సమీక్ష : “స్వాతి ముత్యం” – ఫన్ తో సాగిన ఫ్యామిలీ లవ్ డ్రామా !

swathi-muthyam-telugu-movie-review

విడుదల తేదీ : అక్టోబర్ 05, 2022

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిషోర్, రావు రమేష్, ప్రగతి తదితరులు

దర్శకత్వం : లక్ష్మణ్ కె కృష్ణ

నిర్మాత: సూర్యదేవర నాగవంశీ

సంగీతం: మహతి స్వర సాగర్

సినిమాటోగ్రఫీ: సూర్య

ఎడిటర్: నవీన్ నూలి

 

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ రెండో కుమారుడు బెల్లంకొండ గణేశ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘స్వాతి ముత్యం’ సినిమాలో గణేశ్ హీరోగా నటించాడు. ఈ సినిమాలో వర్ష బొల్లమ్మ హీరోయిన్‌గా నటించగా, లక్ష్మణ్ కె కృష్ణ దర్శకుడిగా పరిచయం అయ్యాడు కాగా ఈ సినిమా ఈ రోజు విడుదల అయింది. మరి ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

 

కథ :

బాలమురళీకృష్ణ (గణేశ్ బెల్లంకొండ) చాలా మంచోడు. జీవితంలో అమ్మాయిలకు దూరంగా ఉంటూ స్వాతిముత్యం లా మిగిలిపోతాడు. అయితే, బాలమురళీకృష్ణ పెళ్లి చేసుకునే క్రమంలో భాగ్యలక్ష్మి ( వర్ష బొల్లమ్మ ) ను పెళ్లి చూపుల్లో భాగంగా కలుసుకుంటాడు. ఆ తర్వాత జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో బాలమురళీకృష్ణ – భాగ్యలక్ష్మి ప్రేమలో పడి పెళ్లికి రెడీ అవుతారు. అయితే, సాయంత్రం పెళ్లి అనగా
బాలమురళీకృష్ణ గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తోంది. దెబ్బకు పెళ్లి రద్దు అవుతుంది. ఇంతకీ ఏమిటీ ఆ రహస్యం?, ఆ తర్వాత బాలమురళీకృష్ణ జీవితంలో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి?, చివరకు బాలమురళీకృష్ణ – భాగ్యలక్ష్మి పెళ్లి అయిందా ? లేదా ? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

మంచి కథాంశం ఆధారంగా దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ ఈ కథను రాసుకోవడం సినిమాకి బాగా ప్లస్ అయింది. అలాగే, ఈ కథకు చక్కని ట్రీట్మెంట్ తో పాటు మంచి ఎమోషనల్ అండ్ కామెడీ స‌న్నివేశాలను కూడా లక్ష్మణ్ కె కృష్ణ బాగా రాసుకున్నాడు. ప్ర‌ధానమైన పాత్ర‌ధారి బాలమురళీకృష్ణ పాత్ర చుట్టూ దర్శకుడు అల్లిన డ్రామా చాలా బాగుంది. హీరోగా గణేష్ తన ఎనర్జిటిక్ యాక్టింగ్ తో తన పాత్ర‌లో చాలా బాగా న‌టించాడు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆయన నటన చాలా సహజంగా ఉంది.

ఇక హీరోయిన్ కి తండ్రి పాత్ర‌లో సీనియర్ నరేష్ ప‌ర‌కాయం ప్ర‌వేశం చేస్తూ.. తన పాత్రకు తగ్గట్లుగానే మంచి కామెడీ టచ్ ఇచ్చాడు. అలాగే మ‌రో ప్ర‌ధాన‌మైన పాత్ర రావు ర‌మేష్‌ త‌న పాత్ర‌ను పూర్తి న్యాయం చేశారు. హీరో పెళ్లి ఆగిపోయే సన్నివేశంలో ఆయన నటన తీరు, ఆయన కామెడీ టైమింగ్ అద్భుతంగా అనిపిస్తోంది.

భాగ్యలక్ష్మి పాత్ర‌లో నటించిన వర్ష బొల్లమ్మ తన నటన తో బాగా ఆట్టుకుంటుంది. ఆమె పాత్ర కూడా కామెడీగా సాగుతూ బాగానే ఎంటర్ టైన్ చేస్తోంది, ఇక మిగిలిన నటీనటులు గోపరాజు రమణ నటన హైలైట్. సుబ్బరాజు, వెన్నెల కిషోర్ అలాగే ఇతర నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

 

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఫస్ట్ హాఫ్ స్క్రిప్ట్ ను మాత్రం రాసుకోలేదు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కథనం విషయంలో లక్ష్మణ్ కె కృష్ణ మెప్పించలేకపోయారు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు అలాగే సెకెండాఫ్ లో కొన్ని సన్నివేశాలు సాగతీసినట్లు చాల స్లోగా సాగుతాయి.

దానికి తోడు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకునే విధంగా లేవు. అసలు హీరో కుటుంబం కొన్ని సీన్స్ లో అయితే మరీ సిల్లీగా బిహేవ్ చేస్తోంది. కొన్ని కీలక సన్నివేశాలు కూడా సహజనికి చాలా దూరంగా సాగుతాయి. దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ స్క్రిప్ట్ పై ఇంకా బాగా వర్క్ చేసి ఉంటే సినిమా అవుట్ ఫుట్ మరో స్థాయిలో ఉండేది.

 

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం విషయానికి వస్తే ముందే చెప్పుకున్నట్లు. దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ మంచి స్టోరీ లైన్ తీసుకున్నా, ఆ స్టోరీ లైన్ కి తగ్గట్లు సరైన కథనాన్ని రాసుకోలేకపోయారు. పాటలు బాగున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే, ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ల నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

 

తీర్పు :

స్వాతిముత్యం అంటూ వచ్చిన ఈ చిత్రం కామెడీగా సాగుతూ అక్కడక్కడా మంచి ఫీల్ తో బాగానే ఆకట్టుకుంది. అయితే కీలకమైన ఎమోషన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోకపోవడం, అలాగే ఫస్ట్ హాఫ్ కథనం కూడా కొన్ని చోట్ల ఇంట్రస్టింగ్ గా సాగకపోవడం వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. అయితే రావు రమేష్ – గోపరాజు రమణ యాక్టింగ్, హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, అలాగే లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వ పనితనం సినిమాలో బాగా ఆకట్టుకుంటాయి. మొత్తమ్మీద ఈ కామెడీ ఎంటర్ టైనర్ బాగానే అలరిస్తుంది.

123telugu.com Rating: 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version