సమీక్ష : ‘విరూపాక్ష’ – ఇంట్రెస్ట్ గా సాగే మిస్టరీ థ్రిల్లర్ !

Virupaksha Movie Review In Telugu

విడుదల తేదీ : ఏప్రిల్ 21, 2023

123తెలుగు.కామ్ రేటింగ్ : 3.25/5

నటీనటులు: సాయి ధరమ్ తేజ్, సంయుక్త మీనన్, బ్రహ్మాజీ, రాజీవ్ కనకాల, అజయ్, సునీల్ తదితరులు

దర్శకులు : కార్తీక్ దండు

నిర్మాతలు: బివిఎస్ఎన్ ప్రసాద్

సంగీత దర్శకులు: అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: శామ్‌దత్ సైనుద్దీన్

ఎడిటర్: నవీన్ నూలి

సంబంధిత లింక్స్: ట్రైలర్

 

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా కార్తీక్ దండు తెరకెక్కించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ “విరూపాక్ష”. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

 

కథ :

 
రుద్రవనం అనే ఊరిలో క్షుద్రపూజలు చేస్తున్నారని ఒక కుటుంబాన్ని ఆ ఊరి ప్రజలు చంపేస్తారు. ఆ జంట కుమారుడ్ని ఆ ఊరు నుంచి పంపించేస్తారు. ఇది జరిగిన పుష్కర కాలం తర్వాత సూర్య (సాయి ధరమ్ తేజ్) తన తల్లితో పాటు రుద్రవనం ఊరు వస్తాడు. రుద్రవనం తన తల్లి ఊరు కావడంతో.. ఆ ఊరుతో సూర్యకి బంధం ఉంటుంది. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాల మధ్య నందిని (సంయుక్త మీనన్)తో సూర్య, ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమ పొందటం కోసం సూర్య ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అయితే, మరోవైపు రుద్రవనం గ్రామంలో వరుసగా మనుషులు చనిపోతూ ఉంటారు. దాంతో ఆ ఊరు మొత్తం భయంతో వణికపోతుంది. అసలు ఎందుకు మనుషులు చనిపోతున్నారు ?, వారి చావుల వెనుక ఉన్న రహస్యం ఏమిటి ?, ఈ మిస్టరీని సూర్య ఎలా సాల్వ్ చేశాడు ?, చివరకు ఏం జరిగింది? అనేది మిగిలిన కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ దర్శకుడు కార్తీక్ దండు రాసుకున్న కథ. పైగా కార్తీక్ దండు ఈ కథను తెరపై అద్భుతంగా చూపించాడు. నటీనటుల విషయానికి వస్తే.. సాయి ధరమ్ తేజ్ పాత్ర చాలా బాగుంది. సూర్య పాత్రలో సాయి ధరమ్ తేజ్ కూడా చాలా చక్కగా నటించాడు. కొన్ని థ్రిల్లర్ సన్నివేశాల్లో తన రియలిస్టిక్ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా సెకెండ్ హాఫ్ లో సాగే కొన్ని యాక్షన్ సన్నివేశాల్లో అలాగే ప్రీ క్లైమాక్స్ లో వచ్చే కీలక సీన్స్ లో కూడా సాయి తేజ్ నటన చాలా బాగుంది.

ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా తన నటనతో ఆకట్టుకుంది. కొన్ని హారర్ సన్నివేశాల్లో ఆమె తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. మరో కీలక పాత్రలో నటించిన రాజీవ్ కనకాల బాగా నటించారు. అలాగే బ్రహ్మాజీ, అజయ్, సునీల్ మరియు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల్లో మెప్పించారు. దర్శకుడు కార్తీక్ కథలో ఉన్న సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేసాడు. పైగా హారర్ సీన్స్ ను కూడా చాలా బాగా పిక్చరైజ్ చేసాడు.

అన్నిటికీ మించి పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందంటమే ఈ సినిమాకు ప్రధాన బలం. అలాగే దర్శకుడు రాసుకున్న కొన్ని కీలక సన్నివేశాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ సినిమాలోని విజువల్స్ అండ్ సౌండ్ ఎఫెక్ట్స్ చాలా బాగున్నాయి. ప్రీ ఇంటర్వెల్ నుంచి కథ ఊహించని టర్న్ తీసుకోవడం, మెయిన్ విలన్ ను ఎవరూ ఊహించని విధంగా డిజైన్ చేయడం బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ సినిమాలోని ప్రేమ సన్నివేశాలు ఇంకా బెటర్ గా ఉండి ఉంటే బాగుండేది. చాలా లాజికల్ పాయింట్స్ ని పర్ఫెక్ట్ గా రివీల్ చేసిన డైరెక్టర్ కొన్నిటిని మాత్రం ఇన్ డైరెక్ట్ గా చాలా సింపుల్ గా చూపించి వదిలేశాడు. అలాగే కీలకమైన సన్నివేశాలను బాగా రాసుకున్నప్పటికీ.. మిగిలిన సన్నివేశాల్లో ముఖ్యంగా సెకండ్ హాఫ్ మధ్యలో వచ్చే కొన్ని సీన్స్ ను ఇంకా ఆసక్తికరంగా మలిచి ఉంటే బాగుండేది.

సినిమా చూస్తున్నంతసేపు తర్వాత ఏం జరుగుతుంది ?, హీరో ఆ చావుల రహస్యాన్ని ఎలా కనిపెడతాడు?, ఆ ఊరుని ఎలా కాపాడతాడు ? అనే ఉత్కంఠ ప్రేక్షకుల్లో బాగానే కలిగించారు. కాకపోతే.. క్లైమాక్స్ కి ముందు వచ్చే సీక్వెన్స్ లను ఇంకా బెటర్ గా చూపించే స్కోప్ ఉంది. అలాగే ఇంకా క్లారిటీగా చూపించి ఉండాల్సింది. అదే విధంగా హీరోయిన్ పాత్రకు – రాజీవ్ కనకాల పాత్రకు మధ్య ట్రాక్ ను కూడా ఇంకా బలంగా రాసుకోవాల్సింది.

 

సాంకేతిక విభాగం :

 

మంచి కథా నేపధ్యాన్ని తీసుకోవడంలో సక్సెస్ అయిన దర్శకుడు కార్తీక్ దండు, కొన్ని చోట్ల ఉత్కంఠభరితమైన సీన్స్ రాసుకోవడంలో మాత్రం కొన్ని చోట్ల తడబడ్డాడు. కానీ ఆయన రూపొందించిన సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్ సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ వర్క్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఎడిటింగ్ కూడా బాగుంది. ఇక దర్శకుడు ఆలోచనను నమ్మి ఇలాంటి వైవిధ్యమైన చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించింనందుకు నిర్మాతను అభినందించాలి. నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణ విలువులు కూడా చాలా బాగున్నాయి.

 

తీర్పు :

 

‘విరూపాక్ష’ అంటూ వచ్చిన ఈ మిస్టరీ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తోంది. ముఖ్యంగా దర్శకుడు కార్తీక్ రాసిన కథ, హారర్ సన్నివేశాలు, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అలాగే టేకింగ్ సినిమాలో ఆకట్టుకునే అంశాలు. అయితే, కొన్ని సీన్స్ సినిమాటిక్ గా అండ్ స్లోగా సాగడం వంటి అంశాలు బలహీనతలుగా నిలుస్తాయి. ఓవరాల్ గా భిన్నమైన, కొత్త తరహా థ్రిల్లర్ చిత్రాలని ఇష్టపడేవారికి ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. అలాగే మిగిలిన వర్గాల ప్రేక్షకులను కూడా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది.

123telugu.com Rating: 3.25/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

Exit mobile version