విడుదల తేది : 10 ఫిబ్రవరి 2012 |
దర్శకుడు : రాజ్ మాదిరాజు |
నిర్మాత : రమేష్ ప్రసాద్ |
సంగిత డైరెక్టర్ : స్నిగ్ధ,డాన్ చంద్రన్ |
తారాగణం : అరవింద్ కృష్ణ, సుప్రియ శైలజ |
ప్రసాద్ ప్రొడక్షన్స్ సంస్థ ముప్పై యేళ్ల తరువాత తీసిన సినిమా ‘ఋషి’. అరవింద్ కృష్ణ, సుప్రియ శైలజ ముఖ్య పాత్రల్లో నటించగా రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. స్నిగ్ధ మరియు డాన్ చంద్రన్ కలిసి ఈ సినిమాకి సంగీతం అందించారు. ఈ సినిమా ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ:
ఋషి (అరవింద్ కృష్ణ) ఉన్నత భావాలు ఉన్న మెడికల్ కాలేజ్ స్టూడెంట్. తన ప్రవర్తన వల్ల తన స్నేహితులకు దూరమైన లెక్క చేయడు. అదే కాలేజ్ స్టూడెంట్ అయిన పూజ (సుప్రియ శైలజ) మొదట అరవింద్ ని అపార్ధం చేసుకున్న తరువాత ప్రేమిస్తుంది. ఋషి కూడా పూజని ప్రేమిస్తాడు. వీరి ప్రేమకి పూజ తల్లితండ్రులు కూడా అంగీకరిస్తారు. ఋషి ఎమ్బీబీఎస్ చివరి సంవత్సరంలో ఉండగా కార్తీక్ (గౌరవ్) అనే కుర్రవాడు గుండె జబ్బుతో ఉన్న కుర్రవాడు కలుస్తాడు. గుండె మార్పిడి చేస్తే కార్తీక్ బతుకుతాడు. అతనికి సరిపడే గుండె దొరికిందా? అతను రుషి జీవితంలో ఎలాంటి పాత్ర పోషించాడు. ఋషికి, కార్తీక్ కి సంబంధం ఏంటి? ఇవన్ని తెలుసుకోవాలంటే ఋషి సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
ఋషి పాత్రలో నటించిన అరవింద్ కృష్ణ మంచి పరిణతి కూడిన నటన ప్రదర్శించాడు. అతని గత చిత్రాల కంటే ఈ చిత్రంలో బాగా నటించాడు. క్లైమాక్స్ ముందు పార్టీ సన్నివేశంలో బాగా నటించాడు. ఋషి పాత్రకు అతికినట్లు సరిపోయాడు. అతని పాత్ర డిజైన్ చేసిన విధానం కూడా బావుండటంతో ప్రేక్షకులు ఆ పాత్రకు కనెక్ట్ అయిపోతారు. ఋషి ప్రియురాలు పూజ పాత్రలో నటించిన సుప్రియ శైలజ తెలుగులో మొదటి సినిమా అయినా బాగా నటించింది. గ్లామర్ కి ప్రాధాన్యం ఉన్న పాత్ర కాకుండా నటనకి స్కోప్ ఉన్న పాత్ర ఎంచుకోవడం అభినందనీయం. ఆమె అందంగా కూడా ఉంది. గుండె జబ్బుతో బాధపడే కార్తీక్ గా నటించిన గౌరవ్ కూడా బాగా నటించాడు. సాల్మన్ తో చేసిన సన్నివేశాల్లో బాగా నవ్వించాడు. సీనియర్ హీరో అయిన సురేష్ నెగటివ్ పాత్రలో లక్ష్మిపతిగా బాగా చేసాడు. హీరో స్నేహితులుగా చేసిన నరసింహ రాజు, సాల్మన్ బాగానే నవ్వించారు. సిగ్ధ-డాన్ చంద్రన్ అందించిన సంగీతంలో మూడు పాటలు బావున్నాయి. స్నిగ్ధ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బావుంది.
మైనస్ పాయింట్స్:
చిత్ర నిడివి కాస్త ఎక్కువగా ఉండటంతో రెండవభాగం కొంత బోర్ కొడుతుంది. పాటలు కూడా ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకుడు అసహనానికి గురవుతాడు. చిత్ర ఆఖరి 45 నిముషాలు మరియు మొదటి భాగంలో కొంత వరకు ఎడిట్ చేసి ఉంటే బావుండేది.
సాంకేతిక విభాగం:
చాలా సన్నివేశాలు పాటలు ఎడిటింగ్ చేయకుండా వదిలేసారు. దర్శకుడు రాజ్ మాదినేని మొదటి చిత్రం అంకుల్ విఫలమైనా ఈ సారి మంచి చిత్రంతో మనముందుకు వచ్చాడు. తను ఎంచుకున్న కాన్సెప్ట్ కి న్యాయం చేయగలిగాడు. ఈ రోజుల్లో దర్శకులు అంతా కమర్షియల్ సినిమాలు అంటూ చేతులు కాల్చుకుంటున్నా ఇలాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ ఎంచుకున్నందుకు దర్శకుడిని అభినందించాలి. అలాగే నిర్మాత రమేష్ ప్రసాద్ గారు కూడా ఇలాంటి సబ్జెక్ట్ ని నమ్మి సినిమా నిర్మించడం అభినందనీయం. పలు హిందీ చిత్రాలకు పనిచేసిన కెమరామెన్ త్రిభువన్ బాబు సాధినేని సినిమాటోగ్రఫీ కూడా బావుంది.
తీర్పు:
మంచి హృదయంతో తీసిన సినిమా. ఒక డాక్టర్ తపనను బాగా చూపించారు. మీరు చూసే రెగ్యులర్ తెలుగు సినిమాలులాగా కాకుండా, ఏదైనా కొత్తగా చూడాలని కోరుకుంటే, ఋషి మీకు నచ్చుతుంది.
123తెలుగు.కామ్ రేటింగ్:
NA ఋషి రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు అందువల్ల ఇలాంటి సినిమాలకు రేటింగ్ ఇవ్వడం సబబు కాదని భావిస్తున్నాం.
అశోక్ రెడ్డి. ఎమ్