సమీక్ష : టెర్రర్ – ఆకట్టుకునే కథనం..

Terror review

విడుదల తేదీ : 26 ఫిబ్రవరి 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

దర్శకత్వం : సతీష్ కాసెట్టి

నిర్మాత : షేక్ మస్తాన్

సంగీతం : సాయి కార్తీక్

నటీనటులు : శ్రీకాంత్, నిఖిత తుక్రల్..

2006లో వచ్చిన ’హోప్’ అనే సినిమాతో జాతీయ అవార్డు పొందిన దర్శకుడు సతీష్ కాషెట్టి తీసిన, తన రెండో సినిమా ’కలవరమాయె మదిలో’ సినిమాతో నంది అవార్డ్ కూడా పొందాడు. ఇప్పుడు ‘టెర్రర్’ అంటూ తన మూడో సినిమాతో మన ముందుకు వచ్చాడు. అఖండ భారత క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమా సమర్పణలో సతీష్ కాసెట్టి దర్శకత్వంలో షేక్ మస్తాన్ నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ ‘టెర్రర్’. చాలా కాలం నుండి హిట్ కోసం తపిస్తున్న హీరో శ్రీకాంత్ కు ఈ సినిమా విజయాన్ని అందించే స్థాయిలో ఉందా? లేదా? చూద్దాం..

కథ :

నిజాయితీపరుడైన పోలీస్ ఆఫీసర్ విజయ్ (శ్రీకాంత్) కొన్ని కారణాల వల్ల సస్పెండ్ అవుతాడు. అదే కారణం వల్ల తండ్రికి కూడా దూరంగా ఉండే విజయ్, భార్యతో జీవనం సాగిస్తూంటాడు. ఇదిలా ఉంటే విజయ్‌కి ఒక కేసు ఇన్వెస్టిగేషన్ లో దొరికిన చిన్న క్లూ ద్వారా హైదరాబాద్ లో ఏదో పెద్ద అలజడి జరగబోతున్నదని తెలుసుకుంటాడు. ఆ కేస్ ని సాల్వ్ చేసే ప్రయత్నంలో విజయ్ కి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. హైదరాబాద్ లో బాంబు పేల్లుళ్ల కు కొంతమంది తీవ్రవాదులు కుట్ర చేస్తున్నట్లు అందులో కొందరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. చివరికి విజయ్ ఆ కుట్ర పన్నిన వారిని ఎలా పట్టుకుంటాడు? అన్నది మిగతా కథ.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమా ప్రధాన ఆకర్షణ హీరో శ్రీకాంత్. చాలా రోజుల తరువాత తనలోని నటుడిని మరోమంచి పాత్ర ద్వారా బయట పెట్టాడు. చాలా సందర్భాల్లో చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ కూడా అద్భుతంగా పలికించి మెప్పించాడు. ఈ సినిమాలోని నటన శ్రీకాంత్‌ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిస్తుంది. శ్రీకాంత్ భార్యగా నిఖిత నటన ఫరవాలేదు. హోం మినిష్టర్ గా నటించిన కోట శ్రీనివాసరావు తనదైన శైలిలో నటించాడు. శ్రీకాంత్ అనుచరుడిగా రవివర్మ మంచి నటనను ప్రదర్శించాడు. ఇక పృధ్వీరాజ్ కామెడి విలన్ గా తనదైన టైమింగ్‌తో కట్టిపడేస్తాడు. నాజర్, విజయ్ చందర్ కూడా తమ స్థాయి నటనను ప్రదర్శించారు.

కథ ఎక్కడా ప్రక్కదారి పట్టకుండా స్క్రీన్ ప్లే ని రూపొందించుకున్నాడు దర్శకుడు. మొదటి పదినిముషాలు మినహా తరువాత నుంచి చివరివరకూ ఎక్కడా టెంపో తగ్గకుండా చూడటం ఈ సినిమాకు హైలైట్స్‌లో ఒకటిగా చెప్పుకోవచ్చు. ముస్లిం అయిన టెర్రరిస్ట్ ని ఒక ముస్లిం పోలీస్ ఇంటరాగేట్ చేసే సీన్ లో వచ్చే మాటలు చాలా బావున్నాయి. ఈ సినిమాలో వచ్చే హైలైట్ సీన్స్ లో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు. ఒక మంచి కథను స్పష్టంగా, సూటిగా ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ని కలపకుండా సినిమా చేయడం దర్శకుడి నిబద్ధతను తెలియచేస్తుంది. ఈ విషయం లో దర్శకుడిని అభినందించాలి.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ మైనస్ పాయింట్ అంటే పదిహేను రోజుల్లో ఏదో జరగబోతున్నది అని ‘టైం లాక్ ఆప్షన్’ పెట్టడం ఆసక్తికలిగించినా తరువాత మొదటి పదమూడు రోజుల్లో జరిగే సీన్స్ ఏమాత్రం థ్రిల్లింగ్ గానీ, టెన్షన్ గానీ కలిగించే విధంగా కానీ రాసుకోకపోవడం. నాజర్, శ్రీకాంత్ ల మధ్య ఉన్న తండ్రికొడుకుల అనుబంధం కూడా సరిగా చూపించలేదు. అందువల్ల వారి మధ్య ఉన్న ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకోవు.

సినిమా మెదటి పదిహేను నిముషాలు, చివర్లో శ్రీకాంత్ కోటశ్రీనివాసరావు కు పోలీస్ డిపార్ట్మెంట్ గురించి చెప్పే విషయాలు కథకు ఏమాత్రం సంబంధం లేనివి. పోలీస్ ఆఫీసర్ అయిన విజయ్ ఫోరెన్సిక్ డిపార్టెమెంట్ కి ఫోన్ చేసి గ్లిజరిన్ ద్వారా ఏమైనా ప్రేలుడు పదార్థాలు తయారుచేయవచ్చా? అని అడగటం విచిత్రంగా అనిపిస్తుంది. రెగ్యులర్ సినిమాలో ఉండే కమర్షియల్ పాయింట్స్ ఇందులో లేవు. ప్రి క్లైమాక్స్ ఎపిసోడ్ బాగున్నా సాగదీసినట్టు అనిపిస్తుంది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా ఈ సినిమాలో అందరికంటే ముందుగా దర్శకుడు సతీష్ కాసెట్టి గురించి చెప్పుకోవాలి. హైదరాబాద్ లో ఓ టెర్రర్ గ్రూప్ బాంబు పేలుళ్ళకు కుట్ర పన్నారని తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్ ఆ బాంబ్ బ్లాస్ట్ ను ఎలా చేధించాడు అనేది కథ పరంగా అంత కొత్త కాన్సెప్ట్ కాకపోయినా దర్శకుడిగా మాత్రం చాలాచోట్ల మంచి సక్సెస్ సాధించాడు. ముఖ్యంగా శ్రీకాంత్ నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. అలాగే ఈ సినిమాకు లక్ష్మీ భూపాల్ రాసిన మాటలు చాలా బాగున్నాయి. శ్యామ్ ప్రసాద్ దుప్పటి సినిమాటోగ్రఫీ బావుందని చెప్పుకోవచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ లో మరింత ట్రిమ్ చేయవచ్చు. కొత్త నిర్మాణ సంస్థ అయినా కథా ప్రకారం నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి.

తీర్పు :

టెర్రరిజం ఆధారంగా చేసుకొని వచ్చిన ఈ సినిమాలో కొత్తకథాంశం కాకపోయినా కథనం కట్టిపడేస్తుంది. దీనికి శ్రీకాంత్ నటన తోడయ్యింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లో మొదటి పదిహేను నిముషాలు ఫరవాలేదనిపించినా ఒకసారి కథ ట్రాక్ లోకి వచ్చిన తరువాత ఆసక్తికరంగా సాగుతుంది. ఇది రెగ్యులర్ మాస్ మసాలా మూవీ కాదు కాబట్టి ఆ తరహా సినిమాలు కోరుకునే వారికి ఇది పెద్దగా నచ్చక పోవచ్చు. కానీ సీరియస్ కథాంశాన్ని, ఎమోషన్‌ను, డ్రామాను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా ఆకట్టుకుంటుంది.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
123తెలుగు టీం

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version