విడుదల తేదీ : ఫిబ్రవరి 28, 2020
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు : కెపిఎన్ చౌహాన్, సింగర్ మంగ్లీ, చమ్మక్ చంద్ర తదితరులు.
దర్శకత్వం : కెపిఎన్ చౌహాన్
నిర్మాతలు : రాజు నాయక్
సంగీతం : భోలే
సినిమాటోగ్రఫర్ : విజయ్ ఠాగూర్
ఎడిటర్ : సురేష్ దుర్గం
సింగర్ మంగ్లీ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘స్వేచ్ఛ’. కేపీఎన్ చౌహాన్ దర్శకత్వంలో ఆంగోత్ రాజునాయక్ ఈ సినిమా నిర్మించారు. సంగీత దర్శకుడు బోలే సంగీతం అందించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ సినిమా పై ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
స్వేచ్ఛ (మంగ్లీ) బంజారా కమ్యూనిటీలో పుడుతుంది. ఆమె పదేళ్ల వయసులో ఉన్నప్పుడే స్వేచ్ఛ తండ్రి అప్పులు చేసి చివరికీ స్వేచ్ఛను సక్కుబాయి అనే లేడీ డాన్ కి అమ్మేస్తాడు. అయితే స్వేచ్ఛ తన తల్లి సాయంతో అక్కడి నుండి తప్పించుకుని బయటపడుతుంది. అలా హైదరాబాద్ కి వచ్చిన స్వేచ్ఛను ఒక పెద్దాయన చేరతీస్తాడు. ఆ తరువాత ఆమె బాగా చదువుని.. మళ్లీ తన ఊరు వెళ్లి సక్కుబాయి చేతిలో బలి అవుతున్న ఆడపిల్లలను కాపాడే ప్రయత్నం చేస్తోంది ? ఈ మధ్యలో చౌహాన్ (కెపిఎన్ చౌహాన్) స్వేచ్ఛను చిన్నప్పటి నుండే ప్రేమిస్తూ ఆమె వెంట పడుతుంటాడు. అతను స్వేచ్ఛకు ఎలాంటి సపోర్ట్ ఇచ్చాడు ? చివరికీ వారిద్దరూ ఒక్కటయ్యారా లేదా ? మధ్యలో కృష్ణగాడి (చమ్మక్ చంద్ర) పాత్ర ఏమిటి ? లాంటి విషయాలు తెలియాలంటే వెండితెర పై ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఆడపిల్లలకు కూడా స్వేచ్ఛనివ్వాలి. మగాళ్లతో పాటు సమానంగా వాళ్ళను చూడాలి, వారి పై జరిగే అన్యాయాలను అరికట్టాలనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా సందేశం పరంగా మాత్రం నిజంగా స్ఫూర్తినిచ్చే సినిమానే. ఇక బంజారా కమ్యూనిటీలో జరిగిన దారుణాలను చాల క్లారిటీగా చూపించారు. ముఖ్యంగా ఆడపిల్లను కన్నతండ్రినే అమ్ముకోవడం లాంటి అంశాల్ని చాల ఎమోషనల్ గా చూపించారు. అలాగే మన చుట్టూ ఉన్న చెట్టు విలువను హైలైట్ చేస్తూ చెప్పడం బాగుంది.
ఇక ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించిన మంగ్లీ తన స్క్రీన్ ప్రెజెన్సీతో ఆకట్టుకుంది. ఇక ఆమె పెర్ఫార్మెన్స్ కూడా పర్వాలేదు. ఆమె మాడ్యులేషన్ ఆమె పాత్రకు ఫర్ఫెక్ట్ గా సరిపోయింది. మంగ్లీ చిన్నప్పటి పాత్రలో నటించిన అమ్మాయి కూడా చాలా బాగా నటించింది. చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో పాటు భావోద్వేగ సన్నివేశంలో ఆ అమ్మాయి నటన సినిమాకే హైలైట్ గా నిలుస్తోంది. హీరోగా చేసిన కెపిఎన్ చౌహాన్ నటన పర్వాలేదు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు.
మైనస్ పాయింట్స్ :
మంచి మెసేజ్ తో కూడుకున్న కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు ఆ కాన్సెప్ట్ ను అంతే బాగా తెర మీదకు ఆసక్తికరంగా మలచలేకపోయారు. ఫస్ట్ హాఫ్ ఇంట్రస్ట్ లేని సీన్లతో మరియు సాగతీత సన్నివేశాలతో, పండిన ఎమోషన్ తో, సందర్భం లేని పాటలతో సాగుతుంది. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ఈ కాన్సెప్ట్ కి సంబంధించిన సన్నివేశాలు కూడా చాలా వరకు ఆకట్టుకోవు.
ఇక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా నమ్మశక్యంగా ఉండదు. అలాగే హీరో పాత్రను నాలుగు లవ్ సీన్స్ కే పరిమితం చేశారు. పైగా తన ప్రేమను ఎలా సాధించాడు, హీరోయిన్ పాత్ర అతన్ని ఎలా ప్రేమించింది అనే విషయాన్ని ఇంకా క్లారిటీగా చూపెడితే బాగుండేది.
ఇక సినిమాలో ఎక్కువుగా నూతన నటీనటులు నటించడం కూడా సినిమాలోని ఎమోషన్ని ఎలివేట్ చేయలేకపోయింది. చాలా సన్నివేశాల్లో కొందరి నటీనటుల హావభావాలు, వారి నటన కూడా బాగా ఇబ్బందిగా అనిపిస్తాయి.
సాంకేతిక విభాగం :
దర్శకుడు ఉన్న స్క్రిప్ట్ ను తెర మీద ఎఫెక్టివ్ గా చూపెట్టడంలో పూర్తిగా విఫలమయ్యాడు. విజయ్ ఠాగూర్ కెమెరా పనితనం మాత్రం ఇంప్రెస్ అయ్యేలా ఉంది. ఆయన తీసిన విజువల్స్, కొన్ని షాట్స్ బాగున్నాయి. భోలే అందించిన సంగీతం పర్వాలేదు. కాకపోతే పాటల్లో చాలా చోట్ల పాత చిత్రాల్లోని బిట్స్ గుర్తువస్తాయి. అయితే ‘బంజారే బంజారే..’ పాట మాత్రం చాల బాగుంది. ఇక ఎడిటర్ పనితనం బాగాలేదు. దర్శకుడు అభిరుచికి తగ్గట్లే ఎడిటింగ్ కూడా సాగింది. నిర్మాత సినిమాకి తగ్గట్లే ఖర్చు పెట్టారు.
తీర్పు :
బంజారా నేపథ్యంలో స్త్రీ జాతి పై జరుగుతున్న అన్యాయం పై సందేశాత్మకంగా తీసిన ఈ సినిమా.. మెసేజ్ పరంగా మెచ్చుకోతగినది. అయితే ఓవరాల్ గా సినిమా పరంగా మాత్రం ప్రేక్షకులను మెప్పించడంలో ఈ చిత్రం పూర్తిగా విఫలం అయింది. ఆకట్టుకోని కథకథనాలు, మెప్పించలేకపోయిన దర్శకత్వ పనితనం, ఆసక్తిగా సాగని సన్నివేశాలు మరియు పాత్రలు ఇలా అన్నీ కలగలిపి ప్రేక్షకుడ్ని ఇబ్బందికి గురి చేస్తాయి. ఈ సినిమా సగటు ప్రేక్షకుడ్ని కూడా ఆకట్టుకోదు.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team