సమీక్ష : సీతారామం – అద్భుతమైన ప్రేమ కావ్యం

Sita Ramam Movie Review

విడుదల తేదీ : ఆగష్టు 05, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.5/5

నటీనటులు: దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న, సుమంత్, భూమిక, మురళి శర్మ, తరుణ్ భాస్కర్

దర్శకత్వం : హను రాఘవపూడి

నిర్మాత: అశ్వినిదత్

సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్

సినిమాటోగ్రఫీ: పీఎస్ వినోద్, శ్రేయాస్ కృష్ణ

ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వర రావు

దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరో,హీరోయిన్స్ గా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సీతారామం. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించిన ఈ మూవీని వైజయంతి మూవీస్ సంస్థ ఎంతో భారీ స్థాయిలో నిర్మించగా రష్మిక మందన్న కీలక రోల్ లో నటించింది. ఇక అందరిలో భారీ అంచనాలు ఏర్పరిచిన సీతారామం మూవీ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ మూవీ కథ, కథనాలు, రివ్యూ ఇప్పుడు చూద్దాం.

 

కథ :

అఫ్రీన్ (రష్మిక మందన్న) లండన్ లోని ఒక ప్రముఖ యూనివర్సిటీ విద్యార్థి యూనియన్ లీడర్. అయితే తన తాతయ్య వీలునామా ప్రకారం సీతామహాలక్ష్మి అనే యువతికి లెఫ్టినెంట్ రామ్ అనే యువకుడు రాసిన ఉత్తరాన్ని ఉత్తరాన్ని అందించాలి. నిజానికి ఆ బాధ్యత తనకు ఇష్టంలేనప్పటికీ ఆస్తిలోని భాగం కోసం ఆమె ఆ పని జరుగుతుంది. మరి ఇంతకీ ఈ సీతామాలక్ష్మి ఎవరు, లెఫ్టినెంట్ రామ్ ఎవరు. వారిద్దరి మధ్య ఏమి జరిగింది. వారిద్దరితో తన తాతయ్యకి సంబంధం ఏమిటి అనే అంశాలు అన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్ :

మలయాళంలో అనేక సూపర్ హిట్ సినిమాల్లో తన అత్యద్భుత పెర్ఫార్మన్స్ తో అందరినీ ఆకట్టుకున్న దుల్కర్ సల్మాన్ సీతారామంలోని లెఫ్టినెంట్ రామ్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసారు అనే చెప్పాలి. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో ఆయన యాక్టింగ్ హృదయానికి హత్తుకుంటుంది. ఆ విధంగా తన పాత్రలో ఒదిగిపోయారు దుల్కర్.

 

సినిమాలో హీరోయిన్ గా నటించిన మృణాల్ ఠాకూర్ కూడా సూపర్ గా పెర్ఫర్మ్ చేసారు. తెలుగులో ఆమెకు ఇది ఫస్ట్ మూవీ. ఇక ఆమె తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశారనే చెప్పాలి. అలానే ఆమెకు కెరీర్ పరంగా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పవచ్చు.

 

హీరో, హీరోయిన్స్ ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ ట్రాక్ ఎంతో బాగుంది. కొన్ని సన్నివేశాల్లో ఇద్దరూ కూడా ఒకరిని మించేలా మరొకరు అద్త్బుతంగా పెర్ఫర్మ్ చేసారు. అలానే ఈ మూవీకి మరొక ప్లస్ అలరించే సాంగ్స్, మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్.

 

సినిమాలో అనేక పాత్రలు ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్క పాత్రని అద్భుతంగా దర్శకుడు హను మలిచిన తీరు ఎంతో గొప్పది. ముఖ్యంగా మూవీలో రష్మిక, సుమంత్ ల పాత్రలు ఎంతో కీలకం. సుమంత్ అయితే కొన్ని సీన్స్ లో ఎంతో అద్భుతంగా నటించారు. తొలిసారిగా ఆయన చేసిన ఇందులోని విష్ణు శర్మ పాత్ర మరింతగా పేరు తెచ్చిపెడుతుంది. ఇది లవ్ ఎమోషనల్ స్టోరీ అయినప్పటికీ అక్కడక్కడా వచ్చే కొన్ని ట్విస్ట్స్ ఆడియన్స్ ని సినిమాపై మరింత ఇంట్రెస్ట్ ఏర్పరిచేలా చేస్తాయి.

 

సినిమాల్లో కొన్ని సీన్స్, డైలాగ్స్ అయితే మనసుకి హత్తుకుంటాయి. చిన్న డైలాగ్స్ అయినప్పటికీ అవి మనపై మంచి ఇంపాక్ట్ ని కలిగిస్తాయి. సెకండ్ హాఫ్ అయితే అద్భుతంగా ఉంది, ఆ విధంగా కథని దర్శకుడు హను ఆకట్టుకునేలా ముందుకు నడిపారు. ఇక వార్ సన్నివేశాలు కూడా ఎంతో బాగున్నాయి. ఆ విధంగా ఈ కథని ఆడియన్స్ కి ఎంగేజ్ చేసేలా సూపర్ గా రాసుకుని దానిని స్క్రీన్ పై ప్రెజెంట్ చేసారు దర్శకుడు హను.

 

మైనస్ పాయింట్స్ :

సినిమాలో ఫస్ట్ హాఫ్ ఒకింత అక్కడక్కడా సాగదీసినట్లు అనిపిస్తుంది. తీసుకున్న కథలోని మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి చాలానే టైం పడుతుంది. అలానే మూవీ యొక్క ఎడిటింగ్ విభాగం వారు ఫస్ట్ హాఫ్ విషయంలో మరింతగా శ్రద్ధ తీసుకుని ఉంటె బాగుండేదనిపిస్తుంది.

 

సినిమాలో ప్రధానంగా కథలో మిళితమైన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది తప్ప ప్రత్యేకంగా కామెడీ సీన్స్ అయితే లేవు. అది బాగున్నప్పటికే వాటిని ఆడియన్స్ కి మరింతగా రెఫ్రెషింగ్ ఫీల్ ఇచేలా రాసుకోవాల్సింది. ఇక సినిమాలో ఒకటి రెండు క్యారెక్టర్స్ అయితే 20 ఏళ్ళు గడిచినప్పటికీ కూడా ఒకేలా ఉండడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది

 

సినిమాలో సాంగ్స్ చాలా ఫాస్ట్ గా అలా వచ్చి ఇలా వెళ్లిపోయినట్లు ఉంటాయి,అలానే అవి ఒకింత కథను ఇబ్బంది పెట్టేవిగా అనిపిస్తుంటాయి. అలానే మాస్ అంశాలు కోరుకునే వారికి ఈ మూవీ పెద్దగా నచ్చదు, అలానే సినిమా లెంగ్త్ పరంగా కొంత ఎక్కువ అనే చెప్పాలి.

 

సాంకేతిక విభాగం :

సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ గురించి ఎంత చెప్పినా తక్కువే అనాలి. ముఖ్యంగా ప్రతి చిన్న పాత్రని మూవీకి కనెక్ట్ చేయడంతో వారి వేషధారణ, ఆహార్యం విషయంలో టీమ్ తీసుకున్న శ్రద్ధ సూపర్. అలానే సినిమాలో పీఎస్ వినోద్, శ్రేయాస్ ల ఫొటోగ్రాఫి అదిరిపోయింది. చాలా సీన్స్ లో అద్భుతమైన విజువల్స్ ని బట్టి మూవీ యొక్క గ్రాండియర్ ని ఖర్చుని మనం తెలుసుకోవచ్చు. ఆ విధంగా నిర్మాణ విలువలు అదిరిపోయాయనే చెప్పాలి.

 

సినిమాలో ఫస్ట్ హాఫ్ లెంగ్త్ విషయంలో టీమ్ కొంత జాగ్రత్త తీసుకోవాల్సింది. సంగీత దర్శకడు అందించిన సాంగ్స్, బీజీఎమ్ ఆడియన్స్ కి మంచి ఫీల్ ని అందిస్తాయి. అలానే ఎడిటింగ్ వారు కూడా అక్కడక్కడా కొంత శ్రద్దా తీసుకోవాల్సింది. కెమెరా పనితనం, విజువల్స్ అయితే సూపర్.

 

గతంలో తన సినిమాల్లో సెకండ్ విషయమై కొంత తడబడే డైరెక్టర్ హను రాఘవపూడి, ఈ మూవీ యొక్క ప్రమోషన్స్ నుండి సెకండ్ హాఫ్ ని ఎంతో బాగా రాసుకుని తెరకెక్కించానని, అలానే ఆడియన్స్ ని అది ఆకట్టుకుంటుందని చెప్తూ వచ్చారు.

 

ఆయన చెప్పిన మాదిరిగా సెకండ్ హాఫ్ ఎంతో బాగుంది, అయితే ఫస్ట్ హాఫ్ కొంత సాగతీతగానే ఉంటుంది. ఇక ప్రతి ఒక్క సన్నివేశాన్ని ఆయన మలిచి కథకి లింక్ చేసిన తీరు, అలానే కథ కథనాల్ని ఆడియన్స్ మనసుకు హత్తుకునేలా అత్యద్భుతంగా ఆయన ఈ మూవీని తెరకెక్కించారు అనే చెప్పాలి.

 

తీర్పు :

మొత్తంగా సీతారామం సినిమా ఒక అద్భుతమైన ప్రేమ కావ్యం అనే చెప్పాలి. దర్శకుడు హను రాఘవపూడి మనసుపెట్టి ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన తీరు నిజంగా అమోఘం. హీరో, హీరోయిన్స్ తో పాటు సినిమాలోని కీలక పాత్రలు అన్ని కూడా ఎంతో బాగున్నాయి. అలానే సినిమా కథ, కథనాలు ఎక్కడా బోర్ లేకుండా కొనసాగడం, ఆకట్టుకునే సంగీతం, బీజీఎమ్, గ్రాండియర్ విజువల్స్, ఫోటోగ్రఫి ఈ మూవీకి ప్రధాన ఆకర్షణ. అయితే మాస్ అంశాలు, యాక్షన్ సీన్స్ కోరుకునే వారికి మాత్రం ఈ మూవీ పెద్దగా నచ్చకపోవచ్చు. ఫస్ట్ హాఫ్ పర్వాలేదనిపించిన సీతారామం సెకండ్ హాఫ్ అద్భుతంగా సాగుతూ ఆడియన్స్ కి ఓవరాల్ గా మంచి ఫీల్ ని తప్పకుండా అందిస్తుంది అని చెప్పవచ్చు.

123telugu.com Rating: 3.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :