సమీక్ష : ‘సింగం 123’ – సంపూ స్టైల్ స్పూఫ్ కామెడీ..!

andhra-pori

విడుదల తేదీ : 5 జూన్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : అక్షత్ అజయ్ శర్మ

నిర్మాత : మంచు విష్ణు

సంగీతం : శషు కె.ఎమ్.ఆర్.

నటీనటులు : సంపూర్ణేష్ బాబు, సనమ్..

మోహన్ బాబు తనయుడు, హీరో మంచు విష్ణు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై నిర్మించిన ఔట్ అండ్ ఔట్ స్పూఫ్ కామెడీ సినిమా ‘సింగం 123’. ‘సింగం 123’ సినిమాకు విష్ణు స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించిన విషయం తెలిసిందే. బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సంపూ మార్క్ స్పూఫ్ కామెడీ ఏ మేరకు నవ్వులు పూయించింది? అన్నది ఇప్పుడు చూద్దాం…

కథ :

సింగం (సంపూర్ణేష్ బాబు) అన్యాయాన్ని సహించని ఓ పవర్ఫుల్ పోలీసాఫీసర్. సింగరాయకొండ అనే ఊర్లో లింగం (భవాని) సారా వ్యాపారం చేస్తూ, దొంగనోట్లు ముద్రిస్తూ ఇలా పలు అక్రమాలకు పాల్పడుతూ అడ్డొచ్చే వారిని చంపేసే రౌడీ. లింగం ఆగడాలకు చెక్ పెట్టడం సింగం లాంటి పవర్ఫుల్ పోలీస్ వల్లే సాధ్యమని అతడిని అక్కడికి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఇదే సమయంలో సంపూర్ణేష్ బాబు సింగరాయకొండతో తనకున్న అనుబంధం గురించి తెలుసుకుంటాడు.

సింగరాయకొండలో సింగం తన స్టైల్లో రౌడీలకు బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలోనే సింగం పోలీస్ కాదనే ఒక విషయం విలన్‌కి తెలుస్తుంది. నిజంగానే సింగం పోలీస్ కాదా? విలన్ ‘లింగం’కు, సింగంతో ఉన్న పగ ఏంటీ? అనే ప్రశ్నలకు సమాధానమే సింగం 123 కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్‌పాయింట్స్ అంటే.. సంపూర్ణేష్ బాబు, స్పూఫ్ కామెడీ అనే కాన్సెప్ట్ ఈ రెండింటి గురించి చెప్పుకోవాలి. ఓ మంచి కామెడీ సినిమా తెరకెక్కించడనమేది ఎంతో కష్టమైన పని. ఇక అంతకు ముందు వచ్చిన సినిమాలను స్పూఫ్ చేస్తూ కామెడీ పండించడనమనేదైతే అంత ఆషామాషి వ్యవహారం కాదు. ఏమాత్రం తేడా వచ్చినా, సినిమా బోర్ కొట్టిస్తుంది. అయితే ఈ సినిమాలో ఓ పక్కా ప్లాన్ ప్రకారం రాసుకున్న స్క్రీన్‌ప్లే వల్ల స్పూఫ్ కామెడీ బాగా పండింది. ఓ ఫక్తు కమర్షియల్ సినిమాలకు అల్లినట్టుగానే ఈ సినిమాకు సన్నివేశాలు అల్లుకోవడం కలిసొచ్చింది.

సంపూర్ణేష్ బాబు సింగంగా ఆద్యాంతం కట్టిపడేస్తాడు. వరుసగా అతను చెప్పుకుంటూ పోయే డైలాగులు, చిలిపి ఎక్స్‌ప్రెషన్స్, సంపూ మార్క్ యాక్టింగ్ ఈ సినిమాకు బాగా ఉపయోగపడ్డాయి. ఇక హీరోయిన్‌గా నటించిన సనమ్ కనిపించే కొన్ని సన్నివేశాల్లో అయినా హీరో పాత్రను ఎలివేట్ చేసే పాత్రలో ఆమె బాగానే నటించింది. విలన్‌గా నటించిన భవాని, సంపూర్ణేష్ బాబుకు సరిజోడిగా బాగా చేశాడు. పృధ్వీ రాజ్ నటన చాలా చోట్ల నవ్వులు పూయిస్తుంది.

సినిమా పరంగా చూసుకుంటే.. హీరో ఎస్టాబ్లిషింగ్ సన్నివేశాలు, హీరోను కథలోకి తీసుకెళ్ళే సన్నివేశాలు, సంపూ మార్క్ డైలాగులతో ఫస్టాఫ్ మంచి కామెడీతో సాగిపోతుంది. సెకండాఫ్‌లో ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు బాగా ఆకట్టుకుంటాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో మైనస్ పాయింట్స్ అంటే కథలో ఎక్కడా లాజిక్స్ లేకపోవడం గురించి చెప్పుకోవాలి. అదేవిధంగా ఫార్ములా తరహాలో కథ రూపొందించడం మరో మైనస్. స్క్రీన్‌ప్లేతో ఆ మైనస్‌ కవర్ అయినా, ఇదే తరహా కాన్సెప్ట్‌తో, ఇంతే రేంజ్ స్పూఫ్ కామెడీతో, వేరే ఫార్ములా కాని కథేదైనా తెరకెక్కించి ఉంటే ఈ సినిమా ఇంకా ఎక్కడో ఉండేది.

హీరోయిన్ పాత్ర అప్పుడప్పుడు మాత్రమే రావడం మరో మైనస్‌గా చెప్పుకోవచ్చు. హీరోయిన్‌తో సంపూర్ణేష్ బాబు చేసే చిలిపి రొమాన్స్ తరహా సన్నివేశాలు ఇంకొన్ని ఉండి ఉంటే మరింత కామెడీ పండేది. ఓ మంచి ఫస్టాఫ్ తర్వాత సెకండాఫ్‌లో సినిమా కొన్ని చోట్ల మందగిస్తుంది. ఆ విషయంలో మరికొంత జాగ్రత్త తీసుకొని ఉంటే బాగుండేది.

సాంకేతిక విభాగం :

సాంకేతికంగా ఈ సినిమా చాలా రిచ్‌గా ఉంది. ముందుగా కథ, స్క్రీన్‌ప్లేల గురించి చెప్పుకుంటే.. మంచు విష్ణు మొదటిసారి కథ, స్క్రీన్‌ప్లే రాయడం విశేషం కాగా, ఇక్కడా ఆయన తన మార్క్ చూపేలా స్క్రీన్‌ప్లే రాశాడు. ఫార్ములా కథే అయినా కూడా, స్క్రీన్‌ప్లే విషయంలో మాత్రం విష్ణు బాగా ఆకట్టుకుంటాడు. స్పూఫ్ కామెడీ అనే క్లిష్టమైన కాన్సెప్ట్‌ను సరిగ్గా అల్లుకుంటూ పోయిన సన్నివేశాల ద్వారా బాగా కనెక్ట్ చేయగలిగారు.

ఇక విష్ణు అందించిన స్క్రిప్ట్‌కు డైమండ్ రత్నం డైలాగులు మరింత బలాన్నిచ్చాయి. ఓ స్పూఫ్ కామెడీకి అవసరమైన పకడ్బందీ స్క్రిప్ట్‌తో దర్శకుడు అక్షత్ శర్మ సినిమాను చాలా బాగా తెరకెక్కించాడు. దర్శకుడిగా తన ప్రతిభ నిరూపించుకునే సన్నివేశాల్లో బాగా ఆకట్టుకున్నాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ ఫర్వాలేదు. సంగీతం కూడా ఓ స్పూఫ్ కామెడీకి అవసరమయ్యే మూడ్‌ని క్రియేట్ చేయడంలో బాగా ఉపయోగపడింది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి. ఓ చిన్న బడ్జెట్‌లో తీసిన సినిమాలో ఇంతటి ప్రొడక్ష ఔట్‌పుట్ చూపడం ఆకట్టుకుంటుంది.

తీర్పు :

మంచు విష్ణు స్క్రిప్ట్ అందించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించి తీసిన స్పూఫ్ కామెడీ ‘సింగం 123’. సంపూర్ణేష్ బాబును ఈ సినిమాకు మేజర్ అట్రాక్షన్‌గా చెప్పుకోవచ్చు. సరదా సరదాగా సాగిపోయే సన్నివేశాలు, ఆద్యంతం నవ్విస్తూ ఉండే స్పూఫ్ కామెడీ, ఫన్నీ ఫైట్లు లాంటివన్నీ కలిపి ‘సింగం 123’ సినిమాను ఔట్ అండ్ ఔట్ స్పూఫ్ కామెడీగా నిలబెట్టాయ్. ఫార్ములా కథ, లాజిక్ లేని సన్నివేశాలు ఈ సినిమాకు ప్రతికూల అంశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే.. సినిమా ద్వారా వినోదం కోరుకునే వారు, లాజిక్‌లను పక్కన పెట్టి స్పూఫ్ కామెడీని ఎంజాయ్ చేయగలిగిన వారు, సినిమా ఓ రెండు గంటల పాటు నవ్వులు పంచితే ఫార్ములా కథైనా చాలని కోరుకునే వారు ‘సింగం 123’ సినిమాను బాగా ఎంజాయ్ చేయొచ్చు!

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version