సమీక్ష : ట్రూ లవర్ – కొన్ని చోట్ల ఆకట్టుకునే ట్రూ లవ్ డ్రామా !

True Lover Movie Review in Telugu

విడుదల తేదీ : ఫిబ్రవరి 10, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు: మణికందన్, శ్రీ గౌరీ ప్రియ, కన్నా రవి, తదితరులు

దర్శకుడు : ప్రభురామ్ వ్యాస్

నిర్మాతలు: నజెరత్ పసిలియన్, మగేష్ రాజ్ పాసిలియన్, యువరాజ్ గణేశన్

సంగీత దర్శకులు: సీన్ రోల్డన్

సినిమాటోగ్రాఫర్‌లు: శ్రేయాస్ కృష్ణ

ఎడిటింగ్: బరత్ విక్రమన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

మణికందన్ – గౌరీప్రియ జంటగా ప్రభురామ్ వ్యాస్ దర్శకత్వంలో తమిళ్ లో తెరకెక్కిన ‘లవర్’ సినిమాని, తెలుగులో మారుతి, SKN ‘ట్రూ లవర్’ పేరుతో ఈ రోజు రిలీజ్ చేశారు. మరి, ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

అరుణ్ (మణికందన్), దివ్య (గౌరి ప్రియ) కాలేజీ రోజుల్లో నుంచే ప్రేమలో ఉంటారు. అలా ఆరేళ్లుగా గడిచిపోతాయి. దివ్య ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటుంది. కానీ, అరుణ్ మాత్రం ఇంట్లో 15 లక్షలు తీసుకుని ఒక కాఫీ షాప్ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ, మరోవైపు తాగుతూ టైమ్ పాస్ చేస్తుంటాడు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ సంఘటనల అనంతరం.. వీరిద్దరి మధ్య ఎలాంటి గొడవలు వచ్చాయి ?, దూరం అవుతూనే ఎలా దగ్గర అయ్యారు ?, ఈ లోపు దివ్య తన తోటి ఉద్యోగస్తులతో కాస్త క్లోజ్ గా ఉండడం అరుణ్ కి ఎందుకు నచ్చదు ?, చివరికి వీళ్లిద్దరు కలిశారా ?, విడిపోయారా?, ఇంతకీ.. కేఫ్ పెట్టాలన్న అరుణ్ కల నెరవేరిందా ? లేదా ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

చిన్న చిన్న విషయాలకే అపోహలతో – అపార్థాలతో లవర్స్ ఎలా గొడవ పడతారు ?, వారి మధ్య ఎలాంటి డ్రామా నడుస్తోంది ?, అసలు ఈ జనరేషన్ ప్రేమ కథలు ఎలా ఉన్నాయి ? అనే కోణంలో దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ రాసుకున్న కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. లవర్స్ మధ్య జన్యూన్ ఎమోషన్ ఉంటే ఎంత బాగుంటుందో దర్శకుడు ఈ సినిమాలో చాలా చక్కగా చూపించాడు.

మళ్లీ అంతలోనే ఆ పాత్రల మధ్యనే గొడవలను, కన్నీళ్లను మరియు అభిమానాలతో కూడుకున్న ఆత్మాభిమానాలను కూడా బాగానే ఎస్టాబ్లిష్ చేశాడు. మొత్తానికి ఈ ‘ట్రూ లవర్’ సినిమాలో వాస్తవ పరిస్థితులు.. అలాగే సగటు కుర్రాళ్ళ భావోద్వేగాలు బాగున్నాయి. ఇక నటన విషయానికి వస్తే.. హీరోగా నటించిన మణికందన్ తన కామెడీ టైమింగ్ తో అండ్ తన ఎమోషనల్ యాక్టింగ్ తో బాగా నటించాడు.

సినిమాలోని కోర్ ఎమోషన్ని మణికందన్ తన హావభావాలతోనే బాగా పలికించాడు. అలాగే హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ కూడా చాలా బాగా నటించింది. ఇక కన్నా రవితో పాటు మిగిలిన ప్రధాన పాత్రధారులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

మైనస్ పాయింట్స్ :

దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ తీసుకున్న కథాంశం బాగున్నప్పటికీ.. కథనం మాత్రం కొన్ని చోట్ల సింపుల్ గా సాగుతుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే ఇంట్రెస్ట్ కలిగించలేని ట్రీట్మెంట్ తో బాగా స్లోగా సాగుతుంది. ఇక హీరోహీరోయిన్ల మధ్య ఉన్న కొన్ని లవ్ సీన్స కూడా చాలా రెగ్యులర్ గానే ఉంటాయి. దీనికితోడు దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ లవర్స్ మధ్య రిలేషన్ ను దృష్టిలో పెట్టుకుని అనవసరమైన రిపీటెడ్ సన్నివేశాలను జోడించాడు.

పైగా కథకు బలం పెంచలేని లవ్ అండ్ ఫ్యామిలీ సీన్స్ ఎక్కువైపోయాయి. అలాగే, కొన్ని ఓవర్ డ్రామా సీన్స్ కూడా సినిమాకి బలహీనతగా నిలుస్తాయి. మొత్తానికి దర్శకుడు ప్రభురామ్ వ్యాస్ తాను అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేసినా.. సినిమాలో కొన్ని రొటీన్ సీన్స్ ను ట్రిమ్ చేసి వుంటే సినిమాకి ప్లస్ అయ్యేది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. ప్రభురామ్ వ్యాస్ దర్శకుడిగా మంచి కథాంశంతో ఆకట్టుకున్నాడు. అలాగే, ఆయన రాసుకున్న కొన్ని కీలక సన్నివేశాలు కూడా బాగున్నా.. పూర్తి స్థాయిలో ఆయన ఆకట్టుకోలేకపోయారు. సంగీత దర్శకుడు సీన్ రోల్డన్ అందించిన పాటలు బాగున్నాయి. అదే విధంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కొన్ని కీలక సన్నివేశాల్లో బాగుంది. ఎడిటర్ అనవసరమైన సీన్స్ ని ఇంకా టైట్ గా ట్రీమ్ చేసి ఉండి ఉంటే, సినిమాకి ప్లస్ అయ్యేది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ బాగుంది. ఫైనల్ గా నిర్మాతలు ‘నజెరత్ పసిలియన్, మగేష్ రాజ్ పాసిలియన్, యువరాజ్ గణేశన్’ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు:

‘ట్రూ లవర్’ అంటూ వచ్చిన ఈ లవ్ డ్రామాలో.. లవర్స్ మధ్య అపోహలను – అపార్థాలను, అలాగే గొడవలను – బాధలను కూడా బాగా ఎస్టాబ్లిష్ చేశారు. కొన్ని ఎమోషనల్ సీన్స్ తో పాటు కొన్ని కామెడీ సీన్స్ కూడా ఆకట్టుకున్నాయి. అయితే, రెగ్యులర్ లవ్ సీన్స్, ఇంట్రెస్ట్ కలిగించలేని స్క్రీన్ ప్లే వంటి అంశాలు సినిమాకి మైనస్ గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమాలోని కొన్ని ఎలిమెంట్స్ యూత్ కు కనెక్ట్ అవుతాయి.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version