సమీక్ష : ‘సెబాస్టియన్‌ పిసి524’ – స్లోగా సాగే ఎమోషనల్ క్రైమ్ డ్రామా !

సమీక్ష : ‘సెబాస్టియన్‌ పిసి524’ – స్లోగా సాగే ఎమోషనల్ క్రైమ్ డ్రామా !

Published on Mar 5, 2022 3:02 AM IST
Sebastian PC 524 Review In Telugu

విడుదల తేదీ : మార్చి 4, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.5/5

నటీనటులు: కిరణ్‌ అబ్బవరం, కోమలీ ప్రసాద్‌, నువేక్ష, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సూర్య, రోహిణీ రఘువరన్‌, మహేష్‌ విట్టా, తదితరులు

దర్శకత్వం : బాలాజీ సయ్యపురెడ్డి

నిర్మాతలు: సిద్ధారెడ్డి బి, జయచంద్ర రెడ్డి, ప్రమోద్‌, రాజు

సంగీత దర్శకుడు: జిబ్రాన్‌

సినిమాటోగ్రఫీ: రాజ్‌ కె. నల్లి

ఎడిటర్ : విప్లవ్‌ న్యసదాం


బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం హీరోగా, కోమలీ ప్రసాద్‌, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా జ్యోవిత సినిమాస్‌ పతాకంపై ఎలైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో తెరకెక్కిన చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి524’. మరి ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం.

కథ :

‘సెబాస్టియన్‌ పిసి524’ (కిరణ్ అబ్బవరం)కి రేచీకటి.. తన తల్లి (రోహిణి) కోరిక మేరకు పోలీస్ కావడానికి, అలాగే.. పోలీస్ అయ్యాక ఆ జాబ్ ను నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. ఈ క్రమంలో అతని రేచీకటి అతనికి అనేక సమస్యలను తెచ్చి పెడుతూ ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం నీలిమ (కోమలీ ప్రసాద్‌) హత్యకు గురి అవుతుంది. ఆమె హత్య కేసు కారణంగా సెబాస్టియన్‌ సస్పెండ్ అవుతాడు. అసలు నీలిమను హత్య చేసింది ఎవరు ? ఆ హత్యకి సెబాస్టియన్‌ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న హేలీకి (నువేక్ష) ఉన్న సంబంధం ఏమిటి ? చివరకు ఆ హత్య చేసిన వాళ్ళను సెబాస్టియన్‌ ఎలా పట్టుకున్నాడు ? న్యాయం గెలవడం కోసం అతను తన జాబ్ ను సైతం ఎలా రిస్క్ లో పెట్టాడు ? అనేది మిగిలిన కథ.
 

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ప్రధాన పాత్ర అయిన సెబాస్టియన్‌ పాత్ర.. ఆ పాత్రకు సంబంధించిన రేచీకటి.సమస్య.. అలాగే ఆ పాత్రతో ముడి పడిన మిగిలిన పాత్రలు.. ఆ పాత్రల తాలూకు పాయింట్ ఆఫ్ వ్యూస్.. ఇలా మొత్తానికి ‘సెబాస్టియన్‌ పిసి524’ సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ముఖ్యంగా కామెడీ టోన్ తో సాగే కొన్ని సస్పెన్స్ సీన్స్ అండ్ ట్విస్ట్ లు అండ్ ఎమోషన్స్ వంటివి సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఇక ఈ సినిమాలో హీరోగా నటించిన కిరణ్ అబ్బవరం తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తన లుక్స్ అండ్ ఫిజిక్ బాగా మెయింటైన్ చేశాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్ గా నిలిచాడు. అలాగే, కీలక పాత్రలో నటించిన కోమలీ ప్రసాద్‌ కూడా చాలా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.

ఇక ఈ సస్పెన్స్ ఎమోషనల్ థ్రిల్లర్ లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి బాగా తీశాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే సీన్స్ ను తెరకెక్కించడంలో అతను సక్సెస్ అయ్యాడు.

 

మైనస్ పాయింట్స్ :

కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు సెబాస్టియన్‌ క్యారెక్టర్ కి ఇచ్చిన ఓవర్ బిల్డప్ కూడా బాగాలేదు.

అయితే దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వ పనితనం సినిమా పై ఆసక్తిని కలిగించినప్పటికీ… అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ.. కథ కథనాలు మరీ స్లోగా సాగడం కూడా బాగాలేదు.

ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వవు. దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలు పెట్టి.. ఆ తర్వాత అనవసరమైన సీన్స్ తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ రెగ్యులర్ ఎమోషనల్ క్రైమ్ స్టోరీలో కొన్ని కామెడీ సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. ఓవరాల్ గా అవసరానికి మించిన స్లో సన్నివేశాలు లేకుండా ఉంటే బాగుండేది.

 

సాంకేతిక విభాగం :

సినిమాలో దర్శకుడు బాలాజీ సయ్యపురెడ్డి చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా.. కథ కథనాలు ఆసక్తికరమైన ప్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు సమకూర్చిన పాటలు బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే.. లొకేషన్స్ అన్ని న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా.. కెమెరామెన్ వాటిని తెరకెక్కించిన విధానం మాత్రం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాత పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

తీర్పు:

‘సెబాస్టియన్‌’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలో కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా… పూర్తి స్థాయిలో మాత్రం సినిమా మెప్పించలేకపోయింది. అయితే, కిరణ్ అబ్బవరం నటన అండ్ కథలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, మరియు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బాగున్నాయి. కానీ, కథ కథనాలు స్లోగా సాగడం, సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ అవ్వడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ ఓ వర్గం ప్రేక్షకులకు కనెక్ట్ అయినా… ఈ సినిమా మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం నచ్చదు.

123telugu.com Rating : 2.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు