విడుదల తేదీ : డిసెంబర్ 09, 2022
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: నిహాల్,అనంత్ నాగ్, రవిచంద్రన్, భరత్ బోపన్న, అనీష్ కురువిల్ల,ప్రకాష్ బేలావాడి,సిరి ప్రహ్లాద్ తదితరులు..
దర్శకుడు : రిషిక శర్మ
నిర్మాత: VRL ఫిల్మ్ ప్రొడక్షన్స్, ఆనంద్ సంకేశ్వర్
సంగీత దర్శకులు: గోపీ సుందర్
సినిమాటోగ్రఫీ: కీర్తన్ పూజారి
ఎడిటర్: హేమంత్ కుమార్
సంబంధిత లింక్స్: ట్రైలర్
కన్నడ నాట VRL ట్రావెల్స్ వ్యవస్థాపకుడు విజయ్ సంకేశ్వర్ బయోపిక్ గా వచ్చిన ఈ సినిమాకి రిషికా శర్మ దర్శకత్వం వహించారు. ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం.
కథ :
విజయ్ సంకేశ్వర్ (నిహాల్) తన తండ్రి (అనంత్ నాగ్)తో కలిసి కర్ణాటకలోని గడగ్‌లో ఒక మాములు ప్రింటింగ్ ప్రెస్ ను నడుపుతూ ఉంటాడు. అయితే, తాను ప్రింటింగ్ ప్రెస్ తోనే ఆగిపోవడం ఇష్టం లేని విజయ్ సంకేశ్వర్.. ట్రావెల్స్ బిజినెస్ చేయాలని ప్లాన్ చేస్తాడు. అందరూ వద్దు అంటున్నా.. సొంతంగా ఓ లారీ కొనుక్కొని బిజినెస్ మొదలు పెడతాడు. కేవలం ఒకే ఒక ట్రక్కుతో ఒక పెద్ద లాజిస్టిక్ కంపెనీ అయిన విజయానంద్ రోడ్ లైన్స్ ను ఎలా స్థాపించాడు ?, ఎలా నడిపించాడు?, ఈ క్రమంలో ఎన్నో అవమానాలను ఎలా ఎదుర్కొని నిలబడ్డాడు ?, అసలు, ఒక్క ట్రక్కుతో మొదలైన ఆయన ప్రస్థానం దాదాపు 5 వేలకు ట్రక్కుల యాజమానిగా ఎలా ఎదిగారు ?, అంతలో విజయ్ సంకేశ్వర్ పత్రికను ఎందుకు స్థాపించాల్సి వచ్చింది ?, అందకు దారి తీసిన పరిస్థితులు ఏమిటి ?, చివరకు తన పత్రికని ఎలా వదులుకోవాల్సి వచ్చింది? ఈ మధ్యలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
ఎమోషన్,ఇన్‌స్ప్రేషన్, మోటివేషన్ వంటి అంశాలు ఆధారంగా సాగిన ఈ సినిమాలో కొన్ని అంశాలు బాగా ఆకట్టుకున్నాయి. కర్ణాటక కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త విజయ్ సంకేశ్వర్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఎమోషనల్ గా చూపించడం బాగుంది. ముఖ్యంగా ఒక మాములు మధ్య తరగతి స్థాయి నుంచి ఉన్నత స్థితికి ఎలా చేరకున్నాడనే కోణంలో వచ్చే సీన్స్ బాగుంటాయి. అలాగే, ఈ కథ జరిగిన నేపధ్యాన్ని కూడా కథకు అనుగుణంగా 70 టు 80 కాలాన్ని చాలా సహజంగా చూపించారు.
ముఖ్యంగా నేపథ్యానికి తగట్టు పాత్రల వేషభాషలను తీర్చిదిద్దడం మరియు రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను చూపించిన విధానం.. ఇలా ప్రతిది రిషిక శర్మ చాల చక్కాగా ఎస్టాబ్లిష్ చేశారు. విజయ్ సంకేశ్వర్ జర్నీ తాలూకు సన్నివేశాలు, అలాగే ఆ పాత్రను ఎలివేట్ చేసే సీన్స్ చాలా బాగున్నాయి. విజయ సంకేశ్వర్ పాత్రలో కనిపించిన నిహాల్ తన హావభావాలతో చక్కగా నటించాడు. అలాగే ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించిన అనంత్ నాగ్, రవిచంద్రన్, భరత్ బోపన్న, అనీష్ కురువిల్ల, ప్రకాష్ బేలావాడి, సిరి ప్రహ్లాద్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ నటనతో ఆకట్టుకున్నారు. సినిమాలో చెప్పిన మెసేజ్ కూడా బాగుంది.
మైనస్ పాయింట్స్ :
కథలో చెప్పాలనుకున్న మెయిన్ థీమ్ తో పాటు కొన్ని సన్నివేశాలలో మంచి పనితీరుని కనబర్చిన రిషిక శర్మ మిగిలిన కొన్ని సన్నివేశాల్లో మాత్రం నెమ్మదిగా కనిపించారు. ఆ సన్నివేశాలను కూడా ఇంకా ఆసక్తికరంగా మలిచే అవకాశం ఉన్నపటికీ రిషిక శర్మ మాత్రం వాట్ని సింపుల్ గా నడిపారు. పైగా సినిమాని ఎక్కువుగా బోరింగ్ అండ్ స్లో డ్రామా సీక్వెన్స్ తో డ్రైవ్ చేశారు.
అలాగే, సినిమాలోని మెయిన్ ఎమోషన్ని అంతే ఎఫెక్టివ్ గా ఎలివేట్ చేయలేక పోయారు. మధ్యమధ్యలో అనవసరమైన ల్యాగ్ సీన్స్ కూడా బాగాలేదు. పైగా సినిమాలోని ట్రీట్మెంట్ అండ్ స్క్రీన్ ప్లే కూడా పూర్తిగా ఆకట్టుకోవు ఓవరాల్ గా కీలక సీన్స్ బాగానే ఉన్నా కథనాన్ని మాత్రం ముందుకు నడిపించవు. పైగా ఆ సీన్స్ కోసమని సినిమా లెంగ్త్ ని పెంచడం కూడా సినిమాకి మరో మైనస్ పాయింట్ గా నిలుస్తోంది.
అలాగే తెలుగు నేటివిటీకి దూరంగా సాగే ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాదు. సినిమాలోని పాత్రధారులు, వారి వ్యవహారశైలి మొత్తం తెలుగు సమాజానికి దూరంగా ఉంటుంది.
సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగం విషయానికి వస్తే .. పాటలు బాగున్నాయి. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సినిమాలోని చాలా సన్నివేశాలను కెమెరామెన్ ఎంతో రియలిస్టిక్ గా, మంచి విజువల్స్ తో చాలా బ్యూటిఫుల్ గా చూపించారు. అయితే ఎడిటర్ సినిమాలోని సాగతీత సన్నివేశాలను తగ్గించి ఉంటే.. సినిమాకి బాగా ప్లస్ అయ్యేది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు బాగున్నాయి. రిషిక శర్మ స్క్రిప్ట్ లో ల్యాగ్ లేకుండా చూసుకుని ఉండి ఉంటే ఇంకా బాగుండేది.
తీర్పు :
కన్నడ నాట VRL ట్రావెల్స్ వ్యవస్థాపకుడు విజయ్ సంకేశ్వర్ బయోపిక్ గా వచ్చిన ఈ చిత్రం ఆయన జర్నీ ని చూపించడంలో సక్సెస్ అయింది. ఎదుగుదలే తన ఆశయంగా మార్చుకుని విజయ్ సంకేశ్వర్ ఎదిగిన విధానం అండ్ ఆయన ఎమోషన్ సినిమాలో బాగా ఆకట్టుకున్నాయి. అయితే, స్క్రీన్ ప్లే బాగా స్లోగా సాగడం, కొన్ని చోట్ల పేలవమైన కథనం, ప్రధానంగా నేటివిటీ సమస్య వంటి అంశాలు సినిమాకి బలహీనతలుగా నిలుస్తాయి. దాంతో ఈ సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team