సమీక్ష: ‘థియేటర్లో.. నలుగురు’ : పరవాలేదనిపించిన కొత్తవాళ్ళ ప్రయత్నం

Theatre-Lo-Naluguru విడుదల తేదీ : 07 జూన్ 2013
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
దర్శకుడు : శ్రీనివాస్ రాజు దెండుకూరి
నిర్మాత : సాయి కిరణ్ ముక్కాముల
సంగీతం : చిన్నా
నటీనటులు : శ్రీకాంత్, ధీరజ్, వరుణ్, శ్వేతా పండిట్


ఈ మధ్య సస్పెన్స్ సినిమాలకు వస్తున్న రెస్పాన్స్ చూసి తమ టాలెంట్ ఏంటో చూపిద్దాం అని అనుకుని కొంతమంది యువకులు కలిసి చేసిన సమిష్టి కృషికి ఫలితమే ‘థియేటర్లో… నలుగురు’ సినిమా. శ్రీకాంత్, ధీరజ్, వరుణ్, శ్వేతా పండిట్ లు తెరకు పరిచయమవనున్న ఈ సినిమాకి శ్రీనివాస్ రాజు దెండుకూరి దర్శకత్వం వహించాడు. ఈ తరహా సినిమాలకు ప్రేక్షకులను భయపెట్టడం అనేదే థంబ్ రూల్ కాబట్టి, అది సాధించగలిగే తెలివితేటలు దర్శకుడికి ఉంటే సరిపోతుంది. మరి ఈ యువ దర్శకుడుకి ఆ తెలివితేటలు ఉన్నాయా? ప్రేక్షకులను ఎంతవరకూ భయపెట్టగలిగాడు? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే రివ్యూ చదవండి మరి..

కథ :

నలుగురు స్నేహితులు – శ్రీ, ధీరజ్, వరుణ్,గవర్రాజులు ఒక అమ్మాయితో కలిసి ఎంజాయ్ చెయ్యడానికి అడవి దగ్గరుండే ఒక గెస్ట్ హౌస్ కు వెళ్తారు. అక్కడ ఒక దెయ్యం మొదట్నుండీ వీరిని వెంటాడుతుంది. గతంలో వీరు చేసిన ఒక తప్పుకు కారణంగా ఆ దెయ్యం చేతిలో వీరు బలవుతారు… స్టొరీ లైన్ చాలా సింపుల్ గా క్లారిటీగా వుందనుకుంటున్నారు కదండీ… కానీ ఇదే సినిమా కాదు.. ఇక్కడ నుండే కాస్త అయోమయం మొదలవుతుంది. ఇది సినిమాలో జనాలు అందరూ చూసే ఒక సినిమా స్టొరీ.. ‘నలుగురు’ అనే సినిమాలో జరుగుతున్న ఈ స్టొరీని లీడ్ స్టొరీగా మారుస్తూ, ఇదే స్టొరీకి అదే థియేటర్లో వున్న నలుగురి కుర్రాళ్ళ కథను కలుపుతూ సినిమాను తెరకెక్కించాడు. ఆఖరికి థియేటర్లో చూస్తున్న స్టొరీకి, థియేటర్లో జరుగుతున్న స్టొరీకి సంబంధం ఏంటి? వీరి కథలు ఎలా ముగుస్తాయి అన్నదే ఈ సినిమా కథ.

ప్లస్ పాయింట్స్:

సినిమాలో నటించింది అంతా కొత్తవారే కనుక తమ తమ పాత్రల మేరకు బాగానే నటించారు. సినిమాలో రేవంత్ కు కాస్త ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చినా శ్రీ నటన మాత్రం గుర్తుండిపోతుంది. ఇతను కొన్ని సన్నివేశాలలో శర్వానంద్ ను తలపిస్తాడు. బోర్ కొడుతున్న ప్రతీ సమయంలో గవర్రాజు అందించే రామ్ గోపాల్ వర్మ కామెడీ, పల్లెటూరు యాస పెద్ద రిలీఫ్ ను, మన పెదాలపై చిన్న చిరునవ్వును తెస్తాయి. శ్వేతా పండిట్ తన గ్లామర్ తో ముందు బెంచ్ వారిని బాగా ఆకట్టుకుంది. కేవలం అందాల ప్రదర్శనకు మాత్రమే ఆమెని వాడుకున్నారు.

సినిమాలో కనిపించిన పాత్రలలో సీనియర్ నటుడు బెనర్జీ ఒక్కడిదే కాస్త తెలిసిన ముఖం, అతని నటన బాగుంది. మిగలిన పాత్రల నటన కూడా పర్వాలేదనిపిస్తుంది. హర్రర్ మూవీ అంటే ముఖ్యంగా ఉండాల్సింది సౌండ్ ఎఫెక్ట్స్, విజువల్స్, స్క్రీన్ ప్లే. ఈ మూడింటిలో స్క్రీన్ ప్లే కాస్త తగ్గినా మిగతా రెండు విభాగాలు సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్స్.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాను కరెక్ట్ గా తీస్తే షార్ట్ ఫిలింను సాగదీస్తే వచ్చే నిడివి అవుతుంది. కానీ డైరెక్టర్ గంటం పావు నిడివి వుండే సినిమాను రెండు గంటలు చెయ్యడానికి నానా పాట్లు పడ్డాడు. సినిమా ప్రారంభం నుంచి స్లోగా ఉంటుంది, ఇంటర్వెల్ బ్లాక్ నుంచి స్పీడ్ అందుకుంటుంది. అనవసరమైన సీన్లతో, అక్కర్లేని బూతు డైలాగులతో, అలాగే అమ్మాయిని గ్లామర్ కోసం పెట్టాం కదా అని మెడను, తోడలను జూమ్ చేసే సన్నివేశాలతో సినిమాను సాగదీసాడు. హర్రర్ సన్నివేశాలను రామ్ గోపాల్ వర్మను స్ఫూర్తిగా తీసుకొని చేసిన టేకింగ్ దర్శకుడిలో కనపడింది. కానీ రొమాంటిక్ సీన్లను మాత్రం అందంగా తియ్యడంలో విఫలమయ్యాడు.

సినిమాలో పాత్రలకు మేకప్ అంతగా కుదరలేదని చెప్పాలి. దెయ్యాన్ని ఎలా చూపించినా భయమేస్తుందని అనుకున్నారో ఏమోగానీ మేకప్ మీద పెద్దగా శ్రద్ధ తీసుకోలేదు. కానీ దెయ్యం మేకప్ మీద ఇంకాస్త శ్రద్ధ తీసుకుని వుంటే ప్రేక్షకులు ఇంకాస్త భయపడి ఉండేవారు. సినిమాలో గ్లామర్ ఎపిసోడ్స్ ని కాస్త తగ్గించి కామెడీని కాస్త జోడించి ఉంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యి ఉండేది.

సాంకేతిక విభాగం:

సీన్ సైలెంట్ గా వున్నా ప్రేక్షకులు వయిలెంట్ గా ఫీల్ అయ్యే ఇలాంటి సినిమాలకు ముఖ్య పాత్ర పోషించేది నేపధ్యసంగీతం. సీన్లలో ఎలాగో లాజిక్ వెతుక్కునే టైం ఉండదు కాబట్టి వాటికి అర్ధవంతమైన మ్యూజిక్ ఇవ్వగలిగితే సినిమా సక్సెస్ అవుతుంది. డైరెక్టర్ అనుకున్నదానికి చిన్నా పూర్తి న్యాయం చేసాడు. చిన్న బడ్జెట్ సినిమాయే అయినా వనాలు, వనరులు తక్కువ వున్నా ఈ సినిమా అందంగా రావడానికి ఎస్.డి జాన్ తన ప్రతిభతో విజువల్స్ ని చాలా బాగా షూట్ చేసాడు. ఇతను ఇంకాస్త పెద్ద సినిమాలకు పనిచేస్తే అతనికి మంచి పేరు వస్తుంది.

దర్శకుడు శ్రీనివాస్ రాజుకు ఇలాంటి సినిమాలపై మంచి పట్టు వుందనే చెప్పుకోవాలి. డైరెక్టర్ రాసుకున్న పాత్రలని, వాటిని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. థియేటర్లో .. థియేటర్ కాన్సెప్ట్, సినిమాలో జరుగుతున్న వాటిపై ప్రేక్షకులు వేసుకునే సెటైర్లు, పాప్ కార్న్ సీన్, ప్రొజెక్టర్ పై మెసేజ్ లు, స్టార్టింగ్ టు ఎండింగ్ స్టొరీ లింకింగ్ వంటి వాటిల్లో దర్శకుడి ప్రతిభ కనబడుతుంది. ఎడిటింగ్ లో చాలా అనవసరపు సీన్లను కత్తిరించవచ్చు. నిర్మాణ విలువలు స్థాయికి తగ్గట్టుగా లేవు.

తీర్పు :

హర్రర్ జోనర్ కు ఎప్పటికీ ప్రత్యేక ప్రేక్షక వర్గం ఉంటుంది. వారిని టార్గెట్ చేసుకుని తీసిన సినిమానే గనుక, ఫ్యామిలీ ప్రేక్షకులకు అంతగా రుచించకపోయినా సినిమా విజయం సాదించే అవకాశాలు వున్నాయి. మొదటి పావుగంట నిదానంగా సాగటం, మధ్య మధ్యలో కాస్త అతిని తట్టుకోగలిగితే సినిమా కనెక్ట్ అవుతుంది. కొత్త కుర్రాళ్ళ ప్రయత్నంలా చూస్తే వారు మనల్ని నిరుత్సాహపరచలేదు అనే చెప్పుకోవాలి. పెద్ద సినిమాల నడుమ విడుదలైన ఈ సినిమాకి అంతగా ప్రమోషన్ లేదు కాబట్టి కేవలం మౌత్ పబ్లిసిటీపైనే ఈ సినిమా విజయం ఆధారపడివుంటుంది.

123తెలుగు.కామ్ రేటింగ్: 2.25/5

వంశీ కృష్ణ

CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version