విడుదల తేదీ : జనవరి 14, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: కళ్యాణ్ దేవ్, రచితా రామ్, తనికెళ్ళ భరణి, అజయ్ తదితరులు.
దర్శకత్వం : పులి వాసు
నిర్మాత: రిజ్వాన్, ఖుషి
సంగీత దర్శకుడు: థమన్
సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు
ఎడిటర్ : మార్తాండ్ కె. వెంకటేష్
మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా వచ్చిన సినిమా ‘సూపర్ మచ్చి’. పులి వాసు దర్శకత్వంలో రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. కల్యాణ్ దేవ్ సరసన రచితా రామ్ హీరోయిన్ గా నటించింది. కాగా ఈ చిత్రం ఈ రోజు విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం..
కథ :
మీనాక్షి (రచితా రామ్) నెలకు లక్షా డెబ్భై వేలు సంపాదించే ఒక సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. ఇక నెలకు ఇరవై వేలు కూడా సంపాదించలేని రాజు (కళ్యాణ్ దేవ్) అనే దిగువస్థాయి సింగర్ ను ప్రేమిస్తుంది. పైగా అసలు అతను ఎలా ఉంటాడో కూడా చూడకుండానే ఘాడంగా ప్రేమిస్తుంది. ఆ తర్వాత అతని గురించి తెలుసుకుని, ప్రేమిస్తున్నా అంటూ అతని వెంట పడుతూ అతని ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటుంది. ఐతే.. ఆమె ప్రేమ పై సరైన అభిప్రాయం లేని రాజు, మీనాక్షిని వదిలించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇంతకీ , మీనాక్షి రాజును ఎందుకు అంతలా ప్రేమించింది ? అలాగే రాజు ప్రేమ పై ఎందుకు నమ్మకాన్ని కోల్పోయాడు ? చివరకు ఈ జంట ఎలా కలిశారు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ప్రేమ మనసుకు సంబంధించిన అంశం అంటూ దర్శకుడు పులి వాసు రాసుకున్న సున్నితమైన కథాంశం బాగుంది. అలాగే ప్రేమ కోసం ఓ అమ్మాయి పడే ఆవేదన మరియు ఇంటర్వెల్ సీక్వెన్స్.. ఇక ఎమోషనల్ గా సాగే ఫాదర్ రాజేంద్రప్రసాద్ ట్రాక్ సినిమాలో ఆకట్టుకున్నాయి. కొన్ని భావోద్వేగాలతో నిండిన ఈ కథలో ప్రేమ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఇక ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేస్తూ ‘విజేత’ చిత్రంతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన కళ్యాణ్ దేవ్ ఆ సినిమాతో ఆకట్టుకున్నా.. ఈ సినిమాలో మాత్రం అంతకుమించిన మంచి ప్రతిభను కనబరిచాడు.
కళ్యాణ్ దేవ్ లుక్స్ అండ్ పర్ఫామెన్స్ చాలా మెరుగ్గా ఉన్నాయి. ‘తనను ప్రేమించిన అమ్మాయే.. తాను ప్రేమించిన అమ్మాయి’ అని తెలుసుకునే సీన్స్ లో ఆ ఫీల్ ను తన కళ్ళల్లో బాగా ఎలివేట్ చేశాడు. ప్రేమ తాలూకు బాధను అర్థం చేసుకున్నే సన్నివేశాల్లోనూ కళ్యాణ్ దేవ్ నటన చాలా బాగుంది. హీరోయిన్ రచితా రామ్ తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. హీరోయిన్ తండ్రి పాత్రలో రాజేంద్ర ప్రసాద్ నటన చాలా బాగుంది. కమెడియన్స్ భద్రం, జబర్దస్త్ మహేష్, పోసాని తమ కామెడీ టైమింగ్ తో అక్కడక్కడా నవ్వించారు. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ :
సింపుల్ పాయింట్ తో సినిమా స్టార్ట్ అవ్వడం.. పైగా, ఫస్ట్ హాఫ్ మొత్తం.. ఆ పాయింట్ చుట్టే సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని ఇంట్రెస్ట్ గా ఎలివేట్ చేయకుండా పూర్తి లవ్ సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలోనే స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. సినిమాలో ఆడియన్స్ కి మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. దీనికి తోడు హీరోయిన్ అసలు హీరోని ఎందుకు అంతలా ప్రేమిస్తోంది ? అనే డౌట్ దగ్గరే ఆడియన్ ఉండిపోయాడు.
దానికి తగ్గట్లుగానే హీరో పాత్రకు సరైన క్యారెక్టరైజేషన్ లేకపోవడం కూడా సినిమాకు మైనస్ అయింది. అయితే, దర్శకుడు రాసుకున్న కాన్సెప్ట్, ప్రేమ సన్నివేశాల్లోని కొన్ని ఎమోషన్స్ బాగున్నా.. అలాగే క్లైమాక్స్ సీన్స్ ఒకే అనిపించినా.. కథ కథనాలు మరీ స్లోగా సాగడంతో సినిమా ఆకట్టుకోలేకపోయింది. అదే విధంగా రెండో భాగం కథనంలో ప్లో కూడా ఇంట్రెస్టింగ్ గా లేదు. ఇక సెకండాఫ్ లో కొన్ని సన్నివేశాలను సాగదీయడంతో సినిమా బోర్ గా ముగుస్తుంది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సినిమా క్వాలిటీ పరంగా చూసుకుంటే బాగానే ఉంది. సినిమాని విజువల్ గా పూర్తిగా ఆకట్టుకునేలా దర్శకుడు సినిమాని తెరకెక్కించారు. కెమెరామెన్ కెమెరా పనితనం కొన్ని కీలక సన్నివేశాలల్లో చాలా బాగుంది. సినిమాకు కెమెరా వర్క్ ప్లస్ అయింది. థమన్ ఇచ్చిన సంగీతం బాగుంది. అయితే, ఎడిటర్ ల్యాగ్ సీన్స్ ను స్మూత్ కట్ చేసి ఉంటే సినిమాకి ప్లస్ అయ్యేది. నిర్మాతలు రిజ్వాన్, ఖుషి ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
ప్యూర్ లవ్ థీమ్ తో ఎమోషనల్ సస్పెన్స్ లవ్ డ్రామాగా వచ్చిన ఈ చిత్రంలో కొన్ని ఎమోషన్స్, ప్రేమ్ సన్నివేశాలు ఆకట్టుకున్నా.. పూర్తీ స్థాయిలో సినిమా ఆకట్టుకోదు. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ లో కీలకమైన సీన్స్ బోర్ గా సాగడం, స్లో నేరేషన్, మరియు సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. ఐతే, ఇక సినిమా కాన్సెప్ట్, లవ్ సీన్స్, నటీనటుల నటన ఆకట్టుకున్నాయి. మొత్తమ్మీద ఈ ‘చిత్రం’ ప్రేమకథలు ఇష్టపడే ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. అయితే మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చదు.
123telugu.com Rating : 2.25/5
Reviewed by 123telugu Team