విడుదల తేదీ : ఏప్రిల్ 23, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు : అరవింద్ కృష్ణ, శ్రీజిత గోష్, విశాల్ రాజ్, సంజీవ్, ఈషా శెట్టి, జస్ ప్రీత్, పూజ, చాందినీ, కమలాకర్, రుద్ర తదితరులు
దర్శకత్వం : సుకు పుర్వజ్
నిర్మాతలు : అయ్యన్న నాయుడు నల్ల, తేజ్ పల్లె
సంగీతం : ఆశీర్వాద్
సినిమాటోగ్రఫీ : జగదీశ్ బొమ్మిశెట్టి
రచన : సుకు పుర్వజ్
కథ :
విల్లీ (అరవింద్ కృష్ణ ), రియా (శ్రీజితా ఘోష్ ) ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. బిజినెస్ లో లాస్ అయిన విల్లీ, రియాతో కలిసి వైజాగ్ వచ్చి అక్కడ తమ లైఫ్ ప్రారంభించి అక్కడ హ్యాపీగా ఉంటారు. అయితే వైజాగ్ లో అప్పటికే ఓ దోపిడి దొంగ ముఠా ఊరికి దూరంగా ఉండే బంగ్లాలను రిక్కీ చేసి, అందులో వ్యక్తులను దోచుకోవడం, చంపేయడం చేస్తుంటుంది. ఈ క్రమంలో విల్లీ రియా బర్త్ డే పార్టీని ఏర్పాటు చేస్తాడు. ఆ పార్టీకి రియా కజిన్ తో పాటు ఫ్రెండ్స్ కూడా వస్తారు. కాగా ఆ పార్టీలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనల కారణంగా ఆ ఇంట్లో మూడు హత్యలు జరుగుతాయి. అసలు ఆ రాత్రి ఆ పార్టీలో ఏమి జరిగింది ? ఆ హత్యలు చేసింది ? దోపిడి దొంగల ముఠాకు ఈ హత్యలతో ఏమైనా సంబంధం ఉందా? అసలు వాళ్ళు విల్లీ ఇంటినే ఎందుకు టార్గెట్ చేసారు ? చివరకు ఈ హత్యల కేస్ ఎలా క్లోజ్ అయ్యింది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో హీరోగా నటించిన అరవింద్ కృష్ణ తన డైలాగ్ డెలివరీ, తన బాడీ లాంగ్వేజ్ తో అలాగే, కొన్నిఎమోషనల్ అండ్ సప్సెన్స్ సీక్వెన్స్ స్ లో చాలా బాగా నటించాడు. ముఖ్యంగా మర్డర్స్ జరిగిన తర్వాత వచ్చే సన్నివేశాల్లో అతని నటన చాల బాగుంది. ఇక హీరోయిన్ గా నటించిన శ్రీజితా తన క్యూట్ అండ్ హాట్ లుక్స్ లో అందంగా కనిపిస్తూ ఆకట్టుకుంది. మెయిన్ గా హీరోతో వచ్చే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయి మరీ నటించింది.
అలాగే హీరో ఫ్రెండ్, పోలీస్ క్యారెక్టర్స్ చేసిన వారు సైతం కథకు తగ్గట్టుగా సరిగ్గా సరిపోయారు. అలాగే ఈ సినిమాలోనే కీలక పాత్రలో నటించిన మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు. ఇక ఆర్టిస్టుల నుండి కావాల్సిన నటనను దర్శకుడు బాగా రాబట్టుకున్నాడు. సినిమాటోగ్రాఫర్ జగదీశ్ బొమ్మిశెట్టి ఈసినిమాకు బాగా ప్లస్ అయ్యాడు. మంచి లైటింగ్ తో సీన్స్ మూడ్ కి తగ్గట్టు చాల బాగా తీశాడు.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు సుకు పుర్వజ్ మంచి కాన్సెప్ట్ తీసుకున్నాడు. అయితే ఇలాంటి కాన్సెప్ట్ తీసుకున్నపుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సినిమాని ఆద్యంతం ఉత్కంఠ రేకెత్తిస్తూ రక్తి కట్టేలా స్క్రీన్ ప్లే సాగాలి, కానీ ఈ సినిమాలో స్క్రీన్ ప్లే ఆ స్థాయిలో సాగదు. కథలో మెయిన్ ప్లాట్ పాయింట్ తరువాత వచ్చే కాన్ ఫిల్ట్ అలాగే సెకెండ్ హాఫ్ లో వచ్చే మెయిన్ సస్పెన్స్ సీన్స్ లో కొన్ని చోట్ల లాజిక్ మిస్ అయింది. పైగా హత్యల చుట్టే మెయిన్ ప్లాట్ సాగడం, సినిమాలో ఇంట్రస్టింగ్ మిస్ అవ్వడం సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.
దానికితోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఫేక్ గా అనిపిస్తాయి. దర్శకుడు సెకెండాఫ్ ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఇంట్రస్ట్ గా నడుపుదామని మంచి ప్రయత్నం అయితే చేశారు గాని, అది స్క్రీన్ మీద అంత ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు. దీనికి తోడు మెయిన్ గా సినిమాలో హీరో హీరోయిన్ల క్యారెక్టైజేషన్స్ కూడా బలహీనమైన ఎమోషన్ కి లోబడి బలహీనంగా సాగడం కూడా సినిమా రిజల్ట్ ను ఎఫెక్ట్ చేసింది.
సాంకేతిక విభాగం :
టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ బాగానే ఉంది. ముఖ్యంగా నేపథ్య సంగీతం సినిమాకు బాగా ప్లస్ ఆయింది. ఆశీర్వాద్ సంగీతంతో సన్నివేశాలకు మంచి ప్రాణం పోశాడు. అదే విధంగా సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ వర్క్ సినిమాకి తగ్గట్లు ఉంది. సినిమాలోని నిర్మాతలు అయ్యన్న నాయుడు, తేజ పల్లె పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. ఇక దర్శకుడు సుకు పూర్వజ్ మంచి కథాంశం తీసుకున్నా ఉత్కంఠభరితమైన కథనాన్ని రాసుకోలేదు.
తీర్పు :
‘శుక్ర’ అంటూ వచ్చిన ఈ చిత్రం కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో, ఫ్యూ బోల్డ్ సీన్స్ తో కొన్ని చోట్ల పర్వాలేదనిపిస్తోంది. అలాగే హీరోహీరోయిన్ల మధ్య ట్రాక్ కూడా బాగానే ఉంది. అయితే, ఇంట్రస్టింగ్ గా సాగని ట్రీట్మెంట్ తో పాటు మెయిన్ క్యారెక్టైజేషన్స్ బలహీనంగా ఉండటం, పైగా సినిమాలో సీన్ కి సీన్ కి మధ్య సస్పెన్స్ పెంచే విధంగా ప్లే లేకపోవడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఓవరాల్ గా థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమాలోని కొన్ని అంశాలు ఆకట్టుకుంటాయి.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team