Release date : July 30th, 2020
123telugu.com Rating : 3/5
నటీనటులు : సత్యదేవ్, హరి చందన, రూప, నరేష్, సుహాస్
దర్శకుడు : వెంకటేష్ మహా
నిర్మాత : విజయ ప్రవీణ పరుచురి, శోబు యర్లగడ్డ, ప్రసాద్ దేవినేని
సంగీతం : బిజిబాల్
లాక్ డౌన్ రివ్యూ సిరీస్ లో భాగంగా నేడు తెలుగు ఫిల్మ్ ఉమామహేశ్వర ఉగ్రరూపస్య ని ఎంచుకోవడంకోసం జరిగింది. సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. మరి ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో చూద్దాం…
కథ:
ఫోటోగ్రాఫర్ అయిన మహేష్(సత్య దేవ్) తన ప్రొఫెషన్ ని ఆస్వాదిస్తూ హ్యాపీ లైఫ్ అనుభవిస్తూ ఉంటాడు. అసలు గొడవలు అంటే ఇష్టపడని మహేష్ ని గర్ల్ ఫ్రెండ్ స్వాతి (హరి చందన) అతన్ని వదిలేసి, వేరొకరిని పెళ్లి చేసుకొని దూరం అవుతుంది. ఈ క్రమంలో జోగి అనే వ్యక్తితో మహేష్ కి వివాదం ఏర్పడుతుంది. జోగి మహేష్ ని తన ఊరి ప్రజల సమక్షంలో అవమానానికి గురి చేస్తాడు. దీనితో మహేష్ జోగిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి అనుకుంటాడు. ఐతే ఇదే సమయంలో తన శత్రువు జోగి చెల్లెలు జ్యోతి(రూప కొడవయూర్) ప్రేమలో పడతాడు. కాగా మహేష్ తన ప్రతీకారాన్ని, ప్రేమను ఎలా దక్కించుకున్నాడు అనేది మిగతా కథ…
ప్లస్ పాయింట్స్:
మలయాళ హిట్ మూవీ మహేషిన్తే ప్రతీకారం అనే మూవీ రిమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం తెలుగు నేటివిటీకి దగ్గరగా తీర్చిదిద్దిన విధానం బాగుంది. అరకు నేపథ్యంలో సాగే కథలో డైలాగ్స్, మరయు నేటివిటీ చాలా సహజంగా తోస్తాయి.
టాలెంటెడ్ నటుడిగా మంచి పేరున్న సత్య దేవ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు అనడంలో సందేహం లేదు. ఎమోషనల్ సన్నివేశాలతో పాటు, పతాక సన్నివేశాలలలో ఆయన నటన సహజంగా కట్టిపడేసేలా సాగుతుంది.
యువ నటుడు సుహాస్ నటన ఈచిత్రానికి మరో ఆకర్షణ అని చెప్పాలి. టైమింగ్ కామెడీతో ఆయన పాత్ర మంచి ఆహ్లాదం పంచుతుంది. ఇక హీరోయిన్ రూప ఆకట్టుకున్నారు. సీనియర్ నటుడు నరేష్ పాత్ర కూడా మూవీలో చెప్పుకోదగ్గ అంశం.
మైనస్ పాయింట్స్:
సహజంగా అనిపించే పాత్రలు, నేపథ్యం, మంచి కామెడీ మరియు రొమాన్స్ తో పాటు సంఘర్షణతో నడిచిన మొదటి సగం అలరిస్తుంది. ఐతే సెకండ్ హాఫ్ లో దర్శకుడికి చెప్పడానికి ఆసక్తికర అంశాలేవీ లేకుండా పోయాయి. దీనితో ఇంటర్వెల్ తర్వాత మూవీ నెమ్మదించింది.
రొమాన్స్ పేరిట అవసరానికి మించిన సన్నివేశాలతో దర్శకుడు నిడివి పెంచేశాడు. అది కూడా ఈ మూవీలో చెప్పుకోదగ్గ మరో మైనస్ పాయింట్.
ఇక ఎడిటింగ్ వైఫల్యం కూడా ఈ మూవీలో కనిపిస్తుంది. పది నిమిషాల వరకు నిడివి తగ్గిస్తే బాగుండు అనే భావన కలిగింది. క్లైమాక్స్ సైతం సింపుల్ గా తేల్చేశారు.
సాంకేతిక విభాగం:
కెమెరా వర్క్ చాలా బాగుంది. విలేజ్ బ్యాక్ గ్రౌండ్ మరియు అరకు అందాలు తెరపై ఆహ్లాదం పంచుతాయి. మ్యూజిక్ పరవాలేదు, బీజీఎమ్ చాలా బాగుంది. డైలాగ్స్ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం. స్క్రీన్ ప్లే కొంచెం ఆకట్టుకొనేలా రాసుకోవాల్సింది.
కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాతో ఒక్కసారిగా మంచి ఫేమస్ అయిన వెంకటేష్ మహా అనగానే అంచనాలు పెరిగిపోయాయి. ఐతే ఈ సినిమాలో ఆయనకి జస్ట్ పాస్ మార్క్స్ పడతాయి. ఆకట్టుకొనే పాత్రలు, రొమాన్స్, కామెడీ మరియు ఎమోషన్స్ తో అద్భుతంగా ఫస్ట్ హాఫ్ నడిపిన మహా సెకండ్ హాఫ్ లో నిరాశపరిచారు.
తీర్పు:
సహజమైన పాత్రలు, సత్య దేవ్ అద్భుత నటన, ఆసక్తిగా సాగే ఫస్ట్ హాఫ్ ఈ మూవీలో ఆహ్లదం పంచే అంశాలు. ఐతే నెమ్మదిగా సాగే సెకండ్ హాఫ్, ఆకట్టుకోని కథనం, హడావుడిగా ముగించినట్లు ఉండే క్లైమాక్స్ నిరాశపరిచే అంశాలు. మొత్తంగా ఉమామహేశ్వర ఉగ్రరూపస్య చాలా వరకు ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్ కొంచం బాగా తీసి ఉంటే ఫలితం మరింత మెరుగ్గా ఉండేది. ఈ లాక్ డౌన్ సమయంలో ఈ విలేజ్ రివేంజ్ డ్రామా ఓసారి చూడవచ్చు.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team