విడుదల తేదీ : అక్టోబర్ 29, 2021
123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5
నటీనటులు: నాగ శౌర్య, రీతూ వర్మ, మురళీ శర్మ, నదియా, జయప్రకాష్, వెన్నెల కిషోర్, సప్తగిరి, హర్ష వర్ధన్
దర్శకత్వం : లక్ష్మీ సౌజన్య
నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ
సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్, థమన్
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
ఎడిటర్: నవీన్ నూలి
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో హీరోయిన్స్ నాగ శౌర్య, రీతూ వర్మలు నటించిన లేటెస్ట్ సినిమా “వరుడు కావలెను”. లక్ష్మి సౌజన్య తెరకెక్కించిన ఈ చిత్రం డీసెంట్ బజ్ ప్రమోషన్స్ నడుమ ఈరోజు రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం ఎంతమేర ఆకట్టుకుంటుందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వస్తే.. భూమి(రీతూ వర్మ) తన పర్సనల్ లైఫ్ పరంగా చాలా పర్టిక్యులర్ గా క్లారిటీ గా ఉండే మహిళ. అలానే పెళ్లి విషయంలో కూడా పెద్దగా ఆసక్తిగా ఆమె ఉండదు. మరి ఆమె కంపెనీలోకి ఓ ఆర్కిటిక్ గా ఆకాష్(నాగ శౌర్య) ఎంటర్ అవుతాడు. ఇక ఇక్కడ నుంచి ఈ ఇద్దరికీ ఎలా రిలేషన్ కుదురుతుంది? పెళ్లిపై ఆసక్తి లేని భూమి ఆకాష్ ని ఇష్టపడుతుందా? ఇష్టపడితే పెళ్లి చేసుకుంటుందా? అసలు తాను పెళ్లి చేసుకోకూడదు అని ఎందుకు బలంగా ఫిక్స్ అవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో ఖచ్చితంగా సినిమాని చూసే ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు చాలానే కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ చిత్రంలో కనిపించే ఒక ఎమోషనల్ బాండింగ్ టచ్ చాలా ఆలోచింపదగేలా పరిపక్వతతో కూడి ఉంటుంది. ఇది మాత్రం చూసే ఏ ఆడియెన్ ని కూడా నిరాశపరచదు. అలానే ఈ పాయింట్స్ తో కూడిన కొన్ని సన్నివేశాలు ఈ సినిమాలో మరింత బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి. ఇంకా రెగ్యులర్ ఎమోషన్స్‌లా కానీ ఓ ఇద్దరు హీరో హీరోయిన్ మధ్య నడిచే కామన్ డ్రామాలా కానీ ఈ సినిమా ఉండదు. చాలా మెచ్యూర్డ్ గా మిగతా సినిమాల కంటే కొత్తగా అనిపిస్తుంది.
ఇక నాగ శౌర్య విషయానికి వస్తే తన కెరీర్ లో ఇది మరో ది బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు. సినిమాలో రెండు షేడ్స్ తో లుక్స్ పరంగా చాలా నీట్ గా హ్యాండ్సమ్ గా కనిపించడమే కాదు అంతే సాలిడ్ పెర్ఫామెన్స్ ను శౌర్య కనబరిచాడు. కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో తన నటన ఇంకా బాగుంటుంది. అలాగే శౌర్యతో పాటు మరో మేజర్ హైలైట్ రీతూ వర్మ.
ఇది వరకు సినిమాలలో అందంగా తెలుగులో మాట్లాడుతూ డీసెంట్ నటనను కనబరిచింది కానీ ఈ సినిమాతో తనలోని మరిన్ని కోణాలతో క్లీన్ పెర్ఫామెన్స్ ను చూపించింది. తన కెరీర్ లో ఇదే బెస్ట్ అని చెప్పడంలో కూడా సందేహం అక్కర్లేదు.. అంత క్లీన్ నటన తన వైపు నుంచి కనబరిచింది. తన లుక్స్ కూడా సినిమాలో చాలా బాగున్నాయి.
అలానే మరో సీనియర్ నటి నదియా కూడా మంచి పాత్రలో కనిపించారు. గత సినిమాలతో పోలిస్తే ఇది కంప్లీట్ కొత్తగా మిడిల్ క్లాస్ తల్లిగా నదియా చాలా బాగా చేశారు. ఇంకా విలన్ గా చేసిన హర్షవర్ధన్, కమెడియన్ సప్తగిరి, వెన్నెల కిషోర్ ప్రవీణ్ తదితరులు తమ పాత్రల పరిధి మేర మెప్పించారు. వీటితో పాటుగా సినిమాలో ఉన్న మంచి కామెడీ కూడా బాగానే ఎంటర్‌టైన్ చేస్తుంది.
ఇక అలాగే మరో మేజర్ హైలైట్ సినిమాకి మాటలు అందించిన గణేష్ రావూరి గురుంచి చెప్పుకోవాలి. తనకిది మొదటి సినిమానే అయినా సినిమాలో పాత్రలు ఆ డైలాగ్స్ చెబుతున్నపుడు అందులో లోతు తెలుస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ కి తన వర్క్ అయితే అవుట్ స్టాండింగ్ అని చెప్పొచ్చు. ఇంకా శౌర్య, రీతుల మధ్య నడిచే సీన్స్ లో కూడా మంచి డైలాగ్‌లను రాసారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో కాస్త నిరాశ కలిగించే అంశం ఏదన్నా ఉంది అంటే అది సినిమా కాస్త స్లో గా నడవడమే. నెమ్మదిగా సాగే కథనం మెయిన్ స్టోరీ, ఎమోషన్స్ లోకి వెళ్లేందుకు ఫ్లో ని దెబ్బ తీస్తుంది అది కాస్త వేగంగా ఉంటే బాగుండేది.
అలాగే సినిమా సెకండాఫ్ కి వచ్చేసరికి ఈ చిత్రంలో అంత చెప్పుకోదగ్గ స్థాయి కథ లేదని అర్ధం అవుతుంది. అలాగే దానిని కవర్ చెయ్యడానికే కొన్ని అనవసర కామెడీ సీన్స్ కోసం ఇరికించినట్టుగా అనిపిస్తుంది. కానీ అక్కడి వరకు అవి బాగానే అనిపిస్తాయి.
సాంకేతిక వర్గం :
ఈ సినిమాలో సితార ఎంటర్టైన్మెంట్స్ వారి నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని వారు తెరకెక్కించారు. అలాగే టెక్నీకల్ టీం లో వంశీ పచ్చిపులుసు అందించిన సినిమాటోగ్రఫీ ఇంప్రెసివ్ గా ఉంటుంది మంచి విజువల్స్ ని తాను అందించాడు. అలాగే నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది. థమన్, విశాల్ చంద్ర శేఖర్ ల సాంగ్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు మరింత ప్లస్ అయ్యాయి.
ఇక దర్శకురాలు లక్ష్మి సౌజన్య విషయం వస్తే ఇది ఆమెకి మొదటి సినిమానే అయినా డైరెక్టర్ గా ఆమె ఖచ్చితంగా మెప్పించారని చెప్పాలి. తాను రాసుకున్న పాత్రలను ఆవిష్కరించిన విధానంలో కానీ ఎమోషన్స్ ని హ్యాండిల్ చేసిన విధానం కానీ ఎక్కడా తనకి ఇది మొదటి సినిమాలా అనిపించదు. అంత పరిపక్వతతో కూడిన వర్క్ ను ఆమె అందించారు. డెఫినెట్ గా తన నుంచి వచ్చే సినిమాలు ప్రామిసింగ్ గా ఉంటాయని మాత్రం ఒక నమ్మకం కుదిరింది, మున్ముందు తాను ఎలాంటి సబ్జెక్ట్స్ తీసుకొస్తారో చూడాలి మరి.
తీర్పు :
ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ “వరుడు కావలెను” మిగతా కొన్ని రెగ్యులర్ రిలేషన్స్, ఫ్యామిలీ డ్రామాస్ లా కాకుండా కొత్తరకం సినిమాలా పరిపక్వతతో కూడిన కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పిస్తుంది. అలానే నాగ శౌర్య, రీతూ వర్మల కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ లు, కామెడీ ఎమోషన్స్ కూడా ఆకట్టుకుంటాయి. కానీ కాస్త స్లో గా అనిపించే కథనం పక్కన పెడితే ఈ వారాంతానికి దీపావళి పండుగకు కుటుంబంతో కలిసి ఖచ్చితంగా వీక్షించదగిన సినిమా ఇదని చెప్పొచ్చు.
123telugu.com Rating : 3.25/5
Reviewed by 123telugu Team