సమీక్ష : విక్రమసింహా – సరికొత్త సినీ ప్రపంచానికి నాంది.!

vikrama-simha-telugu-poster విడుదల తేదీ : 23 మే 2014
123తెలుగు. కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : సౌందర్య రజినీకాంత్
నిర్మాత : సునీల్ లుల్ల, సునంద మురళీ మనోహర్, ప్రశిత చౌదరి
సంగీతం : ఎఆర్ రెహమాన్
నటీనటులు : రజినీకాంత్, దీపిక పదుకొనే..

ఇండియన్ సినిమా చరిత్రలో మొట్ట మొదటి సారిగా మోషన్ కాప్చుర్ టెక్నాలజీ(ఫోటో రియలిస్టిక్ టెక్నిక్)తో షూట్ చేసిన సినిమా ‘విక్రమసింహా'(తమిళ్ లో కొచ్చాడియాన్). రజినీకాంత్ హీరోగా నటించిన ఈ సినిమాని రజినీ కుమార్తె సౌందర్య రజినీకాంత్ డైరెక్ట్ చేసారు. కెఎస్ రవికుమార్ కథ – స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాలో దీపిక పదుకొనే హీరోయిన్ గా నటించింది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోనూ విడుదలైంది. ఇండియన్ స్క్రీన్ పై మొదటి సారి ట్రై చేసిన ఈ మోషన్ కాప్చ్యూర్ టెక్నాలజీ సినిమా తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం..

కథ :

దాసరి నారాయణరావు వాయిస్ ఓవర్ తో సినిమా మొదలవుతుంది. తరతరాల నుంచి కలింగపురం – కోట పట్టణం రాజ్యాలకు మధ్య వైరం నడుస్తూ ఉంటుంది. కోట పట్టణం రాజ్యానికి ఉగ్ర సింహా(నాజర్) రాజైతే, కలింగపురానికి రాజ మహేంద్రుడు(జాకీ ష్రాఫ్) రాజు. కలింగపురానికి కొండంత అండగా సర్వ సైన్యాధిపతి రానా అలియాస్ రణధీర(రజినీకాంత్) ఉంటాడు. రానా అధ్వర్యంలో కలింగపురం తన శత్రు దేశాలన్నిటి పైనా విజయం సాధించి వారి రాజ్యాలను తమలో కలిపేసుకుంటారు. చివరికి కలింగపురానికి – కోట పట్టణంకి యుద్ధ సమయం వస్తుంది. కానీ అసలైన ట్విస్ట్ ఏంటి అంటే రానా ఆ యుద్దంలో కలింగపురం తరపున యుద్ధం చేయకుండా కోట పట్టణంతో కలిసిపోయి కలింగపురం సైనికులని వెనక్కి పంపేస్తాడు.

దాంతో రానాకి కోట పట్టణంలో సైన్యాధికారిగా నియమితుడవుతాడు. కానీ రానా కోట పట్టణంలో ఉంటూనే రాజ్యానికి రాజైన ఉగ్ర సింహాని చంపాలనుకుంటాడు. ఎందుకు అనేది కట్ చేస్తే విక్రమసింహా(రజినీకాంత్) ఫ్లాష్ బ్యాక్. అసలు కలింగపురం నుంచి రానా ఏ కారణం చేత కోట పట్టణంకి వచ్చాడు? ఉగ్ర సింహాని ఎందుకు చంపాలనుకుంటాడు? అసలు రానాకి విక్రమసింహాకి సంబందం ఏమిటి? అసలు విక్రమసింహా కథేంటి? అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

మొట్ట మొదటగా మోషన్ కాప్చ్యూర్ టెక్నాలజీతో ఇండియన్ స్క్రీన్ పై ‘విక్రమసింహా’ లాంటి సినిమాతో సరికొత్త సినీ ప్రపంచానికి నాంది పలికిన సౌందర్య రజినీకాంత్ కి హ్యాట్సాఫ్ చెప్పాలి. ఇక సినిమా విషయానికి వస్తే.. సినిమా స్టార్టింగ్ చాలా బాగుంటుంది. రజినీకాంత్ ఇంట్రడక్షన్, ఫస్ట్ సాంగ్, యాక్షన్ ఎపిసోడ్ ని బాగా డిజైన్ చేసుకున్నారు. అలాగే ఈ సినిమాకి సెకండాఫ్ చాలా పెద్ద హైలైట్. ముఖ్యంగా విక్రమసింహా ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, క్లైమాక్స్ వార్ సీక్వెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్ వార్ సీక్వెన్స్ ముందు రజినీ చెప్పే పంచ్ డైలాగ్స్ ప్రేక్షకుల చేత ఈలలు వేయిస్తాయి.

సినిమాలోని అన్ని వార్ సీక్వెన్స్ లను, సెట్టింగ్ లను చాలా బాగా డిజైన్ చేసారు. ఈ సినిమాకి ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ చాలా పెద్ద ప్లస్ అని చెప్పాలి. ఆయన తన మ్యూజిక్ తో సీట్లో కూర్చున్న ఆడియన్స్ కి ఫోటో రియలిస్టిక్ సినిమాని రియల్ సినిమానా అన్న ఫీలింగ్ ని కలిగించారు. అలాగే చనిపోయిన నగేష్ ని బాగా రీ క్రియేట్ చేసారు. ఆయన కొన్ని సీన్స్ లో ప్రేక్షకులని నవ్వించాడు. ఇది రెగ్యులర్ సినిమా కాదు అని తెలిసి వెళ్ళిన వాళ్ళు ఈ సినిమాని ఎంజాయ్ చేయగలరు.

మైనస్ పాయింట్స్ :

మోషన్ కాప్చ్యూర్ టెక్నాలజీతో తీసారు అనేది ఈ సినిమా మొదటి మైనస్ పాయింట్. ఈ టెక్నాలజీ గురించి తెలియని వారు ఇదొక యానిమేషన్ మూవీ అని థియేటర్ కి రావడం లేదు. సినిమా పరంగా సినిమా స్టార్టింగ్ 15 నిమిషాలు తప్ప మిగతా 40 నిమిషాలు సినిమా చాలా బోరింగ్ గా ఉంది. అలాగే సినిమాలో ఎక్కువ పాటలు సందర్భం లేకుండా రావడమే కాకుండా అప్పటికే స్లోగా నడుస్తున్న సినిమాని ఇంకా స్లో చేస్తాయి. ముఖ్యంగా సెకండాఫ్ మొదలవ్వగానే దీపిక పదుకొనే పై వచ్చే సాంగ్ ని పూర్తిగా కట్ చేయవచ్చు.

ఇక టెక్నికల్ పరంగా నటీనటుల ఫేస్ లను బాగానే కాప్చ్యూర్ చేసినా హావ భావాలను చూపించడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ఎన్నో ఎమోషనల్, పవర్ఫుల్ గా ఉండే సీన్స్ లో వారి హావభావాలకి డైలాగ్స్ కి అస్సలు మ్యాచ్ కాలేదు. దానివల్ల ఆడియన్స్ ఆ ఎమోషన్ కి కనెక్ట్ కాలేకపోతారు. ఆ ఈ విషయంలో టెక్నికల్ టీం మరింత కేర్ తీసుకోవాల్సింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగంలో మొదటగా చెప్పాల్సింది మోషన్ కాప్చ్యూర్ టెక్నాలజీ గురించి.. హాలీవుడ్ వారికి ఈ ఫోటో రియలిస్టిక్ టెక్నాలజీతో సినిమాలు తీయడానికి దాదాపు 25 సంవత్సరాలు పట్టింది. అయిన ఇప్పటికీ వాళ్ళు పర్ఫెక్ట్ గా సినిమాని తీయలేకపోతున్నారు. కానీ మొదటి సారే తక్కువ బడ్జెట్ లో, తక్కువ టైంలో ఈ రేంజ్ లో సినిమా తీయగలిగిన సౌందర్య రజినీకాంత్ ని మెచ్చుకొనే తీరాలి. 2 సంవత్సరాల కాల వ్యవధిలో కేవలం 122 కోట్ల బడ్జెట్ లోనే ఈ సినిమాని ఇంత క్వాలిటీతో తీయడం అనేది ప్రతి ఒక్కరూ మెచ్చుకోదగిన విషయం. టెక్నాలజీని బాగానే ఉపయోగించారు కానీ హ్యూమన్ ఎక్స్ ప్రెషన్స్ మీద కూడా బాగా కేర్ తీసుకొని ఉండాల్సింది. సినిమాలో నటీనటులు ఎవరు అనేది పర్ఫెక్ట్ గా తెలుస్తున్నా ఎక్స్ ప్రెషన్స్ లేకపోయే సరికి వాళ్ళు అంత కష్టపడి క్రియేట్ చేసిన ఫీల్ పోతుంది.

కలర్స్ వాడి విజువల్స్ ని ఇంకాస్త గ్రాండ్ గా ఉండేలా చూసుకోవాల్సింది. కెఎస్ రవికుమార్ రాసిన కథ చాలా బాగుంది. కానీ స్క్రీన్ ప్లే పై ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసింది. ఎడిటర్ అంథోని ఫస్ట్ హాఫ్ పై శ్రద్ధ తీసుకొని కొంత పార్ట్ లేపేసి ఉంటే బాగుండేది. శ్రీ రామకృష్ణ అందించిన డైలాగ్స్ కూడా బాగున్నాయి.

తీర్పు :

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, రజినీ కుమార్తె సౌందర్య అశ్విన్ దర్శకత్వంలో మోషన్ కాప్చ్యూర్ టెక్నాలజీతో తెరకెక్కిన ‘విక్రమసింహా’ ఓ సారి చూడదగిన హిస్టారికల్ ఫిల్మ్. ఈ సినిమాలో నటీనటులు రియల్ గా ఉండరు అన్న విషయం పక్కన పెడితే కథా పరంగా, టెక్నికల్ వాల్యూస్ పరంగా సూపర్బ్ మూవీ అని చెప్పొచ్చు. నటీనటుల హావభావాలు కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యి ఉంటే సినిమా స్థాయి మరో రేంజ్ లో ఉండేది. ఇప్పటి వరకూ రజినీని ఒక స్టైల్లో చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఈ డిఫరెంట్ మూవీని ఆదరించడం కాస్త కష్టమైన విషయమే. తెలుగులో ‘విక్రమసింహా’కి సరైన పబ్లిసిటీ లేకపోవడం వలన మొదటి సారి రజినీకాంత్ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఓపెనింగ్స్ రాబట్టుకోవడంలో వెనకబడిందని చెప్పాలి. చివరిగా ఇండియన్ స్క్రీన్ పై ఇలాంటి ఓ ప్రయత్నం చేసి, సరికొత్త సినీ ప్రపంచానికి నాంది పలికిన సౌందర్య రజినీకాంత్, ఆమె టెక్నికల్ టీంకి నా సెల్యూట్..

గమనిక :  ఈ సినిమాని మేము 2డిలో చూసాం, 3డిలో చూడలేదు. అందుకే మేము 3డి ఎఫెక్ట్స్ గురించి ఇందులో ప్రస్తావించలేదు.

123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5

123తెలుగు టీం


CLICK HERE FOR ENGLISH REVIEW

Exit mobile version