సమీక్ష : సంజీవని – థ్రిల్స్ లేవు.. అడ్వెంచర్స్ లేవు

Sanjeevani movie review

విడుదల తేదీ : జూన్ 29, 2018
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5

నటీనటులు : అనురాగ్ దేవ్, మనోజ్ చంద్ర, తనూజ నాయుడు

దర్శకత్వం : రవి వీడే

నిర్మాత : జి.నివాస్

సంగీతం : కెకె.శ్రావణ్

సినిమాటోగ్రఫర్ : విజి రవి వీడే

ఎడిటర్ : విజి రవి వీడే

స్క్రీన్ ప్లే : ఎన్. శ్రీధర్

ట్రైలర్ తో ప్రేక్షకుల్లో కొంత అటెంక్షన్ తెచ్చుకున్న చిత్రం ‘సంజీవని’. నూతన దర్శకుడు రవి వీడే డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఈరోజే విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ:

భారత ప్రభుత్వం దుర్బేధ్యమైన పర్వత ప్రాంతంలో ఉన్న రహస్యాన్ని ఛేదించమని ఒక పర్వతారోహకులు బృందానికి చెబుతుంది. దాన్ని ఛాలెంజింగా తీసుకున్న బృందం ఆ పర్వతంలోని రహస్యాన్ని కనుగొనడానికి బయలుదేరుతుంది.

అలా వెళ్లిన పర్వతారోహకుల ప్రయాణం ఎలా సాగింది. మార్గ మధ్యలో వారికి ఎలాంటి ఆపదలు ఏర్పడ్డాయి, చివరికి వారు పర్వతంలోని రహస్యాన్ని కనుగొన్నారా లేదా అనేదే తెరపై నడిచే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

సినిమాలో ప్రధాన ప్లస్ పాయింట్ తక్కువగా ఉన్న రన్ టైమ్. సినిమా ఓపెనింగ్ సమయంలో వచ్చే హెలికాఫ్టర్ షాట్ చాలా బాగుంది. ఆ సన్నివేశాన్ని మంచి సీజీ వర్క్ తో రూపొందించారు. నూతన సాంకేతికతను వినియోగించి పర్వత ప్రాంతంలో తీసియాన్ డ్రోన్ షాట్స్ కొన్ని బాగున్నాయి.

ఇక ప్రధాన తారాగణం పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే నటులందరూ కొత్తవారే. అందరూ ఓకే అనేలా పెర్ఫార్మ్ చేశారు. సినిమా ఆఖరులో బృందం రహస్యాన్ని ఛేదించడం, అక్కడే హనుమంతుడి విగ్రహం సహజంగా రూపొందడం, అందులోని విజువల్ ఎఫెక్ట్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకున్నాయి.

మైనస్ పాయింట్స్ :

సినిమా ఆరంభంలో భారీ అడ్వెంచరస్ షాట్ చూపించి ప్రేక్షకులు ఇకపై సినిమా మొత్తం ఇలానే భారీ గ్రాఫిక్స్ నిండి థ్రిల్లింగా ఉంటుంది అనుకునే సమయానికి సినిమా కాలేజ్ నేపథ్యంలోకి వెళ్ళిపోయి ఒక్కసారిగా నిరుత్సాహానికి గురిచేస్తుంది. హీరో హీరోయిన్ల నడుమన సాగే ఎమోషనల్ సీన్స్ అసహజంగా ఉన్నాయి.

పర్వతారోహకులు బృందంలోని సభ్యుల్లో ఒకరికొకరు మధ్యన బాండింగ్ ను సరిగా ఎగ్జిక్యూట్ చేయలేదు. ప్రథమార్థం ఏదోలా గడిచిపోయింది అనుకునే లోపు సెకండాఫ్ రివెంజ్ డ్రామాగా మారిపోయి, సభ్యులు విడిపోవడం విస్మయానికి గురిచేస్తుంది. టీమ్ మెంబర్స్ కారణం లేకుండా ఒకరినొకరు చంపుకోవడమనే లాజిక్ లేని అంశం చిరాకు తెప్పిస్తుంది.

సమయం గడుస్తున్న కొద్ది సినిమా సన్నివేశాల్లో లాజిక్స్ ఉండకుండా చిత్రం బలహీనంగా తయారవుతుంది. చివర్లో వచ్చే జంతువులకు సంబదించిన గ్రాఫిక్స్ కూడ సరిగా లేవు. స్కీన్ మీద ఆట బొమ్మల్ని చూసిన ఫీలింగ్ కలిగింది.

సాంకేతిక విభాగం :

అడ్వెంచరస్ థ్రిల్లర్ ను చేయాలనుకున్నప్పుడు అందులో కమర్షియల్ అంశాల్ని జోడించడానికి ఉన్న అన్ని అవకాశాలని వినియోగించుకుని మంచి ఎంటర్టైనర్ ను అందివ్వాలి. కానీ దర్శకుడు రవి వీడే మాత్రం అలా చేయలేదు. అనవసరమైన ప్రయోగాలకు పోయి ఫలితాన్ని దెబ్బ తినేలా చేశారు.

ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. గ్రాఫిక్స్ అక్కడక్కడా బాగున్నాయి. కెకె.శ్రావణ్ సంగీతం బాగుంది. బ్యాక్ గ్రౌండ్ సినిమాకు ఉపయోగపడింది. లిమిటెడ్ బడ్జెట్ లో తీసిన ఈ సినిమా నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

మొత్తం మీద ఈ ‘సంజీవని’ చిత్రం అతిగా అంచనాలను పెంచిన లాజిక్స్ లేని బోరింగ్ అడ్వెంచరస్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. ఈ థ్రిల్లర్ థ్రిల్స్ ఇవ్వకపోగా సిల్లీ రివెంజ్ డ్రామాగా మారి ప్రేక్షకుడ్ని ఏమాత్రం ఇంప్రెస్ చేయలేకపోయిన సినిమాగా మిగిలిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వారంలో ఈ సినిమాను స్కిప్ చేయడం మంచిది.

123telugu.com Rating : 2/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version