విడుదల తేదీ : జనవరి 07, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2/5
నటీనటులు: విజయ్ రాజా , శివాజీ రాజా, తమన్నా వ్యాస్, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా తదితరులు
దర్శకత్వం : రామ్స్ రాథోడ్
నిర్మాత: తూము నరసింహ పటేల్
సంగీత దర్శకుడు: గ్యాని సింగ్
సినిమాటోగ్రఫీ: అకె. బుజ్జి
ఎడిటర్: వినోద్ అద్వే
సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా తమన్నా వ్యాస్ హీరోయిన్ గా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం “వేయి శుభములు కలుగు నీకు”. జయ దుర్గ దేవి మల్టీ మీడియా పతాకంపై తూము నరసింహ పటేల్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ప్రేక్షకులును ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.
కథ :
చైతు (విజయ్ రాజా) ఒక ప్రముఖ ఛానెల్ లో ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా పనిచేస్తుంటాడు. దివ్య (తమన్నా వ్యాస్)తో చైతు ఆల్ రెడీ రిలేషన్ షిప్‌లో ఉంటాడు. అయితే, చైతు తండ్రి నారాయణ (శివాజీ రాజా) చనిపోతూ ఎప్పటికైనా ఓ సొంత ఇల్లు సాధించమని కొడుకుని కోరుకుంటూ చనిపోతాడు. ఇక తండ్రి కోరికను తీర్చే క్రమంలో చైతు ఎంతో కష్టపడి సంపాదించి ఓ బంగ్లా కొంటాడు. కానీ, ఆ బంగ్లా కారణంగా అతని జీవితం మలుపు తిరుగుతుంది. అతని కల చెదిరిపోతుంది. చైతు కొన్న ఇంట్లో ఓ దెయ్యం ఉంటుంది. మరి చైతు ఆ దెయ్యంతో ఆ ఇంట్లో ఎలా ఉన్నాడు ? అసలు ఆ దెయ్యం ఎందుకు ఆ ఇంటినే పట్టుకుని ఉంది ? చివరికి ఏమైంది ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో కొన్ని హారర్ ఎఫెక్ట్స్ బాగున్నాయి. అలాగే క్లైమాక్స్ లో సెంటిమెంట్ పర్వాలేదు. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే.. విజయ్ రాజా , శివాజీ రాజా, తమన్నా వ్యాస్, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా అందరూ బాగానే నటించారు. సత్యం రాజేష్ తన కామెడీ టైమింగ్ తో కొన్ని సన్నివేశాల్లో తన ముద్ర కనబరుస్తూ కొన్నిచోట్ల నవ్వించాడు.
ఈ సినిమాలో హీరోగా నటించిన విజయ్ రాజా ఆకట్టుకున్నాడు. ఒక పక్క ఏం జరుగుతుందో అనే టెన్షన్ తో మరియు తనకు ఎదురవుతున్న దెయ్యంతో అనుభవాలకు భయపడుతూ విజయ్ రాజా చక్కగా నటించాడు. హీరోయిన్ గా నటించిన తమన్నా వ్యాస్ తన పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేసింది. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేసారు.
మైనస్ పాయింట్స్ :
సిల్లీ హారర్ చిత్రాలలోని కామెడీని ఎంజాయ్ చేసే సాధారణ ప్రేక్షకులకు కొంత వరకు ఈ సినిమా ఆనందాన్ని కలిగించొచ్చు కానీ.. మిగిలిన వర్గాల వారితో పాటు సగటు ప్రేక్షకులకు కూడా ఈ సినిమా రుచించదు. సినిమా నిండా సిల్లీ డ్రామాను మోతాదుకు మించి పెట్టి బాగా విసిగించారు. పైగా యాక్షన్ సీక్వెన్స్ కూడా విజయ్ రాజా పై పెట్టడం నిజంగానే కామెడీగా ఉంది.
పైగా సినిమాలో చాలా సన్నివేశాలు పూర్తి సినిమాటిక్ గా అసలు ఏ మాత్రం నమ్మశక్యం కాని విధంగా సాగుతాయి. అసలు వాస్తవానికి పూర్తి దూరంగా సాగే ప్లేలో ఇక ఇన్ వాల్వ్ అయ్యే విధంగా ఇంట్రెస్టింగ్ సీన్స్ ఎలా వస్తాయి. కథనంలోని ప్రతి సన్నివేశం స్లోగా సాగుతూ అసలు కన్వీన్స్ కానీ విధంగా ముగుస్తోంది. దానికి తోడు ట్రీట్మెంట్ కూడా బోరింగ్ ప్లేతో సాగుతూ సినిమాలోని ఇంట్రెస్టింగ్ ను చంపేసింది.
శివాజీ రాజా పాత్రకు సంబంధించిన ట్రాక్ కూడా బాగాలేదు. అలాగే సినిమాలో సరైన ప్లో కూడా లేకపోవడం, మెయిన్ ట్రీట్మెంట్ లోని కంటెంట్ ఆసక్తికరంగా సాగకపోవడం, మరియు ప్రీ క్లైమాక్స్ అండ్ సెకండ్ హాఫ్ లోని కీలక సన్నివేశాలన్నీ బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరచడం వంటి అంశాలు సినిమాకి ప్రధాన మైనస్ పాయింట్స్ గా నిలుస్తాయి.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు కొన్ని హారర్ కామెడీ సన్నివేశాల్లో మెప్పించే ప్రయత్నం చేసినా, కథాకథనాలను ఆకట్టుకునే విధంగా రాసుకోలేకపోయారు. ఇక సినిమాటోగ్రఫీ పర్వాలేదు. సంగీత దర్శకుడు అందించిన సంగీతం జస్ట్ ఓకే అనిపిస్తుంది. ఎడిటర్ పర్వాలేదు. నిర్మాతలు పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
తీర్పు :
హారర్ అంశాలతో “వేయి శుభములు కలుగు నీకు” అంటూ వచ్చిన ఈ సినిమాలో కొన్ని అంశాలు ఆకట్టుకుంటాయి. అయితే, నమ్మశక్యం కాని పూర్తి కాల్పనిక కథతో సినిమా బాగా స్లోగా సాగుతూ నిరుత్సాహ పరుస్తోంది. అలాగే బోరింగ్ ట్రీట్మెంట్ తో పాటు వర్కౌట్ కానీ కామెడీ సీన్స్ కూడా బాగలేదు. కాకపోతే, కొన్ని కీలక సన్నివేశాలు, నటీనటుల పనితీరు బాగుంది. ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం ఆకట్టుకోదు.
123telugu.com Rating : 2/5
Reviewed by 123telugu Team