విడుదల తేదీ : 9 అక్టోబర్ 2015
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : గుణశేఖర్
నిర్మాత : గుణశేఖర్
సంగీతం : మాస్ట్రో ఇళయరాజా
నటీనటులు : అనుష్క, అల్లు అర్జున్, రానా, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్..
కాకతీయ సామ్రాజ్యాన్ని సమర్ధవంతంగా పరిపాలించి, ప్రజల చేత మన్ననలు పొంది, కాకతీయ వంశానికి ఎన్నో కీర్తి ప్రతిష్టతలు తెచ్చి పెట్టిన వీరణారి రుద్రమదేవి జీవిత కథాంశంతో తెరకెక్కిన హిస్టారికల్ ఫిల్మ్ ‘రుద్రమదేవి’. ‘ది వారియర్ క్వీన్’ అనేది ఉపశీర్షిక. ఇండియాలోనే మొట్ట మొదటి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి ఫిల్మ్ గా వచ్చిన ఈ సినిమాకి గుణశేఖర్ డైరెక్టర్. అనుష్క మెయిల్ లీడ్ గా నటించగా రానా, అల్లు అర్జున్, నిత్యా మీనన్, కృష్ణం రాజు, కేథరిన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తీసిన ఈ భారీ బడ్జెట్ విజువల్ ఎఫెక్ట్స్ మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ హిస్టారికల్ కథని ఎంత మేరకు ప్రేక్షకులకు నచ్చేలా చెప్పాడన్నది ఇప్పుడు చూద్దాం..
కథ :
ఓరుగల్లు(ఇప్పటి వరంగల్)ని కాకతీయ రాజ్య పీఠంగా చేసుకొని కాకతీయ సామ్రాజ్యాన్ని ఎంతో సమర్ధవంతంగా 63 ఏళ్ళు పరిపాలించిన రాజు గణపతి దేవుడు(కృష్ణం రాజు). ఆయనకి వారసులు లేరు. ఆయన చివరి సంతానం కూడా ఆడబిడ్డే పుడుతుంది. కానీ తనకి వారసుడు పుట్టలేదు అని తెలిస్తే దేవగిరి రాజైన సింగన్న(రాజ మురాద్) దండెత్తి వస్తాడని, అలాగే తన దాయాదుల వల్లే తమకు ముప్పు పొంచి ఉన్నదని గణపతి దేవుడు బాధపడుతున్న తరుణంలో మంత్రి శివ దేవయ్య(ప్రకాష్ రాజ్) పుట్టింది ఆడపిల్ల అనే విషయాన్ని దాచి, తమకు పుట్టింది మగ పిల్లాడే, అని తనకి రుద్రమదేవి అనే నామకరణం చేసినా రుద్రదేవ యువరాజుగా ప్రజలకి పరిచయం చేస్తాడు. అనుకున్నట్టుగానే కుమార్తెను ఒక రాజుని తయారు చేసినట్టే సకల విద్యల్లోనూ శిక్షణ ఇప్పిస్తాడు. రుద్రదేవ కూడా అన్ని విద్యల్లో ఆరితేరుతాడు. అప్పుడే యువరాజుగా పట్టాభిశాక్తుల్ని చేస్తారు.
ఇదిలా ఉండగా గణపతిదేవుడు దాయాదులైన హరిహర దేవుడు(సుమన్). మురారి దేవుడు(ఆదిత్య మీనన్)లు రుద్రవీరని చంపి కాకతీయ సింహాసనాన్ని దక్కించుకోవాలని చూస్తుంటే, మరోవైపు దేవగిరి యువరాజు మహాదేవ నాయకుడు(విక్రంజీత్) కూడా కాకతీయ సామ్రాజ్యంపై దండెత్తడానికి వ్యూహాలు రచిస్తుంటాడు. అదే తరుణంలో బంధిపోటుగా పేరు తెచ్చుకున్న గోనగన్నారెడ్డి(అల్లు అర్జున్) కూడా రుద్ర వీరతో పోరు కోసం సిద్దంగా ఉంటాడు. ఇన్ని ప్రమాదాలు పొంచి ఉన్న తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి రుద్రవీర ఏం చేసింది.? రుద్రవీర యువరాజు మగ కాదు,ఆడ అని తెలిసిన తర్వాత కాకతీయ ప్రజలు ఏం చేసారు.? అలా చేయడం వల్ల వారు ఎదుర్కున్న ఇబ్బందులేమిటి.? ఆ ఇబ్బందుల నుంచి ప్రజలని కాపాడి, మహాదేవ నాయకుడి నుంచి కాకతీయ రాజ్యాన్ని ఎలా కాపాడుకుంది.? అసలు రుద్రవీరకి బాల్య మిత్రుడైన గోనగన్నారెడ్డి రుద్రమదేవికి ఎందుకు ఎదురెళ్ళాడు.? అన్న ప్రశ్నలకు సమాధానం మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.
ప్లస్ పాయింట్స్ :
రుద్రమదేవి జీవిత చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు ఉన్నాయి. అలానే రుద్రమదేవి సినిమాకి కూడా హైలైట్ గా నిలిచే కొన్ని బ్లాక్స్ ఉన్నాయి. ముందుగా ఆ బ్లాక్స్ గురించి చెప్పుకుంటే.. రుద్రమదేవి చిన్ననాటి ఎపిసోడ్ తో పాటు, అనుష్క ఇంట్రడక్షన్ సీన్ అన్ని వర్గాల వారికి నచ్చుతుంది. ఆ తర్వాత అనుష్క పై ఓ ముఠా దాడి చేసినప్పుడు అక్కడ అనుష్క చేసే వీరోచిత పోరాటం బాగుంది. ఆ ఫైట్ లో అనుష్క కత్తితిప్పుడు సూపర్బ్. వీటికంటే మించి గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ఇంట్రడక్షన్ సీన్ మైండ్ బ్లోయింగ్. ఒక్కసారిగా థియేటర్లోని ఆడియన్స్ లో ఓ సరికొత్త ఎనర్జీ జెనరేట్ అవుతుంది. ఈ సీన్ లో ఇంటెన్స్ తో పాటు డైలాగ్స్ లో కావలసినంత వెటకారం, కామెడీ కూడా ఉంటాయి. అందుకే ఈ సీన్ అందరికీ పిచ్చ పిచ్చగా నచ్చేస్తుంది. అలాగే ఇంటర్వల్ బ్లాక్ కూడా ఆకట్టుకుంటుంది. ఇక ఫైనల్ క్లైమాక్స్ దగ్గర వచ్చే వార్ ఎపిసోడ్ లో చూపే సర్ప వ్యూహం – గరుడ వ్యూహం సీన్స్ బాగున్నాయి.
ఈ సినిమాలో ఎంతోమంది స్టార్ నటీనటులు ఉన్నారు.. సో సినిమాకి హైలైట్ గా నిలిచిన నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పుకుంటే.. ముందుగా ఇలాంటి ఓ సినిమాని తన భుజాల మీద వేసుకొని నడిపించడమే కాకుండా ఈ సినిమా కోసం రెండేళ్ళు టైం కేటాయించిన అనుష్కకి హ్యాట్సాఫ్. అనుష్క వారియర్ లా, ఒక మెచ్యూర్ యువరాణిలా బాగా చేసింది. ముఖ్యంగా యుద్ద సన్నివేశాల్లో కత్తి తిప్పడం, రిస్కీ స్టంట్స్ చేయడంలో హీరోలకు దీటుగా నిలిచింది. ఇక అంతఃపురంలో రాణిగా తన అందచందాలతో ఆకట్టుకుంది. ఇక అనుష్క కంటే మించి ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది గోనగన్నారెడ్డి పాత్ర చేసిన అల్లు అర్జున్. బన్ని లుక్ అండ్ తెలంగాణా యాసలో బన్ని చెప్పిన డైలాగ్ డెలివరీ అదిరిపోయింది. ‘గమ్మునుండవో..’ అంటూ సాగదీసి చెప్పే డైలాగ్ బాగా ఫేమస్ కూడా అవుతుంది. తన ఇంటెన్స్ యాక్షన్ రోల్ సినిమాకి మేజర్ హైలైట్ అయ్యింది. రుద్రమదేవి అనే సినిమాకి అనుష్క – అల్లు అర్జున్ లు రెండు కళ్ళు లాంటివారు. ఇక రానా యువరాజు పాత్రలో బాగా చేసాడు. మంత్రిగా ప్రకాష్ రాజ్, రాజుగా కృష్ణంరాజులు తమ పాత్రలకి న్యాయం చేస్తే సుమన్, ఆదిత్య మీనన్, విక్రంజీత్ లు నెగటివ్ షేడ్స్ ని బాగా చేసారు. మిగతా చిన్న చిన్న పాత్రలో చేసిన నిత్యా మీనన్, కేథరిన్, హంసానందిని, అదితి చెంగప్పలు తెరపై కాస్త గ్లామర్ ని ఒలకబోశారు.
ఇక సినిమా పరంగా చూసుకుంటే.. ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి వేసిన సెట్స్ మనకు 13వ శతాబ్దంని గుర్తు చేస్తాయి. అలాగే విజువల్స్ ఎఫెక్ట్స్ కూడా బాగానే ఉన్నాయి. 7 కోట గోడల నిర్మాణం, చివరి వార్ ఎపిసోడ్ దగ్గర వచ్చే ఎఫెక్ట్స్ బాగున్నాయి. ఫస్ట్ హాఫ్ లో కథలో బాగంగా వచ్చే కొన్ని సీన్స్ బాగా ఆకట్టుకుంటాయి. అలాగే చిరంజీవి వాయిస్ ఓవర్ కూడా సినిమాకి బాగా హెల్ప్ అయ్యింది.
మైనస్ పాయింట్స్ :
సినిమా ప్రారంభం ముందే ఈ రియల్ లైఫ్ కథలో ఏమన్నా చిన్న చిన్న తప్పులుంటే క్షమించాలి అని వేసారు కాబట్టి కథ గురించి ఏం మాట్లాడటం లేదు. కానీ కథలో రియాలిటీ కంటే సినిమాటిక్ కల్పిత అంశాలు ఎక్కువయ్యాయి. ఇకపోతే సినిమాకి రాసుకున్న కథనం బాలేదు. ఎందుకు అంటే చెబుతున్నది రియల్ గా జరిగిందే అయినా స్క్రీన్ ప్లే మాత్రం చాలా రెగ్యులర్ వేలో రాసారు. దాని వలన అన్ని పాత్రల పరిచయాల తర్వాత రుద్రమదేవి కథలో ఏం జరుగుతుందా అనేది తెలిసిపోతుంది. దాంతో సినిమా బోరింగ్ గా అనిపిస్తుంది. మనకు తెలియని ఓ కథని చెబుతున్నప్పుడు అందులో ఎన్నో కొన్ని థ్రిల్స్ ఉండాలి. కానీ ఇందులో థ్రిల్స్ అనేవి లేవు. రుద్రమదేవి కథ మొత్తానికి ఒకే ఒక్క ట్విస్ట్ ని రాసుకున్నారు, ఆ ట్విస్ట్ ఆడియన్స్ ఊహించదగినదే కావడం వలన చివర్లో పెద్ద కిక్ ఏమీ ఉండదు. ఇక నేరేషన్ కూడా అంతే స్లోగా సాగడం, ముఖ్యంగా సెకండాఫ్ లో అయితే ఉన్న మూడ్ ని మరింత తగ్గించేలా నేరేషన్ ఉంటుంది. సెకండాఫ్ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్.
సెకండాఫ్ లో సూపర్ అని చెప్పుకునేలా ఒక్క సీన్ కూడా లేకపోవడం బాధాకరం. సన్నివేశాలే బోర్ కొడుతున్నాయి అంటే.. మధ్య మధ్యలో వరుసగా పాటలు వచ్చి సినిమా వేగాన్ని ఇంకా కిందకి పడేస్తాయి. సో పాటల్ని కట్ చేసేయవచ్చు. ఇకపోతే ఇలాంటి హిస్టారికల్ సినిమాలలో డైరెక్టర్ చేయాల్సిన మేజిక్ చరిత్రలోని పాత్రలని సినిమా మొదట్లోనే ప్రేక్షకులకు కనెక్ట్ చేసెయ్యాలి. అలానే ఆడియన్స్ లో మనం 13వ శతాబ్దంలో ఉన్నా అనే ఫీలింగ్ ని కలిగించాలి. ఈ రెండింటిలో ఏ ఫీలింగ్ ని క్రియేట్ చేయలేకపోయాడు. ఎక్కడా పాత్రలని 100% ఎలివేట్ చేయలేదు. దాంతో ఒకటి రెండు పాత్రలకు తప్ప మిగతా ఏ పాత్రకి ఆడియన్స్ ఎమోషనల్ గా కనెక్ట్ కాలేదు. దానివల్ల ఆడియన్స్ సినిమాతో కంటిన్యూగా సింక్ అవ్వరు. ఇక సినిమాకి కీలకం కావాల్సిన వార్ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను నిరుత్సాహపరుస్తుంది. ఒకటి రెండు ఫార్మేషన్స్ ని బాగానే చూపిన వార్ ఎపిసోడ్ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. నిత్యా మీనన్, కేథరిన్, హంసానందిని, అదితి చెంగప్పలు గ్లామర్ అట్రాక్షన్ కే తప్ప సినిమాకి పెద్ద ఉపయోగపడని పాత్రలు. వీరి కాంబినేషన్ లో వచ్చే కొన్ని సీన్స్ ని కూడా తీసేయవచ్చు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చింది ఆర్ట్ డైరెక్టర్ తోట తరణి. ఆయన వేసిన సెట్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్. ఎందుకంటే ఆయన కాకతీయ కట్టడాలను కళ్ళకు కట్టినట్లు రూపకల్పన చేసారు. అలాగే సెట్స్ కి కొనసాగింపుగా చేసిన విజువల్ ఎఫెక్ట్స్ బాగున్నాయి అంటే బాగున్నాయి అనేలా ఉన్నాయే తప్ప, ఇలాంటి ఓ భారీ బడ్జెట్ సినిమాకి ఉండాల్సిన హై రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే లేవు. ఇక అజయ్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ బాగుంది. సెట్ లో లేదా బయట తీసిన లొకేషన్స్ ని చాలా బాగా చూపించాడు. ఇకపోతే మాస్ట్రో ఇళయరాజా అందించిన పాటలు సినిమాకి హెల్ప్ కాలేదు, అలాగే ఆయన నేపధ్య సంగీతం కూడా అంతంతమాత్రంగానే ఉంది. సో మ్యూజిక్ అనేది ఈ సినిమాకి మైనస్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ అస్సలు బాలేదు. అంత సీనియర్ ఎడిటర్ ఇంత స్లోగా ఉండేలా ఓ ఎపిక్ డ్రామాని ఎడిట్ చేయడం చాలా బాధాకరమైన విషయం. అప్పటి తరానికి మ్యాచ్ అయ్యేలా నీతా లుల్లా డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్ మాత్రం అందరికీ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. పీటర్ హెయిన్, విజయ్ కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ జస్ట్ యావరేజ్ అనుకునేలా ఉన్నాయే తప్ప రుద్రమదేవి అనే హిస్టారికల్ సినిమాకి సరిపోయే రేంజ్ లో లేవు. తోట ప్రసాద్ – గుణశేఖర్ – పరుచూరి బ్రదర్స్ కలిసి రానుకున్న డైలాగ్స్ బాగున్నాయి, ముఖ్యంగా అల్లు అర్జున్ కి రాసిన డైలాగ్స్ బాగున్నాయి.
ఇక కథ – కథనం – నిర్మాణం – దర్శకత్వం విభాగాలను డీల్ చేసింది గుణశేఖర్.. కథ – రుద్రమదేవి అనే ఒరిజినల్ కథని తీసుకొని దానికి ఎక్కువ సినిమాటిక్ అంశాలను జత చేసి చివరికి వచ్చేసరికి రెగ్యులర్ స్టొరీ చూస్తున్నామనే ఫీలింగ్ ని కలిగించింది. కథనం – అవసరానికి మించిన సాగదీత, స్లో అండ్ రొటీన్. దర్శకత్వం – దర్శకుడిగా ఓ హిస్టారికల్ కథనే ఎంచుకున్నారు బాగుంది, కానీ దాన్ని పర్ఫెక్ట్ గా తెరపై ఆవిష్కరించడంలో ఫెయిల్ అయ్యాడు. ఏ ఒక్క పాత్రని పూర్తిగా ఆడియన్స్ కి కనెక్ట్ చేయలేకపోయారు. అలాగే చాలా సీన్స్ లో ఇంటెన్స్ ఉన్నా దానిని తెరపైకి తీసుకురాలేకపోయాడు. నిర్మాతగా కూడా ఓ డీసెంట్ విజువల్ ట్రీట్ ఇచ్చాడే తప్ప, ఓ కేవ్వుకేక అనిపించుకునే విజువల్ వండర్ మూవీ అయితే ఇవ్వలేదు.
తీర్పు :
భారతీయ వీరణారిగా చరిత్ర పుటల్లో నిలిచిన రాణీ రుద్రమదేవి జీవిత గాధ ఆధారంగా హిస్టారికల్ ఎపిక్ డ్రామాగా వచ్చిన ‘రుద్రమదేవి’ సినిమా ప్రేక్షకుల భారీ అంచనాలను అందుకునేలా లేకపోయినా, పరవాలేదు అనిపించుకునేలా మాత్రం ఉంది. కథలో దమ్మున్న సినిమా అయినప్పటికీ కథనం మరియు డైరెక్షన్ కారణాల కారణంగా యావరేజ్ అటెంప్ట్ గా నిలిచిపోవాల్సి వచ్చింది. ఒక హిస్టారికల్ కథని చెబుతున్నప్పుడు ఆ కథని ప్రేక్షకుల మదికి బలంగా తగిలేలా చెప్పాలి కానీ చెప్పలేకపోయారు. రుద్రమదేవిగా అనుష్క, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ లు తమ పాత్రల మీద ప్రాణం పెట్టి చేయడం వలన ఆ పాత్రలకు మంచి ఎస్టాబ్లిష్ మెంట్ వచ్చింది, అవే సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యాయి. సినిమాని సాగదీయడం, అనవసరపు సాంగ్స్, ఆకట్టుకోలేకపోయిన వార్ ఎపిసోడ్స్, సెకండాఫ్ బాగా డల్ గా సాగడం లాంటివి సినిమాకి బిగ్గెస్ట్ మైనస్. ఓవరాల్ గా అంచనాలను కాస్త తగ్గించుకొని, కాస్త స్లో అయినా పర్లేదు అనుకొని సినిమా చూస్తే డీసెంట్ హిస్టారికల్ ఫిల్మ్ చూసాం అనే ఫీలింగ్ కలుగుతుంది.
123తెలుగు.కామ్ రేటింగ్ :3/5
123తెలుగు టీం