విడుదల తేదీ : జనవరి 26, 2023
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: సునీల్, చైతన్య రావు మదాడి తదితరులు
దర్శకుడు : అనిల్ గోపిరెడ్డి
నిర్మాతలు: తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి, మహీంధర్ నారల
సంగీత దర్శకులు: అనిల్ గోపిరెడ్డి
సినిమాటోగ్రఫీ: జయపాల్ రెడ్డి
సంబంధిత లింక్స్: ట్రైలర్
సునీల్, చైతన్య రావు మదాడి ప్రధాన పాత్రలలో అనిల్ గోపిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన సినిమా వాలెంటైన్స్ నైట్. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ కృష్ణ (సునీల్) డ్రగ్స్ కి సంబధించిన వారిని పట్టుకుని ఎన్ కౌంటర్ చేస్తూ ఉంటాడు. ఈ డ్రగ్స్ దందాను నడుపుతున్న దాదా బ్యాచ్ ను పట్టుకోవడానికి విచారణ జరుపుతూ ఉంటాడు. అసలు ఈ దాదా ఎవరు ?, వెనుక ఉండి ఈ డ్రగ్స్ దందాను ఎలా నడుపుతున్నాడు ?, మరోవైపు
అజయ్ (చైతన్య రావు) ప్రియ (లావణ్య) ను సిన్సియర్ గా ప్రేమిస్తాడు. కానీ, కొన్ని కారణాల వల్ల తన ప్రేమను, అలాగే ఆమెను దూరం చేసుకుంటాడు. ఎందుకు అజయ్ తన ప్రేమకు తన ప్రియసికి దూరం అవుతాడు ?, ఈ మధ్యలో డ్రగ్స్ కి బానిసలుగా మారిన రాహుల్ – వేద ట్రాక్ ఏమిటి ?, అలాగే నిర్మాత వెలుగు కృష్ణ మూర్తి (పోసాని కృష్ణమురళి) కథ ఏమిటి ?, ఈ పాత్రలన్నీ చివరకు మెయిన్ కథలోకి ఎలా కలిశాయి ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో హీరోగా నటించిన చైతన్య రావు పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంది. సునీల్ ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా టెర్రిఫిక్ గా కనిపించారు. లావణ్య నటన కూడా చాలా బాగుంది. శ్రీకాంత్ అయ్యంగార్ నటన పరంగా చక్కగా నటించాడు. ఆయన నటనే సినిమాకి ప్లస్ అయింది. తన డైలాగ్ డెలివరీ మరియు తన బాడీ లాంగ్వేజ్ తో శ్రీకాంత్ అయ్యంగార్ చాలా బాగా మెప్పించాడు.
ఇక సినిమాలో మరో కీలక పాత్రలో నటించిన పోసాని కృష్ణ మురళి, అలాగే ఫ్రెండ్ పాత్రలో నటించిన రవివర్మ కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. రవివర్మకి శ్రీకాంత్ అయ్యంగార్ కి మధ్య వచ్చే కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా బాగున్నాయి. ఇక అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
మైనస్ పాయింట్స్
దర్శకుడు అనిల్ గోపిరెడ్డి డ్రగ్స్ కు డబ్బుకు సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు కానీ, ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా కథాకథనాలను రాసుకోలేదు. దీనికి తోడు సినిమాలో కొన్ని కీలక సన్నివేశాలు కూడా సినిమాటిక్ గా అనిపిస్తాయి తప్ప, ఇన్ వాల్వ్ అయ్యే విధంగా అనిపించవు.
సినిమాను ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు అనిల్ గోపిరెడ్డి మాత్రం ఎక్కడా ఆ దిశగా సినిమాని మలచలేదు. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మినహా మిగతా సన్నివేశాలు అంతగా ఆకట్టుకోవు. పైగా కొన్ని సన్నివేశాల్లో నాటకీయత ఎక్కువవడంతో కథలో సహజత్వం లోపించింది.
కానీ, సినిమాలో చెప్పాలనుకున్న కథాంశం బాగుంది. కథాంశం బాగున్నా ఓవరాల్ గా ఈ చిత్రం నెమ్మదిగా సాగుతూ బోర్ కొట్టిస్తోంది. మొత్తమ్మీద బోల్డ్ సీన్స్ వర్సెస్ డ్రగ్స్ సీన్స్ అన్నట్టు సాగింది ఈ సినిమా.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో చూసుకుంటే.. జయపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలోని కొన్ని కీలక దృశ్యాలను కెమెరామెన్ సమర్ధవంతంగా చిత్రీకరించాడు. అనిల్ గోపిరెడ్డి అందించిన సంగీతం విషయానికి వస్తే.. బాగానే ఉంది. కీలక సన్నివేశాల్లో నేపధ్య సంగీతం చాలా బాగుంది. ఎడిటర్ బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ట్రీమ్ చేసి ఉంటే సినిమాకు ప్లస్ అయ్యేది. నిర్మాతలు తృప్తి పాటిల్, సుధీర్ యాళంగి, మహీంధర్ (MO) నారల పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
‘వాలెంటైన్స్ నైట్’ అంటూ వచ్చిన ఈ చిత్రం డబ్బు పై దురాశ వర్సెస్ మత్తు పానీయాల సమ్మేళనం అన్నట్టు సాగింది. అయితే, సినిమాలో ప్రతి సన్నివేశం ఒకే ఎమోషన్ తో సాగింది. నటీనటుల మధ్య వచ్చే సన్నివేశాల క్రమంలో ప్లో కూడా లేదు. దీనికితోడు కథాకథనాలు ఆకట్టుకునే విధంగా లేవు. అలాగే లాజిక్ లెస్ సీన్స్, బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ యూత్ కి కనెక్ట్ అవుతాయి.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team