సమీక్ష : జగద్గురు ఆదిశంకర – పెద్దలు మెచ్చే భక్తిరస చిత్రం

Adishankara విడుదల తేదీ : 15 ఆగష్టు 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకుడు : జె.కె భారవి
నిర్మాత : నారా జయ శ్రీ దేవి
సంగీతం : నాగ్ శ్రీ వత్స
నటీనటులు : కౌశిక్, నాగార్జున, మోహన్ బాబు తదితరులు

‘అన్నమయ్య’, ‘శ్రీ మంజునాధ’, ‘శ్రీ రామదాసు’, ‘పాండురంగడు’ వంటి భక్తిరసాత్మక సినిమాలకు కధను అందించిన జె.కె భారవి, కౌశిక్ ప్రధాన పాత్రలో నాగార్జున, మోహన్ బాబు, శ్రీహరి, సుమన్, సాయి కుమార్, తనికెళ్ళ భరణి, శ్రీ రామ్ చంద్ర, కామ్న జఠ్మలాని, కమిలిని ముఖర్జీ తదితరులు కధాప్రధానమైన పాత్రలతో ‘జగద్గురు ఆదిశంకర’ చిత్రం తీసి దర్శకుడిగా మారారు. అడపాదడపా వాయిదాపడుతూ వచ్చిన ఈ సినిమా స్వాతంత్రదినోత్సవ సందర్భంగా ఈరోజున విడుదలైంది. మరి ఆయన పంచిన భక్తిరసామృతం ప్రేక్షకులకు రుచించిందా లేదా అన్నది ఇకపై చదవండి..

కథ :

దాదాపు కొన్ని వేల సంవత్సరాల క్రితం పరమ భగవత్ స్వరూపమైన శ్రీ ఆదిశంకరాచార్యుల వారి గొప్పతనాన్ని వర్ణిస్తూ మెగా స్టార్ చిరంజీవిగారి గాత్రసహాయంతో సినిమా మొదలవుతుంది. పసితనం నుండే సన్యాసిగా మారాలనేది ఆదిశంకరాచార్యుల కోరిక. దీనికి శ్రీ చక్ర ఉపాసనతో అగ్ని దేవుడు(తనికెళ్ళ భరణి), ప్రతీ 8 సంవత్సరాలకు ఓ సారి తన ఆయుష్యును ఆ పసివాడికి అందించే ‘రుద్రాక్ష రుషి’గా మోహన్ బాబు, సకల విద్యలు నేర్పే పాత్రలో శ్రీహరి ఆదిశంకరాచార్యులకు సహాయపడుతుంటారు. అందరికీ మంచి చెడులు నేర్పే ఆదిశంకరాచార్యులకే మంచి చెడులు నేర్పే పాత్రలో నాగార్జున కనిపిస్తారు.

కులం, మతం అంటూ కొట్టుకుంటూ తిరుగుతున్న ప్రజలకు ప్రపంచమంతా శివోహమే అని చాటి చెప్పాలనుకునే యుక్త వయసు వచ్చిన ఆదిశంకరాచార్యులకు, ఎలాగైనా కాశిలోవుండే సర్వజ్ఞ పీఠం అధిరోహించాలనుకునే కపాల మార్ద్తాండ రాజు(సుమన్) కు మధ్య వైరం ఏర్పడుదుంది. అదే సమయంలో గంగాదేవి(మీనా) కోరిక మేరకు ఆదిశంకరాచార్యులు మదన మిశ్రుడు(సాయి కుమార్) అజ్ఞాన అంధకారాన్ని తొలగించడానికి పూనుకుంటాడు. అయితే అనుకోకుండా మదన మిశ్రుడి భార్య(కమిలిని ముఖర్జీ) కారణంగా ఆ కార్యాన్ని నిర్వర్తించలేని ఆదిశంకరాచార్యులు ఎటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు?? ఆ నిర్ణయానికి అమరేంద్ర రాజు(శ్రీ రామచంద్ర), అతని భార్య(కామ్న జఠ్మలాని)కు గల సంబంధం ఏమిటి? ఆ నిర్ణయం ద్వారా ఆఖరికి సర్వజ్ఞ పీఠాదిరోహరణ ఎవరికి దక్కింది అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

ఖచ్చితంగా ఈ సినిమాకు దర్శకుడు ఎంచుకున్న కథే ప్రధాన బలం. ఆద్యంతం అద్వైతం యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తూ అంతులేని కథను తెరకెక్కించడానికి భారవి కృషి మెచ్చుకోదగినది. కౌశిక్ ఆదిశంకరాచార్యుల పాత్రను తన భుజాలమీద ఆద్యంతం మోసాడు. ఆ పరమ శివుని అవతారమైన ఛండాలుని పాత్రలో నాగార్జున కనిపించింది కొన్ని నిముషాలే అయినా ఆ సన్నివేశాలు అద్భుతంగా పండాయి. పలు విద్యలు నేర్పే క్రమంలో శ్రీ హరి నటన, పతాక సన్నివేశంలో మోహన్ బాబు నటన ఆకట్టుకుంటాయి.

మొదటిసారిగా తెరపై కనిపించిన ఇండియన్ ఐడల్ శ్రీ రామచంద్రకు ప్రాధాన్యమున్న పాత్ర దక్కింది. కానీ నటన పరంగా అతను మెరుగు పరచుకోవాల్సింది చాలా ఉంది. సాయి కుమార్, కౌశిక్, కమిలిని మధ్య వచ్చే వాదనసభ సన్నివేశాలు నవ్వించడమేకాక, ఆడియన్స్ ని ఆలోచింపజేస్తాయి. ‘శ్రీ మంజునాధ’ సినిమాలో చిరంజీవి శివునిగా చేసిన తాండవాన్ని ఈ సినిమాలో కథకు తగ్గట్టుగా తెలివిగా వాడుకున్నారు. రోజా, మీనా, నాగబాబు తదితరులు పాత్ర అవసరం మేరకు మాత్రమే తెరమీద కనబడతారు. జెకె భారవి రాసుకున్న డైలాగ్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాలో ఎక్కడ పశువులు, పక్షులు, కొండలు, కోనలు కనిపించినా అవి గ్రాఫిక్స్ రూపంలో తెరకెక్కించారు. కాకపోతే ఆ గ్రాఫిక్స్ స్థాయికి తగ్గట్టుగా లేవు. దీనివల్ల సీన్ కి సీన్ కి మధ్య లింక్ సరిగా కుదరలేదు. చాలామంది జూనియర్ ఆర్టిస్ట్లు ఎక్కవగా ఉండడం వలన సినిమా ఫీల్ కాస్త కొన్ని చోట్ల డ్రామా ఫీల్ గా మారుతుంది.

ఒక్క నాగార్జున కాస్ట్యూమ్స్ తప్ప మిగిలిన వారి వస్త్రాలంకరణపై మరింత శ్రద్ధపెడితే కంటికి ఇంకాస్త ఇంపుగా వుండేది. కథానుగుణంగా వెళ్ళినందున కామెడీ గానీ, రొమాన్స్ గానీ, మాస్ ప్రేక్షకులను మెప్పించే అంశాలు గానీ కనబడవు. యువతను ఉద్దేశించి తీసామన్న ఈ చిత్రంలో ఆఖరి సన్నివేశాలలో తప్ప మరెక్కడా యువత ప్రస్తావనే రాకపోవడం కొసమెరుపు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాలో ముఖ్యమైన నాలుగు విభాగాలు(కథ, మాటలు, కదనం, దర్శకత్వం) డీల్ చేసిన భారవి మొదటి రెండింటిలో విజయం సాధించాడు. సినిమా మొదట్లో ఆయన నమస్సుమాంజలి అని ఎంత మంది పేర్లను వేసాడో చూస్తే చాలు ఈ కథ కోసం ఎంత అన్వేషణ చేసాడో తెలుసుకోవడానికి, అద్బుతమైన సృష్టిధర్మాన్ని చిన్న చిన్న పదాలలో ఆయన మాటల రూపంలో చాలా చోట్ల వర్ణనాతీతంగా వర్ణించారు. అయితే కధనం, దర్శకత్వంపై ఆయన మరింత దృష్టి కేంద్రీకరిస్తే సినిమా అవుట్ పుట్ మరింత అందంగా వచ్చేది.

నాగ్ శ్రీ వత్స అందించిన సంగీతానికి పేరు పెట్టలేము. అయితే ఇటువంటి సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ అయిన కీరవాణి బాణీ లేని లోటు మాత్రం కనిపిస్తుంది. పాటలలో సాహిత్యం బాగుంది. సినిమాటోగ్రాఫర్ భక్తిరసా చిత్రాన్ని మరింత అందంగా చూపించడంలో కాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది. ఎడిటర్ కాస్త సాగదీస్తున్నాం అనుకున్న సీన్స్ ని కట్ చేసి ఉంటె బాగుండేది.

తీర్పు :

‘జగద్గురు ఆదిశంకర’ – ఫర్ యూత్ అంటూ ప్రచారంలోకి తెచ్చిన ఈ సినిమాను మన యూత్ కు చేరవెయ్యాలన్నా, తీరా చేరవేసాక అది యూత్ కు చేరువవ్వాలన్నా అది కాస్త కష్టతరమైన పనే. ఎందుకంటే యువత ఇప్పుడు ఇలాంటి సినిమాలు చూడడం మానేసారు. కానీ ఆదిశంకరాచార్యుల జీవిత తత్త్వం గురించి, మన ధర్మ ఔన్నత్యం గురించి తెలుసుకోవాలంటే తప్పకుండా చూడాలి. సీరియళ్ళకు పరిమితమైన చాలా మంది పెద్ద వారు ఈ సినిమాపై దదృష్టిపెట్టడం సంతోషకరమైన విషయం. చివరిగా మధ్య వయసు ఉన్న కుటుంబ సభ్యులకు, కాస్త దైవ చింతన కలిగిన వారు, అలాగే జగద్గురు ఆదిశంకరాచార్య లాంటి గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనుకునే వారు ఈ సినిమాని చూడగలరు మరియు వారికి ఎంతో బాగా నచ్చుతుంది. కానీ యువతరాన్ని ఎంతవరకూ ఆకట్టుకుంటుందో కాలమే నిర్ణయించాలి.

123తెలుగు.కామ్ రేటింగ్ – 3/5

వంశీ కృష్ణ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version