హిందీలో అమీర్ ఖాన్ నటించి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘3 ఇడియట్స్’ చిత్రాన్ని అగ్ర దర్శకుడు శంకర్ తమిళ్లో ‘నన్బన్’ పేరుతో రిమేక్ చేసారు. ఇప్పుడు అదే చిత్రాన్ని తెలుగులో ‘స్నేహితుడు’ పేరుతో దిల్ రాజు ఆంధ్రప్రదేశ్లో విడుదల చేసారు. విజయ్, జీవా, శ్రీరామ్ మరియు ఇలియానా ముఖ్య పాత్రల్లో నటించారు. హారిస్ జైరాజ్ సంగీతం అందించారు. ఈ చిత్రం ఈ రోజే విడుదలవగా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
కథ:
పంచబట్ల సారంగపాణి అలియాస్ పాణి (విజయ్), వెంకట్ రామకృష్ణ (శ్రీరామ్) మరియు శనక్కాయల రవి (జీవా) ఐడియల్ ఇంజినీరింగ్ కాలేజ్ లో వీరు ముగ్గురు రూం మేట్స్. వీరు ముగ్గురు ప్రాణస్నేహితులు కాని వారి అలవాట్లు మరియు ప్రతిభ వేరేలా ఉంటాయి. పాణి ఆచారాల మీద నమ్మకం లేని విద్యార్ధి. మార్కుల మీద కంటే జ్ఞానం గొప్పదని నమ్ముతుంటాడు. అతను బాగా తెలివైన వాడు మరియు ప్రాక్టికల్ జోకర్. వెంకట్ బాగా ప్రతిభ ఉన్న వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ అతనికి ఇంజినీరింగ్ చదవటం ఇష్టం లేకపోయినా తన తల్లితండ్రుల కోసం చదువు కొనసాగిస్తుంటాడు. రవి మాత్రం ఆర్ధిక పరిస్థితి సరిగా లేని పేద కుటుంబం నుంచి వచ్చిన వాడు, మరియు భయస్తుడు. మంచి ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషించాలని అనుకుంటుంటాడు. పాణి తన స్నేహితులిద్ధరినీ ప్రోత్సహిస్తుంటాడు కాని పరీక్షల కోసం ఒత్తిడి తెచ్చోకోవద్దు అని చెబుతూ ఉంటాడు. అదే కాలేజ్ ప్రిన్సిపాల్ విరుపాక్షి సుందరం అలియాస్ వైరస్ (సత్యరాజ్). అతను కాలేజ్ లో పెట్టే నియమ నిబంధల వల్ల కొంచెం కామెడీ మరియు సెంటిమెంట్ సాగుతుంది. వైరస్ కూతురు రియా (ఇలియానా) మరియు పాణి ఇద్దరు ప్రేమలో పడతారు. వైరస్ ఈ ముగ్గురు స్నేహితుల్ని కాలేజ్ నుండి వెళ్ళగొట్టాలని నిర్ణయిస్తాడు. వైరస్ అలా ఎందుకు అనుకున్నాడు? వారిని కాలేజ్ నుండి వేల్లగోట్టాడా లేదా అనేది మిగతా చిత్ర కథ.
ప్లస్ పాయింట్స్:
వెంకట్ పాత్రలో శ్రీరామ్ చాలా బాగా నటించాడు. అతను చూడడానికి బావున్నాడు మరియు మంచి నటన కూడా ప్రదర్శించాడు. భయస్థుడైన రవి పాత్రలో జీవా కూడా బాగా నటించాడు. ఇలియానా చాలా అందంగా ఉంది మరియు ‘ఇలియానా’ పాటలో బెల్లీ డాన్సు తో ప్రేక్షకులను అలరించింది. స్ట్రిక్ట్ మరియు విపరీతమైన కోపంగల ప్రిన్సిపాల్ గా సత్యరాజ్ బాగా నటించారు. సైలెన్సర్ గా నటించిన సత్యన్ బాగా నవ్వించాడు. అతనికి ప్రముఖ కమెడియన్ సునీల్ డబ్బింగ్ చెప్పడం బాగా నవ్విస్తుంది. స్క్రిప్ట్ బలంగా ఉండటం సెంటిమెంట్ సన్నివేశాలు ప్రేక్షకుల మనస్సును తాకుతాయి. సెంటిమెంట్, కామెడీ, డ్రామా మరియు రొమాన్స్ అన్ని కలగలిపి దర్శకుడు బాగా తీసాడు. శ్రీరామ్ తన తల్లితండ్రులతో తన జీవితం గురించి తను ఏమవ్వలనుకున్నది చెప్పే సన్నివేశం చాలా బాగా తీసారు. సినిమా ఎక్కడా డౌన్ కాకపోవడం సినిమాకి ప్లస్సయింది.
మైనస్ పాయింట్స్:
విజయ్ నుండి ఇలాంటి నటన చూడడం ఆశ్చర్యకరంగా ఉంది. అతను తమిళ్లో పెద్ద స్టార్ హీరో అయ్యుండొచ్చు కాని తెలుగు ప్రేక్షకులు అతనిని మెయిన్ హీరోగా అంగీకరించడం కష్టమే. అతని నటన కూడా డల్ గా ఉండటం విశేషం. హిందీలో అమీర్ నటించిన పాత్రలో విజయ్ ని అంగీకరించడం కష్టమే. 3 ఇడియట్స్ చిత్రాన్ని అలాగే ఒక్క సన్నివేశం కూడా పొల్లు పోకుండా కార్బన్ కాపీలా తీసారు. ఆ సినిమాలో వాడిన మొబైల్ ఫోన్లు, కార్లు మరియు బట్టలు కూడా అచ్చం అలాంటివే ఉపయోగించారు. అగ్ర దర్శకుడు శంకర్ ఇలా చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంతకుముందే 3 ఇడియట్స్ చూసిన వారికి కొంత బోర్ కొట్టడం మాత్రం ఖాయం.
సాంకేతిక విభాగం:
సినిమాటోగ్రఫీ బావుంది. హారిస్ జైరాజ్ సంగీతం పర్వాలేదు. అబ్బూరి డైలాగులు బావున్నాయి. ఎడిటింగ్ పర్వాలేదు.
తీర్పు:
3 ఇడియట్స్ చూడకుండా కొత్తగా ఈ సినిమా చూసేవాళ్ళకి బాగా నచ్చుతుంది కానీ 3 ఇడియట్స్ చూసిన వారికి మాత్రం కచ్చితంగా బోర్ కొడుతుంది. ఇలియానా అందం, జీవా మరియు శ్రీరామ్ ల నటన కోసం తప్పక చూడండి. మరియు పతాక సన్నివేశాలు ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టిస్తాయి.
అశోక్ రెడ్డి. ఎమ్
123తెలుగు.కాం రేటింగ్: 3.25/5