సమీక్ష : “సెహరి” – పర్వాలేదనిపించే కామెడీ ఎంటర్‌టైనర్

Sehari Review In Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 11, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి, అభినవ్‌ గోమఠం, ప్రణీత్‌ రెడ్డి, కోటి, బాలకృష్ణ

దర్శకత్వం : జ్ఞానసాగర్‌ ద్వారక
నిర్మాత: అద్వయ జిష్ణు రెడ్డి

సంగీత దర్శకుడు: ప్రశాంత్‌ ఆర్ విహారి

సినిమాటోగ్రఫీ: అరవింద్‌ విశ్వనాథ్‌

ఎడిటర్ : రవితేజ గిరిజాల

హర్ష్‌ కనుమిల్లి, సిమ్రాన్‌ చౌదరి జంటగా జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “సెహరి”. వర్గో పిక్చర్స్‌పై అద్వయ జిష్ణు రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ:

 

వరుణ్ (హర్ష్ కనుమిల్లి) చిన్నపిల్లల మనస్థత్వం కలిగిన ధనవంతుడు. అతను తన మాజీ ప్రియురాలి కంటే చాలా అందంగా కనిపించే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అలియా (స్నేహ విలిదిండి)తో అతని వివాహం ఫిక్స్ అవుతుంది. ఆలియా అక్క అమూల్య (సిమ్రాన్ చౌదరి) కుటుంబ ఆచారం కారణంగా నిశ్చితార్థం మరియు పెళ్లి పనులను చూసుకుంటుంది. చివరికి వరుణ్ అమూల్యపై ఫీలింగ్స్‌ని పెంచుకుని అలియాతో పెళ్లిని రద్దు చేసుకోవాలనుకుంటాడు. మరి వరుణ్ పెళ్లి రద్దు చేసుకున్నాడా? అతని నిర్ణయంపై అమూల్య ఎలా స్పందించింది? అనేది తెలియాలంటే బిగ్ స్క్రీన్‌పై సినిమాను చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:

 

హర్ష్ కనుమిల్లి నటన చాలా బాగుంది, అయోమయ యువకుడిగా చక్కగా నటించాడు మరియు అతని కామెడీ టైమింగ్ కూడా బాగుంది. ఇండస్ట్రీలో అతనికి మంచి భవిష్యత్తు ఉంది. సిమ్రాన్ చౌదరి అందంగా కనిపించింది మరియు బాగా నటించింది. అభినవ్ గోమఠం కామెడీ పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి.

సిట్యుయేషనల్ కామెడీతో నిండిన ఈ సినిమా మీకు బోర్ అనిపించదు. ఫస్ట్ హాఫ్ నవ్విస్తుంది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి, మ్యూజిక్ కూడా వినడానికి బావుంది. అంతేకాకుండా రన్‌టైమ్ ఈ సినిమాకి అదనపు ప్రయోజనం చేకూర్చిందని చెప్పాలి.

 

మైనస్ పాయింట్స్:

 

ఈ కథ తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు కానీ జ్ఞానసాగర్ కథను హాస్యభరితంగా వివరించిన తీరు మంచిగా అనిపించింది. హీరో తండ్రిగా కోటిని నటింపజేయడం మంచి ఆలోచన అయితే అతని కోసం మరిన్ని సన్నివేశాలు ఉండి ఉంటే అతని పాత్ర మరింత బాగుండేదనిపించింది.

సెకండాఫ్ ప్రేక్షకులను కథకు కట్టిపడేయడంలో కాస్త విఫలమైంది. నటుడు నందు అతిధి పాత్ర అనవసరం అనిపించింది. ఎమోషనల్ సీన్స్‌లో సిమ్రాన్ ఇంకాస్త మెరుగ్గా నటించి ఉండాలి. దర్శకుడు సెకండాఫ్‌పై మరింత దృష్టి పెడితే ఈ సినిమా పెద్ద హిట్ అయ్యేది.

 

సాంకేతిక విభాగం:

 

జ్ఞానసాగర్‌కి ఇది తొలి సినిమా అయినా బాగానే హ్యాండిల్‌ చేశాడు. ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం ఆహ్లాదకరంగా ఉంది. అరవింద్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి, రవితేజ గిరిజాల క్రిస్పీ ఎడిటింగ్‌ని మెచ్చుకోవాలి.

 

తీర్పు:

 

మొత్తంగా చూసుకున్నట్టైతే “సెహరి” ఒక మంచి రోమ్-కామ్ ఎంటర్‌టైనర్. ఫస్ట్ హాఫ్ మరియు క్లైమాక్స్‌లు ఆస్వాదించదగ్గవిగా ఉన్నాయి. సిట్యుయేషనల్ కామెడీ చాలా బాగా వర్కవుట్ అయ్యింది. హర్ష్ మరియు అభినవ్ కామెడీ చాలా బాగుంది. చివరలో కొన్ని సాగదీత సన్నివేశాలను పక్కనపెడితే “సెహరి” ఈ వారాంతంలో ఫ్యామిలీ మరియు స్నేహితులతో కలిసి చూడదగ్గ చిత్రం అని చెప్పొచ్చు.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

Exit mobile version