సమీక్ష : తిక్క – తిక్క తిక్క కామెడీ!

'Thikka review

విడుదల తేదీ : ఆగష్టు 13, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5

దర్శకత్వం : సునీల్ కుమార్ రెడ్డి

నిర్మాత : సి. రోహిణ్ రెడ్డి

సంగీతం : ఎస్.ఎస్. థమన్

నటీనటులు : సాయిధరమ్ తేజ్, లారిస్సా బొనెసి, మన్నారా చోప్రా..


వరుస విజయాలతో జోరు మీద ఉన్న మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్, ఆ సక్సెస్ ట్రాక్‌ను అలాగే కొనసాగించాలన్న ఉద్దేశంతో ‘తిక్క’ అనే మరో కామెడీతో మనల్ని మెప్పించేందుకు వచ్చేశాడు. ‘ఓం’ సినిమాతో పరిచయమైన సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు భారీ అంచనాల నడుమ పెద్ద ఎత్తున విడుదలైంది. మరి సినిమా ఆ అంచనాలను అందుకుందా? చూద్దాం..

కథ :

ఆదిత్య (సాయిధరమ్ తేజ్) అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉండే ఓ సాధారణ యువకుడు. తాగడం, అమ్మాయిల వెంట పడడం తప్ప ఇంకే పనులూ లేని ఆదిత్య జీవితంలోకి అంజలి (లారిస్సా బొనెసి) ప్రవేశిస్తుంది. చూడడంతోనే ఆదిత్య, అంజలి ప్రేమలో పడిపోతాడు. కొన్నాళ్ళకు అంజలి కూడా అతడ్ని ప్రేమిస్తుంది. వారి ప్రేమ ప్రయాణం అలా సాఫీగా సాగుతుండగానే, కొన్ని అనుకోని కారణాల వల్ల అంజలి, ఆదిత్యకు బ్రేకప్ చెబుతుంది. ఈ బ్రేకప్‌తో పిచ్చోడైపోయిన ఆదిత్య, మళ్ళీ తాగడం మొదలుపెడతాడు. ఆ రాత్రి తాగి అతడు చేసే కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల కథంతా పూర్తిగా మారిపోతుంది. ఆదిత్య చేసిన ఆ తప్పులేంటి? అంజలి, ఆదిత్యకు బ్రేకప్ ఎందుకు చెబుతుంది? ఎన్నో మలుపులు తిరిగిన కథ చివరకు ఎక్కడకు చేరుతుందీ? అన్నది సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే నిస్సందేహంగా సాయిధరమ్ తేజ్ అనే చెప్పాలి. చాలా నీరసంగా నడిచే కథను కూడా తన ఎనర్జిటిక్ యాక్టింగ్, డైలాగ్ డెలివరీతో నడిపించగలిగాడు. ముఖ్యంగా ఏడుస్తూ కూడా కథ అవసరానికి తగ్గట్టు నవ్వించేలా చేయడంలో సాయిధరమ్ తేజ్ బాగా మెప్పించాడు. ఇక అజయ్, అతడి గ్యాంగ్ నేపథ్యంలో వచ్చే కన్ఫ్యూజన్ కామెడీ బాగుంది. కమెడియన్ సత్యకు రాసిన స్టీఫెన్ అనే క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. ఆ పాత్రలో సత్య మంచి టైమింగ్‌తో నవ్వించాడు.

సినిమా పరంగా చూసుకుంటే సెకండాఫ్‌ను ఉన్నంతలో మేజర్ హైలైట్‌గా చెప్పుకోవాలి. కథంతా చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ చుట్టూ తిరుగుతూ ఉండే సెకండాఫ్ అక్కడక్కడా నవ్వించేలా ఉంది. ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా చాలా బాగుంది. తిక్క తిక్క అనే పాట కూడా బాగా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

ఈ సినిమాకు కథనమే అతిపెద్ద మైనస్ పాయింట్. ఒక కామెడీ సినిమాకు సరిపడే స్థాయి కన్ఫ్యూజన్‌ను పెట్టుకొని కూడా దాన్ని సరైన రీతిలో చెప్పలేకపోవడంతో సినిమా అంతా నీరసంగా సాగిపోయింది. ఫస్టాఫ్ అయితే పూర్తిగా లౌడ్ కామెడీతో నడుస్తూ చాలా చోట్ల విసుగు పుట్టించింది. సెకండాఫ్‌లో మళ్ళీ ఈ కన్ఫ్యూజన్‌ను అందుకొని నవ్వించే ప్రయత్నం చేసినా, అప్పటికే సినిమా అంతా దారితప్పిపోవడంతో ఏదీ కాపాడలేకపోయాయి.

హీరోయిన్లు లారిస్సా బొనెసి, మన్నారా చోప్రాలు సినిమాకు పెద్దగా ఉపయోగపడింది లేదు. మన్నారా చోప్రా పాత్ర అయితే చాలా సిల్లీగా ఉంది. ఇక తిక్క తిక్క పాట మినహాయిస్తే ఏ పాట కూడా సందర్భానికి తగ్గట్టు రాలేదు. ఆలీ-ముమైత్ ఖాన్‌ల ట్రాక్ అస్సలు బాగోలేదు. కామెడీ అని చెప్పుకోవడానికి ఫస్టాఫ్‌లో వచ్చే సన్నివేశాలన్నింట్లోనూ సరైన క్లారిటీ లేదు. హీరో-హీరోయిన్ల లవ్ ట్రాక్ కూడా ఏమాత్రం ఆకట్టుకునేలా లేదు. ఇంటర్వెల్ బ్లాక్ మినహాయిస్తే ఫస్టాఫ్‌లో ఒక్క ఎగ్జైటింగ్ ఎలిమెంట్ కూడా లేదు. సినిమా మొత్తంలో ఎక్కడ వెతికినా, ఎమోషన్, లాజిక్ అన్నవి కనిపించవు.

సాంకేతిక విభాగం :

సాంకేతిక అంశాల పరంగా చూస్తే ఈ సినిమాలో కె.వి.గుహన్‌కు ఎక్కువ మార్కులు ఇవ్వొచ్చు. ఎక్కువగా రాత్రిపూటే జరిగే కథకు తగ్గ లైటింగ్‌ను, సినిమా చెప్పాలనుకున్న అంశానికి తగ్గ ఫ్రేమింగ్‌ను వాడుతూ గుహన్ మంచి ప్రతిభ చూపాడు. థమన్ అందించిన పాటల్లో రెండు వినడానికి బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంది. ఎడిటింగ్ చాలా బాగుంది. కొన్నిచోట్ల ఎడిటింగ్ పరంగా చేసిన ప్రయోగాలు కూడా ఫర్వాలేదు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ చాలా బాగున్నాయి.

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి విషయానికి వస్తే, ఒక కామెడీ సినిమాకు సరిపడే కథను చేతుల్లో పెట్టుకొని దాన్ని పూర్తిగా మిస్‌ఫైర్ చేశాడనే చెప్పుకోవాలి. ఎక్కడా స్క్రీన్‌ప్లేపై పట్టు లేకుండా రాసిన సన్నివేశాలన్నీ బోరింగ్‌గా సినిమాను నడిపాయి. మేకింగ్ పరంగా మొదటి పదినిమిషాలు, ఇంటర్వెల్‌లో సునీల్ తన ప్రతిభను చూపుకోగలిగాడు. అయితే ఒక మంచి కన్ఫ్యూజన్ కామెడీని అందించగల అవకాశాన్ని సరిగ్గా వినియోగించుకోవడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు.

తీర్పు :

కామెడీ సినిమాల్లో కన్ఫ్యూజన్‌ అనేది సినిమాను బాగా నడిపిస్తూ ఉంటుంది. ఇప్పటికే తెలుగులో చాలా హిట్ కామెడీ సినిమాలు ఇదే విషయాన్ని ఋజువుచేశాయి. ‘తిక్క’ ఒరిజినల్ స్టోరీని చూస్తే అలాంటి కన్ఫ్యూజన్ చాలా ఉందని అనిపించేలా ఉన్నా, దాన్ని సినిమాగా మలచడంలో తేలిపోవడంతో చివరకు ఆ తిక్కే బోల్తా కొట్టింది. సెకండాఫ్‌లో అక్కడక్కడా నవ్వించే కన్ఫ్యూజన్, సాయిధరమ్ తేజ్ ఎనర్జిటిక్ టైమింగ్ లాంటి అనుకూలాంశాలతో వచ్చిన ఈ సినిమాలో మిగతావన్నీ ప్రతికూలాంశాలే. ఒక్క మాటలో చెప్పాలంటే.. ‘తిక్క’ కామెడీ, నవ్వించకపోగా ‘తిక్క తిక్కగా’ మిగిలిపోయింది!

123telugu.com Rating : 2.25/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version