విడుదల తేదీ : నవంబర్ 17, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకత్వం : మహేష్ ఉప్పుటూరి
నిర్మాత : శివ బాలాజీ
సంగీతం : సునీల్ కశ్యప్
నటీనటులు : శివ బాలాజీ, రాజీవ్ కనకాల
సినిమా బాగుంటే చాలు చిన్న సినిమా పెద్ద సినిమా తేడా లేకుండా థియేటర్స్ కు వచ్చి చూస్తున్నారు తెలుగు ప్రేక్షకులు . ఈ శుక్రవారం అరడజను పైగా సినిమాలు విడుదల అయ్యాయి అందులో ‘స్నేహమేరా జీవితం’ కూడా ఒకటి. శివబాలాజీ, రాజీవ్ కనకాల నటించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ :
మోహన్ (శివ బాలాజీ) మరియు చలపతి (రాజీవ్ కనకాల) మంచి మిత్రులు. మోహన్ ను చేరదీసి తన మంచి చెడ్డా చూసుకుంటూ ఉంటాడు చలపతి. ఎం.ఎల్.ఏ అవాలనే కోరికతో ఉండే చలపతి మోహన్ పై ఎవరయినా చెయ్యి వేస్తే ఊరుకోడు. ఇందిరా అనే అమ్మాయిని ప్రేమించిన మోహన్ అనుకోని పరిస్థితిలో చలపతిని అపార్థం చేసుకుంటాడు. ఇందిరా, మోహన్ ప్రేమ విజయం సాధించిందా ? చలపతి ఎం.ఎల్.ఏ అయ్యాడా ? అసలు చలపతి ని మోహన్ ఎందుకు అపార్థం చేసుకున్నాడు ? అన్నదే కథ.
ప్లస్ పాయింట్స్ :
స్నేహితులు కలిసి ఉండడం, వారిమధ్య విభేదాలు రావడం, విడిపోవడం నిజ జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఈ సన్నివేశాలు డైరెక్టర్ మహేష్ బాగా తీశాడు, కొన్ని సంభాషణలు బాగా రాసుకున్నాడు. ముఖ్యంగా ‘నీలాగా పగలు, రాత్రి.. పగ, ప్రతీకారం అంటూ తిరిగే టైప్ కాదు నేను, నాకు డబ్బు కావాలి. అది ఉంటే ఎన్ని పాపాలు చేసినా ఈ పెపంచకం సలామ్ కొట్టుద్ది…’ అని రాజీవ్ కనకాల చెప్పే డైలాగ్ బాగుంది. శివబాలాజీ తన ప్రేయసిని దక్కించుకోవడం చేసే చిన్న చిన్న పనులు ఆసక్తిగా ఉన్నాయి.
ఒక ప్రేమ జంటను కలపడానికి శివ బాలాజీ చేసే ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఎం.ఎల్.ఎ అవ్వాలనే కోరికతో ఉండే చలపతి పాత్రలో రాజీవ్ కనకాల నటన బాగుంది. అతని మాట తీరు, నటన, వేష ధారణ అన్నీ 1980 ల కాలానికి చెందినవిగానే ఉండి సినిమాకు పాతకాలపు వాతావరణాన్ని తెచ్చిపెట్టాయి.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో శివ బాలాజీ, రాజివ్ కనకాల చేసిన మోహన్, చలపతి పాత్రల్లో పెద్దగా డెప్త్ లేదు. వారి మధ్య స్నేహ బంధాన్ని పూర్తి స్థాయిలో ఎలివేట్ చేయడంలో దర్శకుడు విఫలం అయ్యాడనే చెప్పాలి. కొన్ని అనుకోని కారణాల వల్ల మోహన్ చలపతిని అనుమానించి ఊరు వదిలి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మోహన్ పాత్ర మాతమే కనిపిస్తుంది. చలపతి మనకు కనిపించడు. దీంతో స్నేహితులు ఎప్పుడు కలుస్తారు, ఎలా కలుస్తారు అన్న విషయాలు అర్థం కావు. అసలు చలపతి పాత్ర అంత వరుకేనా అనే అనుమానం కూడా కలుగుతుంది. చలపతి పాత్రకు కూడా ప్రాధాన్యం ఇచ్చి ఉంటే బాగుండేది.
మొదటి సగం సినిమా పాత్రల పరిచయాలకు పరిమితం అవడం తప్ప పెద్దగా కథ అనేది లేదు. రెండో సగంలో ఫ్రెండ్ ను అపార్థం చేసుకున్న సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కథలో మరో ప్రేమ జంటను కలిపేందుకు హీరో చేసే ప్రయత్నాలు బాగున్నా సినిమాకు అవి అవసరం లేదనిపిస్తుంది. సినిమా ఓపెనింగ్ షాట్ బాగానే ఉన్నా ఆ తర్వాత చాలా సేపటి వరకు సినిమా సాలు కథలోకి వెళ్ళకపోవడం నిరుత్సాహాన్ని కలిగిస్తుంది.
సాంకేతిక విభాగం:
డైరెక్టర్ మహేష్ ఎంచుకున్న కథ పాతది, దాని తెరమీద చూపించిన విధానం కూడా పాతగా ఉంది .మోహన్ చలపతి మద్య వచ్చే సన్నివేశాలను ఇంకా బాగా తీసి ఉండాల్సింది. సునీల్ కశ్యప్ సంగీతం పర్వాలేదు. పాటలు గొప్పగా లేనప్పటికీ నేపధ్య సంగీతం బాగుంది. కెమెరామెన్ ధరణి ఎనభైలో జరిగే కథగా సినిమాను అందంగా తీశాడు. మహేంద్ర నాథ్ ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు :
ఇద్దరు ఫ్రెండ్స్ విడిపోవడం, వారి మధ్య మనస్పర్థలు రావడం తిరిగి వారు కలుసుకోవడం అనే నేపథ్యంలో ఎన్నో సినిమాలు చూశాం. అయితే అలాంటి కథల్లో ప్రేక్షకుడు హృదయాన్ని టచ్ చేస్తూ సాగేలా సీన్లు ఉండాలి. కానీ ఇందులో డైరెక్టర్ రాసుకున్న సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి. పైగా కథకు అవసరంలేని ట్రాక్స్ తో సినిమాను పక్కదారి పట్టించారు. మొత్తం మీద పాత తరహా కథల్ని, నెమ్మదైన కథను ఇష్టపడేవారు ఈ సినిమాను ట్రై చేయవచ్చు కానీ మిగతావారు టీవీల్లో వేశాక చూడొచ్చు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team