విడుదల తేదీ : ఫిబ్రవరి 09, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు: డా. శివరాజ్‌కుమార్, గానవి లక్ష్మణ్, ఉమాశ్రీ, అదితి సాగర్, శ్వేత చంగప్ప, వీణా పొన్నప్ప, రఘు శివమొగ్గ, జగ్గపా, చెలువరాజ్, వినయ్ బిడప్ప, భరత్ సాగర్, ప్రసన్న, సంజీవ్, కురి ప్రతాప్, లాస్య నాగరాజ్
దర్శకుడు : ఎ. హర్ష
నిర్మాతలు: గీతా శివరాజ్‌కుమార్, జీ స్టూడియోస్
సంగీత దర్శకులు: అర్జున్ జన్య
సినిమాటోగ్రఫీ: స్వామి జె. గౌడ
ఎడిటర్: దీపు ఎస్. కుమార్
సంబంధిత లింక్స్: ట్రైలర్
కన్నడ స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ 125వ సినిమా వేద తెలుగు డబ్బింగ్ వెర్షన్ తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ బజ్ తో థియేటర్ల లో విడుదల అయిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్ష లోకి వెళ్లి చూద్దాం.
కథ:
వేద (శివ రాజ్‌కుమార్) మరియు అతని కుమార్తె కనక (అదితి సాగర్) వరుస హత్యలు చేస్తూ ఉన్నారు. తమ సంతోషకరమైన కుటుంబానికి భంగం కలిగించిన వ్యక్తులను కిరాతకంగా చంపడానికి వారు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళతారు. ఆ వ్యక్తులు ఎవరు? వారు వేద కుటుంబాన్ని ఏమి చేసారు? తరువాత ఏం జరిగింది? వేద మరియు అతని కుటుంబం వెనుక కథ ఏమిటి? వేద భార్య పుష్ప (గనవి లక్ష్మణ్) కి ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
కథ అంత గొప్పగా ఏమీ లేదు. కానీ, కథనం మాత్రం చాలా ఎంగేజింగ్‌గా ఉంది. దర్శకుడు తను చెప్పదలచుకున్న విషయాన్ని చాలా నీట్ గా నేరేట్ చేశాడు. యాక్షన్ సన్నివేశాలు మరియు స్లో మోషన్ షాట్‌లు విజువల్‌గా అద్భుతంగా ఉన్నాయి. అద్భుతమైన సినిమాటోగ్రఫీ మరియు ఆసక్తికరమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సన్నివేశాలు చాలా బాగున్నాయి.
సినిమాలో ప్రధాన నటీనటుల పెర్ఫార్మెన్స్ లు బాగున్నాయి. స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ నటన చాలా బాగుంది. అలాగే కనక పాత్రలో అదితి సాగర్ అద్భుతంగా నటించింది. పగ తీర్చుకునే కూతురిగా ఆమె నటన అసాధారణంగా ఉంది. ఆమెకు కొన్ని డైలాగులు మాత్రమే ఉన్నాయి, అది కూడా క్లైమాక్స్‌లో. అయితే సినిమా చూడడానికి ఆమె అద్భుతమైన నటన ఒక కారణం అని చెప్పాలి.
గనవి లక్ష్మణ్ పోషించిన పుష్ప పాత్ర చాలా బాగుంది. ఆమె పాత్ర చాలా పరిమితమైనప్పటికీ, ఆమె సన్నివేశాలు సినిమాలో కీలక పాత్ర పోషించాయి. ముఖ్యంగా ఫైట్ సీన్స్ లో తనను చూపించిన విధానం చాలా బాగుంది. చిత్రంలోని మిగిలిన పాత్రలు పర్వాలేదు. వారు తమ పాత్రలకి తగు న్యాయం చేశారు. సినిమాలో డబ్బింగ్ వర్క్ నీట్ గా బాగుంది.
మైనస్ పాయింట్స్:
పైన చెప్పినట్లుగా, కథ తెలిసినట్లు గా ఉంది. ప్రేక్షకులు చాలా ఓల్డ్ మూవీస్ లో ఈ రకమైన కథనాన్ని చూశారు. కానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం మాత్రం సినిమాని ఆసక్తికరంగా మార్చింది. స్క్రీన్‌ప్లే చాలా చోట్ల డల్‌గా ఉంది. దర్శకుడు దానిపై శ్రద్ద వహించి ఉంటే బాగుండేది. స్క్రీన్‌ప్లే బాగుంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
రెండు భాగాల్లో కూడా కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది. కొన్ని సన్నివేశాలు కథకు అడ్డంకిగా మారాయి. సరైన స్క్రీన్‌ప్లే తో ఆకట్టుకొనే ప్రయత్నం డైరెక్టర్ చేసి ఉండవచ్చు. యాక్షన్ సన్నివేశాలు చాలా హింసాత్మకంగా ఉన్నాయి. అయితే కొన్ని ఇబ్బంది కలిగించే సన్నివేశాలను బ్లర్ చేసినందుకు సెన్సార్ బోర్డుకి థాంక్స్ చెప్పాలి.
సాంకేతిక విభాగం:
మేకప్ ఆర్టిస్టుల పని తీరు తప్పకుండా మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. వారు నటీనటులను చాలా రియలిస్టక్ గా, పల్లెటూరి వారి లాగా కనిపించేలా చేసారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్ వర్క్ చాలా బాగుంది. 1960 మరియు 1980లలో ఉన్న ప్రాపర్టీలను రీ క్రియేట్ చేయడం ద్వారా అద్భుతమైన పని చేశారు.
మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ తమ బెస్ట్ అందించడానికి చాలా కష్ట పడ్డారు. సినిమాకి మంచి అనుభూతిని అందించడం లో వీరి పాత్ర కీ రోల్ ప్లే చేసింది. అర్జున్ జన్య, స్వామిగౌడ్ లు బెస్ట్ అవుట్ పుట్ అందించి సినిమాను భుజానకెత్తుకున్నారు. తెలుగు డబ్బింగ్ కూడా చక్కగా ఉంది. డైరెక్టర్ స్క్రీన్ ప్లే పై ఎక్కువ దృష్టి పెట్టాల్సి ఉంది. అంతేకాక రన్‌టైమ్ కాస్త తక్కువగా ఉంటే సినిమా మరింత ఆకట్టుకునేది. దీపు ఎడిటింగ్ ఇంకాస్త బాగుండేది.
తీర్పు:
మొత్తం మీద, శివ రాజ్‌కుమార్ యొక్క వేద చిత్రం చాలా స్లో గా సాగుతూ ఆకట్టుకుంది. ఈ రివెంజ్ డ్రామాలో ప్రధాన నటీనటుల పెర్ఫార్మెన్స్ లు బాగున్నాయి. సినిమా రన్ టైమ్ మరియు అక్కడక్కడ కొన్ని అనవసర సన్నివేశాలు మినహాయిస్తే ఈ వీకెండ్ లో సినిమాను చూడవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team