విడుదల తేదీ : జులై 27, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
నటీనటులు : బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే, జగపతిబాబు
దర్శకత్వం : శ్రీ వాస్
నిర్మాతలు : అభిషేక్ నామా
సంగీతం : హర్షవర్ధన్ రామేశ్వర్
సినిమాటోగ్రఫర్ : ఆర్ధర్ ఎ.విల్సన్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర్రావు
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజ హెగ్డే జంటగా, శ్రీవాస్ దర్శకత్వంలో తెరకెక్కిన డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ “సాక్ష్యం”. అభిషేక్ పిక్చర్స్ పతాకంపై అభిషేక్ నామా నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
రాజాగారు (శరత్ కుమార్)కు ఎన్నో పూజలు వ్రతాలు తర్వాత పుట్టినవాడే విశ్వాజ్ఞ (బెల్లంకొండ శ్రీనివాస్). కాగా మునిస్వామి (జగపతిబాబు) అతని తమ్ముళ్లు చేసే దుర్మార్గాలకు అడ్డు వస్తున్నాడని విశ్వాజ్ఞ పసిబిడ్డగా ఉన్నప్పుడే రాజాగారిని అతని కుంటుంబం మొత్తాన్ని అతి దారుణంగా చంపేస్తాడు. పంచభూతాల సాయంతో కొన్ని నాటకీయ పరిణామాల మధ్య ఆ పసిబిడ్డ ( విశ్వాజ్ఞ) మునిస్వామి అతని తమ్ముళ్లు నుండి తప్పించుకొని పెద్ద బిజినెస్ ఫ్యామిలీ అయిన శివ ప్రసాద్ (జయ ప్రకాష్, పవిత్రా లోకేష్)ల కొడుకుగా అమెరికాలో పెరుగుతాడు.
వీడియో గేమ్ డెవలపర్ అయిన విశ్వాజ్ఞ ప్రవచనాలు చెప్పే సౌందర్య లహరి(పూజ హెగ్డే)ను చూసి ప్రేమిస్తాడు. ఆమెను ప్రేమలో పడేసే క్రమంలో ఇండియా వస్తాడు. కాగా పంచభూతాలు ఆడే నాటకీయ పరిణామాల మధ్య చంపేవాడు (విశ్వాజ్ఞ), చచ్చేవాళ్ళు (మునిస్వామి, అతని తమ్ముళ్లు) ఒకరికి ఒకరు తెలియకుండా, విశ్వాజ్ఞ వాళ్ళని ఎలా చంపాడు ? వాళ్ళు ఎలా చచ్చారు ? చివరకి హీరో హీరోయిన్లు కలుస్తారా ? అసలు విశ్వాజ్ఞకు చనిపోయిన అతని కుంటుంబం గురించి తెలుస్తోందా ? ఈ మొత్తం వ్యవహారంలో అతనికి ప్రకృతి ఎలా సాయపడింది ? పంచభూతాలు ఎలా తమ ప్రతిచర్యను చూపాయి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
వీడియో గేమ్ డెవలపర్ గా నటించిన బెల్లంకొండ శ్రీనివాస్ లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా చాలా ఫిట్ గా బాగున్నాడు. పైగా తన సిక్స్ ప్యాక్ తో, గతంలో కంటే పరిణతి చెందిన తన నటనతో ఆకట్టుకుంటూ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. ముఖ్యంగా ఆయన రిస్క్ చేసి మరి చేసిన ఇంట్రడక్షన్ సీన్లోని అడ్వంచరస్ చిన్న పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి. ఇక హీరోయిన్ గా నటించిన పూజా హెగ్డే తన స్క్రీన్ ప్రెజెన్స్ తో గ్లామర్ తో ఈ చిత్రానికి స్పెషల్ ఎట్రాక్షన్ లా నిలిచింది.
దర్శకుడు శ్రీవాస్ ఈ చిత్రంతో తనలోని ఓ కొత్త యాంగిల్ ను చూపించాలనుకున్న ప్రయత్నం బాగుంది. పంచభూతాలు ను ఉపయోగించుకొని స్క్రీన్ ఫ్లే రాసుకోవడం, ఆ నేపథ్యంలోనే సినిమాను చేయాలనుకోవడం, ముఖ్యంగా కమర్షియల్ ఎలిమెంట్స్ కి ప్రకృతిని కేంద్రబిందువుగా చెయ్యాలనుకున్న ఆయన ప్రయత్నం మెచ్చుకోదగినది.
జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రాణా, మధు గురుస్వామి లాంటి మంచి నటులు ఈ చిత్రంలో విలన్ల పాత్రలను పోషించి ఈ చిత్రాన్ని మరో స్థాయికు తీసుకెళ్లారు ఇక వెన్నెల కిషోర్ తన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడ నవ్విస్తాడు. అలాగే ఎక్కువ సేపు కనిపించకపోయిన కీలక పాత్రల్లో నటించిన శరత్ కుమార్, మీనా తమ నటనతో ఆకట్టుకున్నారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
మైనస్ పాయింట్స్ :
ఓ కొత్త పాయింట్ తో కూడుకున్న విభిన్నమైన కథ మా చిత్రం అని సాక్ష్యం చిత్రబృందం ప్రమోట్ చేసినప్పటికీ, సాక్ష్యం చిత్రం మాత్రం తెలుగు సినిమాల మాదిరిగానే రొటీన్ సినిమాలాగే ఐదు ఫైట్స్, సాంగ్స్ తో పక్కా కమర్షియల్ చిత్రంలానే సాగుతుంది.
సినిమా ఇంట్రస్ట్ గా మొదలైనప్పటికీ, ఆ ఇంట్రస్ట్ ను దర్శకుడు చివరి వరకు నిలబెట్టలేకపోయాడు. అదికాక నమ్మశక్యం కాని సన్నివేశాలతో, కొన్ని అక్కరలేని సీన్లతో సినిమా ప్లో దెబ్బతింది. పైగా సినిమా కథాంశంలో చూపినంత కొత్తధనం సినిమాలో ఎక్కడా కనిపించదు.
పంచభూతాలు హీరోకి సాయపడే విధానం బాగున్నప్పటికీ మరి నాటకీయంగా అనిపిస్తాయి. మునుస్వామి (జగపతిబాబు) అతని తమ్ముళ్లు చేసే హత్యలు అన్యాయాలు వాస్తవానికి చాలా దూరంగా ఉండటం వల్ల ప్రేక్షకులు సినిమాని సినిమాలానే చూస్తారు తప్ప, పాత్రల్లో మమేకం అయిపోయి ఫీల్ అయ్యే సందర్భాలు చాల తక్కువ.
సాంకేతిక విభాగం :
దర్శకుడు శ్రీవాస్ ఓ మంచి కొత్త స్టోరీ ఐడియా తీసుకున్నారు గాని, ఆ ఐడియాకు తగ్గట్టు అంతే కొత్తగా ట్రీట్మెంట్ మాత్రం రాసుకోలేదు. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ అందించిన రీరికార్డింగ్ సినిమాని మరో స్థాయికి తీసుకువెళ్ళింది, సౌండ్, పాటల్లోని కొన్ని బిట్స్ చాలా బాగున్నాయి. పీటర్ హైన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ కూడా చాలా బాగున్నాయి. ప్రతీ ఫైట్ క్లైమాక్స్ ఫైట్ లానే ఉంటుంది.
సినిమాటోగ్రఫర్ ఆర్ధర్ ఎ.విల్సన్ సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. యూఎస్, వారణాసి, దుబాయ్ వంటి లొకేషన్స్ లో ఆయన తీసిన విజువల్స్ మంచి థియేటర్ ఎక్స్పీరియెన్స్ ఇస్తాయి. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ ఆయన స్థాయికి తగ్గట్టుగానే చాలా లోతుగా అర్ధవంతంగా ఉన్నాయి.
కోటగిరి వెంకటేశ్వర్రావు ఎడిటింగ్ బాగున్నా, సెకండ్ హాఫ్ లోని సాగతీత సీన్లను కొంత ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. సినిమాలోని అభిషేక్ నామా పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి.
తీర్పు :
ఓ కొత్తరకం పాయింట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాక్ష్యం చిత్రం చివరకి ఓ యాక్షన్ థ్రిల్లర్ అండ్ ఎంటర్ టైనర్ గానే నిలుస్తోంది. కాగా సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, పాత్రల నటన, వారి మధ్య కొన్ని భావోద్వేగ సన్నివేశాలు, ముఖ్యంగా ఓపెనింగ్ సీన్స్ బాగున్నప్పటికీ, సినిమా అనుకున్నంత కొత్తదనంగా లేకపోవడం, అక్కడక్కడ కొన్ని దృశ్యాలు ఆసక్తికరంగా లేకపోవడం సినిమా స్థాయిని తగ్గించేస్తుంది. కానీ ఓ మంచి కంటెంట్ తో వచ్చిన ఈ చిత్రం బి.సి సెంటర్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team