విడుదల తేదీ : 30 జనవరి 2015 | ||
123తెలుగు. కామ్ రేటింగ్ : 1/5 | ||
దర్శకత్వం : గొల్లపాటి నాగేశ్వరరావు | ||
నిర్మాత : పసుపులేటి బ్రహ్మం | ||
సంగీతం : జయసూర్య | ||
నటీనటులు : రాజేంద్ర ప్రసాద్, సోని చరిష్ట, గిరిబాబు |
రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘టాప్ ర్యాంకర్స్’. ఎ జర్నీ బిట్వీన్ ఎల్.కె.జి టు ఎంసెట్ అనేది ఉపశీర్షిక. విశ్వ విజన్ ఫిల్మ్స్ పతాకంపై గొల్లపాటి నాగేశ్వరరావు దర్శకత్వంలో పసుపులేటి బ్రహ్మం ఈ సినిమాను నిర్మించారు. జయసూర్య సంగీతం అందించిన ఈ సినిమా నేడు విడుదలైంది. టైటిల్ కు తగ్గట్టు సినిమా టాప్ ర్యాంక్ సాధించే విధంగా ఉందొ..? లేదో..? ఓసారి చూడండి.
కథ :
దేశవ్యాప్తంగా రెండు వందల బ్రాంచీలు గల సెంట్ మేరీస్ విద్యాసంస్థల పురోగతిలో ప్రిన్సిపాల్ విశ్వనాధ్ (రాజేంద్ర ప్రసాద్) పాత్ర ఎంతో ఉంది. ప్రతి రోజు 20 గంటలు విద్యార్ధులు చదవాలని కొత్త కొత్త రూల్స్ తీసుకువస్తాడు. కాలేజీలో విద్యార్ధులను మనుషులుగా కాకుండా, ఎంసెట్ లో ర్యాంకులు సాధించే రోబోలు కిందా చూస్తాడు. వారి సంతోషం గురించి కాస్తయినా ఆలోచించాడు. ఎంసెట్ లో తమ కాలేజీ విద్యార్ధులే టాప్ ర్యాంకులు సాదించాలనిది అతని టార్గెట్. ఇంట్లో కూతురిని సైతం ఎంతసేపు చదవు చదువు అంటూ కోప్పడతాడు. ఒక్కసారి కూడా ప్రేమగా మాట్లాడిన సందర్భం ఉండదు. పదవ తరగతిలో 18వ ర్యాంక్ సాధించిన కూతురిని విపరీతంగా తిడతాడు. కన్న కూతురికి టాప్ ర్యాంక్ రాకపోవడం పెద్ద అవమానం అంటూ కూతురిని అసహ్యించుకుంటాడు. తండ్రి విశ్వనాద్ ప్రవర్తన సహించలేని కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది.
కూతురి ఆత్మహత్య తర్వాత విశ్వనాథ్ లో ఎటువంటి మార్పు వచ్చింది..? ఆ మార్పు పలితంగా విద్యావిధానంలో ఎటువంటి మార్పులు తీసుకురావాలని విశ్వనాథ్ ప్రయత్నించాడు..? దీని పట్ల సెంట్ మేరీస్ విద్యాసంస్థలలో భాగస్వామ్యులైన మిగతా వారు ఎలా స్పందించారు..? విశ్వనాథ్ తన ప్రయత్నంలో విజయవంతం అయ్యాడా..? లేదా..? అనేది మిగతా సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ అభినయానికి వంక పెట్టలేం. ప్రతి సన్నివేశంలో తన నటనతో ఆకట్టుకున్నారు. ఫస్ట్ హాఫ్ లో సీరియస్ గా విద్యార్ధుల చదువు, ర్యాంకులు తప్ప ఇతర విషయాలు పట్టని హిట్లర్ ప్రిన్సిపాల్ గా… సెకండ్ హాఫ్ లో పిల్లల సంతోషమే ముఖ్యమనే ఒక మనిషిగా తనదైన శైలిలో నటించి మెప్పించారు. రాజేంద్ర ప్రసాద్ కూతురిగా నటించిన అమ్మాయి నటన బాగుంది. వీరిద్దరూ బాగా నటించడంతో ఇంటర్వెల్ ముందు సూసైడ్ సన్నివేశం, థియేటర్లో ప్రేక్షకుల చేత కంటతడి పెట్టించింది.
మైనస్ పాయింట్స్ :
ప్రారంభంలోనే సినిమా పాయింట్ ఏంటి అనేది క్లియర్ కట్ గా ప్రేక్షకులకు అర్ధం అవుతుంది. ఎల్.కె.జి ఫీజులకు లక్షల డొనేషన్లు, ర్యాంకులు సాధించాలనుకునే లక్ష్యంతో విద్యార్ధులను చదువు పేరుతో హింసించే కాలేజీ యాజమాన్యాలు, తల్లిదండ్రుల ప్రేమాభిమానాల కోసం తాపత్రయపడే పసి హృదయాలు.. ఇలా గతంలో పలు సినిమాలలో టచ్ చేసిన పాయింట్లను కొంచంగా కొత్తగా చెప్పాలని ప్రయత్నించి, తీవ్రంగా విఫలమయ్యారు. దానికి తోడు ఆర్టిస్టుల నటన మేజర్ మైనస్ పాయింట్ గా నిలిచింది. విద్యార్ధులతో మ్యూజిక్ టీచర్ కలిసి డాన్స్ చేసిన సాంగ్, ఐటెం సాంగ్ లా ఉంది. ఓ వైపు సందేశం ఇస్తూ.. మరోవైపు ఇలాంటి అసభ్యకరమైన సాంగులు ఎలా పెట్టారో..?
రాజేంద్ర ప్రసాద్ ను మినహాయిస్తే సినిమాలో ముఖ్య పాత్రలలో విద్యార్ధులుగా నటించిన వారందరూ కొత్త ముఖాలే. వారిలో ఒక్కరి నటన కూడా ఆకట్టుకునే విధంగా లేదు. ఒకవైపు రాజేంద్ర ప్రసాద్ అద్బుతంగా నటిస్తున్నా, సన్నివేశంలో ఇతర పాత్రధారుల నుండి ఎటువంటి సహకారం లేదు. దాంతో, థియేటర్లలో ప్రేక్షకులకు సినిమాపై అనాసక్తి, చిరాకు వస్తాయి. ఇంటర్వెల్ ముందు వరకు భారంగా నడిచిన సినిమా, సూసైడ్ సన్నివేశంతో ఒక్కసారిగా ప్రేక్షకులలో ఒక సదాభిప్రాయం తీసుకొస్తుంది. సెకండ్ హాఫ్ బాగుంటుందని ఆశించిన ప్రేక్షకులు మరోసారి మోసపోతారు.
సాంకేతిక విభాగం :
సంగీత దర్శకుడు జయసూర్య స్వరపరిచిన పాటల్లో గుర్తుంచుకునే పాట ఒక్కటి కూడా లేదు. రీ రికార్డింగ్ ఇతర సినిమాల నుండి స్ఫూర్తితో చేసేశారు. యాక్షన్ సన్నివేశాలలో షారుఖ్ ఖాన్ ‘డాన్’ రీ రికార్డింగ్ కాపీ కొట్టడం విశేషం. నిర్మాణ విలువలు లో బడ్జెట్ సినిమాల తరహాలోనే ఉన్నాయి. ఎడిటర్, సినిమాటోగ్రాఫర్ లకు అద్బుతాలు చేసే అవకాశం రాలేదు.
కాన్సెప్ట్ పాతదైనా పర్వాలేదు.. ఆసక్తికరంగా కథను నడిపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు. అని గతంలో పలు సినిమాలు రుజువు చేశాయి. చదువు పేరుతో పిల్లలను సంతోషానికి దూరం చేస్తున్నాం. కాలేజీ యాజమాన్యాలు, తల్లిదండ్రుల ఆలోచన దృక్పదం మారాలనే పాయింట్ తో గతంలో పలు సినిమాలు వచ్చాయి. ఈ సినిమా పాయింట్ అదే. కానీ, కథను ఆసక్తికరంగా చెప్పడంలో.. సన్నివేశాలను ప్రేక్షకులు హర్షించే విధంగా తీయడంలోను దర్శకుడు గొల్లపాటి నాగేశ్వరరావు ఫెయిల్ అయ్యారు. ప్రారంభం నుండి కథ ముగిసే వరకు దర్శకుడు ఎక్కడా మ్యాజిక్ చేయలేదు. దాంతో, సినిమా బోరింగ్ గా మారింది.
తీర్పు :
‘టాప్ ర్యాంకర్స్’ అనే టైటిల్ కు ఒక్క రాజేంద్రప్రసాద్ మాత్రమే న్యాయం చేశారు. నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ నటన తప్పిస్తే, సినిమాలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం మరొకటి లేదు. చదువు పేరుతో పిల్లలను సంతోషానికి దూరం చెయ్యొద్దు అనే కాన్సెప్ట్ తో గతంలో పలు సినిమాలు వచ్చాయి. అదే పాయింట్ తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయ్యింది. ఆర్టిస్టుల పేలవమైన నటనతో సన్నివేశాలు తేలిపోయాయి. దాంతో, సినిమా ఒక రేంజ్లో బోర్ కొడుతుంది.
123తెలుగు. కామ్ రేటింగ్ : 1/5
123తెలుగు టీం