సమీక్ష : స్పెక్టర్ – బాండ్.. ఓన్లీ యాక్షన్, నో రొమాన్స్!

Spectre review

విడుదల తేదీ : 20 నవంబర్ 2015

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : సామ్ మెండిస్

నిర్మాత : మైఖేల్ విల్సన్, బార్బరా

సంగీతం : థామస్ న్యూమన్

నటీనటులు : డానియల్ క్రెయిగ్, క్రిస్టోఫర్ వాల్డ్జ్, లీ సుడో

‘జేమ్స్‌ బాండ్’.. హాలీవుడ్ సినిమాలతో పరిచయమున్న ప్రేక్షకులకే కాకుండా, కేవలం తెలుగు సినిమాలనే చూసే ప్రేక్షకులకు కూడా బాగా పరిచయమున్న పేరు. జేమ్స్‌ బాండ్ క్యారెక్టర్ పేరుతో ఇప్పటివరకూ 23 సినిమాలు రాగా, ఇందులో చాలా సినిమాలు తెలుగులోనూ అనువాదమై ఇక్కడి ప్రేక్షకులనూ విపరీతంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సిరీస్‌లో 24వ సినిమా అయిన ‘స్పెక్టర్’. అమెరికా, ఇంగ్లాండ్‌‌లతో పాటు పలు ఇతర దేశాల్లో రెండు వారాల క్రితమే విడుదలైన ఈ సినిమా నేడు ఇండియాలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలైంది. మరి ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ బాండ్ ఎంతమేరకు ఆకట్టుకున్నాడూ? చూద్దాం..

కథ :

మెక్సికో సిటీలో ‘డే ఆఫ్ ది డెడ్’ పేరుతో జరుపుకునే వేడుకకు సంబంధించిన విజువల్స్‌తో స్పెక్టర్ కథ మొదలవుతుంది. జేమ్స్‌ బాండ్ సిరీస్‌లోని గత చిత్రమైన ‘స్కై ఫాల్’ సినిమాలో మరణించిన ఇంటిలిజెన్స్ సర్వీస్ సంస్థ హెడ్ ఇచ్చిన చివరి సందేశాన్ని అందుకొని జేమ్స్ బాండ్ (డానియల్ క్రెయిగ్) మెక్సికో వస్తాడు. అక్కడ టెర్రరిస్ట్ కార్యక్రమాల్లో భాగమైన ఇద్దరు వ్యక్తులపై దాడి చేసి ఒక బిల్డింగ్‌ను కూల్చేస్తాడు. కాగా బాండ్ లండన్ చేరాక మెక్సిలో అతడు చేసిన పనిని తప్పుపడుతూ బ్యూరో కొత్త బాస్, బాండ్‌ను సర్వీస్ నుండి తొలగిస్తాడు. ఇక ఆ తర్వాత బాండ్, మెక్సికోలో తన చేతుల్లో చనిపోయిన వ్యక్తికి సంబంధించిన సమాచారంతో రోమ్‌కి వెళతాడు.

రోమ్‌లో బాండ్‌కి స్పెక్టర్ పేరుతో నడిచే ఓ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ గురించి తెలుస్తుంది. స్పెక్టర్ ఆర్గనైజేషన్ కథ ఏంటి? దాని గురించి తెలుసుకోవడానికి బాండ్ ఏయే దేశాల్లో వివరాలను సంపాదించాడు? ఏమేం సాహసాలు చేసి బాండ్ స్పెక్టర్ సంస్థను నడిపే విలన్ ఫ్రాంజ్ (క్రిస్టోఫర్ వాల్డ్జ్)ను అంతమొందించాడు? ఫ్రాంజ్‌కి, బాండ్‌కి ఉన్న వ్యక్తిగత సంబంధం ఏంటి? లాంటి ప్రశ్నలకు సమాధానమే ‘స్పెక్టర్’ సినిమా.

ప్లస్ పాయింట్స్ :

స్పెక్టర్ సినిమాకు మేజర్ ప్లస్‌పాయింట్ అంటే కళ్ళు చెదరనివ్వని అద్భుతమైన విజువల్స్ గురించి చెప్పుకోవాలి. మెక్సికో సిటీ, రోమ్, ఆస్ట్రియా, లండన్ ఇలా పలు అద్భుతమైన లొకేషన్స్‌లో వచ్చే విజువల్స్ కనులవిందుగా ఉన్నాయి. ముఖ్యంగా మెక్సికో సిటీలో సినిమా మొదలవుతూనే సుమారు 4-5 నిమిషాల పాటు ఒక్క కట్ లేకుండా వచ్చే ఓపెనింగ్ షాట్ సినిమాకే మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు. ఈ షాట్‌కు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. ఇక బాండ్ సినిమా అంటే ఎప్పట్లానే కార్ చేజ్‌లు, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లకు కొదవ ఉండదు. స్పెక్టర్‌ కూడా ఈ విషయంలో ఏ లోటూ లేకుండా పలు కార్ చేజ్‌లు, యాక్షన్ సీక్వెన్స్‌లతో మెప్పిస్తుంది. ఇక హీరో, హీరోయిన్లు ఇద్దరూ కలిసి ‘స్పెక్టర్’ గురించి తెలుసుకునే క్రమంలో వచ్చే కొన్ని ఎమోషన్స్ చాలా బాగున్నాయి.

బాండ్ పాత్రలో ఇప్పటికే మూడు సార్లు ఆకట్టుకున్న డానియల్ క్రెయిగ్, నాలుగో సారీ అదే ఉత్సాహంతో దూసుకుపోయాడు. యాక్షన్ సన్నివేశాలతో పాటు పలు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ క్రెయిగ్ యాక్టింగ్ విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక క్రెయిగ్‌కు ఇదే చివరి బాండ్ సినిమా అన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన అభిమానులకు ఈ సినిమాను తప్పకచూడాల్సిన సినిమాగా చెప్పుకోవచ్చు. విలన్‌గా వాల్ట్జ్ అద్భుతంగా నటించాడు. అతడి క్యారెక్టర్‌కు ఇచ్చిన సిగ్నేచర్ స్మైల్ బాగుంది. ఇక హీరోయిన్ లీ సుడో పాత్రకు సినిమాలో మంచి ప్రాధాన్యమే ఉంది. ఆ పాత్రలో ఆమె బాగానే అలరించారు.

సినిమా పరంగా చూసుకుంటే మెక్సికో సిటీలో వచ్చే ఓపెనింగ్ సీన్స్, రోమ్‌, ఆస్ట్రియాల్లో యాక్షన్ సీక్వెన్స్, ప్రీ క్లైమాక్స్ వంటివి మేజర్ హైలైట్‌గా చెప్పుకోవచ్చు.

మైనస్ పాయింట్స్ :

‘స్పెక్టర్’ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే సాదాసీదా కథ, నత్తనడకన సాగే కథనం గురించి చెప్పుకోవచ్చు. కథలో ఎక్కడా కొత్తదనం లేకపోగా 146 నిమిషాల నిడివితో సినిమా కొన్నిసార్లు సహనానికి పరీక్ష పెడుతుంది. కొన్ని అవసరం లేని సన్నివేశాలనే స్లో నెరేషన్‌లో చెప్పడంతో కొన్నిచోట్ల విసుగుపుట్టుకొస్తుంది. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ చూడడానికి బాగున్నా, బాండ్ గత చిత్రాలతో పోల్చి చూస్తే మాత్రం తేలిపోయేలా ఉన్నాయి.

బాండ్ సినిమా అనగానే గుర్తొచ్చే రొమాన్స్‌కు ఈ సినిమాలో భారీ కత్తెర పడింది. బాండ్ అభిమానులు, రొమాన్స్ పార్ట్‌ను ఆశించి ఈ సినిమాకు వెళితే నిరాశ తప్పదు. దర్శకుడు సామ్ మెండిస్ స్కై ఫాల్ తరహాలోనే ఈ సినిమాలోనూ బాండ్ గతాన్ని గుర్తుచేసుకుంటూ వచ్చే సన్నివేశాలకు ప్రధాన్యతనిచ్చారు. ఆ సినిమాకు క్లిక్ అయిన ఈ ఫీట్ ఈ సినిమాలో మాత్రం బోర్ కొట్టించింది. ఇక ఒక దశలో బాండ్ రివెంజ్ డ్రామాగా సినిమాను మార్చేశారే! అన్న ఫీలింగ్ బాండ్ సినిమాకు ఉండే విశిష్టతను చెడగొట్టినట్లు కనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా కథ, కథనాలను పక్కనపెడితే జేమ్స్‌ బాండ్ సినిమాకు ఎక్కడా వంక పెట్టలేం. దర్శకుడు సామ్ మెండిస్ ఒక సాదాసీదా కథనే ఎంచుకొని, అందుకు బోరింగ్ స్క్రీన్‌ప్లేనే సిద్ధం చేయించినా, దర్శకుడిగా మాత్రం అద్భుతమైన ప్రతిభ కనబరిచాడు. విజువల్స్ పరంగా, షాట్ కంపొజిషన్ పరంగా, ఎమోషన్స్ కనెక్ట్ చేయడంలో దర్శకుడి పనితనం బాగుంది. అయితే తనదైన మార్క్ డైరెక్షన్‌కు సామ్, ఒక మంచి కథను జోడించి ఉంటే స్పెక్టర్ కథ వేరేలా ఉండేది.

‘స్కై ఫాల్’ సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌తో కట్టిపడేసిన న్యూమన్, ఈ సినిమాలోనూ అదే స్థాయిలో అలరించాడు. ఓపెనింగ్ షాట్‌తోనే సినిమాతో కనెక్ట్ చేయడంలో న్యూమన్ అద్భుతంగా రాణించాడు. ఇక సినిమాటోగ్రాఫర్ హోటే వన్ హ్యొటెమా గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమాలో కొన్ని బోరింగ్ సన్నివేశాలను కూడా కదలకుండా చూడగలమంటే అది సినిమాటోగ్రాఫర్ గొప్పదనంగానే చూడొచ్చు. లీ స్మిత్ ఎడిటింగ్ స్మూత్‌గా ఉంది. అయితే లెంగ్త్ విషయంలో మాత్రం జాగ్రత్త వహిస్తే బాగుండేది.

తీర్పు :

‘బాండ్.. జేమ్స్ బాండ్!’ ఈ ఒక్క డైలాగ్ చాలు.. జేమ్స్ బాండ్ అన్న క్యారెక్టర్, ఆ క్యారెక్టర్‌ను బేస్ చేసుకొని వచ్చిన సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పడానికి! ఆ సినిమాలకు సాధారణంగానే ఉండే క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొనే కళ్ళు తిప్పుకోనివ్వని విజువల్స్, భారీ యాక్షన్ సీన్స్, కార్ ఛేజ్‌లతో ఈ సిరీస్‍లో కొత్త సినిమా ‘స్పెక్టర్’ మనముందుకు వచ్చేసింది. బాండ్ సినిమాలో ఏమేం కోరుకుంటామో వాటినే హైలైట్ చేస్తూ వచ్చిన ఈ సినిమాలో ప్రేక్షకుడిని కూర్చోబెట్టేది కూడా ఈ అంశాలే! ఇకపోతే, ఒక బలమైన కథంటూ లేకపోవడం, స్లోగా సాగే కథనం, బాండ్ సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అయిన రొమాన్స్ తగ్గడం లాంటివి ఈ సినిమాకు మైనస్‌గా తయారయ్యాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. బాండ్ సినిమా.. బాండ్ సినిమా.. అంటూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న అభిమానులను ఓ రేంజ్‌లో కాకపోయినా ఓ మోస్తారుగానైనా అలరించే సినిమాగా స్పెక్టర్‌ను చెప్పుకోవచ్చు. డానియల్ క్రెయిగ్ అభిమానులు మాత్రం తప్పక చూడాల్సిన సినిమా.. స్పెక్టర్!

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version