సమీక్ష : వకీల్ సాబ్ – గుడ్ కాన్సెప్ట్ తో సాగే ఎమోషనల్ డ్రామా !

సమీక్ష : వకీల్ సాబ్ – గుడ్ కాన్సెప్ట్ తో సాగే ఎమోషనల్ డ్రామా !

Published on Apr 10, 2021 3:02 AM IST
Vakeel Saab movie review

విడుదల తేదీ : ఏప్రిల్ 09, 2021

123తెలుగు.కామ్ రేటింగ్ :  3.5/5

నటీనటులు : ప‌వ‌న్ క‌ల్యాణ్‌, శృతిహాస‌న్‌, ప్ర‌కాశ్ రాజ్‌, నివేదాథామ‌స్‌, అంజలి, అన‌న్య నాగ‌ళ్ల త‌దిత‌రులు

దర్శకత్వం : శ్రీరామ్ వేణు‌

నిర్మాత‌లు : దిల్‌రాజు, శిరీష్‌

సంగీతం : ఎస్‌.ఎస్‌.త‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ : పి.ఎస్‌.వినోద్

ఎడిటింగ్ : ప్ర‌వీణ్ పూడి

లాక్ డౌన్ తర్వాత టాలీవుడ్ నుండి రిలీజవుతున్న పెద్ద సినిమా ‘వకీల్ సాబ్’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ తర్వాత చేసిన సినిమా ఇదే. అందుకే అభిమానుల్లో ఇంత క్రేజ్, ఈ స్థాయి హైప్. ఈ చిత్రం బాలీవుడ్ ‘పింక్’కు తెలుగు రీమేక్. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. కాగా పవన్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రజలు కూడా భారీ అంచనాలతో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు గ్రాండ్ గా విడుదల అయింది. మరి ఈ చిత్రం, ఆడియన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :

జరీనా (అంజలి) పల్లవి (నివేదా థామస్) అనన్య (అనన్య) ముగ్గురూ స్నేహితులు, ముగ్గురు మిడిల్ క్లాస్ అమ్మాయిలైన వీళ్ళు హైదరాబాద్ లో జాబ్స్ చేసుకుంటూ ఉంటారు. ఐతే ఒకరోజు రాత్రి పార్టీ నుండి క్యాబ్ లో వెళ్తూ.. అనుకోకుండా వంశీ (విల‌న్) గ్యాంగ్ తో వాళ్ళ రిసార్ట్ కి వెళ్తారు. అయితే అక్కడ జరిగిన ఒక సంఘటన వాళ్ళ జీవితాలను మలుపు తిప్పుతుంది. వీళ్ళ పై కోర్టులో కేసు ఫైల్ అవుతుంది. . ఏ దిక్కూ లేని ఈ అమ్మాయిల పక్షాన‌ నిలుస్తాడు వ‌కీల్ సాబ్ సత్యదేవ్ (పవన్ కళ్యాణ్). బలహీనులకు బలాన్ని ఇచ్చే వకీల్ సాబ్ ఈ అమ్మాయిలకు ఎలా న్యాయం జరిగేలా చేశాడు ? బ‌ల‌మైన లాయ‌ర్ నందా (ప్రకాష్ రాజ్)ను మరియు బ‌ల‌వంత‌మైన నిందితుల‌ను ఎలా ఢీ కొన్నాడు ? అసలు పేదల వైపు నిలబడే వకీల్ సాబ్ ఎందుకు తాగుడిని అలవాటు చేసుకుని జీవితంలో ఎందుకు ఒంటరిగా మిగిలాడు ? లాంటి విషయాలు తెలియాలంటే వెండి తెరపై ఈ సినిమాని చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

ఈ సినిమాకు ప్రధాన బలం, బలగం పవర్ స్టార్ పవన్ కల్యాణే. లాయర్ వకీల్ సాబ్ పాత్రలో పవన్ పరకాయ ప్రవేశం చేశారు. ప్రత్యేకించి కోర్టు సన్నివేశాల్లో ప్రధానమైన కొన్ని హావభావాలను, పవన్ తన ముఖ కవళికల్లో పలికించిన విధానం ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులను కూడా అబ్బుర పరుస్తోంది. అలాగే ఫ్లాష్ బ్యాక్ లో లవ్ స్టోరీలో కూడా పవన్ కొత్తగా కనిపించాడు. ఇక శృతిహాసన్ చనిపోయిన సీన్ లో అలాగే కోర్టులో ఎమోషనల్ గా సాగే కన్నీళ్ళు పెట్టే సన్నివేశంలో పవన్ నటన సినిమాకే ప్రత్యేక ఆకర్షణ.

ఓవరాల్ గా అన్యాయాన్ని ఎదిరించే వ‌కీల్ సాబ్ గా పవన్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇచ్చారు. అలాగే పవన్ చెప్పిన కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక బాధిత యువ‌తులుగా అంజ‌లి, నివేదా థామ‌స్‌, అన‌న్య తమ పాత్రల్లో అద్భుతంగా న‌టించారు. ముఖ్యంగా నివేదా నటన చాలా బాగుంది. ఇక క్రిమిన‌ల్ లాయ‌ర్ గా ప్ర‌కాష్ రాజ్ ఎప్పటిలాగే తన పాత్రలో చెల‌రేగిపోయారు. గెస్ట్ రోల్ లాంటి హీరోయిన్ పాత్రలో శృతిహాస‌న్ ఆక‌ట్టుకుంది. ఆమెకు సూప‌ర్బ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బాగానే చేసింది.

దర్శకుడు వేణు శ్రీ రామ్ కంటెంట్ బేస్డ్ స్టోరీలో హీరోయిజమ్ పెట్టి సినిమా స్థాయిని పెంచాడు. అలాగే ట్రీట్మెంట్ విషయంలో అలాగే పవన్ ను చూపించే విధానంలో కూడా చాలా వరకు విజయం సాధించాడు. ముఖ్యంగా కోర్టులో జరిగిన కొన్ని నాటకీయ అంశాలనూ, సమాజంలో స్త్రీల పై కొన్ని సందర్భాల్లో జరుగుతున్న వాస్తవిక పరిస్థితులను వేణు చాలా ఆసక్తికరంగా చూపించాడు.

మైనస్ పాయింట్స్ :

స్టోరీ సెటప్ అండ్ ట్రీట్మెంట్ బాగున్నా.. ప్లాష్ బ్యాక్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా స్థాయికి తగ్గట్టు లేదు. ఇంట్రస్టింగ్ గా సాగుతున్న సినిమాలో అంత ఎఫెక్టివ్ గా సాగని హీరో లవ్ ట్రాక్, లవ్ లో పడే సీన్స్ తో కథను డైవర్ట్ చేశారనిపించినా, అది ఎక్కువ సేపు సాగదు కాబట్టి, ప్లేకి వచ్చిన నష్టం ఏమి లేదు. కాకపోతే లవ్ స్టోరీ ఇంకా ట్రీమ్ చేసి ఉంటే బాగుండేది. పైగా కొన్ని చోట్ల అనవసరమైన సీన్స్ కూడా ఉండటం, పైగా ఆ సీన్స్ అన్ని కూడా కథను సాగదీయడంతో అవి సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.

అలాగే ఇంటర్వెల్ కి గాని అసలు కథ ముందుకు కదలదు. ఇక కొన్ని కోర్టు సన్నివేశాల్లో కూడా మంచి పనితీరుని కనబర్చిన దర్శకుడు, కొన్ని సీన్స్ ను మాత్రం నెమ్మదిగా నడిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ ఆయన మాత్రం వాట్ని సింపుల్ గా నడిపారు. ఐతే ఆ సీన్స్ ను ఫ్యాన్స్ ను దృష్టిలో పెట్టుకుని చేసినవి కాబట్టి.. అవి ఫ్యాన్స్ కు నచ్చినా.. రెగ్యులర్ ఆడియన్స్ కి నచ్చవు.

సాంకేతిక విభాగం :

ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. థమన్ అందించిన సంగీతం ఆకట్టుకుంటుంది. అలాగే సాంగ్స్ కూడా బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సీన్స్ ను తగ్గించి ఉంటే.. ముఖ్యంగా లవ్ సీన్స్ లోని కొన్ని సీన్స్ ను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాత దిల్ రాజు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు. నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి. ఇక దర్శకుడు కూడా ఆకట్టుకున్నాడు.

తీర్పు :

పేదలకు న్యాయం చేయడానికే వకీల్ సాబ్ గా మారి.. న్యాయం చేయడం కోసం ఎవర్ని వదలడు అంటూ వచ్చిన ఈ చిత్రం చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ను ఇచ్చింది ఈ సినిమా. మెయిన్ గా సినిమాలో పవన్ ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. అలాగే మంచి మెసేజ్ తో పాటు ఇంట్రస్ట్ గా సాగే హీరో క్యారెక్టరైజేషన్ మరియు కొన్ని ఎమోషనల్ సీన్స్ సినిమాలో చాలా బాగున్నాయి. కాకపోతే లవ్ స్టోరీ స్లోగా సాగడం, అక్కడక్కడ కొన్ని సీన్స్ కూడా స్లోగా ఉన్నా.. ఓవరాల్ గా ఆడియన్స్ ను మాత్రం ఈ సినిమా బాగా అకట్టుకుంటుంది. పవన్ ఫ్యాన్స్ కి అయితే ఈ సినిమా మంచి అనుభూతిని ఇస్తోంది.

123telugu.com Rating :  3.5/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు