ఆడియో సమీక్ష : శతమానం భవతి

shatamanam-bhavati
1. పాట : మెల్లగా తెల్లవారిందోయ్

గాయనీ గాయకులూ : అనురాగ్ కులకర్ణి, రమ్య బెహర, మోహన్ భోగరాజు
సాహిత్యం : శ్రీమణి

పల్లెటూరి వాతావరణాన్ని, తెల్లవారు జామున పల్లెవాసుల దిన చర్యలను ఎంతో అందంగా వర్ణించినట్టు ఉండే ఈ పాట ఈ ఆల్బమ్‍లోనే బెస్ట్ పాట అని చెప్పొచ్చు. మిక్కిజె మేయర్ అందించిన వినసొంపైన ట్యూన్స్ కు అనురాగ్ కులకర్ణి, రమ్య బెహర, మోహన్ భోగరాజుల అద్భుతమైన గానం తోడై పాటను చాలా తియ్యగా నిలబెట్టింది. ముఖ్యంగా శ్రీమణి అందించిన ‘పోలామారే పొలమంతా ఎన్నాళ్ళో నువ్వు తలచి’ వంటి సాహిత్యం పాటకు ప్రాణం పోసిందనే చెప్పాలి. పాట వింటున్నంత సేపు రాబోయే సినిమాలోని విజువల్స్ కళ్ళముందు కదులుతున్నట్టే ఉంటుంది.

2. పాట : శతమానంభవతి

గాయనీ గాయకులూ : చిత్ర, విజయ్ ఏసుదాస్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

సినిమాలో టైటిల్ సాంగ్ అయిన ‘శతమానంభవతి’ అనే ఈ పాట వింటే సినిమా యొక్క మొత్తం లక్షణం ఏమిటనేది ఇట్టే తెలిసిపోతుంది. పాట ఆద్యంతం సాంప్రదాయకమైన తెలుగింట జరిగే పెళ్లిని, దాని అంతర్గత లక్షణాన్ని, హీరో, హీరోయిన్ల వ్యక్తిత్వాన్ని వివరిస్తూ సాగుతుంది. మిక్కీ ట్యూన్స్ కి చిత్ర, విజయ్ ల అమృతం లాంటి గానం సరిగ్గా సరిపోయి పాట అద్భుతంగా వచ్చింది. ‘పంచదార నవ్వులవాడు, పాతికేళ్ల పండుగ వీడు’ లాంటి రామ జోగయ్య సాహిత్యం పాటకు కొత్తదాన్నని, హుందాతనాన్ని తీసుకొచ్చింది. ఈ పాట సినిమాలో విజువల్ గా చాలా బాగా ఉంటుందనడంలో సందేహం లేదు.

3. నాలో నేను

గాయనీ గాయకులూ : సమీరా భరద్వాజ్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

నాలో నేను.. అంటూ సాగే ఈ రొమాంటిక్ మాంటేజ్ సాంగ్ ఆరంభం కాస్త మామూలుగానే ఉన్నా ముందుకు సాగే కొద్దీ కొత్తగా మారుతూ హాయినిస్తూ ఉంటుంది. మిక్కీ ట్యూన్స్ అంత గొప్పగా లేకపోయినా సమీరా గాత్రం, రామ జోగయ్య సాహిత్యం ఆ లోటును కప్పేస్తూ పాట మొదటి రెండు పాటలంత కానున్న బాగానే ఉంది.

4. నిలవదే

గాయనీ గాయకులూ : ఎస్పీ. బాలు
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి

నిలవదే మది .. అంటూ సాగే ఈ పాట హీరో తన ప్రేమను తెలుపుతూ, కథానాయిక అందాన్ని వర్ణిస్తూ పాడే ఈ పాట కాస్త పాత ఫ్లేవర్ లో ఉన్నా ముందుకు సాగే కొద్దీ చాలా అద్బుతంగా తయారై మంచి అనుభూతిని ఇస్తుంది. ఎస్పీ బాలు గాత్రం నిజంగా పాటకు ప్రాణం పోసింది. మిక్కీ అందించిన లైట్ మ్యూజిక్ కూడా బాగు గొంతుకు బాగా సెట్టైంది. ఇక ‘దేవదాసే కాళిదాసై ఎంత పొగిడిన కొంత మిగిలిపోయేంత అందం నీది’ లాంటి రామజోగయ్య లిరిక్స్ చాలా కొత్తగా ఉంటూ, అనుభూతిని ఇస్తూ ఈ పాట ఆల్బమ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ గా నిలిచింది.

5. హైలో.. హైలెస్సారే

గాయనీ గాయకులూ :రోహిత్ పరిటాల, దివ్య దివాకర్, మోహన్ భోగరాజు, ఆదిత్య అయ్యంగర్ల
సాహిత్యం : శ్రీమణి

హైలో.. హైలెస్సారే.. అంటూ సాగే ఆల్బమ్ లోని ఈ చివరి పాటలో తెలుగువారికి పెద్ద పండుగైన సంక్రాంతిని వర్ణించడం జరిగింది. పండుగరోజు ప్రాముఖ్యతను, ఆరోజు ప్రతి ఒక్కరు చేసే సరదా పనులను వర్ణిస్తూ ఈ పాట సాగుతుంది. ఈ పాట పాత సంక్రాంతిని పాటల్లానే కాస్త రొటీన్ గానే ఉన్నా వినొచ్చు. ఇక మిక్కీ ట్యూన్స్, శ్రీమణి లిరిక్స్ బాగానే ఉన్నాయి. పాటకు రోహిత్ పరిటాల, దివ్య దివాకర్, మోహన్ భోగరాజు, ఆదిత్య అయ్యంగర్ల గాత్రం బాగా సెట్టైంది.

తీర్పు :

నిర్మాత దిల్ రాజు ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి ‘శతమానంభవతి’ అనే టైటిల్ ప్రకటించినప్పటి నుండి సినిమా అంతా సాంప్రదాయకరంగా ఉంటూ కుటుంబ బంధాలు చుట్టూ తిరిగే కథాగా ఉంటుందని అర్థమైపోయింది. అందుకు తగ్గట్టే ఉంది ఈ ఆడియో కూడా. ఉన్న 5 పాటల్లో ఏది కూడా శతమానంభవతి అనే టైటిల్ కు ఉన్న గొప్ప లక్షణాన్ని పాడుచేసే విధంగా లేకుండా పరిపూర్ణతను చేకూర్చే విధంగా ఉన్నాయి. ముఖ్యంగా ఒకటి, రెండు, నాలుగు పాటలైతే ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయనే చెప్పాలి. ఇక మూడు, ఐదు పాటలు అంత గొప్పగా కాకపోయినా బాగానే ఉన్నాయి. మొత్తం మీద ఈ ‘శతమానంభవతి’ ఆల్బమ్ టైటిల్ కు తగ్గట్టే సాంప్రదాయకరంగా, వినసొంపుగా బాగుంది.

Click here for English Review

Exit mobile version