విడుదల తేదీ : అక్టోబర్ 27, 2017
123తెలుగు.కామ్ రేటింగ్ : 3/5
దర్శకత్వం : కిశోర్ తిరుమల
నిర్మాత : కృష్ణ చైతన్య, స్రవంతి రవికిశోర్
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
నటీనటులు : రామ్, శ్రీవిష్ణు, అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, శ్రీ విష్ణు కీలక పాత్రలో కిశోర్ తిరుమల రూపొందించిన చిత్రం ‘ఉన్నది ఒకటే జిందగీ’. రామ్, తిరుమల కలయికలో గతంలో వచ్చిన ‘నేను శైలజ’ చిత్రం మంచి విజయంగా నిలవడంతో ఈ సినిమాపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. మరి ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఆ అంచనాలను ఏ మేరకు అందుకుందో ఇప్పుడు చూద్దాం…
కథ :
అభి (రామ్), వాసు (శ్రీవిష్ణు) లు చిన్నప్పటి నుండి ప్రాణ స్నేహితులు. ఒకరి కోసం ఒకరు ఏమైనా చేసేంత గొప్ప స్నేహం బంధం వాళ్ళది. అలా హాయిగా జీవితం గడుపుతున్న వారి మధ్యలోకి మహా (అనుపమ పరమేశ్వరన్) అనే అమ్మాయి ప్రవేశిస్తుంది.
దాంతో వాళ్ళ మధ్యన మనస్పర్థలు మొదలై ఒకరికొకరు దూరమైపోతారు. అలా మహా మూలాన దూరమైన అభి, వాసులు మళ్ళీ ఎలా కలుసుకున్నారు, అసలు మహా ఎవరు, ప్రాణ స్నేహుతులైన అభి, వాసులు ఆమె వలన ఎందుకు దూరమయ్యారు అనేదే ఈ సినిమా కథ.
ప్లస్ పాయింట్స్ :
సినిమాకు ప్రధాన బలం అభి, వాసుల స్నేహ బంధం. దర్శకుడు కిశోర్ తిరుమల ఈ ఒక్క థ్రెడ్ మీదే కథ, కథనాలను రాసుకున్నాడు. సినిమాలో కీలకమనిపించే ప్రతి సన్నివేశం వీరిద్దరి స్నేహ బంధం నైపథ్యంలోనే ఉండటంతో చాలా చోట్ల స్నేహమనే ఎమోషన్ మనసులో కదలాడుతూ ఉంటుంది. దానికి తోడు సెకండాఫ్లో విడిపోయిన అభి, వాసులు తిరిగి కలుసుకునే ప్రాసెస్లో తీసిన రెండు సన్నివేశాలు బాగా కదిలిస్తాయి. వీటి ద్వారా ఇద్దరు స్నేహితులు ఒకరి కోసం ఒకరు ఎలా పరితపించుపోతుంటారు అనే అంశాన్ని బలంగానే చెప్పారు కిశోర్ తిరుమల.
వాటితో పాటే ఫస్టాఫ్ లో సాగే రామ్, అనుపమ లవ్ ట్రాక్ కూడా కొంత ఎంటర్టైన్మెంట్ కలగలిసి ఆహ్లాదకరంగా అనిపించింది. లుక్స్, పెర్ఫార్మెన్స్ పరంగా అనుపమ స్క్రీన్ మీద చక్కగా కనబడింది. మధ్య మధ్యలో వచ్చే ప్రియదర్శి కామెడీ మంచి టైమింగ్ తో ఉండి నవ్వించింది. రామ్ పాత్ర చిత్రీకరణ, అతని లుక్స్, పెర్ఫార్మెన్స్ బాగున్నాయి. కీలకమైన శ్రీవిష్ణు పాత్ర కూడా భావోద్వేగంతో కూడినదై ఉండటం, అందులో ఆయన నటన కూడా బాగుండటం సినిమాకు కలిసొచ్చాయి. ఇక మహా వలన బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరూ విడిపోయే పరిస్థితులు కన్విన్సింగా ఉండి మెప్పించాయి.
మైనస్ పాయింట్స్ :
దర్శకుడు కిశోర్ తిరుమల స్నేహ బంధాన్ని మాటల్లో, ఒక మూడు కీలక సన్నివేశాల్లో అయితే బాగానే చెప్పగలిగాడు కానీ మిగతా చాలా సీన్లలో అంత ప్రభావవంతంగా కనెక్ట్ చేయలేకపోయాడు. ముఖ్యంగా అభి, వాసుల మధ్య ఉన్న స్నేహ బంధాన్ని గొప్ప స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయలేదు. కీలక సన్నివేశాలలో తప్ప మిగతా సినిమా మొత్తం ఏదో ఉదాసీనంగా, అనాసక్తితో సాగుతున్న ఫీలింగ్ కలిగింది. పైగా ఫస్టాఫ్ లెంగ్త్ కూడా ఎక్కువైనట్టు తోచింది. అంతగా అవసరంలేని డ్రామా కొద్దిగా ఎక్కువై ఇంటర్వెల్ త్వరగా పడితే బాగుండు అనే భావన కలిగింది.
సెకండాఫ్లో వచ్చే లావణ్య త్రిపాఠి ట్రాక్ మరీ బలహీనంగా తోచింది. ఒకసారి ప్రేమలో విఫలమైన హీరో రెండోసారి ప్రేమలో పడాలంటే బలమైన కారణాలు, పరిస్థితులు ఖచ్చితంగా అవసరమవుతాయి. కానీ ఇక్కడ మాత్రం హీరో సులభంగా రెండోసారి ప్రేమలో పడిపోవడం కొంత నిరుత్సాహకరంగా అనిపించింది. ఇక ఫస్టాఫ్ మధ్య నుండి చివరి వరకు దాచిపెట్టినట్లు అనిపించిన ఎమోషన్ క్లైమాక్స్ లో హెవీగా బ్లో అవుతుందేమో అనుకుంటే చాలా సింపుల్ గా కొన్ని నిజాల్ని రివీల్ చేసి తేల్చేయడం కొంత లోటుగా తోచింది.
సాంకేతిక విభాగం:
దర్శకుడు కిశోర్ తిరుమల స్నేహ బంధాన్ని హైలెట్ చేస్తూ రాసుకున్న కథ సింగిల్ లైన్లో బాగానే ఉన్నా ఆయన రాసిన కథనం కొద్దిగా బలహీనంగా, రొటీన్ గా అనిపించింది. అంతేగాక అందులోని మూడు కీలకమైన సీన్లు తప్ప మిగతా అంతా ఏదో ఉందంటే ఉంది అన్నట్టు తోచింది. దీంతో ఫలితం యావరేజ్ అనే స్థాయిలోనే నిలబడింది. ఇకపోతే సినిమాలో ప్రతి సినిమాకి తన మ్యూజిక్ తో ప్రాణం పోసే దేవిశ్రీ ఈ సినిమాకు మాత్రం పెద్దగా ఉపయోగపడలేకపోయారు. ఆయన్నుండి ఇంకా మంచి ఔట్ అవుట్ ఫుట్ రాబట్టుకుని ఉంటే బాగుండేది.
ఎడిటింగ్ ద్వారా ఫస్టాఫ్ లెంగ్త్ కొద్దిగా తగ్గించి ఉండాల్సింది. సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. షూట్ చేసిన సహజ లొకేషణాలు ఆహ్లాదకరంగా అనిపించాయి. స్నేహ బంధం నైపథ్యంలో రాసిన డైలాగ్స్ బాగున్నాయి. స్రవంతి రవికిశోర్ పాటించిన నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
తీర్పు :
స్నేహ బంధం నైపథ్యంలో రూపొందిన ఈ ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రంలో కాస్త ఎమోషనల్ గా కనెక్టయ్యే కథ, ఇద్దరు స్నేహితుల మధ్యన ఉండే గొప్ప స్నేహాన్ని వివరించే కొన్ని భావోద్వేగ పూరితమైన సన్నివేశాలు, రామ్, అనుపమల లవ్ ట్రాక్, కొంత కామెడీ మెప్పించే అంశాలు కాగా కీలక పాత్రలైన అభి, వాసుల మధ్య స్నేహం పూర్తిస్థాయిలో ఎస్టాబ్లిష్ చేయకపోవడం, కొద్దిగా రొటీన్ గా అనిపించే కథనం, పసలేని సెకండాఫ్ లవ్ ట్రాక్ నిరుత్సాహపరిచాయి. మొత్తం మీద చెప్పాలంటే రెగ్యులర్ ఆడియన్సుకి కొంత రొటీన్, స్లో అనిపించే ఈ చిత్రం యువతకు కనెక్టవుతుంది.
123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team