సమీక్ష : ఆటోనగర్ సూర్య – సూర్య ఓకే, మరి ఎలివేషన్ ఏది.!

Autonagar_Surya విడుదల తేదీ : 27 జూన్ 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 2.75/5
దర్శకత్వం : దేవకట్టా
నిర్మాత : కె. అచ్చిరెడ్డి
సంగీతం : అనూప్ రూబెన్స్
నటీనటులు : నాగ చైతన్య, సమంత

చాలా కాలంగా ఇదిగో రిలీజ్, అదిగో రిలీజ్ అని హడావిడి చేస్తూ పలుసార్లు వాయిదా పడుతూ గత సంవత్సరం రోజులుగా తెలుగు ప్రేక్షకులను, అక్కినేని అభిమానులను ఎంతగానో ఊరించిన ‘ఆటోనగర్ సూర్య’ ఎట్టకేలకు ఈ రోజు విడుదలైంది. నాగ చైతన్య పూర్తి మాస్ లుక్ లో ఓ మెకానిక్ గా కనిపించిన ఈ సినిమాలో సమంత మూడవ సారి చైతన్యతో జోడీ కట్టింది. కథా బలం ఉన్న సినిమాలను అందించే దేవకట్టా డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్స్, సాంగ్స్ అందరినీ ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ‘మనం’ సినిమాతో సక్సెస్ అనుకొని ఉన్న నాగ చైతన్యకి మరో హిట్ ని, హిట్ కోసం ఎదురు చూస్తున్న దేవకట్టాకి హిట్ ని ఈ ‘ఆటోనగర్ సూర్య’ అందించిందేమో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఒక యూనియన్ ర్యాలీ బాంబ్ బ్లాస్ట్ తో సినిమాని మొదలు పెట్టి, అక్కడి నుంచి కట్ చేస్తే 1973లో అసలు కథ మొదలవుతుంది. ఒక రైలులో కోటి లింగం ఒక అమ్మాయిపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తుండగా అదే ట్రైన్ లో ఉన్న ఓ వ్యక్తి ఎదిరించడానికి వెళితే అతన్ని, అతని భార్యని కోటిలింగం చంపేస్తాడు. ఆ చనిపోయిన వారి బిడ్డే సూర్య. అలా అనాధ అయిన సూర్య ఆటోనగర్ లో చిన్న వ్యాపారం చేసుకునే మామయ్య భరణి(సాయికుమార్) దగ్గరకి చేరుతాడు. కానీ భరణి కూడా ఇంటి నుంచి గెంటేయడంతో బయటకి వచ్చి ఒక మెకానిక్ గా లైఫ్ ని మొదలు పెడతాడు.

సూర్య 16 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు తన ఫ్రెండ్ ని చంపారని ఓ రౌడీని చంపి జైలుకి వెళ్తాడు. తను తిరిగొచ్చే సరికి ఆ ఆటోనగర్ ప్రాంతం అంతా ఇంద్రన్న(జయ ప్రకాష్ రెడ్డి), మేయర్ అలియాస్ కోటిలింగం(మధు) చేతిలో ఉంటుంది. వాళ్ళు ప్రజలను భయపెట్టి అక్రమంగా డబ్బులు దండుకుంటూ ఉంటారు. అది చూసి ఆటోనగర్ స్థితి గతులను మార్చాలని, ఆ రాబందుల రాజ్యాన్ని కూలదోసి ప్రజలను కాపాడి తన సూర్య తన బుడ్డి బలంతో ఎదగాలనుకుంటాడు. దాని కోసం సూర్య ఏం చేసాడు? అసలు ఇంద్రన్న, మేయర్ తో ఎలా తలపడ్డాడు? చివరికి ఆటోనగర్ ని వారిబారి నుండి కాపాడాడా? తన తల్లి తండ్రులను చంపింది కూడా మేయరేనని సూర్య తెలుసుకున్నాడా? లేదా అన్నది మీరు తెరపైనే చూడాలి..

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అంటే అది నాగ చైతన్య అనే చెప్పాలి. మొదటిసారిగా నాగ చైతన్య ఫుల్ మాస్ పాత్రలో ప్రేక్షకులని మెప్పించాడు. చైతన్య నటనలో, డైలాగ్ డెలివరీలో ఎంతో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వల్ బ్లాక్ లో వచ్చే యూనియన్ ఎపిసోడ్ లో చైతన్య పెర్ఫార్మన్స్, డైలాగ్స్ సింప్లీ సూపర్బ్. ఇక బ్యూటిఫుల్ సమంతకి ఉన్నది చిన్న పాత్రే అయినా ఎప్పటిలానే తన లుక్స్, పెర్ఫార్మన్స్ తో ఉన్నంతలో ఆడియన్స్ ని తనవైపు ఆకర్షించుకుంది. చైతన్య – సమంత మధ్య వచ్చే కొన్ని లవ్ సీన్స్ ఫన్నీగా బాగున్నాయి.

వీరి తర్వాత చెప్పుకోవాల్సింది చైతన్య ఫ్రెండ్ గా నటించిన నందు గురించి, సినిమాకి ముఖ్యమైన ఈ పాత్రకి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. నందు పెర్ఫార్మన్స్ చాలా బాగుంది. అమాయకమైన పాత్రలో సాయి కుమార్ నటన బాగుంది. మెయిన్ విలన్ గా చేసిన మధు తన పెర్ఫార్మన్స్ తో హీరో పాత్రకి గట్టి పోటీనే ఇచ్చాడు. జయ ప్రకాష్ రెడ్డి, అజయ్ లు తమ పాత్రలకి న్యాయం చేసారు.

ఫస్ట్ హాఫ్ లో వచ్చే కొన్ని కామెడీ సీన్స్, ఇంటర్వల్ బ్లాక్ దగ్గర వచ్చే ఓ 20 నిమిషాలు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. అలాగే క్లైమాక్స్ కూడా బాగుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ కంటెంట్ ఎలివేషన్.. డైరెక్టర్ దేవకట్టా రాసుకున్న కంటెంట్ లో హీరోని ఎలివేట్ చేసే సీన్స్ చాలానే ఉన్నాయి కానీ ఒకటి రెండు సీన్స్ లో తప్ప మిగతా ఎక్కడా ఎలివేట్ చేయకపోవడం వల్ల ఆడియన్స్ కి సినిమా చూస్తున్నంత సేపూ ఏదో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ లోనే ఉండిపోతారు. ఇకపోతే మరో మేజర్ మైనస్ రన్ టైం 2 గంటల 39 నిమిషాలు అవ్వడం. ఇందులో ఓ 20 -30 నిమిషాల సినిమాని కట్ చేసి ఉంటే చాలా బాగుండేది.

అందులో ముఖ్యంగా సెకండాఫ్ లో వచ్చే అన్ని పాటలని లేపేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే చాలా స్లోగా సాగే సెకండాఫ్ లో ఈ పాటలు ఆడియన్స్ కి పెద్ద భారంగా తయారయ్యాయి. సెకండాఫ్ లో ఒక్క పాట కూడా అవసరం లేదు. అలాగే కామెడీ పెట్టాలనే ఉద్దేశంతో బ్రహ్మానందం, వేణు మాధవ్ లను ఇందులో ఇరికించారు. దీనివల్ల సినిమాకి ఎలాంటి ఉపయోగము లేకపోగా రన్ టైం పెరిగి ప్రేక్షకులకు బోర్ కొట్టించింది.

ఫస్ట్ హాఫ్ మీద సెకండాఫ్ చాలా డల్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్లాక్ చూసాక సెకండాఫ్ ఇక ఇదే స్పీడ్ తో ఉంటుందని ప్రేక్షకులు ఆశిస్తారు. కానీ సెకండాఫ్ మాత్రం గ్లూకోజ్ లెవల్స్ లేని రన్నర్ లా చాలా స్లోగా, నీరసంగా సాగుతుంది. దానికి తోడు మధ్యలో అవసరంలేని పాటలు ఇంకా చిరాకు పెడతాయి. దేవకట్టా లాంటి దర్శకుడు కూడా ఓ డ్యూయెట్, ఓ ఐటెం సాంగ్ ఉండాలి అని కథ రాసుకోవడం కాస్తా బాధాకరమైన విషయమే. స్క్రీన్ ప్లే చాలా ఊహాజనితంగా ఉంటుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో ది బెస్ట్ అని చెప్పాల్సింది అనూప్ రూబెన్స్ మ్యూజిక్ మరియు కొన్ని సీన్స్ లో డైలాగ్స్ మాత్రమే.. దేవకట్టా అనుకున్న సీన్స్ ని తెరమీద ఎలివేట్ చెయ్యలేకపోయినా అనూప్ మాత్రం తన రీ రికార్డింగ్ తో ఎలివేట్ చెయ్యడానికి బాగా ట్రై చేసాడు. పాటలు బాగున్నాయి, పాటలకంటే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. శ్రీకాంత్ నరోజ్ సినిమాటోగ్రఫీ సినిమాకి పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఏ యాక్షన్ ఎపిసోడ్ కి తన సినిమాటోగ్రఫీ హెల్ప్ అవ్వలేదు. సీనియర్ ఎడిటర్ అయిన గౌతంరాజు అయినా ఎడిటింగ్ రూంలో డైరెక్టర్ ని కూర్చోబెట్టుకొని ఇది సాగదీసినట్టు ఉంది, ఇది అవసరం లేదని చెప్పి తన కత్తెరకి పని పెట్టి ఉంటే సినిమా నిడివి ఇంకాస్త తగ్గి సినిమా ఇంకాస్త బెటర్ గా వచ్చి ఉండేది.

ఈ సినిమాకి కెప్టెన్ అఫ్ ది షిప్ దేవకట్టా. ఆయనే కీలకమైన కథ – మాటలు – స్క్రీన్ ప్లే – దర్శకత్వం విభాగాలను డీల్ చేసాడు. దేవకట్టా రాసుకున్న కథ రొటీన్ లా అనిపించినా ఎంచుకున్న నేపధ్యం వల్ల కంటెంట్ కి దమ్మోచ్చింది కానీ ఎలివేట్ చేయలేకపోయాడు. తన ఫిలాసఫీని మాటల తూటాలుగా మార్చి సినిమాలో పేల్చాడు. అవి కొన్ని చోట్ల బాగానే పేలాయి. మాటలపై పెట్టిన శ్రద్ధ కథనంపై పెట్టి ఉంటే సినిమా చాలా బెటర్ గా వచ్చి ఉండేది. ఇకపోతే డైరెక్షన్ – దేవకట్టా రాసుకున్న పాత్రల కోసం ఎన్నుకున్న నటుల నుండి మంచి పెర్ఫార్మన్స్ రాబట్టుకున్నాడు. కానీ పాత్రని ఎలివేట్ చెయ్యకుండా ఎంత పెర్ఫార్మన్స్ రాబట్టుకున్న ఏం లాభం చెప్పండి. దేవకట్టా తీసిన ‘ప్రస్థానం’ సినిమాలో మొదటి నుంచి చివరి దాకా ఓ ఇంటెన్స్ అనేది ఉంటుంది కానీ ఇందులో అదే లేదు. అదే ఇంటెన్స్ ఉంది ఉంటే సినిమా రిజల్ట్ మరోలా ఉండేది.

తీర్పు :

‘ప్రస్థానం’ లాంటి ఇంటెన్స్ సినిమా తీసిన దేవకట్టా ‘ఆటోనగర్ సూర్య’ సినిమాతో అదే మేజిక్ ని రిపీట్ చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. అక్కడక్కడా కొంత సమయం ప్రేక్షకులని మెప్పించగలిగిన దేవకట్టా మిగిలిన సమయం అంతా బాగా బోర్ కొట్టించాడు. నాగ చైతన్య పెర్ఫార్మన్స్, కొన్ని సీన్స్, డైలాగ్స్ సినిమాకి మేజర్ హైలైట్స్ అయితే సినిమా నిడివి, సీన్స్ లో ఎలివేషన్ లేకపోవడం, బోర్ కొట్టే కామెడీ, బోరింగ్ సెకండాఫ్ మరియు థియేటర్ బయటకి పంపేలా చేసే పాటలు మేజర్ మైనస్ పాయింట్స్. సరికొత్త నాగ చైతన్యని చూడాలనుకునే వారు ఈ సినిమాని చూడొచ్చు. చాలా కాలంగా ప్రేక్షకుల ముందుకు రాలేక ఇబ్బంది పడి అన్ని అవాంతరాలను ఎదుర్కొని ఎట్టకేలకు విడుదలైన ఈ ‘ఆటోనగర్ సూర్య’ పర్ఫెక్ట్ కండిషన్ లో లేని బండిలా, అటు ఫ్లాప్ ఇటు హిట్ కి మధ్యలో మిగిలిపోతుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version