ఓటీటీ సమీక్ష : ‘టక్ జగదీష్’ – ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే జగదీష్

ఓటీటీ సమీక్ష : ‘టక్ జగదీష్’ – ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించే జగదీష్

Published on Sep 11, 2021 3:02 AM IST
Laabam Movie Review

విడుదల తేదీ : సెప్టెంబర్ 10, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

నటీనటులు: నాని, రీతూ వర్మ, జగపతి బాబు, ఐశ్వర్య రాజేశ్ తదితరులు

దర్శకుడు: శివ నిర్వాణ

నిర్మాత‌లు: సాహు గారపాటి, హ‌రీశ్ పెద్ది

సంగీత దర్శకుడు: తమన్

సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల

ఎడిటర్: ప్రవీణ్ పూడి

నేచురల్ స్టార్ నాని హీరోగా, రీతూ వర్మ హీరోయిన్‌గా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘టక్ జగదీష్’. మంచి అంచనాల మధ్య ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌గా డైరెక్ట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో వినాయక చవితి సందర్భంగా నేడు విడుదలయ్యింది. మరీ ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం రండి.

 

కథ:

భూదేవిపురం అనే ఓ ఊరిలో ఆది శేష‌గిరి నాయుడు (నాజ‌ర్‌)ది పెద్ద కుటుంబం. ఆయనకు బోస్ (జ‌గ‌ప‌తిబాబు), ట‌క్ జ‌గ‌దీష్ (నాని) ఇద్దరు కొడుకులు, మరియు ఇద్దరు కూతుళ్లు. ఆ ఊరిలో భూ తగాదాలు ఎక్కువగా ఉంటాయి. భూప‌తి కుటుంబంలోని వీరేంద్ర (డేనియల్ బాలాజీ) అందుకు ప్రధాన కారణం. వీటిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే శేష‌గిరి నాయుడు హఠాత్తుగా చనిపోతాడు. ఆ తర్వాత బోస్, వీరేంద్రతో చేతులు కలపడంతో పరిస్థితులు అన్ని ఒక్కసారిగా మారిపోతాయి. కుటుంబమంతా విడిపోతుంది. ఈ సమయంలో ఎం.ఆర్‌.ఓ గా ఎంట్రీ ఇచ్చిన ట‌క్ జ‌గ‌దీష్ పరిస్థితులను ఎలా చక్కదిద్దాడు? మళ్ళీ తన కుటుంబాన్ని ఎలా కలిపాడు? అనేదే మిగతా కథ.

 

ప్లస్ పాయింట్స్:

ఈ సినిమాకు ప్రధానమైన ప్లస్ పాయింట్ ఏమిటంటే అది నాని నటనే అని చెప్పాలి. ఎలాంటి ఎమోషన్‌ని అయినా నాని చాలా చక్కగా పండించగలడన్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో తన లుక్, యాక్టింగ్ అన్ని కూడా మునపటి కంటే మరింతగా ఆకట్టుకున్నాయి. గుమ్మడి వరలక్ష్మిగా రీతూ వర్మ కూడా ఆకట్టుకోవడమే కాకుండా నానికి మంచి సపోర్ట్ ఇచ్చిందని చెప్పాలి.

విలక్షణ నటుడు జగపతి బాబు పాత్ర సెకండాఫ్‌లో బాగా సెట్ చేయబడిందని చెప్పాలి. నానితో అతని సన్నివేశాలన్నీ చాలా చక్కగా నిర్వహించబడ్డాయి. విలన్‌గా డేనియల్ బాలాజీ తన నటనతో బాగానే ఆకట్టుకున్నాడు కానీ సెకాండాఫ్‌లో అతడి విలనిజాన్ని పూర్తిగా తగ్గించేశారు.

ఇక ఫస్ట్ హాఫ్ అంతా చక్కని కుటుంబ భావోద్వేగాలతో నడిచింది. ప్రీ-ఇంటర్వెల్ సమయంలో తీసుకొచ్చిన ట్విస్ట్, ఇంటర్వెల్ బ్యాంగ్ చాలా బాగున్నాయి. ఐశ్వర్య రాజేష్ తన పాత్రలో ఉన్నంతలో బాగా చేసింది. నరేష్, రావు రమేష్, రోహిణి, దేవదర్శిని ఒకే అనిపించారు.

 

మైనస్ పాయింట్స్:

ఈ సినిమాకు ప్రధానమైన డ్రా బ్యాక్ కథలో కొత్తదనం లేకపోవడం. గతంలో ఇలాంటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలు చాలానే వచ్చాయి కనుక ప్రేక్షకులు కాస్త కొత్తదనాన్ని ఆశిస్తారు. కానీ ఇందులో అలాంటిదేమి కనిపించలేదు. ఇకపోతే సినిమాలో నాజ‌ర్‌కి ఇద్ద‌రు భార్య‌లు అని మొదటి భార్య కొడుకు కేవలం నాని ఒక్కడే అన్న పాయింట్‌ని ప్రేక్ష‌కుల‌కు సరైన క్లారిటీతో చెప్ప‌లేక‌పోయాడు. నానిపై కూడా కొన్ని అనవసరమైన సీన్స్ తీసుకొచ్చారనిపించింది.

ఇక ఈ సినిమాలో తల్లి పాత్రగా పార్వతి ఎంపిక పూర్తిగా తప్పనే చెప్పాలి. ఆమె స్క్రీన్‌ను క్యాచ్ చేయలేకపోవడం అతిపెద్ద లోపమని చెప్పాలి. అయితే ఈ పాత్ర కోసం అందరికి తెలిసిన నటిని పెట్టి ఉంటే బాగుండేదనిపించింది.

ఇక ఐశ్వర్య రాజేశ్ యొక్క క్యారెక్టర్ కూడా కొత్తగా అనిపించేలేదు. దర్శకుడు శివ నిర్వాణ స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుందని చెప్పాడు కానీ అది కనిపించలేదు.

 

సాంకేతిక విభాగం:

సినిమా నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి, కెమెరా పనితీరు ఆకట్టుకుంది. తమన్ సంగీతం బాగుంది కానీ గోపి సుందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. నాని ఎమ్మార్వోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత కొన్ని అనవసరమైన సన్నివేశలు ఎడిటింగ్ పరంగా తొలగించి ఉంటే బాగుండేది. డైలాగ్స్ చక్కగా ఉన్నాయి కానీ స్క్రీన్ ప్లే మాత్రం డల్ గా అనిపించింది.

దర్శకుడు శివ నిర్వాణ విషయానికి వస్తే ఒక సాధారణ కథను తీసుకున్నా కూడా భావోద్వేగాలను మాత్రం చక్కగా చూపించగలుగుతాడు. గతంలో అతను చేసిన రెండు సినిమాలు మజిలీ, నిన్ను కోరి కూడా సాధారణ కథలను కలిగి ఉన్నప్పటికీ చక్కటి భావోద్వేగాలను చూపించాడు. కానీ కొన్ని కీలక సందర్భాల్లో భావోద్వేగాలు చాలా కృత్రిమంగా కనిపిస్తున్నాయన్న దానిపై ఇంకాస్త దృష్టి పెట్టాలి.

 

తీర్పు:

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ‘టక్ జగదీశ్’ ఒక మంచి ఫ్యామిలీ టచ్ ఎమోషన్స్ మరియు మంచి ట్విస్టులను కలిగి ఉంది. నాని తన నటనతో సినిమాకు ప్రధాన ఫిల్లర్‌గా నిలిచాడనే చెప్పుకోవాలి. సెకండ్ హాఫ్‌లో కథనం కాస్త దెబ్బతిన్నప్పటికీ ప్రీ-క్లైమాక్స్ మరియు ఎండింగ్‌ని బాగా ముగించారు. ఏది ఏమైనా ఫ్యామిలీ ఆడియన్స్‌ని మాత్రం ఈ వారం టక్ జగదీశ్ మెప్పిస్తాడనే చెప్పాలి.

123telugu.com Rating : 3/5

Reviewed by 123telugu Team

Click Here For English Version

సంబంధిత సమాచారం

తాజా వార్తలు