విడుదల తేదీ: మార్చి 15, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5
నటీనటులు: సాయి రామ్ శంకర్, యషా శివకుమార్, సత్యం రాజేష్, సునీల్, హెబా పటేల్, దేవరాజ్, ప్రభాస్ శ్రీను తదితరులు
దర్శకుడు: నవీన్ రెడ్డి
నిర్మాత: దేవరాజ్ పోతురు
సంగీత దర్శకుడు: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రాఫర్: సతీష్ ముత్యాల
ఎడిటింగ్: ఎస్ బి ఉద్దవ్
సంబంధిత లింక్స్: ట్రైలర్
టాలీవుడ్ హీరో సాయి రామ్ శంకర్ చాలా కాలం తర్వాత చేసిన లేటెస్ట్ “వెయ్ దరువెయ్” . కొత్త హీరోయిన్ యషా శివకుమార్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం రండి.
కథ :
ఇక కథలోకి వస్తే కామారెడ్డి శంకర్(సాయి రామ్ శంకర్) సరిగ్గా చదువు అబ్బక మాస్ గా తిరుగుతూ ఉంటాడు. అయితే తన ఇంట్లో పోరు పడలేక హైదరాబాద్ కి ఏదన్నా జాబ్ కోసం వస్తాడు. ఇదే సమయంలో తన ఫ్రెండ్ ద్వారా ఫేక్ సర్టిఫికెట్స్ లో జాబ్ కొట్టొచ్చని తెలుసుకుంటాడు. ఇక మరో పక్క హీరోయిన్ శృతి(యషా శివకుమార్) ని చూసి మొదటి చూపులోనే ఇష్టపడతాడు. మరి ఆమె కూడా ఆ ఫేక్ సర్టిఫికెట్స్ ని తయారు చేసే ఫ్లై కన్సల్టెన్సీలో వర్క్ చేస్తుంది. అయితే ఈ ఫ్లై కన్సల్టెన్సీ హెడ్ వీర వెంకట సత్యహరి ప్రసాద్ కి తన తమ్ముడు బాను ప్రసాద్(సునీల్) ఈ బిజినెస్ విషయంలో తగాదాలు ఉంటాయి. మరి అసలు ఈ ఫేక్ సర్టిఫికెట్స్ మాఫియా లోకి కామారెడ్డి శంకర్ ఎందుకు ఎంటర్ అయ్యాడు? కావాలనే వచ్చాడా లేక కేవలం ఉద్యోగం కోసమే వచ్చాడా? అనేదానికి ఈ సినిమాలోనే సమాధానం దొరుకుతుంది.
ప్లస్ పాయింట్స్ :
ఈ చిత్రంతో చాలా కాలం తర్వాత సాయి రామ్ శంకర్ మరోసారి మెప్పిస్తాడని చెప్పాలి. మెయిన్ గా తన మార్క్ కామెడీ టైమింగ్, డాన్స్ లు, మంచి నటన ఇందులో కనిపిస్తాయి. ఫస్టాఫ్ లో నటుడు సత్యం రాజేష్ తో కొన్ని వన్ లైనర్స్ బాగున్నాయి.
ఇక వీటితో పాటుగా డెబ్యూ నటి యషా శివకుమార్ తన రోల్ లో బాగానే చేసింది. చబ్బీ లుక్స్ అండ్ నీట్ పెర్ఫామెన్స్ తో ఆమె ఆకట్టుకుంటుంది. ఇక వీరితో పాటుగా సత్యహరి ప్రసాద్ గా నటించిన నటుడు, సునీల్, ప్రభాస్ శ్రీను తదితరులు తమ పాత్రలకి తగ్గట్టుగా డీసెంట్ పెర్ఫామెన్స్ ని అందించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ చిత్రంలో ఫస్టాఫ్ వరకు ఓకే ఇంకా మెయిన్ ప్లాట్ లోకి వెళ్లకపోయినా కామెడీ వరకు పర్వాలేదు అనిపిస్తుంది. కానీ సెకండాఫ్ లో అసలు సమస్య మొదలవుతుంది. చూస్స్తున్న కొద్దీ కథనం చాలా సిల్లీగా పరమ బోరింగ్ గా అనిపిస్తుంది. సినిమా తక్కువ నిడివే అయినప్పటికీ కూడా సెకండాఫ్ లో కొన్ని సీన్స్ చికాకు తెప్పించక మానవు.
మెయిన్ గా హీరో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే సహనాన్ని పరీక్షించవచ్చు. ఎమోషన్స్ అసలు వర్కువుట్ అవ్వవు, లాజిక్స్ అసలే లేవు. ఇక కొన్ని సీన్స్ లో సెటప్ అయితే చాలా నాసిరకంగా కనిపిస్తుంది. అలాగే కథనం సాగుతున్న కొద్దీ దాదాపుగా అన్ని సీన్స్ ని కొన్ని ట్విస్టులని కూడా మనం ముందే ఊహించేయవచ్చు. ఆ రేంజ్ లో ఆ సీన్స్ ఉంటాయి.
ఇక మరీ మెయిన్ గా సినిమా ప్లాట్ మనం ఆల్రెడీ చూసేసిన “అర్జున్ సురవరం” నుంచి నీట్ గా తస్కరించినట్టు ఉంది. ఈ కాన్సెప్ట్ అర్ధం అయ్యేసరికి సినిమాపై ఉన్న ఆసక్తి కూడా తగ్గిపోతుంది. అలాగే నటుడు సునీల్ పాత్రకి పెద్దగా ఇంపార్టెన్స్ ఉన్నట్టు కనిపించదు. ఇంకా హెబా పటేల్ సాంగ్ పక్కన పడితే అసలు తనకి ఆ సాంగ్ లో ఇంట్రెస్ట్ లేనట్టుగా ఏదో చెయ్యాలి అన్నట్టుగా క్లియర్ గా అర్ధం అయ్యిపోతుంది.
సాంకేతిక వర్గం :
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బిలో యావరేజ్ గా ఉన్నాయి. టెక్నీకల్ టీం లో సినిమా సెట్టింగ్స్, వి ఎఫ్ ఎక్స్ వర్క్ బాగాలేదు. భీమ్స్ సంగీతం ఓకే. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ పర్వాలేదు. ఎడిటింగ్ కూడా ఓకే.
ఇక దర్శకుడు నవీన్ రెడ్డి విషయానికి వస్తే.. తాను ఎంచుకున్న కథ ఆల్రెడీ చూసేసిందే. దానికి కొంచెం కామెడీ స్టైల్ లో మార్చారు. ఆ కామెడీ వర్కౌట్ అయ్యింది కానీ మిగతా సినిమా అంతా డిజప్పాయింట్ చేస్తుంది. సినిమాలో సెకండాఫ్ అయితే మరింత డిజప్పాయింట్ చేస్తుంది. తాను ప్లాన్ చేసుకున్న ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్ ఏమాత్రం వర్కవుట్ అవ్వదు, పై పెచ్చు బోరింగ్ నరేషన్, పాత్రల్లో లోపాలు, కొన్ని ఓవర్ ఎమోషన్స్ తో డిజప్పాయింటింగ్ వర్క్ అయితే తాను ఈ చిత్రానికి అందించారు.
తీర్పు :
ఇక మొత్తంగా చూసినట్టు అయితే.. ఈ “వెయ్ దరువెయ్” మెయిన్ లీడ్ ఓకే అనిపిస్తారు అలాగే కొన్ని సీన్స్ కి నవ్వుకోవచ్చు కానీ చాలా సిల్లీగా బోర్ గా అనిపించే కథనం, ఆల్రెడీ చూసేసిన కథ, మెసేజ్ లు చూసే ఆడియెన్స్ ని బాగా ఇబ్బంది పెడతాయి. వీటితో అయితే ఈ చిత్రానికి దూరంగా ఉండడమే మంచిది.
123telugu.com Rating: 1.75/5
Reviewed by 123telugu Team