సమీక్ష : తొలిప్రేమలో – ఫీల్ గుడ్ లవ్‌స్టోరీ.. కొంతవరకే!

Tholi Premalo review

విడుదల తేదీ : ఆగష్టు 26, 2016

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

దర్శకత్వం : ప్రభు సాల్మన్

నిర్మాత : యాదాద్రి ఎంటర్‌టైన్‌మెంట్స్‌

సంగీతం : డి. ఇమాన్

నటీనటులు : చంద్రన్, ఆనంది, విన్సెంట్..

దర్శకుడు ప్రభు సాల్మన్‌కు తమిళంలో మంచి పేరుంది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాల్లో ప్రేమఖైదీ, గజరాజు లాంటివి తెలుగులో డబ్ అయి ఇక్కడి ప్రేక్షకులనూ బాగానే ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన కయల్ అనే సినిమాను తెలుగులో తొలిప్రేమలో పేరుతో డబ్ చేశారు. చంద్రన్, ఆనంది ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో విడుదలవుతోంది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం..

కథ :

ఆరోన్ (చంద్రన్), సోక్రటీస్ (విన్సెంట్) ఇద్దరు మంచి మిత్రులు. ఏ ఆధారమూ లేని ఈ ఇద్దరూ ఆరు నెలల పాటు విపరీతంగా కష్టపడి డబ్బు సంపాదించుకొని, మరో ఆరు నెలలు దేశపర్యటన చేస్తూంటారు. ఈ ప్రయాణాలే తమ జీవితమని బతికే ఈ ఇద్దరూ, కన్యాకుమారి వెళ్ళే దారిలో ఓ గొడవలో చిక్కుకుంటారు. అక్కడే ఆరోన్, కావేరీ (ఆనంది) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. అయితే పరిస్థితులు వీరిద్దరినీ విడదీస్తాయి. ఆ తర్వాత వీరి ప్రేమకథ ఏయే మలుపులు తిరుగుతుందీ? చివరకు ఎక్కడికి చేరుతుందీ? అన్నదే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ అంటే కథా నేపథ్యం అనే చెప్పాలి. ట్రావెలింగ్‌యే జీవితంగా బతికే ఓ యువకుడు తన ఈ ట్రావెల్‌లోనే ఓ అమ్మాయిని ప్రేమించడం, పరిస్థితులు వారిని విడదీయడం, సునామీ వల్ల ఆ ప్రేమకథ అనుకోని మలుపులు తిరగడం.. ఇవన్నీ ఈ ప్రేమకథలో చాలా కొత్తగా కనిపించి మంచి ఫీల్‌ను అందించాయి. ఇక ఫస్టాఫ్‌ను ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా చెప్పుకోవాలి. ముఖ్యంగా జమీందారీ వంశ నేపథ్యం ఉన్న ఇంట్లో ఈ ఇద్దరూ చిక్కుకోవడం, అక్కడ వచ్చే కామెడీ అదిరిపోయింది.

హీరో చంద్రన్ తన పాత్రలో బాగా నటించాడు. ఆ పాత్ర అవసరానికి తగ్గట్టే నిలకడగా ఉండకుండా, ఏదో ఒక పనిచేస్తూ నటించడం బాగా నప్పింది. తెలుగమ్మాయి ఆనంది చూడడానికి బాగుంది. తన పాత్రలో ఆనంది ఒదిగిపోయి నటించింది. ఇక హీరో ఫ్రెండ్‌గా నటించిన విన్సెంట్ బాగానే నవ్వించాడు.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్‌ని ఈ సినిమాకు అతిపెద్ద మైనస్ పాయింట్‌గా చెప్పుకోవాలి. ఇంటర్వెల్ దగ్గర ఆగిపోయిన కథ క్లైమాక్స్ వరకూ ఎక్కడా కదిలినట్లు అనిపించలేదు. చూసిన సన్నివేశాలే మళ్ళీ చూస్తున్నట్లు, కథ ముందుకు కదలక క్లైమాక్స్ వరకూ సినిమా బోరింగ్‌గా నడిచింది. ఇక సినిమాలో అసలైన ప్రేమకథకు కూడా పూర్తిగా క్లారిటీ లేదు. ‘ఇష్టపడ్డాను’ అని హీరో చెప్పిన ఒక్క మాట కోసం హీరోయిన్ ఏదీ ఆలోచించకుండా, ఎక్కడ ఉంటాడో కూడా తెలియకుండా వెతకడం ప్రాక్టికల్‍గా చూస్తే సిల్లీగా కనిపించింది.

పాటలు కూడా వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రావడం విసుగు పుట్టించింది. ముఖ్యంగా సెకండాఫ్ అంతా పాటలే ఉన్నట్లు కనిపించడం పెద్ద మైనస్‌గానే చెప్పొచ్చు. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఆకట్టుకునేలా లేదు. ఇక లాజికల్‌గా చూస్తే చాలాచోట్ల సునామీ జరిగిన సమయానికి, కథ నడిచే సమయానికి సంబంధం లేనట్లు కొన్ని సన్నివేశాలు ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

ముందుగా దర్శకుడు ప్రభు సాల్మన్ గురించి చెప్పుకుంటే, మంచి నేపథ్యాన్ని, దానికి తగ్గట్టే మంచి ఫస్టాఫ్‌ను బాగా రాసుకున్న ఆయన, సెకండాఫ్ విషయంలో మాత్రం తేలిపోయాడనిపించింది. క్లైమాక్స్‌లో ఓ బలమైన అంశాన్ని పెట్టుకొని దాన్ని చెప్పడం కోసం సెకండాఫ్‌నంతా బోరింగ్‌గా నడిపించాడు. మేకింగ్ పరంగా ప్రభు సాల్మన్ చాలా చోట్ల తన ప్రతిభ చూపాడు.

మహేంద్రన్ సినిమాటోగ్రఫీకి వంక పెట్టలేం. న్యాచురల్ లొకేషన్స్‌లో నడిచే కథను తన సినిమాటోగ్రఫీతో మహేంద్రన్ అందంగా చూపించాడు. ఇమ్మాన్ అందించిన పాటలు బాగానే ఉన్నాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లో ఇమ్మాన్ మంచి ప్రతిభ చూపాడు. సామ్యూల్ ఎడిటింగ్ బాగుంది. బడ్జెట్ స్థాయి బట్టి చూస్తే విజువల్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. తెలుగు వర్షన్ డబ్బింగ్ ఫర్వాలేదు. శశాంక్ వెన్నెల కంటి రాసిన తెలుగు డైలాగ్స్ బాగా కుదిరాయి.

తీర్పు :

రియలిస్టిక్ ప్రేమకథలను తీయడంలో తమిళ సినిమాలు చాలా ముందుటాయని కొన్ని తెలుగులో డబ్ అయి హిట్ అయిన చాలా సినిమాలే ఋజువు చేశాయి. సరిగ్గా ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని తెలుగులోకి తీసుకురాబడ్డ మరో రియలిస్టిక్ ప్రేమకథే ‘తొలిప్రేమలో’. కథ నడిచే నేపథ్యం, ఫస్టాఫ్‌లో కట్టిపడేసే సన్నివేశాలు, మంచి క్లైమాక్స్ లాంటి ప్లస్‌లతో వచ్చిన ఈ సినిమా అసలు కథలో క్లారిటీ లేకపోవడం, సెకండాఫ్ అంతా గాడితప్పడం లాంటివి మైనస్ పాయింట్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ ‘తొలిప్రేమలో’ పూర్తిగా మునిగినా, సగం ఫీల్ మాత్రమే వచ్చింది.

123telugu.com Rating : 2.75/5

Reviewed by 123telugu Team

Click here for English Review

Exit mobile version