విడుదల తేదీ : సెప్టెంబర్ 03, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5
నటీనటులు: సిము లియు, ఆక్వాఫినా, మెంగర్ జాంగ్, ఫలా చెన్, టోనీ ల్యూంగ్ తదితరులు
దర్శకత్వం: డెస్టిన్ డేనియల్ క్రెట్టన్
స్క్రీన్ ప్లే: డేవ్ కల్లా హమ్, డెస్టిన్ డేనియల్ క్రెట్టన్, ఆండ్రూ లాన్హామ్
సంగీతం: జోయెల్ పి. వెస్ట్
నిర్మాతలు: కెవిన్ ఫీజ్, జోనాథన్ స్క్వార్జ్
హాలీవుడ్ యాక్షన్ మూవీస్ ను విశేషంగా ఆదరించే తెలుగువారు చాలామందే ఉన్నారు. వారి కోసమే అనేకానేక చిత్రాలు తెలుగులో డబ్ అవుతున్నాయి. అలా మార్వెల్ కామిక్ బుక్స్ నుండి వెండితెరపైకి వచ్చింది ‘షేంగ్ – ఛీ అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్’ సినిమా. మరి ఈ డబ్బింగ్ చిత్రం ఎలా ఉందో ఒక్కసారి సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
వెన్వు (టోనీ ల్యూంగ్) టెన్ రింగ్స్ అనే మానవాతీత శక్తులతో ప్రపంచాన్ని జయిస్తూ.. ఓ పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించుకుంటూ వెళ్తాడు. ఈ క్రమంలోనే అనేక శక్తులకు నిలయమైన న తాలూ అనే గ్రామానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు. కానీ అతను ఆ గ్రామంలోకి వెళ్లకుండా జియాంగ్ లీ (ఫలా చెన్) అడ్డుకుంటుంది. ఈ క్రమంలో వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. కొన్నేళ్ళకు వీరికి కొడుకు షేంగ్ – ఛీ (సిము లియు), కూతురు సాలియన్ (మెంగేల్ జాంగ్) పుడతారు. ఆ తర్వాత జియాంగ్ లీను ప్రత్యర్ధులు చంపేస్తారు. భార్య మరణాన్ని సహించలేని వెన్వు మళ్ళీ టెన్ రింగ్స్ ను ధరించి కఠినంగా మారతాడు. దాంతో షేంగ్ – ఛీ జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి ? అతను ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ? టెన్ రింగ్స్ ఆర్గనైజేషన్ ను ఎందుకు వదిలేసి వెళ్ళిపోతాడు ? షేంగ్ – ఛీ జీవితంలోకి సాధారణ యువతి కేటీ (ఆక్వా ఫినా) ఎలా ప్రవేశిస్తుంది ? చివరకు వీరి జీవితాలు ఎలాంటి మలుపులు తీసుకున్నాయి ? ఇంతకీ తాలూ గ్రామంలోని చీకటి రాకాసీ గుహకు షేంగ్ – ఛీకే మధ్య సంబంధం ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ ‘షేంగ్ -ఛీ అండ్ ద లెజెండ్ ఆఫ్ ద టెన్ రింగ్స్’ బేసికల్ గా సూపర్ హీరో సినిమా. అసలు సూపర్ హీరో సినిమా అంటేనే… యాక్షన్స్ మరియు ఎమోషన్స్ తో నిండిపోయి ఉంటుంది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో కూడా షేంగ్ -ఛీ, అతని తండ్రి, చెల్లి పాత్రలు తమ ధైర్యసాహసాలతో ఫైట్స్ తో ఆకట్టుకున్నారు. అలాగే బలమైన విలన్ రాకాసిని ఎదురుకునే క్రమంలో వచ్చే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు కూడా బాగా అలరిస్తాయి.
ముఖ్యంగా క్లైమాక్స్ లో రాకాసి వర్గం పై దాడి చేసే సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అలాగే షేంగ్ -ఛీ – అతని తండ్రి వెన్వు మధ్య వచ్చే యాక్షన్ సీన్స్ కూడా సినిమాలో హైలైట్ గా నిలుస్తాయి. ఇక వెన్వు పాత్రను డిజైన్ చేసిన తీరు, ఆ పాత్ర తాలూకు మేకప్ మరియు ఆ పాత్రకు తగ్గట్లు కల్పించిన పరిస్థితులు చాలా బాగున్నాయి.
అలాగే షేంగ్ -ఛీ, అతని చెల్లి మెంగేల్ జాంగ్ పాత్ర మధ్య సీన్స్ కూడా ఉత్కంఠభరితంగా సాగుతాయి. ఆక్వా ఫినా బస్ డ్రైవింగ్ సీన్ కూడా ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తోంది. అలాగే డైలాగ్స్ లో అక్కడక్కడా తెలుగు నేటివిటీకి సినిమాను దగ్గర చేసే ప్రయత్నం చేశారు. ఇక నటీనటులు కూడా ప్రతి ఒక్క ప్రేక్షకులను అలరించడంలో తమ పాత్ర పరిధి మేరకు చాలా బాగా మెప్పించారు. అలాగే తెలుగు వెర్షన్ లో డైలాగ్ మాడ్యులేషన్ అన్ని పాత్రలకు పర్ఫెక్ట్ గా సరిపోయాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు డెస్టిన్ డేనియల్ క్రెట్టన్, సూపర్ హీరో వెన్వు పరిచయంతో సినిమాని ఆసక్తికరంగా మొదలుపెట్టినా.. స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే ను నెమ్మదిగా నడిపారు. షేంగ్ -ఛీ స్టార్టింగ్ సీన్స్ కూడా కాస్త స్లోగా సాగుతాయి. పైగా ఈ చిత్రం ఎమోషన్స్ కు కూడా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం వలన.. కొన్ని రెగ్యులర్ సీన్స్ చూస్తోన్న భావన కలుగుతుంది.
ఇక యాక్షన్ పార్ట్ చాలా బాగున్నా.. ఇంకా అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ తో క్లైమాక్స్ ముగిస్తే బాగుండేది. అలాగే ప్రతి క్యారెక్టర్ తాలూకు ఎండింగ్ ను చూపించినా.. ఇంకా డిటైల్డ్ గా ఆ పాత్రలను ఎలివేట్ చేసి ఉంటే బాగుండేది.
సాంకేతిక విభాగం :
ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఈ సినిమాకు సంబంధించన ప్రతి క్రాఫ్ట్ బాగుంది. సినిమాలో సాంకేతికంగా పెద్దగా ఎక్కడా ఎలాంటి లోపాలు కనిపించవు. వీ.ఎఫ్.ఎక్స్, కంప్యూర్ గ్రాఫిక్స్ దగ్గర నుంచీ కెమెరా వర్క్, నేపథ్య సంగీతం వరకూ ప్రతి క్రాఫ్ట్ వర్క్ చక్కగా కుదిరింది. చివరగా నిర్మాణ విలువలు అద్భుతం.
తీర్పు :
ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల నెలకొన్న ఈ సూపర్ హీరో ‘షేంగ్ -ఛీ’ సినిమా అద్భుతమైన స్పెషల్ ఎఫెక్ట్స్ తో యాక్షన్ సీక్వెన్స్ తో మరియు బలమైన ఎమోషనల్ సీన్స్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే స్లోగా సాగే సీన్స్ తో కొన్నిచోట్ల స్క్రీన్ ప్లే నెమ్మదిగా సాగడం, రెగ్యులర్ ఎమోషనల్ సీన్స్ వంటి అంశాలు సినిమాకు బలహీనతలుగా నిలుస్తాయి. కానీ సినిమాలో కంటెంట్ తో పాటు యాక్షన్ అండ్ ఎమోషన్స్ బాగా అలరిస్తాయి. మొత్తానికి ‘షేంగ్ -ఛీ అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్’ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా ఓ మంచి ట్రీట్ లా అనిపిస్తుంది.
123telugu.com Rating : 3.5/5
Reviewed by 123telugu Team