ఆడియో సమీక్ష : సాహసం శ్వాసగా సాగిపో – రహమాన్ మ్యాజిక్!

Saahasam-Swaasaga-Saagipo
‘ఏ మాయ చేసావే’ సినిమాతో మ్యాజిక్ చేసిన హీరో నాగ చైతన్య, దర్శకుడు గౌతమ్ మీనన్‌ల క్రేజీ కాంబినేషన్‌లో మరో సినిమా అనగానే ఆ సినిమాకు ఏ స్థాయి అంచనాలు ఉంటాయో చెప్పాల్సిన పనిలేదు. ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఈ కాంబినేషన్‌ వల్లే మొదట్నుంచీ ఆసక్తి రేకెత్తిస్తూ వస్తోంది. ఇక దానికితోడు ‘ఏ మాయ చేసావే’కి మ్యూజిక్ అందించిన ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రహమాన్ ఈ సినిమాకూ సంగీతం సమకూర్చడంతో ఆడియోపైనా మంచి అంచనాలు కనిపించాయి. ఇప్పటికీ పలువురి ఫేవరైట్ ఆల్బమ్స్‌లో ఒకటిగా నిలిచే ‘ఏ మాయ చేసావే’ కాంబినేషన్‌లో వచ్చిన ‘సాహసం శ్వాసగా’ ఆడియో ఎలా ఉందీ? చూద్దాం..

1. పాట : షోకిల్లా
గాయనీ గాయకులూ : ఆదిత్య రావు, ఏడీకే, రాస్కోల్, రాకెందు మౌళి
సాహిత్యం : రాకెందు మౌళి

‘షోకిల్లా’ అంటూ మొదలయ్యే ఈ రాప్, రహమాన్ వెస్ట్రన్ స్టైల్ పాటల్లానే సాగిపోతుంది. ఇన్స్ట్రుమెంట్స్‌తో రహమాన్ చేసే ప్రయోగం ఎప్పుడూ ఉన్నట్లుగానే ఉంది. చెప్పుకోదగ్గ స్థాయిలో ట్యూన్ ఏమీ లేకున్నా వినగలిగేలానే ఉంది. విజువల్స్‌తో కలిపి చూస్తే, ఇంకా నచ్చే ఈ పాటలో రాకెందు మౌళి అందించిన సాహిత్యం కూడా పాట స్టైల్‌కి తగ్గట్టుగానే ఉంది. ముఖ్యంగా ఇంగ్లీష్-తెలుగు పదాలతోనే రాకెందు మౌళి అందించిన సాహిత్యం కొత్తగా బాగుంది. గాయకులందరూ తమ గానంతో ఓ రాప్ సాంగ్ మూడ్‌ను తేగలిగారు. అయితే సినిమాతో చూస్తే ఏమో కానీ, మళ్ళీ మళ్ళీ వినిపించే పాటగా ఈ పాట కనిపించలేదు.

2. పాట : కన్నుల ముందే
గాయనీ గాయకులూ : హరిచరణ్, చిన్మయి
సాహిత్యం : కృష్ణ చైతన్య

కన్నుల ముందే అంటూ సాగే ఈ పాటలో అందరినీ మించి గాయనీ, గాయకులిద్దరూ పాటను తమ చేతుల్లోకి తీసుకోవడం చూడొచ్చు. రహమాన్ అందించిన ట్యూన్ ఆహ్లాదకరంగా, ఒక ఫ్లోలో సాగిపోతుంది. టెంపో పెరిగినప్పుడల్లా హరిచరణ్ వాయిస్‌ మ్యాజిక్ చేసేసింది. ఇక కృష్ణ చైతన్య అందించిన సాహిత్యం చాలా బాగుంది. ఒకే పదాన్ని మళ్ళీ మళ్ళీ వాడుతూ ఎప్పుడు ప్రయోగం చేసినా బాగుంటుంది. అలాంటి ప్రయోగాన్ని ఈ పాటలో చూడొచ్చు. విజువల్స్‌తో కలిపి చూసినపుడు ఈ పాట మరింత బాగుంటుందని ఆశించొచ్చు.

3. పాట : చక్కోరి
గాయనీ గాయకులూ : సత్య ప్రకాష్, సాషా
సాహిత్యం : అనంత శ్రీరామ్

‘చక్కోరీ’ అంటూ వచ్చే ఈ పాట ట్యూన్-సింగింగ్-లిరిక్స్ మూడూ పద్ధతిగా ఓ దగ్గర కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందనిపించే పాట. ‘మొదటా ఆ మాటనీ మాటాడగలదెవరో, మొదటా ఈ ప్రేమనీ బయటుంచగలదెవరో..’ అంటూ అనంత శ్రీరామ్ అందించిన లిరిక్స్, రహమాన్ వినసొంపైన ట్యూన్‌లో అలా ఒదిగిపోయి మరింత అందంగా మారిపోయాయి. ముఖ్యంగా పాట మధ్యలో కాస్త ట్రెడిషనల్, వెస్ట్రన్ బీట్స్ కలుపుతూ రహమాన్ చేసిన ప్రయోగం అద్భుతంగా ఉంది. సత్య ప్రకాష్, సాషాల గానం కూడా ఈ పాటకు సరిగ్గా సరిపోయింది. వినగా వినగా బాగా ఎక్కే ఈ పాట కూడా చాలాకాలం వరకూ వినిపిస్తుందని ఆశించొచ్చు.

4. పాట : తానూ నేనూ
గాయనీ గాయకులూ : విజయ్ ప్రకాష్
సాహిత్యం : అనంత శ్రీరామ్

‘తానూ నేనూ..’ అంటూ మొదలయ్యే ఈ పాట ఆల్బమ్ మొత్తంలో బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఏ.ఆర్.రహమాన్ సమకూర్చిన ఆహ్లాదకరమైన ట్యూన్ ఈ పాటకు ఓ అందాన్ని తెస్తే, అనంత శ్రీరామ్ సాహిత్యం దాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. రహమాన్ ఇన్స్ట్రుమెంట్స్ వాడకంలో చూపిన ప్రతిభ కూడా బాగుంది. ముఖ్యంగా అనంత శ్రీరామ్ పదాలతో చేసిన ప్రయోగం గురించి ఎంత చెప్పినా తక్కువే. మొయిలూ-మిన్నూ, పైరు-చేనూ, గానం-గమకం, శశి-నిశి.. లాంటి పదాలతో ఓ ప్రేమజంట గురించి చెప్పడం చాలా బాగుంది. ఇక విజయ్ ప్రకాష్ గాత్రం కూడా రహమాన్-అనంత శ్రీరామ్ ఇద్దరూ కలిసి చేసిన మ్యాజిక్‌కు ఇంకా అందాన్ని తెచ్చింది. విన్నాకొద్దీ ఇంకా ఇంకా బాగుందనిపించే ఈ పాట కొన్నాళ్ళ తర్వాత కూడా గుర్తుంచుకొని, పాడుకోదగ్గ స్థాయిలో ఉంది.

5. పాట : వెళ్ళిపోమాకే
గాయనీ గాయకులూ : సిధ్ శ్రీరామ్, ఏడీకే
సాహిత్యం : శ్రీజో

‘వెళ్ళిపోమాకే’.. అంటూ వచ్చే ఈ పాట రహమాన్ ట్యూన్ పరంగా చేసిన మ్యాజిక్ అనే చెప్పాలి. పాటను రకరకాల మూడ్స్ వైపుకు మళ్ళించేలా ఇన్స్ట్రుమెంట్స్‌తో రహమాన్ చేసిన ప్రయోగం కట్టిపడేసేలా ఉంది. ముఖ్యంగా ఎళ్ళిపోమాకే.. అన్న లైన్ వినిపించినప్పుడల్లా పాట స్థాయి మరింత పెరిగిపోయింది. సిధ్ శ్రీరామ్, ఏడీకేల గానం కూడా పాట మూడ్‌కు సరిగ్గా సరిపోయింది. శ్రీజో అందించిన సాహిత్యం చాలా బాగుంది. చాలా బలమైన భావాలను చిన్న చిన్న పద ప్రయోగాలతో శ్రీజో బాగా పట్టుకున్నారు. ఇక ఈ పాటలో రహమాన్ ‘ఐ’ సినిమా ఆల్బమ్‌కు ఇచ్చిన ట్యూన్స్ చాయలు కనిపిస్తాయి.

తీర్పు :

ఏ.ఆర్.రహమాన్ ఆల్బమ్ ఒకటి విడుదలయిందంటే ఆ ఆల్బమ్‌కు మార్కెట్‌లో ఏ స్థాయి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. దానికితోడు గౌతమ్ మీనన్ లాంటి దర్శకుడి సినిమా ఆల్బమ్ అది అయి ఉంటే ఇక ఆ క్రేజ్ ఎక్కడికో చేరిపోతుంది. ఈ నేపథ్యంలోనే ‘సాహసం శ్వాసగా సాగిపో’ ఆడియోకు కూడా అదే స్థాయిలో క్రేజ్ కొనసాగుతూ వచ్చింది. ఇక ఆడియోపై సగటు అభిమాని పెట్టుకున్న అంచనాలన్నింటినీ అందుకొని ఏ.ఆర్.రహమాన్ అభిమానులకు ఓ గుర్తుండిపోయే ఆల్బమ్ ఇచ్చాడనే చెప్పాలి. ఎప్పట్లానే, రహమాన్ అన్ని సినిమాల పాటల్లానే ఈ పాటలూ విన్న మొదట్లో చాలా సాధారణంగా కనిపించేవే, తర్వాత తర్వాత అవే పూర్తిగా ఎక్కేసి చుట్టూ తిరుగుతున్నట్లనిపిస్తాయి. ‘తానూ నేనూ’, ‘ఎళ్ళిపోమాకే’, ‘చక్కోరీ’.. ఈ ఆల్బమ్‌లో టాప్ సాంగ్స్‌గా వీటిని చెప్పుకోవచ్చు. ఇక ‘కన్నుల ముందే’, ‘షోకిల్లా’.. సినిమాతో కలిపి చూసినప్పుడు నచ్చేవిగా చెప్పుకోవచ్చు. చివరగా ఒక్కమాటలో చెప్పాలంటే.. కొన్ని పాటలు మొదట్లో చాలా మామూలుగా కనిపించి, తర్వాత కాలానికి అవే ఇష్టమైన పాటల జాబితాలో చేరిపోతాయి. అలాంటి పాటలతో వచ్చిన మరో అందమైన రహమాన్ మ్యాజిక్, ఈ ‘సాహసం శ్వాసగా సాగిపో’!

సంబంధిత సమాచారం :