విడుదల తేదీ : 11 ఏప్రిల్ 2013 | ||
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5 |
||
దర్శకుడు : కార్తికేయ గోపాలకృష్ణ |
||
నిర్మాత : బత్తుల రతన్ పాండు, దివాకర్ |
||
సంగీతం : చిన్ని చరణ్ |
||
నటీనటులు : నవదీప్, శ్రీ హరి, రీతు బర్మేచ.. |
‘చందమామ’ సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకొని, ఒక్క హీరోగానే కాకుండా అడపాదడపా పెద్ద హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న నవదీప్ సోలో హీరోగా నటించిన సినిమా ‘వసూల్ రాజా’. ఈ సినిమా ఉగాది కానుకగా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రియల్ స్టార్ శ్రీహరి కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రీతు బర్మేచ హీరోయిన్. కార్తికేయ గోపాల కృష్ణ డైరెక్ట్ చేసిన ఈ సినిమాని బత్తుల రతన్ పాండు – దివాకర్ సంయుక్తంగా నిర్మించారు. ఇటీవలి కాలంలో సోలో హీరోగా సరైన హిట్స్ లేని నవదీప్ కి ఈ సినిమా హిట్ ఇచ్చిందో లేదో ఇప్పుడు చూద్దాం…
కథ :
వసూల్ రాజా(నవదీప్), రాణి(సత్యం రాజేష్) కలిసి కార్లు దొంగతనాలు చేసుకుంటూ అప్పుడప్పుడూ పోలీసులకు దొరికి మళ్ళీ తప్పించుకుంటూ జీవితాన్ని గడుపుతుంటారు. అలా నాలుగు కార్లు కొట్టేసి బార్లలో నాలుగు బీర్లు కొడుతూ గడుపుతున్న వసూల్ రాజా జాను(రీతు బర్మేచ)ని చూసి ప్రేమలో పడతాడు. వసూల్ రాజా బిజినెస్ మాన్ అని చెప్పి జాను వెంట పడుతుంటాడు. కొన్ని రోజులకి జాను కూడా రాజా తో ప్రేమలో పడుతుంది. వసూల్ రాజా జాను కోసం దొంగతనాలు మానెయ్యాలి కానీ చివరిగా ఒక్క పెద్ద దొంగతనం చేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకుంటాడు. అందులో భాగంగానే సిటీ లో దందాలు చేసే జగ్గు భాయ్, ముత్తు మణి, ఉంగరాల శ్రీనివాస్, నజీర్ లతో చేతులు కలిసి చైనా నుంచి వచ్చే అక్రమ ఆయుధాలను ఇండియాలో పంచే కాంట్రాక్ట్ ఎంచుకుంటారు.
అదే టైంలో హైదరాబాద్లో హై లెవల్లో ఉన్న డ్రగ్స్ మాఫియాని, ఈ అక్రమాయుధాల కాంట్రాక్ట్ ని ఆపాలని ఎసిపి యాదవ్ (శ్రీ హరి)ని రంగంలోకి దింపుతారు. అలా రంగంలోకి దిగిన ఎసిపి యాదవ్ అక్రమాయుధాలు మన దేశంలోకి రాకుండా ఎలా అడ్డుకున్నాడు? జాను కోసం మంచిగా మారాలనుకున్న వసూల్ రాజా అసలు విలన్స్ తో ఎందుకు చేతులు కలిపాడు? అలా వారితో కలవడం వల్ల ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కున్నాడు? అనేదే మిగిలిన కథాంశం..
ప్లస్ పాయింట్స్ :
నవదీప్ ఈ సినిమాలో రెండు రకాల పాత్రలను పోషించాడు. ఫస్ట్ హాఫ్ లో దొంగగా, సెకండాఫ్ లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అతని నటన బాగుంది. ఎసిపి యాదవ్ పాత్రలో శ్రీ హరి నటన బాగుంది. రీతు బర్మేచ నటన ఓకే అనేలా ఉంది. నవదీప్ ఫ్రెండ్ గా నటించిన సత్యం రాజేష్ పలు చోట్ల బాగానే నవ్వించాడు. తాగుబోతు రమేష్ రెండు సీన్స్ లోనే వచ్చినా ఉన్నంత సేపూ నవ్వించడానికి ప్రయత్నించాడు. బ్రహ్మానందం ఒకే ఒక్క సీన్ లో వచ్చినా బాగానే నవ్వించాడు. సినిమా మొదటి 15 – 20 నిమిషాలు బాగుంటుంది.
మైనస్ పాయింట్స్ :
ముందుగా ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ మా తాతల కాలం నాటిది. అప్పటి నుంచి ఇదే కథని తిప్పి తిప్పి పలు రకాలుగా తీస్తూనే ఉన్నారు, మన డైరెక్టర్ కార్తికేయ గోపాల కృష్ణ కూడా అదే కథని తీసుకొని పులుపు, తీపి, చేదు లేని ఉగాది పచ్చడిలా కథని రాసుకొన్నాడు. సినిమాలో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, అలాగే లాజిక్స్ లేవు. సినిమాలో ఒక సీన్ కి మరొక సీన్ చాలా చోట్ల లింక్స్ మిస్ అవుతాయి. సినిమాలో చాలా సీన్స్ ని పూర్తిగా కంప్లీట్ చెయ్యకుండా తర్వాత ఏం జరిగింది అనేది గాలికొదిలేసి డైరెక్టర్ నెక్స్ట్ సీన్స్ కి వెళ్ళిపోయాడు.
సినిమా మొదటి 20 నిమిషాల తర్వాత సినిమా కథలానే మన తాతల కాలం నాటి రైలులా అటు ఆగిపోకుండా, ఇటు వేగంగా వెళ్ళకుండా ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షిస్తుంది. డైరెక్టర్ సినిమాని చాలా సస్పెన్స్ గా ఉండాలని ఉన్న ఒక్కగానొక్క ట్విస్ట్ ఏంటనేది క్లైమాక్స్ లోనే రివీల్ చేసినాగానీ ఆ ట్విస్ట్ ఏంటనేది ప్రీ ఇంటర్వల్ ఎపిసోడ్ వద్దే ప్రేక్షకులకి అర్థమయిపోవడం వల్ల సెకండాఫ్ చాలా బోరింగ్ గా సాగుతుంది. సినిమా అంటే నాలుగు పాటలు ఉండాలి అందులో ఒకటి క్లబ్ లో ఐటెం సాంగ్ అయ్యి ఉండాలి, ఓ రెండు ఫైట్స్, చేజ్ సీన్స్ ఉండాలి అన్నట్లుగా ఈ సినిమాలోని సీన్స్, సాంగ్స్ ని షూట్ చేసారు.
శ్రీహరి ఇంట్రడక్షన్ సీన్ ని పోతురాజు గెటప్ లో పెట్టాడు, ఇది విని మీరు ఎసిపి కదా ఏదో సీక్రెట్ ఆపరేషన్ చెయ్యడం కోసమే ఈ గెటప్ వేసుంటారు అనుకుంటే మాత్రం అరటి తొక్క మీద కాలేసిట్టే ఎందుకంటే అలాంటిది ఏమీ ఉండక పోగా ఆ గెటప్ వేసిన కారణం చూసి ఎసిపి ఇలాంటి వాటి కోసం కూడా గెటప్ మారుస్తాడా అని ప్రేక్షకులు నవ్వుకుంటున్నారు. అసలు ఆ విషయంలో డైరెక్టర్ కి అన్నా క్లారిటీ ఉందో? లేదో?. ఇలాంటి సీన్స్ సినిమాలో చాలానే ఉన్నాయి. అలాగే శ్రీ హరి పాత్ర కూడా ఇంకాస్త ఎఫెక్టివ్ గా ఉండుంటే బాగుండేది. అనుకున్న కథకి విలన్ పాత్ర టఫ్ గా ఉండుంటే సినిమాకి చాలా హెల్ప్ అయ్యేది. కానీ సినిమాలో విలన్స్ పాత్రని పవర్ఫుల్ గా రాసుకోవడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు.
సాంకేతిక విభాగం :
సినిమాటోగ్రఫీ అంతంత మాత్రంగా ఉంది. దానికి తగ్గట్టుగానే ఎడిటర్ కూడా ఏదో కత్తిరించాలంటే కత్తిరించాలి అన్నట్టు ఎడిట్ చేసాడు. పాటల్ని, చాలా సీన్స్ ని కట్ చేస్తే సినిమా కాస్త వేగవంతంగా ఉండేది. రామ్ స్వామి రాసిన డైలాగ్స్ బాగున్నాయి. చిన్ని చరణ్ అందించిన పాటల్లో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే ‘పైసాయే పరమాత్మ’ పాట తప్ప మిగతా మూడు పాటలు బాగోలేవు. విలన్ ఎలివేషన్ సీన్స్ లో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది.
కథ – పాత చింతకాయ పచ్చడిలా ఉంది, స్క్రీన్ ప్లే – అంత ఆసక్తికరంగా లేదు, డైరెక్షన్ – వీటన్నింటినీ కవర్ చేసి ప్రేక్షకుడు సంతోష పెట్టే రేంజ్ లో లేదు, కావున ఈ మూడు డిపార్ట్ మెంట్స్ ని హండిల్ చేసిన డైరెక్టర్ కార్తికేయ గోపాల కృష్ణ గురించి కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు . నిర్మాణ విలువలు ఓకే.
తీర్పు :
నవదీప్ నటించిన ‘వసూల్ రాజా’ బాక్స్ ఆఫీసు వద్ద వసూళ్ళు సాధించడం కాస్త కష్టమే. మొదటి 20 నిమిషాలు, నవదీప్, శ్రీహరిల నటన, కొన్ని కామెడీ బిట్స్ చెప్పదగిన ప్లస్ పాయింట్స్. పాత చింతకాయ పచ్చడి లాంటి కథ, నిదానంగా సాగే సెకండాఫ్, బోర్ కొట్టించే పాటలు, చిరాకు తెప్పించే కొన్ని సీన్స్ మేజర్ మైనస్ పాయింట్స్. చివరిగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంలో ‘వసూల్ రాజా’ విఫలమయ్యాడనే చెప్పుకోవాలి.
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
రాఘవ