తన కామెడీ టైమింగ్‌తో, డైలాగ్ డెలివరీతో పార్వతీశం సినిమాకు మంచి హుషారు తీసుకొచ్చాడు. ఇక చేతన్ ఓ సాఫ్ట్ క్యారెక్టర్‌లో బాగా చేశాడు. కృతిక పాత్ర చాలా కాంప్లికేటెడ్. ఒకేసారి రెండు కోణాల్లోనూ ఆలోచించే ఈ పాత్రలో ఆమె మంచి ప్రతిభ చూపింది. ఇక తేజస్వి టైమింగ్, చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌ను పలికించడంలో కూడా చూపిన ప్రతిభ చాలా బాగుంది.

సినిమా పరంగా చూసుకుంటే ఫస్టాఫ్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ రైటింగ్ పరంగా, మేకింగ్ పరంగా చాలా బాగా ఆకట్టుకుంటుంది.

మైనస్ పాయింట్స్ :

అదిరిపోయే ఫస్టాఫ్ తర్వాత రోజులు మారాయి సినిమా అంతా మళ్ళీ రొటీన్‌గా మారిపోయింది. ఈ సెకండాఫ్ మొత్తంలో పెద్దగా ఎగ్జైటింగ్ అంశాలేవీ లేవు. ‘దృశ్యం’ ఎపిసోడ్, అలీ కామెడీ.. ఇవన్నీ కథను ముందుకు ఎలా నడపాలో తెలియక పెట్టినట్లు కనిపించింది. ఫస్టాఫ్‌లోనే అసలు కథంతా చెప్పడం, సెకండాఫ్‌ కోసం దాచిపెట్టిన ఒక్క ట్విస్ట్‌ కూడా ముందే తెలిసిపోయేంత సాదాసీదాగా ఉండడం లాంటి అంశాల వల్ల సెకండాఫ్‌లో సినిమా కొన్నిచోట్ల నీరసించినట్లు కనిపించింది.

ఇక కథ పరంగా ఫస్టాఫ్‌లో చేసిన సాహసం, సెకండాఫ్‌కి వచ్చేసరికి పూర్తిగా పక్కనపెట్టేయడం బాగోలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ వచ్చేసరికి పాతకాలంనాటి డ్రామా సినిమాల స్టైల్‌ను ఫాలో అవ్వడం కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అక్కడక్కడా డైలాగ్స్ కాస్త శృతిమించాయి.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే, మారుతి అందించిన స్క్రీన్‌ప్లే మొదటి సగమంతా చాలా బాగుంది. ఇలాంటి కథాంశాన్ని ఎంచుకొని, దాన్ని ఒక సినిమాగా మార్చే ప్రక్రియలో మారుతి ఫస్టాఫ్‌లో సూపర్ అనిపించుకున్నాడు. అయితే సెకండాఫ్‌కి వచ్చేసరికి సినిమాను మరీ రొటీన్‌గా మార్చేసి, చివర్లో అనవసర డ్రామా పెట్టి సాదాసీదాగా మార్చేశాడు. మారుతి కథతో దర్శకుడు మురళి సినిమాను బాగానే తెరకెక్కించాడు. దర్శకుడిగా ఇంటర్వెల్ బ్లాక్‌లో మురళి మంచి ప్రతిభ చూపాడు. సెకండాఫ్ విషయంలో మేకింగ్ పరంగా చెప్పుకోదగ్గ సన్నివేశాలేవీ లేవు.

జె.బీ సంగీతం బాగుంది. అన్నీ సందర్భానుసారంగా వచ్చే పాటలే కావడంతో సినిమాలో బాగా కుదిరాయి. సినిమాటోగ్రాఫర్ పనితనం బాగుంది. ముఖ్యంగా గెస్ట్ హౌస్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలన్నీ అందంగా ఉన్నాయి. అయితే మారుతి స్టైల్ మేకింగ్ అయిన ఎక్స్ట్రీమ్ క్లోజప్ షాట్స్ మాత్రం బాగోలేవు. రవి నంబూరి మాటలు బాగున్నాయి. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కూడా ఎక్కడా చిన్న సినిమా అన్న ఫీల్ తెప్పించకుండా బాగున్నాయి.

తీర్పు :

‘రోజులు మారాయి’.. చెప్పాలనుకున్న అసలు కథను అలాగే ఎక్కడా పక్కదోవ పట్టకుండా చెప్పి ఉంటే మంచి సాహసంగానే నిలిచింది. అలాకాకుండా సెకండాఫ్‌లో సినిమాను రొటీన్ దారి పట్టించి, అసలు కథనే పక్కనపెట్టడంతో కామెడీ కోసమే చూడదగ్గ టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా నిలిచింది. ఫస్టాఫ్‌ ఆద్యంతం నవ్వించేలా ఉన్న కామెడీ, ప్రేమకథల్లో ఓ కొత్త కోణాన్ని చెప్పాలన్న ఆలోచన, పార్వతీశం కామెడీ లాంటి హైలైట్స్‌తో వచ్చిన ఈ సినిమాకు సెకండాఫ్ చెప్పుకోదగ్గ స్థాయిలో లేకపోవడమే ప్రధాన మైనస్. ఇక ఒక్కమాటలో చెప్పాలంటే.. చెప్పాలనుకున్న ఆలోచన కోసం, ఫస్టాఫ్ కామెడీ కోసం చూస్తే, ‘రోజులు మారాయి’ ఎంటర్‌టైన్ చేస్తుందనే చెప్పొచ్చు.

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version